Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేడు టీఆర్‌ఎస్ పాక్షిక మ్యానిఫెస్టో

-చిన్న ఉద్యోగుల వేతనాల పెంపు..
-ఆసరా పింఛన్ల పెంపుదల..
-ఇంటిస్థలం ఉన్నవారికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు
-నిరుద్యోగులకు భృతి ఇచ్చే యోచన
-హామీలపై ఇప్పటికే కేసీఆర్ సంకేతాలు
-స్వయంగా వెల్లడించనున్న పార్టీ అధినేత, సీఎం కేసీఆర్
-కమిటీకి వివిధ సంఘాల నుంచి వెల్లువెత్తిన వినతులు

ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలుచేయడమేకాకుండా.. ఇవ్వని హామీలను చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి.. తాజా ఎన్నికలకు ప్రకటించే మ్యానిఫెస్టోపై తీవ్ర కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన కమిటీ.. మంగళవారం ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో సమావేశంకానున్నది. మధ్యాహ్నం 2.30 గంటలకు తెలంగాణభవన్‌లో ప్రారంభమయ్యే ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళికకు తుదిమెరుగులు దిద్దుతారని భావిస్తున్నారు. అనంతరం పాక్షిక మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు. ఇప్పటివరకు ప్రజలనుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై ఈ సమావేశంలో చర్చిస్తామని టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ కే కేశవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమైన సమావేశమైనందున కమిటీ సభ్యులంతా సమావేశానికి తప్పక హాజరుకావాలని కోరారు. ఇప్పటికే అభ్యర్థులు ప్రజల్లో తిరుగుతూ ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తున్నందున, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున ఇచ్చే హామీలను కూడా ప్రజల్లోకి వెంటనే తీసుకుపోవాలని నాయకత్వం యోచిస్తున్నది. ఈ క్రమంలోనే పూర్తిస్థాయి మ్యానిఫెస్టో సిద్ధమయ్యేలోపు.. ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్న కొన్నింటిని వెల్లడించాలని కేసీఆర్ భావిస్తున్నారు.

వెల్లువెత్తుతున్న వినతులు
కే కేశవరావు అధ్యక్షతన ఉన్న మ్యానిఫెస్టో కమిటీకి పలు సంఘాల నాయకులు గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వినతిపత్రాలు అందజేశారు. వాటిని మ్యానిఫెస్టోలో చేర్చాలని కోరుతున్నారు. 2014లో మ్యానిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను మొదటి క్యాబినెట్ సమావేశంలోనే ఆమోదించి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మ్యానిఫెస్టోలోని అంశాలను పూర్తిస్థాయిలో అమలుచేసిన చరిత్ర టీఆర్‌ఎస్‌కే దక్కింది. ఈసారి కూడా అదే స్పూర్తితో ప్రజల సమస్యలకు పరిష్కారం చూపేలా మ్యానిఫెస్టోను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్నారు. 2001 వరకు తెలంగాణ సాధనే ఏకైక ఎజెండాతో టీఆర్‌ఎస్ ముందుకు సాగింది. రాష్ట్ర సాధనతోనే తెలంగాణ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెప్తూ వచ్చిన టీఆర్‌ఎస్.. అధికారంలోకి వచ్చాక అదే కోణంలో నిర్ణయాలు తీసుకున్నది. మ్యానిఫెస్టోను పూర్తిస్థాయిలో అమలుచేయడమేకాకుండా.. మ్యానిఫెస్టోలో పేర్కొనని అంశాలు సైతం గత నాలుగు సంవత్సరాల్లో అమలుచేసింది.

హామీలపై ఇప్పటికే సంకేతాలు
టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గతంలో మాదిరిగానే అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా, అందరికీ లబ్ధికలిగించేలా మరిన్ని అభివృద్ధి అంశాలతో మ్యానిఫెస్టో ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రజలు మెచ్చిన మ్యానిఫెస్టోగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నామని టీఆర్‌ఎస్ నాయకత్వం చెప్తున్నది. మ్యానిఫెస్టోలో ఇచ్చే హామీలపై ఇటీవలి బహిరంగసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనప్రాయంగా వెల్లడించారు. ఆసరా పథకం ద్వారా పేద వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఇచ్చే పింఛను పెంచుకుందామని ప్రకటించారు. సొంత ఇంటిస్థలం కలిగిన లబ్ధిదారులకు సైతం డబుల్‌బెడ్‌రూం ఇండ్లు కట్టించాలనే యోచన ఉందని వెల్లడించారు. వీటితోపాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ తదితర చిన్న ఉద్యోగుల వేతనాలను పెంచుకుందామని చెప్పారు. నిరుద్యోగ భృతిని ఇచ్చే అంశాన్ని కూడా పార్టీ పరిశీలిస్తున్నది. వీటితోపాటు కొన్ని నిర్ణయాలను కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.