Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేతన్నలకే ప్రభుత్వ ఆర్డర్లు

-ఎనిమిది నెలలు చేతినిండా పని -వస్త్రాల ఆర్డర్లపై త్వరలో వార్షిక ప్రణాళిక -చేనేత, జౌళిశాఖలపై సమీక్షలో మంత్రి కేటీఆర్ -ఢిల్లీలో టెస్కో షోరూం ఏర్పాటుకు ఆదేశాలు

రాష్ట్రంలోని చేనేత కార్మికుల ఉత్పాదక సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకొనేందుకు వార్షిక ప్రణాళికను త్వరలోనే ప్రభుత్వం ఉత్తర్వుల రూపంలో ఇస్తుందని చేనేత,జౌళి, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. సోమవారం బేగంపేట క్యాంపు కార్యాలయంలో బతుకమ్మ చీరెల పంపిణీపై, చేనేత,జౌళిశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ నేతన్నలకు వచ్చే ఏడాదినుంచి ఎనిమిదినెలలపాటు ప్రభుత్వం సేకరించే వస్త్రాలను ఉత్పత్తి చేసేందుకు అవకాశం కల్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆర్డర్లతో ప్రస్తుతం కార్మికులకు నెలకు కనీసం రూ.15 వేల వేతనం మూడునెలల పాటు లభించిందన్నారు. రంజాన్, క్రిస్మస్, బతుకమ్మకు చీరెలు, రాజీవ్ విద్యామిషన్ వస్త్రాల సేకరణను వ్యవస్థీకృతం చేయాలని అధికారులను ఆదేశించారు. వచ్చేఏడాది నుంచి ప్రణాళిక ప్రకారం వస్త్రాల సేకరణ జరిగేలా ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. వస్త్రాలను సేకరిస్తున్న విద్యాశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, వైద్యారోగ్య శాఖాధిపతులతో కలిపి సమావేశాన్ని ఏర్పాటుచేయాలని ఆదేశించారు.

పథకాల అమలును వేగవంతంచేయండి చేనేత కార్మికుల కోసం చేపట్టిన సంక్షేమకార్యక్రమాలను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. నూలు, రసాయనాలు, అద్దకాల సబ్సిడీ పథకాలను ప్రారంభించాలని సూచించారు. నేతన్నకు చేయూతలో భాగంగా జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటుచేయాలన్నారు. ప్రభుత్వం వద్ద చేనేత మగ్గాలు, కార్మికుల సంపూర్ణ సమాచారం ఉన్నదని, పవర్‌లూం కార్మికుల సమాచార సేకరణను పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రతి చేనేతకార్మికుడి సమాచారం చేనేత, జౌళిశాఖ వద్ద ఉండాలని.. దీన్ని డిజిటలైజ్ చేయాలని కోరారు. కార్మికుల వ్యక్తిగత రుణాలమాఫీ, ముడిసరుకుల కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తున్నామని, దీనికి ఈ సమాచారం ఉపకరిస్తుందని చెప్పారు. బతుకమ్మ చీరెల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయి నుంచి చీరెల పంపిణీని పర్యవేక్షించాలని సూచించారు. ఈ నెల 20వ తేదీలోగా చీరెల పంపిణీ పూర్తవుతుందని అధికారులు వివరించారు. సమావేశంలో చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ శైలజా రామయ్యర్, అడిషినల్ డైరెక్టర్ బీ శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ వీ పూర్ణచందర్‌రావు, టెస్కో జీఎం యాదగిరి, ఏడీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాల్లో టెస్కో షోరూంలు ఢిల్లీలోని తెలంగాణభవన్‌లోనూ టెస్కోషోరూం ఏర్పాటుచేయాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇకపై కేంద్ర మంత్రులను కలిసే సందర్భంలో తెలంగాణ చేనేత వస్త్రాలు, గోల్కొండ కళాకృతులను అందించాలని సూచించారు. డిమాండ్ ఉన్న జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూంలను ఏర్పాటుచేయాలని ఆదేశించారు. రాష్ట్రానికి వివిధపథకాల కింద కేంద్రం నుంచి అందే సహకారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఇటీవల కేంద్ర జౌళిశాఖ మంత్రి సృ్మతిఇరానీని కలిసి సహకరించాలని కోరినట్టు చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.