-హాలియా సమీపంలో సీఎం కేసీఆర్ బహిరంగసభ -ఆయకట్టు రైతుకోసం ఆనాడే కేసీఆర్ పాదయాత్ర టీఆర్ఎస్ను స్థాపించిన తొలినాళ్లలోనే ఉద్యమనేత కేసీఆర్ సాగర్ ఆయకట్టు పరిరక్షణకు పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో ఆయకట్టు రైతుల వెతలను కండ్లారా చూసిన ఆయన.. రాష్ట్రం వచ్చాక అన్నింటికీ పరిష్కారం చూపుతానని ఆనాడే మాటిచ్చారు.
ముఖ్యమంత్రిగా ఎడమకాలువ ఆయకట్టుకు రెండుకార్ల పంటకూ నీళ్లందిన్నారు. సాగర్ డ్యాంలో 510 అడుగుల కనీస నిల్వస్థాయిని నిర్వహిస్తున్నారు. టెయిల్‌పాండ్ నిర్మాణాన్నీ పూర్తిచేయించారు. నేడు సాగర్ ఎడమ కాలువ చివరి ఆయకట్టుతోపాటు, కృష్ణా ఒడ్డున బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు 13 ఎత్తిపోతల పథకాలను మంజూరుచేశారు.

దిగువన కృష్ణమ్మ, ఎగువన ఎడమకాలువ, మధ్య నుంచి పారుతున్న మూసీ.. అయినా ఉమ్మడి నల్లగొండలో సాగునీటికోసం నోళ్లు తెరుచుకున్న భూములు ఎన్నో. సమైక్యరాష్ట్రంలో ఏనాడూ వాటి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. పేరుకు సాగర్ ఆయకట్టు ప్రాంతమైనా చివరిభూములకు నీరిచ్చిన దాఖలాల్లేవు. ఉద్యమనేతగా కే చంద్రశేఖర్‌రావు టీఆర్ఎస్ను స్థాపించిన తొలినాళ్లలోనే సాగర్ ఆయకట్టు పరిరక్షణ కోసం పాదయాత్ర చేపట్టారు. వేలాదిమంది ఉద్యమకారులతో కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర నిర్వహించారు. ఎడమ కాలువ కింది 41 ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వమే నిర్వహించాలని, సాగర్ టెయిల్‌పాండ్‌ను నిర్మించి విద్యుదుత్పత్తి చేసిన నీటిని రివర్సబుల్ పంపింగ్ చేయాలని, డ్యాంలో కనీస నీటిమట్టాన్ని మెయింటెయిన్ చేయాలని డిమాండ్ చేస్తూ 2003 ఆగస్టు 25 నుంచి ఆరు రోజులపాటు ఈ పాదయాత్ర కొనసాగించారు. చిలుకూరు, హుజూర్నగర్, గరిడేపల్లి, నేరేడుచర్ల, మిర్యాలగూడ, త్రిపురారం, నిడమనూరు మీదుగా 90 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్ర సందర్భంగా కేసీఆర్ ఆయకట్టు రైతుల వెతలు కండ్లారా చూసారు. కృష్ణమ్మ మన చెంతనే ఉన్నా.. ఎడమ కాలువ రైతులకు అన్యాయం చేస్తూ కుడి కాలువ ద్వారా నీటిని ఎలా దోచుకుంటున్నారో ఎండగట్టారు. రాష్ట్రం వచ్చాక వీటన్నింటికీ పరిష్కారం చూపుతానని ఆనాడే మాటిచ్చారు.

2,395 కోట్లతో 13 లిఫ్టులు తెలంగాణ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాగర్ ఆయకట్టు రైతు కలల సాకారానికి కృషి చేస్తున్నారు. సాగర్ పూర్తిస్థాయిలో నిండినా, నిండకపోయినా రెండు పంటలకు నీళ్లిచ్చి ఆయకట్టు రైతుల అపరభగీరథుడయ్యారు. ప్రాజెక్టులో 510 అడుగుల కనీస నీటిమట్టాన్ని ఉంచుతూ వచ్చే ఏడాది పంటలకూ భరోసా కల్పిస్తున్నారు. సాగర్ టెయిల్‌పాండ్ నిర్మాణాన్ని పూర్తిచేయించి నీటి రివర్సబుల్ పంపింగ్‌కు చర్యలు తీసుకున్నారు. తాజాగా నాగార్జునసాగర్ ఎడమ కాలువకింద చివరి ఆయకట్టుతోపాటు, కృష్ణపట్టికి జవసత్వాలు కల్పించేందుకు ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.2,395.68 కోట్ల వ్యయంతో మొత్తం 13 ఎత్తిపోతల పథకాలతో పాటు పలుచోట్ల ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారు. వీటన్నింటికీ పునాదిరాయి వేసేందుకు బుధవారం సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌కు రానున్నారు. నెల్లికల్లు వద్ద ఈ ఎత్తిపోతల పథకాలకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం టీఆర్ఎస్ నల్లగొండ జిల్లా పార్టీ ఏర్పాటు చేసిన ధన్యవాదసభలో ప్రసంగిస్తారు.
సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లుచేసినట్టు విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలతో కలిసి మంగళవారం సభాస్థలాన్ని పరిశీలించారు. పార్కింగ్ స్థలం, హెలిపాడ్ తదితర అంశాలపై సూచనలు చేశారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సభకు తరలివచ్చేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతుండడంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఉమ్మడి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేశారని తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అనేక ప్రాజెక్టులు పూర్తి చేశారని, ప్రధానంగా వ్యవసాయం, అనుబంధ రంగాలకు ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. ఉమ్మడి జిల్లాకు మూడు మెడికల్ కాలేజీలతోపాటు దామరచర్ల వద్ద పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.

సాగర్ ఎడమ కాలువ చివరి భూములకు సాగునీరు అందించడంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తితో గోదావరి జలాల రాకతో జిల్లాలో వ్యవసాయం పండుగలా మారిందని తెలిపారు. ప్రస్తుతం కృష్ణానదీ జలాల వినియోగంపై దృష్టి సారించారని, అందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో 1,04,600 ఎకరాల టెయిల్‌లాండ్ భూములకు సాగునీరు అందించేందుకు 13 లిఫ్ట్ ఇరిగినేషన్ ప్రాజెక్టులను చేపడుతున్నారని తెలిపారు. ఇందుకోసం జిల్లా రైతుల పక్షాన ధన్యవాద సభను ఏర్పాటు చేశామని చెప్పారు. మధ్యాహ్నం రెండు గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తకెళ్లపల్లి రవీందర్రావు, ఆప్కాబ్ మాజీచైర్మన్ ఎడవల్లి విజయేందర్‌రెడ్డి, టీఆర్ఎస్ నేత నోముల భగత్ తదితరులు ఉన్నారు.
