Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నీ జేజమ్మ తరంకాదు

చంద్రబాబు కాదు కదా.. ఆయన తాత జేజమ్మ వచ్చినా తెలంగాణ ప్రభుత్వం వెంట్రుక కూడా పీకలేరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తనను అరెస్టు చేసిన రోజు తెలంగాణ ప్రభుత్వానికి ఆఖరి రోజని చంద్రబాబు చేసిన వ్యాఖ్యపై కేసీఆర్ తీవ్రస్థాయిలో స్పందించారు. చంద్రబాబును దొరికిన దొంగ అని అభివర్ణించిన ముఖ్యమంత్రి.. ఆయన చర్యను ప్రధాని నరేంద్రమోదీ కూడా సమర్థించబోరని భావిస్తున్నానని చెప్పారు. తమ ప్రభుత్వం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని కేసీఆర్ స్పష్టంచేశారు. ఇది వెయ్యిశాతం వాస్తవమని అన్నారు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయి.. దానినుంచి తప్పించుకోడానికి గాయి గాయి చేస్తున్నారని మండిపడ్డారు.

KCR press meet after cabinet meeting 10-06-15

-చంద్రబాబూ.. జస్ట్ నువ్వొక గెస్ట్‌వి.. -దొరికిన దొంగవు.. అహంకారం.. అరాచకం నీదే.. -తెలంగాణలో నీ ఆటలు సాగవు.. -ఫోన్ల ట్యాపింగ్ చేయలేదు.. చెయ్యం -మెజార్టీ లేకుండా పోటీకి దిగడం వెనుక బాబు ప్లానేంది? -దొంగకు కేంద్రం సహాయం చేస్తుందని అనుకోను -చంద్రబాబు ఆయనను ఆయనే మసిజేసుకున్నడు -చంద్రబాబు బాగోతం చెప్తే పరేషాన్ అయితరు -ఇప్పుడు చెప్ప.. టైమొచ్చినప్పుడు చెప్త -రాజీ జరగడానికి మాకేం పంచాయతీ ఉంది? -కేంద్ర నుంచి ఎవరూ నాకు ఫోన్ చేయలేదు -మీడియా సమావేశంలో సీఎం వ్యాఖ్యలు హైదరాబాద్‌పై పదేండ్లు తనకు హక్కు ఉందని చంద్రబాబు చెప్పడాన్ని కేసీఆర్ తప్పుపట్టారు. ఇది పదేండ్లు ఫెసిలిటేటింగ్ క్యాపిటల్ మాత్రమేనని గుర్తు చేశారు. కావాలంటే విభజన చట్టాన్ని చదువుకోవాలని చంద్రబాబుకు హితవు పలికారు. అహంకారం, అరాచకంతో మాట్లాడున్న చంద్రబాబు ఆటలు సాగబోవని హెచ్చరించారు.

ఇక్కడ ఆయన కేవలం ఒక గెస్ట్ సీఎం మాత్రమేననే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. బుధవారం రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అనంతరం నిర్ణయాలను ప్రకటించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. క్యాబినెట్ నిర్ణయాలు ప్రకటించిన అనంతరం పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రధానంగా ప్రశ్నోత్తరాలు సాగాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మీడియా: చంద్రబాబు ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తున్నారు.. కేసీఆర్: బాబుకు కామన్సెస్ ఉందా. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఈ కేసులో విచారణ జరుపుతున్న డీజీపీ మంగళవారం నన్ను కలిశారు. తాము ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదని విస్పష్టంగా తెలిపారు. నేనూ అదే చెప్తున్నాను. ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం 120 మంది వివిధ ఏపీ అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి ఫోన్లను ట్యాప్ చేసిందే అనుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మే 31 వరకూ ఏం చేస్తున్నది? మే 31 నుంచి జూన్ 10 వరకే 120 ఫోన్లను ట్యాప్ చేస్తిమా? మరి ముందే ఎందుకు కైంప్లెంట్ ఇవ్వలేదు? జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం. ఈ కాలమంతా ఏపీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం పొగరుగా వ్యవహరిస్తున్నదంటే చంద్రబాబు నాయుడుకానీ, ఆయన అధికారులుగానీ ఏం చేస్తున్నారు?

మీడియా: చంద్రబాబు టేపులు బయటకు వచ్చిన తర్వాత తాము అప్రమత్తమయ్యామనేది ఏపీ వాదన! కేసీఆర్ : టేపులు టీవీల్లో రావడం అనేది మీడియా స్వేచ్ఛ. మీడియాకు ఉన్న సోర్స్. ఎవరూ దాన్ని కాదనలేరు. వెయ్యి విషయాలు ఊహించుకోవచ్చు. నేనేమీ చేయలేను. మీరు వెళ్లి మీడియాను అడగండి! బంగారు లక్ష్మణ్ కేసులో ఏమైంది? కేవలం లక్ష రూపాయలు ముడుపులు తీసుకుంటూ ఎలక్ట్రానిక్ మీడియాకు దొరికినందుకు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. చంద్రబాబు ఇప్పుడు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారు. కేవలం 63 మంది ఎమ్మెల్యేలతోనే 5 ఎమ్మెల్సీలు పోటీ చేశారని అంటున్నాడు. పెద్దమనిషి చంద్రబాబును నేను అడుగుతున్నా.. పార్టీ ఫిరాయింపుల నేరం నీకు వర్తించదా?

నీకు లేదా నీతి? నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో గెలిచిండు? ఇయ్యాల ఏ పార్టీల ఉన్నడు? కొత్తపల్లి గీత! ఈ ఇద్దరు ఎంపీలు ఏ పార్టీనుంచి గెలిచారో? ఏ పార్టీలో ఉన్నారో ప్రపంచం మొత్తానికీ తెలుసు. మీకు నైతికతే ఉంటే వారిని పార్టీలోకి ఎలా చేర్చుకున్నారు మిస్టర్ నాయుడు? వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకున్నావు? నీ సమాధానం ఏమిటి? ఆరుగురు కాంగ్రెస్, ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలను, ఒక జెడ్పీ చైర్‌పర్సన్‌ను పార్టీలో చేర్చుకున్నారు. నువ్వు చేర్చుకుంటేనేమో నీతి! ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఒక కొత్త వాతావరణం వచ్చి తెలుగుదేశాన్ని ప్రజలు దారుణంగా తిరస్కరించిన తర్వాత నీ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరితేనేమో అవినీతి! దీనికి చంద్రబాబు సమాధానం ఏమిటి? మీరే రేపు ఆయనను అడగండి.

మీడియా: సర్ మీరు నాలుగింటికే పోటీ చేస్తే ఈ సమస్య ఉండేది కాదని టీడీపీ వాళ్ళు అంటున్నారు? కేసీఆర్: ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషనుల వేసే సమయానికి మాకు స్పష్టమైన మెజార్టీ ఉంది. చంద్రబాబునాయుడికి మెజార్టీ లేదు. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచే మీరు ఈ విషయాన్ని ధ్రువీకరించుకోవచ్చు. మాకు సపోర్ట్ చేయాలని మేం మూడు పార్టీలను ఆశ్రయించినాం. నేను వ్యక్తిగతంగా ఫోన్ చేసి అడిగిన. ఎంఐఎం మా మిత్రపక్షమే! కలిసి పని చేస్తున్నాం. వారు మాకు మద్దతు పలికారు. సూత్రప్రాయంగా సపోర్ట్ చేస్తాం కానీ.. పార్టీ అనుమతి తీసుకుంటాం అని వైసీపీవారు చెప్పారు.

అయితే హామీ ఇచ్చారు. రెండు మూడు రోజుల తర్వాత వారు అధికారికంగా డిసైడ్ చేసి చెప్పారు. మొదట సీపీఎం తాము ఓటింగ్‌లో పాల్గొనడం లేదని చెప్పింది. దాని తర్వాత సీపీఐ కూడా మేం సపోర్ట్ చేయబోమని చెప్పింది. అప్పుడు మాకు ఉన్న సంఖ్య ప్రకారం 17 చొప్పున ఓట్లు వేసుకుంటే మాకు 68లో నలుగురు ఎమ్మెల్సీలు గెలుస్తారు. వైసీపీ మాకు హామీ ఇచ్చింది. ఒక్క ఓటు మాకు కలుస్తది. పదహారు అయితయి. చంద్రబాబుకు ఆరోజుకు ఉన్న సంఖ్య పదహారు.

ఆయనకు ఇంకో ఓటు వచ్చే ఆస్కారం లేదు.. ఆయన సత్య హరిశ్చంద్రుడైతే. ఆయన 16తోనే ఆయన గెలవాలనుకుంటే ఆయనకు ఇంకో ఓటే రాదు. కనుక ఆయన గెలవడం అనే పరిస్థితే ఉత్పన్నంకాదు. మాకు 69 మంది మద్దతు ఉన్నంక రెండో ప్రాధాన్య ఓట్లు మా అభ్యర్థికి వేసుకుంటే మాకు .44 జమ అయితా ఉంది. దాంతో ఆటోమేటిగ్గా టీఆర్‌ఎస్ ఓట్లు 16.54కి చేరుకుంటాయి. టీడీపీ 16 దగ్గరే ఆగిపోతుంది. ఇది చంద్రబాబుకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఆయన ఎందుకు పోటీ చేశారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు రాజీకీయాలను నాశనం చేసింది? ఎవరు రాజకీయ బేరసారాలకు పాల్పడ్డారు? ఎవరు ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించారు?

అంతిమంగా పోలింగ్ రిజల్టేమిటి? ఎవరికి ఉన్న ఓట్లు వారికే పడ్డాయి కదా! రిజల్ట్ ఏమిటి? సోకాల్డ్ ట్యాపింగ్.. టేపింగ్..! అదంతాగూడా మే 31 తర్వాతే యాదికి వచ్చిందా? వాళ్ల ఎమ్మెల్యేబోయి మా ఎమ్మెల్యేకు డబ్బులిస్తూ.. మా ఎమ్మెల్యే ప్లేసులో రెడ్‌హ్యాండెండ్‌గా నోట్ల కట్టలతో దొరికన తర్వాత కూడానా? కచ్చితంగా ఇందులో చంద్రబాబు పేరు ఉంది. చంద్రబాబు వేర్వేరు వ్యక్తులతో మాట్లాడారు. చంద్రబాబు అనుచరులు కూడా వేర్వేరు వ్యక్తులతో మాట్లాడారు. ఇప్పుడు దానిని విచారణ సంస్థలు కాల్ డేటా ఆధారంగా బయటకు తీశాయి.

ఆ ఫోన్లు ఇప్పటికే కోర్టుకు డిపాజిట్ చేశారు. ఇంకా ఏం జరిగిందండి.. మా ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ను రేవంత్‌రెడ్డి అప్రోచ్ అయినప్పుడు ఆయన నేరుగా ఏసీబీ డీజీ వద్దకు వెళ్లి కైంప్లెంట్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణ మొదలు పెట్టింది. అప్పుడు మాత్రమే కొన్నిసార్లు మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు! కొన్నిసార్లు కట్ అండ్ పేస్ట్ చేశారని అంటున్నారు! ఆ గొంతు చంద్రబాబునాయుడిదొ కాదో ఆయన మొదట చెప్పాలి. దాని గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదు? డబ్బులు ఇచ్చారా? లేదా? వాళ్ల ఎమ్మెల్యే రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడ్డారా? లేదా? స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడారా? లేదా? ఇవన్నీ ఆయన ఎందుకు చెప్పడం లేదు? మీరంతా లైవ్ మీడియా.

హైదరాబాద్ నగరంలో గతేడాది కాలంలో ఒక్క చిన్న ఘటన అయినా జరిగిందేమో మీరు చెప్పగలరా? ఇక్కడ ఏమైనా శాంతి భద్రతల సమస్య ఉందా? కానీ చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ర్టానికి అనేక విధాలుగా వ్యతిరేకంగా ప్రవర్తించారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన విద్యుత్‌ను ఇవ్వలేదు. ఒక వైపు విద్యుత్ ఆపేసి.. మరోవైపు వాళ్ల ఎమ్మెల్యేలను ధర్నాలు చేయాలని, యాత్రలు చేయాలని ఆదేశించారు. చంద్రబాబు చేస్తున్న పని సరైంది కాదని కేంద్రం నియమించిన సంస్థలు సైతం హెచ్చరించాయి. వాటిని కూడా చంద్రబాబు తోసిపుచ్చేశారు. చట్టాన్ని ఉల్లంఘించింది మీరు. చట్టం స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించింది మీరు. మళ్లీ ఇతరులపైకి తప్పు నెట్టేస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉన్నాయి.

మీడియా: ఉద్యోగులను వేధిస్తున్నారని ఫిర్యాదులున్నాయి..ఇండ్లు కూల్చేశారు. . కేసీఆర్: ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? సంబంధిత మంత్రికి ఎవరైనా చెప్పారా? ఎవరి ఇండ్లు కూలగొట్టామండి? చంద్రబాబు నాయుడిదా? గురుకుల్ ట్రస్ట్‌లో ఆంధ్రవాళ్ల ఇండ్లే కూలగొట్టారా? అక్రమ నిర్మాణాలు కూల్చిండ్రు. అందులో తెలంగాణవాళ్లున్నరు.. ఆంధ్రవాళ్లున్నరు. అందరు.. ప్రపంచమంతా ఉన్నరు. లేరా? తెలంగాణ వాళ్ల ఇండ్లు కూలలేదా?

మీడియా: ఈ కేసులో చంద్రబాబు ఏ-1గా ఉండాలనే డిమాండ్లు వస్తున్నాయి.. మీ వెర్షనేంటి? కేసీఆర్: నాకో వెర్షనంటూ ఉండదు. చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. అరిసి.. గాయిజేసి దొరికిన దొంగలాగ పట్టుబడి..రాజకీయాలను మలినం జేసే ప్రయత్నంజేసి ముఖానికి మసిబూసుకుని! ఏం సమాధానం చెప్తరండీ ఇయాల! అద్చెప్పవేందయ్యా! అది మాట్లాడవు! అసలు విషయం పక్కకు పోయింది.. ట్యాపు..ట్యాపు.. ఏం ట్యాపు?

మీడియా: ఆయన కండ్లు తెరిస్తే ఒకొక్క అస్త్రం వదిలితే మీరు మాడి మసై పోతానంటున్నారు.. కేసీఆర్: ఈ మొగోడు ఇట్ల మాట్లాడబట్టి పదేండ్లయింది. అదొక పెద్ద అరిగిపోయిన రికార్డు. మాకు తెల్వదా? ఈ రోజు నీ పరిస్థితి బాగలేక నీ కిందికి నీళ్లుదెచ్చుకోని ఇంక నువ్వు కన్ను ఎన్నడు తెరవాలె.. నేనెన్నడు మసిగావాలె? ఆల్రెడీ నిన్ను నువ్వే మసిజేసుకున్నవ్.. అయిపోయింది.. ఒడ్సిపోయింది!

మీడియా: తనను అరెస్టు చేస్తే మీ ప్రభుత్వం పడిపోతుందని ఢిల్లీలో ఇవాళ చంద్రబాబు చెప్పారు… కేసీఆర్: ఇది చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. ఇది సహించరానిది. ఏ అధికారంతో చెప్తున్నారు? ఏమధికారం ఉందండి.. చంద్రబాబునాయుడుగారికి? ఈయన ఏమైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా? ఈయన ఒక దొరికిన దొంగ. ఆయనను అరెస్టు చేస్తే తెలంగాణ ప్రభుత్వానికి అది ఆఖరి రోజని ఆయన ఏ అధికారంతో చెప్తారు? చంద్రబాబు కావచ్చు.. ఎక్స్‌వైజెడ్.. ఎవరైనా కావచ్చు.. వాళ్లకు తెలుసు. మీరు బీజేపీ మద్దతు పోటీ చేసి గెలిచారు. కానీ ఇక్కడ మేం మా సొంత బలంపై గెలిచాం.

ఇది ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం. నువ్వుకాదు.. నీ తాత జేజమ్మ కూడా మా వెంట్రుక కూడా పీక్కోలేరు. గవర్నర్‌కు ప్రత్యేక అధికారాలు ఉండాల్నా? వద్దా? అనేది చట్టంలోనే చెప్పారు. అది చాలు. గవర్నర్ కూడా ఒక సంవత్సరం నుంచి చూస్తున్నడు. ఎవరి చరిత్ర ఏంది? ఎవరి భాగోతమేంది? ఎవరు ఎంతలోతు నీళ్లలో ఉన్నడు? అన్నీగూడ ఉన్నయ్.

ఈ రోజు ఒకటే నేనడిగేది.. మెజార్టీ లేకుండా పోటీ చేసిన పార్టీ ఎవరు? మేం వైసీపీ మాకు హామీ ఇచ్చిన తర్వాత ఇక ఏపార్టీ ఎమ్మెల్యే ఓటు కొనే అవసరం లేకుండా ఈ చిల్లర మేనేజ్‌మెంట్ అవసరం లేకుండ.. రైట్ రాయల్ పద్ధతిలో మేం గోదాలోకి దిగినం. నువ్వు దేనిమీద దిగినవు చెప్పు. కేవలం 16 మంది ఎమ్మెల్యేలే ఉన్న తర్వాత చంద్రబాబు ఎలా పోటీలోకి దించారు? చంద్రబాబు ప్లానేంటి? ఆయన చెప్పాలి! 16మందితో ఎమ్మెల్సీని గెలువలేరు. మరి ఎందుకు పోటీ చేశారు? దీనికి మీ సమాధానమేంటి?

మీడియా: టీడీపీకి 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా! మీరు 15మందే అని చెప్తున్నారు? కేసీఆర్: అవన్నీ ఉంటాయండీ.. వాళ్లు అల్రెడీ టీఆర్‌ఎస్‌లో చేరారు. కైంప్లెట్ తీసుకున్నరు.. కోర్టుకు పోయిండ్రు.. ప్రస్తుతం అది స్పీకర్‌గారి పరిధిలో ఉంది. దానిపై నేనేమీ కామెంట్ చేయకూడదు. ఎవరూ స్పీకర్‌ను ప్రశ్నించజాలరు. ఆఖరుకు నేను కూడా!

మీడియా: స్టీఫెన్‌సన్‌తో చేసిన బేరసారాలన్నీ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేశారా? దీని వెనుక వేరే ఉద్దేశం ఏమైనా ఉన్నదని మీరు అనుకుంటున్నారా? కేసీఆర్: వాళ్లకు చాలా కలలున్నాయి. పాపం వాళ్లకు వాళ్లే చేతులు కాల్చుకున్నారు. ఇప్పుడు పెడబొబ్బలు పెట్టి..గాయిజేసి గత్తరగత్తరజేసి బయటపడదామనే పిచ్చి ప్రయత్నంలో ఉన్నరు. ఈ రోజు ఆయన దొరికిన కథ చెప్తే మీరు పరేషన్ అయితరు. చాలుంది బాగోతం.

మీడియా: చెప్పండిసార్.. కేసీఆర్: నేనెందుకు చెప్త? చెప్పవల్సిన టైమ్ వచ్చినప్పుడు చెప్త. నాకేం అవసరముంది? తెలంగాణ ప్రభుత్వ అధినేతగా నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ నాకు వస్తది. ఏది చెప్పాలి? ఏది చెప్పకూడదు? అనేది వేరే విషయం. కానీ.. పీకల్లోతు కూరుకునిపోయి ఉన్నడు చంద్రబాబునాయుడు.

మీడియా: ఢిల్లీలో ప్రయత్నాలపై మీ కామెంట్? కేసీఆర్: ఏం ప్రయత్నం! ఆళ్ల కాళ్లు ఈళ్ల కాళ్లు పట్టుకుంటున్నడు. ఈ రోజు చంద్రబాబుకు కొత్తనా? నాకర్థంకాదు! అందితె రాళ్లు తప్పితే కాళ్లు!

మీడియా: రాజీ కుదిర్చే ప్రయత్నం జరుగుతున్నదా? కేసీఆర్: రాజీ ఏముంది ఇందులో? మాకేం పంచాయతీ ఉంది రాజీ ఉండటానికి!

మీడియా: స్ట్రింగ్ ఆపరేషన్ చేశారంటున్నారు? కేసీఆర్: నువ్వు జేసిన దొంగతనం మీద ఏ ఆపరేషన్ అయితే ఏంది? స్ట్రింగ్ అయితేనేం బింగ్ అయితేనేం? నువ్వు దొరికినవా? లేదా?

మీడియా: మీరు కూడా ఢిల్లీ వెళ్తున్నారంటున్నారు! కేసీఆర్: నేనెందుకు పోతున్న? నాకేం ఖర్మ? 12న నేను ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. కానీ.. ఆ సమావేశం రద్దయింది. దాంతో ఢిల్లీ వెళ్లటం లేదు.

మీడియా: కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా ఎవరైనా ఫోన్ చేశారా? కేసీఆర్: ఇప్పటి వరకూ అయితే ఎవరూ ఫోన్ చేయలేదు. నేననుకోవడం.. ఈ విషయానికి సంబంధించి ఎవరూ ఫోన్ చేయరు. నరేంద్రమోదీ ఇలాంటి ముడుపుల కేసును సపోర్ట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. దేశంలో మునుపెన్నడూ లేనంత చండాలపు అవినీతి ఇది.

ఒక ఎమ్మెల్యే ఓటును ఐదు కోట్లకు కొనుగోలు చేయడం అంటే.. ఎంత నీచం? మీరంతా మీడియాలో వచ్చిన రేవంత్‌రెడ్డి సంభాషణలు వినలేదా? చంద్రబాబు మీడియాను అడుగుతున్నాడు! మీడియాకు సోర్స్ ఉండదా? ఏం సోర్స్ ఉందో తెచ్చుకు వేసుకున్నారు. టీవీకి ఇచ్చిండ్రా.. ప్రపంచమంతా ఇచ్చిండ్రు. మీరు చేసిన తప్పును ఆపితే మాత్రం.. ఎన్నాళ్లీ సంకెళ్లు..! మీ తప్పును బయటపెడితే మాత్రం సంకెళ్లు ఉండొద్దా? ఎటుపాయెనండి.. ఈ సంకెళ్లు?

మీడియా: మీ ఒక్క చానలే ఇచ్చిందంటున్నారు! కేసీఆర్: మళ్ల అట్లనే అంటున్నవయ్య! నిమిషాల తేడాలో ఇస్తరందరూ! ఎవనికి ముందుగాల అందితే వాడు ఇస్తడు.

మీడియా: కోర్టుకు సబ్‌మిట్ చేయాలిగానీ ఇలా మీడియాకు ఇవ్వడమేంటని అంటున్నారు.. కేసీఆర్: నీకు తెలుసా? నాకు తెలుసా? కోర్టుకు ఎవరు ఏం సబ్‌మిట్ చేశారో!

మీడియా: ఈ కేసులో ఏసీబీ నోటీసు వస్తే నేను తీసుకోనని చంద్రబాబు అంటున్నారు.. కేసీఆర్: దీనిపై నేను మాట్లాడ. చట్టం ఉంటది.. దాని పని అది చేస్తది.

మీడియా: మీపై ఏపీలో 79 కేసులు నమోదయ్యాయి! కేసీఆర్: చూడండి.. ఇలాంటి కేసులు నాపై 790 నమోదయ్యాయి. ఉద్యమం సమయంలో నాపై ఆంధ్రప్రదేశ్‌లో వందల కేసులు నమోదయ్యాయి. నేను తెలంగాణ ముఖ్యమంత్రిని. తెలంగాణ పౌరుడిని. భారతదేశ పౌరుడిని. మా తెలంగాణలో పెడితే వాళ్ల దగ్గర పెట్టరా? కేసు పెట్టడమే పెద్ద గొప్పతనమా? తెల్లారకల్లి వెయ్యి కేసులు పెట్టనీకి రాదా తెలంగాణ ఉద్యమకారులకు. తెలంగాణ వాదులకు?

అదో విషయమా? నేననేది.. చేసిన దొంగతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంత కతెందుకయ్యా? ఈ సమస్య నీది.. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌నారాయణ్ జెప్పిండు.. నీ సమస్యను ప్రజల సమస్యగా మారుస్తున్నవని! ఆంధ్ర ప్రజలు ఆంధ్రలో.. తెలంగాణ ప్రజలు తెలంగాణలో సంతోషంగ ఉన్నరు. వాళ్లకెందుకు పూస్తవయ్యా నీమసి? మడుగులపడిన దున్నపోతు పది మందికి పూసిందన్నట్లు!

మీడియా: వైసీపీతో మ్యాచ్‌ఫిక్సింగ్ అయిందనే విమర్శలున్నాయి! కేసీఆర్: ఈ కుమ్మక్కులకు, కుంభకోణాలకు పెట్టిన పేరు చంద్రబాబు నాయుడు. నేనో సైనికుడిని. పోరాటయోధుడిని. ఎవరో పెట్టిన పార్టీలోకి వచ్చి గుంజుకుని ముఖ్యమంత్రినిగాలె. నేను ఒక పార్టీ వ్యవస్థాపకుడిని. ఒక కారణం కోసం పోరాడి.. దానిని సాధించాను. అంతిమంది నేను తెలంగాణ పునర్నిర్మాణంలో ఉన్నాను. తెలంగాణ ప్రజల దయతో నా సొంతంగా నేను ముఖ్యమంత్రిని అయ్యాను. ఏ మాట్లాడుతారండి? వీళ్లకు సంస్కారం ఉన్నదా? నేను మంత్రి పదవి ఇవ్వకుంటే గొర్లు కాసుకునేవాడని అంటడా? అన్లేదా? ఎవరిది గొర్లు కాసే బతుకు? నీదా? నాదా? తలపొగరు ఎవరికి ఉంది? అహంకారం ఎవరిది ఉంది?

మీడియా: మీకు ట్రెయినింగ్ ఇచ్చారంట! కేసీఆర్: ఎవలు? నిజంగ నాకు ఆయన ఇయ్యలేదుగాబట్టి బతికిపోయిన. ఆయన శిక్షణ తీసుకుని ఉంటే ఈ రోజు నేను జైల్లో ఉండేవాడిని.

మీడియా: లేటెస్ట్ శాటిలైట్ ఎక్విప్‌మెంట్‌ను వెహికల్స్‌లో పెట్టి.. సీఎం, అధికారుల ఇండ్ల పక్కన పెట్టి.. ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని అంటున్నారు! కేసీఆర్: చాలా స్పష్టంగా చెప్తున్నా. మేం ఎవరి ఫోన్లనూ ట్యాప్ చేయలేదు. చట్టవిరుద్ధంగా మేం ఏమీ చేయలేదు. మాకు మా పరిమితులు తెలుసు. మా పరిమితుల్లోనే మేం ఉన్నాం. నాదొక రిక్వెస్టు. పెద్ద ఉద్యమం జరిగి రాష్ట్రం వచ్చింది. ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నరు. దినంరాత్రిబవళ్లు కష్టపడుతున్నం. దానికే నువ్వు చాలా ఆటంకాలు కల్పిస్తున్నావ్. చాలా రకాలు ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తున్నవ్.

అడ్డదారిల ఏడు మండలాలు ఎత్తుకుని పోయినవ్. ఆ తదనంతరం కరెంటు ఇవ్వనన్నావ్. పొద్దున లేస్తే కిరికిపెడతవ్. ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మీద హైకోర్టుకు వెళితే నీ ముఖం పగిలిపాయె. టెన్త్ షెడ్యూలులోని ఇన్‌సిట్యూషన్స్ అన్నీ తెలంగాణకే చెందుతాయని హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. ఇట్లా ఎన్ని దుర్మార్గాలు జేసినవ్? నీ దురాశకు ఒక అంతున్నదా? నువు పక్క స్టేట్ ముఖ్యమంత్రివి. నీకు తెలంగాణతో సంబంధం లేదు.

మాట్లాడితే కామన్ కేపిటల్ అంటవ్. కామన్ క్యాపిటల్ ఏంటి? ఇది ఫెసిలిటేటింగ్ క్యాపిటల్. అది పదేండ్ల వరకూ ఉమ్మడి రాజధాని కాదు.. పదేండ్లు మించకుండా ఉమ్మడి రాజధాని. చట్టం చదువుకో. నీ విజ్ఞత ఏమైపోయింది? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఒక గెస్ట్ చీఫ్ మినిస్టర్. అక్కడ మీ కార్యాలయాలు ఉండయి కాబట్టి..కట్టుకునే వరకూ కల్పించిన వెసులుబాటు. నీకు హక్కుగాదు. హైదరాబాద్ మీద నీ జురిడిక్షన్‌ ఉండదు.

చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది ఒక టెరిటోరియల్ పోస్టు. డీజీపీ పోస్టు టెరిటోరియల్ పోస్టు. ఏపీ డీజీపీ ఏపీ టెరిటోరియల్‌లోనే పని చేయాలి. ఏపీ చీఫ్ మినిస్టర్ టెరిటరీ ఆంధ్రప్రదేశ్. అంతేకానీ తెలంగాణ రాష్ట్రం కాదు. మీరు రాజధాని నిర్మించుకునేంత వరకూ ఉమ్మడి రాజధాని అనేది ఒక ఫెసిలిటీ మాత్రమే. అది ఒక గౌరవంతో నీకిచ్చిన మర్యాద. దాని పేరుతో నువ్వు తెలంగాణనే శాసిస్తననుకుంటవా? ఇక్కడ ఒక గవర్నమెంటు ఉంది. ఒక పద్ధతుంది. ఇక్కడకొచ్చి అధికార పార్టీ ఎమ్మెల్యేలనే కొని నేను రాజకీయం చేస్తననుకుంటే ఇక్కడ చేతులు ముడుచుకుని కూర్చుంటారు! నేను ఎమ్మెల్యేలను కొంట.. మీరు సహకరించాలి..

ఇయ్యకుంటే గాయి చేస్త! ఇదేనా? ఇది నీతా? నా ఎమ్మెల్యేను కొనడానికి వెళ్లి నా ఎమ్మెల్యే ఇంటికాడ పట్టుపడటం నిజం కాదా? ప్రపంచం ముందు లేదా? ప్రజల్లేరా? అరిసి.. బొబ్బపెట్టి.. ఎందుకండి? చాలా వస్తది ఇంకా! పైసలెక్కడికెల్లి వచ్చినయ్..అందంతా రావద్దా? మొత్తం వస్తది కదా! కథెక్కడ జరిగింది? ఎవడు ఎవడితో మాట్లాడిండు.. ఎవడి ఫోన్లో మాట్లాడిండు.. అవన్నీ వస్తయి. ఇప్పుడైందా ఇది..

మీడియా: 150 కోట్లతో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని అస్థిరపర్చాలనే కుట్ర జరిగిందంటున్నారు. . కేసీఆర్: తెలంగాణలో నీవు లేని పరిస్థితి ఉంది. ఎందుకు ఈ దందా పెట్టావు? మా ఎమ్మెల్యేలను ఎందుకు కొంటున్నావు? అందరికి ఈ సందేహాలు వస్తాయి. దీన్నిట్లనే వదిలేస్తే మా ప్రభుత్వాన్ని కూడా అస్థిరపరుస్తవు కదా! వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వాళ్ళు ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నారు. ఈ సమాచారం నాకొచ్చింది. నేను వాళ్ళను అలెర్ట్ చేశాను. వెంటనే వాళ్ళు అందర్నీ తీసుకుని వెళ్ళి గండిపేటలో క్యాంపు పెట్టుకున్నారు. వైసీపీ డిసైడ్ చేసింది.

సీపీఐ, సీపీఎం ఓటింగ్‌కు దూరంగా ఉంటానన్నాయి. అప్పుడు వారు స్టార్ట్ చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలను పిలిచి.. బెదిరించి, భయపెట్టి బేరసారాలు సాగించారు. ఐదు ముఠాలు రంగంలోకి దిగాయి. ఇందులో ఒక ముఠా పట్టుబడింది. దాంతో మిగిలిన ముఠాలు జారుకున్నాయి. నేను పోలీసు అధికారిని కాదు. వారిని అరెస్టు చేయడానికి. దానికి ప్రత్యేక సంస్థ ఉంది. స్వతంత్ర సంస్థ ఉంది. వారు చూసుకుంటారు.

మీడియా: చంద్రబాబు ఢిల్లీలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు.. కేసీఆర్: కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్ళి కాళ్ళు, గడ్డాలు పట్టుకుంటున్నారు. అది ఆయనకు అలవాటు. కేంద్రం ఇలాంటి దొంగలకు సహాయం చేస్తుందని, మద్దతు ఇస్తుందని నేను అనుకోను. గతంలో చాలా మంది ఇలాగే దొరికారు. ప్రధానికూడా కోర్టు ముందు నిలబడ్డారు. చరిత్రలో ఇవన్నీ ఉన్నాయి. క్రిమినల్స్‌ను అరెస్టు చేయడం ప్రభుత్వ పని కాదు.

సంస్థలు ఉన్నాయి. ప్రత్యేక విభాగాలున్నాయి. పోలీసులు ఉన్నారు. చంద్రబాబు కోరుకున్నట్లు కేంద్ర వ్రభుత్వం ఎక్కడైనా తప్పుచేసి సెక్షన్ 8మీద ఏదైనా చేయబోతే కేంద్ర ప్రభుత్వం తన ముఖానికి కూడా మసిపూసుకుంటది.

వారు ఖర్మకాలి సెక్షన్ 8 పెట్టినా.. ఏసీబీ ఆ సెక్షన్‌లోకి రాదు. ఇదంతా చంద్రబాబు ఆడే డ్రామా. ఆధిపత్యం. దాదాగిరి. ఏపీ పోలీసు ఇక్కడ ఏమీ అధికారం చెలాయించడానికి లేదు. ఎవరైనా సీఎం పక్క రాష్ర్టానికి వెళితే అక్కడి ప్రభుత్వం సెక్యురిటీ కల్పిస్తుంది. చెన్నైకి పోతే చెన్నై ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది. ఇవన్నీ కాదు. ఫస్ట్ నువ్వు దొరికిన సంగతి చెప్పు. ఆ తర్వాత మిగతా విషయాలు మాట్లాడు. నీ అంతట నీవే సరెండర్ అవుతావా? స్టేట్‌మెంట్ ఇస్తావా? నిర్ణయం నీదే. మిగతావన్నీ తర్వాత మాట్లాడుదాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.