తన పార్టీ నాయకత్వాన్ని, అభ్యర్థులను పూర్తి స్థాయిలో.. అస్త్రశస్త్రాలతో ప్రచారంలోకి దించేందుకు టీఆర్‌ఎస్ పకడ్బందీ వ్యూహ రచన చేస్తున్నది. ఇందుకోసం సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతోపాటు జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్‌చార్జిలతో శనివారం అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఆహ్వానితులందరూ తప్పని సరిగా ఈ సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే పార్టీ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. 13వ తేదీ నుంచి టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగే ప్రచార సరళి, జిల్లాల్లో ఏయే తేదీల్లో కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించాలి? రోడ్ షోలు ఎప్పుడు నిర్వహించాలనే అంశాలను ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. అదే సమయంలో కేసీఆర్ హాజరయ్యే సభల తేదీలను కూడా ఖరారు చేయనున్నారు.

-అభ్యర్థులు, ముఖ్య నేతలతో సమావేశం -ఎన్నికల ప్రచారసరళిపై దిశానిర్దేశం.. -కేసీఆర్ బహిరంగ సభల తేదీల ఖరారు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ విధిగా హాజరుకావాలని కేసీఆర్ ఆదేశించారు. కేవలం ప్రచార సరళిని రూపొందించడమే లక్ష్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే ప్రధాన అంశంగా కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇతర పార్టీలు అనుసరిస్తున్న వైఖరులు, టీఆర్‌ఎస్‌పై చేస్తున్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే అంశాలపై కేసీఆర్ పార్టీ అభ్యర్థులకు సవివరంగా చెప్పనున్నారు.
అదే సమయంలో గ్రేటర్‌లో గవర్నర్‌కు అధికారాలు, పోలవరం ప్రాజెక్టు డిజైన్ మార్పు, 10 సంవత్సరాల పాటు ఉమ్మడి విద్య, ఉద్యోగులకు ఆప్షన్లు వంటి వాటిపై టీఆర్‌ఎస్ వైఖరిని స్పష్టం చేస్తూనే టీడీపీ, కాంగ్రెస్ పార్టీల వైఖరులను ప్రశ్నించాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రచారపర్వంలో చేయాల్సిన ప్రసంగాలతో పాటు టీఆర్‌ఎస్ ఇప్పటికే విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలను కూడా ప్రసంగాల్లో ప్రస్తావించేలా అవగాహన కల్పించనున్నారు. కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొవడమే లక్ష్యంగా ఇప్పటికే టీఆర్‌ఎస్ సంధించిన 10 ప్రశ్నలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేయనున్నారు.