Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేడు విద్యుత్ బంధం

-ఛత్తీస్ గఢ్ లో సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం

కరెంటు కష్టాలనుంచి తెలంగాణకు ఉరట కల్పించే దిశలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకోనుంది. మిగులు విద్యుత్‌ కలిగిన రాష్ట్రంగా ఉన్న ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు వెయ్యి మెగావాట్ల విద్యుత్‌ను తీసుకువచ్చేందుకు రెండు రాష్ర్టాల మధ్య సోమవారం అవగాహన ఒప్పందంపై సంతకాలు జరుగనున్నాయి. ఆ రాష్ట్ర రాజధాని రాయపూర్‌లోని హోటల్ తాజ్ గేట్‌వేలో జరిగే కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుల సమక్షంలో తెలంగాణ తరపున ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్ జోషి, ఛత్తీస్‌గఢ్ తరపున అక్కడి ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అమన్‌సింగ్‌లు వెయ్యి మెగావాట్ల సరఫరాపై అవగాహన ఒప్పందాల(ఎంవోయూ)పై సంతకాలు చేయనున్నారు.

KCR tour of Chattisgarh

-నేడు విద్యుత్ బంధం – వెయ్యి మెగావాట్లకు ఒప్పందం – ఇరు రాష్ర్టాల సీఎంల సమక్షంలో ఎంవోయూ -తొలిరోజు దుర్గ్, బెమెత్రా జిల్లాల్లో సీఎం పర్యటన – ఆధునిక పద్ధతుల్లో జరుగుతున్న సేద్యం పరిశీలన ఛత్తీస్‌గఢ్‌లో మిగులు విద్యుత్‌ను రాష్ట్ర అవసరాలకు వినియోగించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌కు వెళ్ళారు. ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి (అదనపు బాధ్యతలు) శైలేంద్రకుమార్ జోషి, తెలంగాణ జెన్‌కో, తెలంగాణ ట్రాన్స్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావులు సోమవారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌కు బయలుదేరుతున్నారు. వచ్చే ఏడాది చివరినాటికి వార్దా-డిచ్‌పల్లి (నిజమాబాద్ జిల్లా) మధ్య 765 కేవీ పవర్‌గ్రిడ్ కారిడార్ నిర్మాణ పనులు పూర్తి అయిన వెంటనే ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ పంపిణీ అవుతుంది. ఇరురాష్ర్టాల మధ్య విద్యుత్ కొనుగోలు అంశంపై తెలంగాణ ఈఆర్సీ లేదా ఛత్తీస్‌గఢ్ ఈఆర్సీ టారిఫ్(ధర)ను ఖరారు చేస్తాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకోసం ఛత్తీస్‌గఢ్ వెళ్లిన కేసీఆర్‌కు రాయపూర్‌లోని స్వామి వివేకానంద విమానాశ్రయంలో అక్కడి మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఛత్తీస్‌గఢ్ అవతరణ సందర్భంగా పొరుగునే కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తమ రాష్ర్టానికి రావడం ఎంతో ఆనందదాయకంగా ఉందని ఛత్తీస్‌గఢ్ రవాణా మంత్రి రాజేష్ మునత్ అన్నారు. రాజేష్ మునత్‌తోపాటు పలువురు ఉన్నతాధికారులు, రాయచూర్ జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు కేసీఆర్‌కు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. తన పర్యటన తొలిరోజైన ఆదివారం నాడు దుర్గ్, బెమెత్రా జిల్లాల్లో కేసీఆర్ పర్యటించారు.

విమానాశ్రయం నుంచి నేరుగా గోమ్చిలోని వీఎన్‌ఆర్ సీడ్స్ రిసెర్చ్ స్టేషన్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌కు.. స్టేషన్ ఎండీ విమల్ చౌదాతోపాటు ఇతర నిపుణులు విత్తనోత్పత్తి, కూరగాయలు, పండ్లతోటల సాగు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సీఎం ఈ సందర్భంగా వారిని పలు ప్రశ్నలు అడిగి అనుమానాలు నివృత్తి చేసుకున్నారు. ఎక్కువ దిగుబడులు రావడానికి, మంచి విత్తనాలు ఉత్పత్తి చేసేందుకు అక్కడ అవలంబిస్తున్న పద్ధతులను అడిగి తెలుసుకున్నారు.

జామ, టమాట, అరటి, దోస, వంకాయ, అల్లం, క్యాబేజీ, కాలీప్లవర్, దానిమ్మ, ఖర్జూర తదితర పంట పొలాల్లో కలియదిరిగారు. అక్కడ ప్రతి అంగుళం నేల కూడా బిందు సేద్యం ద్వారా సాగవుతున్న సంగతిని పరిశీలించారు. బిందు సేద్యంవల్ల మొక్కలకు నేరుగా నీరు అందడంతోపాటు తక్కువ నీటి వినియోగంతోఎక్కువ పంటను సాగు చేసే పద్ధతులు, ట్రాక్టర్ల ద్వారా పురుగు మందులను పిచికారి చేసే విధానాన్ని పరిశీలించారు.

తెలంగాణలో కూడా డ్రిప్ ఇరిగేషన్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు వారికి చెప్పారు. బడ్జెట్‌లో డ్రిప్ ఇరిగేషన్‌కు అధిక నిధులు కేటాయిస్తామన్నారు. ఈ విషయంలో సాంకేతిక సహకారం అందించాలని అక్కడి రైతులు, వీఎన్‌ఆర్ రిసెర్చ్ స్టేషన్ నిర్వాహకులను సీఎం కోరారు. దాదాపు ఒకేచోట, ఒకే రకమైన పంట 50, 60ఎకరాల్లో సాగు చేస్తుండటాన్ని కూడా సీఎం పరిశీలించారు. ఆ తరువాత ముఖ్యమంత్రి బెమెత్రా జిల్లాలోని కోహడియా గ్రామ పరిధిలోని గ్రీన్‌హౌజ్, పాలీహౌజ్, కల్టివేషన్‌ను పరిశీలించారు. వాతావరణ ప్రతికూల పరిస్థితులను, ఉష్ణోగ్రత హెచ్చు తగ్గులను, ఈదురు గాలుల వంటి వైపరీత్యాలను తట్టుకొని మొక్కలు పెరగడం గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ ద్వారా సాధ్యమని తరుచూ చెప్పే సీఎం అదే అంశానికి సంబంధించి మరి కొన్ని పద్ధతులు అధ్యయనం చేశారు.

ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఆదేశాలమేరకు స్థానిక పోలీసులు కేసీఆర్‌కు భారీ భద్రతా ఏర్పాట్లుచేశారు. ఈ సందర్భంగా అవసరమైన సమాచారం అందించడానికి స్థానిక కలెక్టర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌లు కేసీఆర్ వెంటే ఉన్నారు. కొహడియా గ్రామంలో ఆధునిక వ్యవసాయం చేస్తున్న రైతులతో కేసీఆర్ మాట్లాడారు. ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ముఖ్యమంత్రితోపాటు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలాచారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగరావు ఇతర అధికారులు కూడా ఉన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.