Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నేటి నుంచి సాగుకు 24 గంటల కరంటు

-సాగుకు భరోసా.. ఐదురోజులపాటు ప్రయోగాత్మకంగా.. -విద్యుత్ అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు.. -సరఫరాకు సిద్ధమైన విద్యుత్ సంస్థలు -పునస్సమీక్ష అనంతరం నిరంతర సప్లెకి శాశ్వతచర్యలు: సీఎం

రైతన్నలకు మరో శుభవార్త. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం రాత్రి నుంచి వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ప్రయోగాత్మకంగా సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిరంతర విద్యుత్ సరఫరాపై ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ మేరకు విద్యుత్ అధికా రులను ఆదేశించారు. దీంతో మరో అయిదారు నెలల్లో వ్యవసాయానికి 24గంటల పాటు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేయాలన్న ముఖ్యమంత్రి సంకల్పాన్ని అమలు చేయడంలో అధికారులు తొలి అడుగు వేశారు. సోమవారం రాత్రి నుంచి అయిదారు రోజులపాటు రాష్ట్రమంతటా ప్రయోగాత్మకంగా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఇప్పటికే పాత మూడు జిల్లాల పరిధిలో రైతులకు 24గంటలపాటు విద్యుత్‌ను సరఫరాచేస్తున్నారు. మిగతా అన్ని జిల్లాల్లో కూడా 2018 మార్చి-ఏప్రిల్ నుంచి 24గంటల విద్యుత్‌ను అమలు చేయాలన్న లక్ష్యంతో విద్యుత్ సంస్థలు గత ఏడాదికాలంగా తీసుకొంటున్న చర్యలు కొలిక్కివచ్చాయి. దీంతో ముందుగా అయిదారు రోజుల పాటు ప్రయోగాత్మకంగా ఉచిత విద్యుత్‌ను సరఫరాచేసే విషయంలో జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించారు. నిరంతరాయ విద్యుత్ అందించడానికి పంపిణీ, సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని సీఎం ఆయనను ఆదేశించారు.

నేటి రాత్రి నుంచి ప్రారంభం సోమవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ఐదారు రోజులపాటు ప్రయోగాత్మకంగా 24 గంటల కరంటు సరఫరాచేస్తామని సీఎండీ ప్రభాకర్‌రావు చెప్పారు. దీని ప్రభావాన్ని అన్ని కోణాల్లో అంచనా వేసుకొని, తదుపరి కార్యాచరణ చేపడుతామని ఆయన ప్రతిపాదించారు. ఆయన ప్రతిపాదనను సీఎం కేసీఆర్ ఆమోదించారు. అనంతరం ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ట్రాన్స్‌కో డైరెక్టర్లు నర్సింగ్‌రావు, జగత్‌రెడ్డిలతో ప్రభాకర్‌రావు చర్చించారు. సోమవారం నుంచి అన్ని జిల్లాల్లోని సబ్‌స్టేషన్ల పరిధిలో ఉన్న అన్ని పంపుసెట్లకు 24గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని చెప్పారు. జిల్లాలు, డివిజన్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లవారీగా విద్యుత్ సరఫరా ప్రభావాన్ని అంచనా వేయాలని, ఈ ఐదారురోజులపాటు ప్రతీక్షణం పరిస్థితిని క్షుణ్ణంగా గమనించాలని సూచించారు. ఐదారు రోజుల తర్వాత వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను సమీక్షించుకొని సంస్థాగత సవరణలు చేసుకోవాలన్నారు. దాని ఆధారంగా శాశ్వతప్రాతిపదికన 24 గంటల కరంటు ఇవ్వడానికి తుది ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.

సరికొత్త రికార్డు దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అవుతున్నప్పటికీ.. ఎక్కడా 24 గంటలపాటు సైప్లె లేదు. నిరాటంకంగా రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌నివ్వడం సరికొత్త రికార్డుగా చరిత్రలో నిలిచిపోనున్నది. తెలంగాణ ఏర్పడకముందు రైతులకు అరకొరగానే విద్యుత్ అందేది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొద్దిరోజుల నుంచే 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఏడాదిక్రితం విద్యుత్ శాఖను ఆదేశించారు. దీంతో జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లు సమన్వయంతో రూ.12వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టి పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేశాయి. గత జూన్ 17 నుంచి పాత మెదక్ జిల్లా పరిధిలో, జూన్ 18నుంచి పాత కరీంనగర్, నల్లగొండ జిల్లాల్లో 24 గంటల విద్యుత్‌ను రైతులకు అందిస్తున్నాయి.

23 లక్షల పంపుసెట్లు-11, 500 మెగావాట్ల డిమాండ్ రాష్ట్రం మొత్తం మీద 23 లక్షలకు పైగా పంపుసెట్లున్నాయి. ప్రస్తుతం నిరంతరం ఉచిత విద్యుత్ అమలవుతున్న మూడు జిల్లాల పరిధిలో 9.58లక్షల పంపుసెట్లున్నాయి. రాష్ట్రంలోని పంపుసెట్లలో ఇవి 43శాతం. గరిష్ఠంగా 9,500 మెగావాట్ల డిమాండ్ వచ్చినా సరే, చాలినంత విద్యుత్ సమకూర్చుకుని ఈ మూడు జిల్లాలకు అందించగలిగారు. వచ్చే మార్చి నుంచి మిగతా అన్ని జిల్లాల్లో 23 లక్షలకు పైగా ఉన్న పంపుసెట్లకు నిరంతర విద్యుత్‌ను ఇవ్వడం వల్ల మరో 1500-2000 మెగావాట్ల మేర డిమాండ్ అదనంగా రావచ్చు. ఈ డిమాండ్‌ను సైతం అందుకోవడానికి విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి. రైతులకు 24 గంటలపాటు కరంటు అందివ్వడం తమ శాఖకు కూడా గర్వకారణం కాబట్టి, ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చేయాలనే పట్టుదలతో అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు.

చకచకా 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం 2014 జూన్ 2కు ముందు రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు ఆరు 400 కేవీ సబ్‌స్టేషన్లు మాత్రమే ఉండేవి. వ్యవసాయంతోపాటు అన్ని రంగాలకు 24 గంటల కరంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కేవీ సబ్‌స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నది. సూర్యాపేట, నర్సాపూర్, అసుపాక, డిండి, మహేశ్వరంలో 3,980 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. జూలూరుపాడు, నిర్మల్, కేతిరెడ్డిపల్లి, జనగామల్లో 3705 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు 400 కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణపు పనులు వేగంగా జరుగుతున్నాయి. సూర్యాపేట సబ్‌స్టేషన్‌ను సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఈ తొమ్మిది పూర్తయితే 400 కేవీ సబ్‌స్టేషన్ల సంఖ్య 15కు చేరుకొంటుంది. వీటితో పాటు 19 కొత్త 220 కేవీ సబ్‌స్టేషన్లు, మరో 35 కొత్త 132 కేవీ సబ్‌స్టేషన్లు కూడా నిర్మించింది. తెలంగాణ రాకముందు 233 ఈహెచ్‌టీ లైన్ల సామర్థ్యం కలిగిన సబ్‌స్టేషన్లు ఉండగా, ప్రస్తుతం 292 సబ్‌స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 33/11 కేవీ సబ్ స్టేషన్లు కూడా వందల సంఖ్యలో నిర్మించారు. వీటితోపాటు 2695.25 కిలోమీటర్ల మేర 400 కేవీ లైన్లు, 6,900 కిలోమీటర్ల 220 కేవీ లైన్లు, 10,321 కిలోమీటర్ల మేర 132 కేవీ లైన్లు కొత్తగా వేశారు. తెలంగాణ రాకముందు 16,379 కిలోమీటర్ల లైన్లు ఉంటే, ఇప్పుడు 19,916 కిలోమీటర్ల హెచ్‌టీ లైన్లు సిద్ధంగా ఉన్నాయి. 33/11 కేవీ లైన్లు కూడా దాదాపు 15 వేల కిలోమీటర్లకు పైగా కొత్తగా వేశారు. తెలంగాణ వచ్చేనాటికి 3,748 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లుంటే, కొత్తగా 1,724 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటుచేసి, వాటిసంఖ్యను 5,472కు పెంచారు.

24 గంటల కరంటు నా స్వప్నం: కేసీఆర్ తెలంగాణ రైతులు కరంటు కోసం దశాబ్దాల తరబడి అనేక బాధలు పడ్డ్డరు. భూగర్భంలో నీళ్లున్నా తోడుకోవడానికి కరంటు లేక గోసపడ్డ్డరు. చేతికొచ్చిన పంట ఎండిపోతున్నా నిస్సహాయులుగా మిగిలిపోయిండ్రు. సమైక్య రాష్ట్రంలో మూడు నాలుగు గంటల కరంటు కూడా అందలేదు. వ్యవసాయం ఎక్కువశాతం బోర్లమీదనే ఆధారపడినా, సమైక్య రాష్ట్రంలో రైతులకు కరంటు ఇచ్చే అంశం తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఈ పరిస్థితిలో మార్పు తేవాలని ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే అనుకున్న. దీని ఆవశ్యకతను విద్యుత్ అధికారులకు విడమరిచి చెప్పిన. అందుకు తగ్గట్టుగానే విద్యుత్ సంస్థలు అహోరాత్రులు పనిచేసి, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించినయి. ప్రస్తుతం 9 గంటల కరంటు ఇవ్వగలుగుతున్నయి. మూడు జిల్లాల్లో 24 గంటల కరంటు ఇస్తున్నం. రైతులందరికీ 24 గంటల కరంటు ఇవ్వాలన్నది నా స్వప్నం. ఆ స్వప్నాన్ని సాకారం చేయడానికి కష్టపడుతున్న విద్యుత్ ఉద్యోగులందరికీ అభినందనలు, ధన్యవాదాలు. విద్యుత్ నిరంతరం అందుబాటులో ఉంటుందనే నమ్మకమే రైతుల్లో సానుకూల దృక్పథం ఏర్పడడానికి కారణమవుతుంది. మిషన్ కాకతీయతో తెలంగాణలో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి 24గంటల కరంటు ఎంతగానో దోహదపడుతుంది. రైతులు బంగారు పంటలు పండించగలుగుతారు. తెలంగాణ రైతులు బాగుపడితేనే సాధించుకున్న స్వరాష్ర్టానికి సార్థకత. సోమవారం నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేసే 24 గంటల కరంటు సరఫరా తప్పక విజయవంతం అవుతుంది. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు, భగవంతుడి దీవెనలున్నాయి.

విద్యుత్ సంస్థలకు గర్వకారణం: ప్రభాకర్‌రావు రైతులకు 24 గంటలపాటు కరంటు అందివ్వాలనే సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా అన్ని ఏర్పాట్లుచేశాం. శరవేగంగా కొత్త సబ్‌స్టేషను ్లనిర్మించాం, కొత్త లైన్లు వేశాం. పంపిణీ, సరఫరా వ్యవస్థలను సంసిద్ధం చేశాం. కొత్త పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశాం. అదనపు డిమాండ్‌ను దృష్టిలోపెట్టుకుని, అవసరమైన విద్యుత్‌ను సమకూర్చుకొంటున్నాం. వచ్చే ఏడాదికి కొత్తగూడెం, మణుగూరు ప్లాంట్లు కూడాఉత్పత్తి ప్రారంభిస్తాయి. పంపిణీ, సరఫరాలో నష్టాలను బాగా తగ్గించడం లాంటి సంస్థాగత విషయాల్లో కూడా ఎంతో మెరుగుపడ్డాం. అన్ని జిల్లాల్లో కూడా విజయవంతంగా 24 గంటల కరంటు సరఫరా చేయగలుగుతామనే నమ్మకం మాకున్నది. ప్రభుత్వం కూడా విద్యుత్ సంస్థలకు, ఉద్యోగులకు అన్ని విధాలా అండదండగా ఉన్నది. ప్రభుత్వ సహకారం, విద్యుత్ సంస్థల్లోని ఉద్యోగులకు అంకితభావంతో రైతులకు మేలు చేసే విధంగా విద్యుత్ వ్యవస్థను తీర్చిదిద్దగలుగడం మాకు గర్వకారణం. ప్రభుత్వరంగ సంస్థల ద్వారానే విద్యుదుత్పత్త్తి జరిగితే రైతులకు, పేదలకు మరిన్ని లాభాలు చేకూర్చవచ్చని, విద్యుత్ ఉద్యోగులే ఆ వ్యవస్థలను నడిపిస్తే అద్భుతాలు చేయగలరని భావించే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష నెరవేరే దిశలో పురోగతి సాధించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.