Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నీటి వినియోగ ప్రణాళిక

-రాష్ట్రం యూనిట్‌గా అవసరాలు తీర్చాలి -డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ.. -వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణ ఏర్పర్చాలి -భూ రికార్డుల ప్రక్షాళన పర్యవేక్షణకు ప్రత్యేక విభాగం -మండలానికో రిజిస్ట్రేషన్ కార్యాలయం.. ఐటీ అధికారి హైదరాబాద్ తాగునీటికి సింగూరు జలాలు -సాగర్ నుంచి అక్కంపల్లిద్వారా నల్లగొండకు -ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ -కలెక్టర్లు, వ్యవసాయాధికారులతో రేపు వేర్వేరుగా భేటీ

రాష్ట్రం యూనిట్‌గా నీటి వినియోగం ఉండాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు స్పష్టంచేశారు. ఈ మేరకు కృష్ణా, గోదావరి నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ రెండు నదుల నీటితో సాగు, తాగునీటి అవసరాలతోపాటు పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి కావాల్సిన నీటి అవసరాలను తీర్చుకోవాలన్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులకు కొత్త ఆపరేషనల్ మాన్యువల్స్ (నీటి వినియోగ ప్రణాళికలు) రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాజెక్టు ద్వారా ఏ ప్రాంతం నుంచి ఎన్ని నీళ్లు మిషన్ భగీరథకు ఉపయోగిస్తారో మదింపు చేయాలన్నారు. తెలంగాణ సమస్త ప్రజల అవసరాలను తీర్చడంకోసం డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణను, సాగునీటి ప్రాజెక్టులనుంచి ఏ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి ఎన్ని నీళ్లు కావాలో లెక్కలు వేసి, వాటి వినియోగానికి పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణను ఏర్పాటుచేయాలని కోరారు. ఇప్పుడున్న నీటి లభ్యతనుబట్టి వచ్చే జూలై వరకు ఆచరించే విధంగా నీటి ప్రణాళిక ఉండాలని, కాళేశ్వరం అందుబాటులోకి వచ్చిన తరువాత శాశ్వత నీటి ప్రణాళిక ఉండేలా రూపొందించాలని అధికారులను కోరారు. భూముల రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని ఉన్నతస్థాయిలో పర్యవేక్షించేందుకు ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయాన్ని వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. రిజిస్ట్రార్లు లేని మండలాల్లో తహసీల్దార్లకే రిజిస్ట్రార్లుగా అదనపు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. రిజిస్ట్రేషన్ జరిగినరోజే మ్యుటేషన్ కూడా పూర్తిచేయాలని ఆదేశించారు.

రెవెన్యూ కార్యాలయాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అధికారుల నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పారు. భూమి రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి గురువారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. అదేరోజు ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయంలో వ్యవసాయాధికారులతో సమావేశం ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో తాను ప్రారంభోపన్యాసం చేసిన తరువాత కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది నుంచి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకటించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సింగూరు జలాలను విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నల్లగొండ తాగునీటి అవసరాలకు నాగార్జునసాగర్ నుంచి అక్కంపల్లి ద్వారా నీటిని అందించాలని చెప్పారు. వ్యవసాయం, నీటిపారుదల, మిషన్ భగీరథ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సంయుక్త సమీక్షా సమావేశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదులద్వారా అందుబాటులోకి వచ్చే జలాలను మంచినీరు, సాగునీరు, విద్యుత్, పారిశ్రామిక అవసరాలకోసం సమర్థంగా వాడుకునే అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.

మంచినీటికి అధిక ప్రాధాన్యం ప్రాజెక్టుల నీటిలో మంచినీటికి అధిక ప్రాధాన్యమిస్తాం. ఇందుకోసం అన్ని రిజర్వాయర్లలో 10% నీటిని మంచినీటికి రిజర్వుచేశాం. ఆ నీటిని సమర్థంగా వాడుకోవాలి. వచ్చే ఏడాదినాటికి కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందుబాటులోకి వస్తాయి. కాళేశ్వరం ద్వారా పాత వరంగల్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలతోపాటు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందుతుంది. కాబట్టి మిషన్ భగీరథ అధికారులు రెండు రకాల ప్రణాళికలను సిద్ధంచేసుకోవాలి. ఇప్పుడున్న నీటి లభ్యత, వనరులను బట్టి వచ్చే ఏడాది జూలై నాటికి ఉండే పరిస్థితిని అంచనా వేసి ప్రణాళిక సిద్ధంచేయాలి. కాళేశ్వరం నీరు అందుబాటులోకి వచ్చిన తర్వాత శాశ్వత ప్రణాళిక వేసుకోవాలి. హైదరాబాద్‌తోపాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామాలవారీగా లెక్కలు వేసుకుని, ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు తీసుకుని మంచినీరుగా అందివ్వాలి అని సీఎం సూచించారు.

త్వరితగతిన హైదరాబాద్ శివార్లలో రెండు రిజర్వాయర్ల నిర్మాణం హైదరాబాద్ మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారాలుగా రెండు రిజర్వాయర్లు నిర్మించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఒకదాన్ని కాళేశ్వరంద్వారా వచ్చే గోదావరి నీటితో, రెండోదాన్ని కృష్ణానది జలాలతో నింపాలని అన్నారు. ప్రస్తుతమున్న హిమాయత్‌సాగర్, గండిపేట చెరువుల సామర్థ్యం చాలా తక్కువని, అవి నగర అవసరాలు తీర్చలేవని సీఎం చెప్పారు. కరువు వచ్చినా, నదీ జలాలు అందుబాటులో లేకున్నా సరే, హైదరాబాద్ నగరవాసులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే త్వరితగతిన రిజర్వాయర్లు నిర్మాణం కావాలని చెప్పారు.

మండలానికో రిజిస్ట్రార్ కార్యాలయం ప్రతి మండలానికి ఒక రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటుచేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇప్పటికే ఉన్న రిజిస్ట్రార్ కార్యాలయాలు, రిజిస్ట్రార్లను యథాతథంగా కొనసాగిస్తూ రిజిస్ట్రార్ కార్యాలయాలు లేని మండలాల్లో కొత్తవి నెలకొల్పాలన్నారు. కొత్తగా ఏర్పాటుచేసే రిజిస్ట్రార్ కార్యాలయాలకు రిజిస్ట్రార్లుగా తహసీల్దార్లకే అదనపు బాధ్యతలు అప్పగించాలన్నారు. అవినీతికి, జాప్యానికి ఏ మాత్రం అవకాశంలేకుండా రిజిస్ట్రేషన్ విభాగంలో పెద్దఎత్తున సంస్కరణలు అమలుచేస్తున్నట్టు సీఎం తెలిపారు. మండల స్థాయిలోనే రిజిస్ట్రార్ కార్యాలయం ఉండటంవల్ల ప్రజలకు మేలు కలుగుతుందని చెప్పారు.

రిజిస్ట్రేషన్ రోజే మ్యుటేషన్ కోర్ బ్యాంకింగ్ విధానంలాగానే ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు, క్రయవిక్రయాల వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌డేట్ అవుతాయని సీఎం కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో భూ రికార్డుల నిర్వహణ కోసం, కోర్ బ్యాంకింగ్ తరహాలో భూముల క్రయవిక్రయాల వివరాల నమోదుకు వెయ్యిమంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) అధికారులను నియమించాలని ఆయన ఆదేశించారు. రిజిస్ట్రేషన్ అయినరోజే మ్యుటేషన్ కూడా పూర్తికావాలన్నారు.

భూవివాదాల పరిష్కారానికి ఇకనుంచి కలెక్టర్ కోర్టు ఒక్కటే గతంలో భూమి శిస్తు వసూలుచేసేవారు. దానికి అనుగుణంగా పహాణీలు తయారుచేశారు. కానీ ఇప్పుడు భూమి శిస్తు వసూలుచేయడం లేదు. పైగా ప్రభుత్వమే ఎకరాకు రూ.8వేల చొప్పున పెట్టుబడి ఇస్తున్నది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం పహాణీలో ఉన్న 31 కాలమ్స్ అవసరం ఉందా? లేదా? అనే ఆలోచన చేయాలి. కేవలం రైతుల ఖాతాల వివరాలు మాత్రమే ఉంచి, మిగతావి తొలిగిస్తే సరళంగా ఉంటుంది. గ్రామాలవారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, అటవీ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో ఉన్న భూముల రికార్డులను ప్రత్యేకంగా నిర్వహించాలి. భూ వివాదాలకు సంబంధించి కూడా ఇన్ని కోర్టులు అవసరం లేదు. కలెక్టర్ కోర్టు ఒక్కటే ఉండాలి. మిగతావి రద్దుచేయాలి. పట్టాదారు పాసుపుస్తకాల్లో, పహాణీల్లో వాడే భాష సరళంగా, అందరికీ అర్థమయ్యేలా ఉండాలి. అర్థంకాని పదాలకు బదులు అందరికీ అర్థమయ్యే తెలుగు భాషను వాడాలి. పహాణీలను కంప్యూటర్‌లో డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు ఉండాలి. వచ్చే ఆర్థికసంవత్సరం నుంచి వ్యవసాయ శాఖకు ప్రత్యేక బడ్జెట్ రూపొందిస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి, విధి విధానాలు ఖరారుచేయాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌కే జోషి, బీఆర్ మీనా, ముఖ్య కార్యదర్శి ఎస్ నర్సింగ్‌రావు, సీనియర్ అధికారి వాకాటి కరుణ, నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ సురేందర్‌రెడ్డి, జలమండలి ఈడీ సత్యనారాయణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులవారీగా ఆపరేషనల్ మాన్యువల్స్ గోదావరి, కృష్ణానదులపై అనేక ప్రాజెక్టులు కడుతున్నాం. ఈ రెండు నదుల నీటితో రైతులకు సాగునీరు అందించడంతోపాటు మంచినీరు, పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తికి నీరు సరఫరాచేస్తున్నాం. ఈ నేపథ్యంలో తెలంగాణలోని ప్రాజెక్టులవారీగా కొత్త ఆపరేషనల్ మాన్యువల్స్ తయారుచేయాలి. ప్రాజెక్టునుంచి సాగునీటికి ఎంత ఇవ్వాలి? మంచినీటికి ఎంత ఇవ్వాలి? విద్యుత్ కేంద్రాలకు, పరిశ్రమలకు ఎంత నీరు ఇవ్వాలి? అనే విషయాల్లో స్పష్టత ఉండాలి. ప్రాజెక్టుల్లో నీరు చేరినదాన్నిబట్టి కూడా ప్రాధాన్యాలను నిర్ణయించి నీటిని విడుదలచేయాలి. దీనికోసం ప్రత్యేక విధానం అమలుపరుచాలి. కొత్త ఆపరేషనల్ మాన్యువల్స్ వెంటనే తయారుచేయాలి. నీటి విడుదలకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజధాని నుంచి వచ్చే సూచనలు, ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మిషన్ భగీరథ అధికారులు కూడా ఏ ప్రాజెక్టునుంచి ఎన్ని నీళ్లు తీసుకుంటున్నాం? ఏయే ప్రాంతాలకు ఎక్కడి నుంచి నీరు సరఫరా చేస్తున్నాం? అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. సాగునీటి ప్రాజెక్టులనుంచి వాడుకునే నీటికి సంబంధించి ఎప్పటికప్పుడు పరిస్థితిని బట్టి వ్యవహరించేందుకు డ్రింకింగ్ వాటర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణను నెలకొల్పాలి. ఇదే విధంగా పవర్ ఫ్రంట్ ఆఫ్ తెలంగాణను కూడా ఏర్పాటుచేయాలి. వారు కూడా ఏ ప్రాజెక్టు నుంచి ఏ విద్యుత్ కేంద్రానికి ఎన్ని నీళ్లు కావాలో? అవి ఎలా పొందాలో? స్పష్టమైన అంచనాకు రావాలి. పరిశ్రమలకు కూడా ఇదే విధమైన ఏర్పాటు ఉండాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ మేరకు నీటిపారుదల, మిషన్ భగీరథ, విద్యుత్, పరిశ్రమల శాఖల అధికారులు సంయుక్త సమావేశం ఏర్పాటుచేసుకుని, నదీ జలాల వాడకంపై అవగాహనకు రావాలని సీఎం ఆదేశించారు.

రేపు కలెక్టర్ల కాన్ఫరెన్స్ భూ రికార్డుల ప్రక్షాళనకు క్షేత్రస్థాయిలో జరుగాల్సిన కార్యక్రమాలపై మార్గనిర్దేశం చేసేందుకు గురువారం జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ప్రగతిభవన్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశం రోజంతా కొనసాగుతుంది. సెప్టెంబర్ ఒకటి నుంచి రైతు సమన్వయ కమిటీల నియామకం జరుగాలని, సెప్టెంబర్ 15 నుంచి రికార్డుల పరిశీలన ప్రారంభించాలని సీఎం చెప్పారు. భూ రికార్డుల ప్రక్షాళన, రికార్డుల నిర్వహణ, పట్టాదార్ పాసుపుస్తకాల్లో మార్పులు, పహాణీల్లో మార్పులు, రిజిస్ట్రేషన్లలో సంస్కరణలు తదితరాలపై విధివిధానాలకు తుదిరూపం ఇచ్చి కలెక్టర్ల సమావేశంలో వెల్లడించాలని సూచించారు.

జయశంకర్ వర్సిటీలో వ్యవసాయాధికారుల సమావేశం హైదరాబాద్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వ్యవసాయాధికారుల సమావేశం గురువారం జరుగుతుంది. భూ రికార్డుల ప్రక్షాళన, రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితుల నిర్మాణం, రైతు వేదికల ఏర్పాటు తదితర అంశాలపై సమావేశంలో చర్చిస్తారు. సీఎం కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేస్తారు.

హైదరాబాద్ తాగునీటికి సింగూరు జలాలు -నీటిపారుదల శాఖకు సీఎం కేసీఆర్ ఆదేశాలు -సాగర్ నుంచి అక్కంపల్లిద్వారా నల్లగొండకు -సాగర్ నీటిమట్టం తగ్గడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు -రంగంలోకి నీటిపారుదల, జలమండలి అధికారులు

కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు మంచినీటి సరఫరాకోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మంగళవారం అధికారులను ఆదేశించారు. సింగూరు నుంచి హైదరాబాద్‌కు నీటిని వదులాలని, నాగార్జునసాగర్‌నుంచి అక్కంపల్లి రిజర్వాయర్‌ద్వారా ఉదయ సముద్రం రిజర్వాయర్‌కు నీటిని విడుదలచేసి నల్లగొండ జిల్లాకు మంచినీరు ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఈఎన్సీ మురళీధర్‌రావును ఆయన ఆదేశించారు. సింగూరు నుంచి హైదరాబాద్‌కు, అక్కంపల్లి నుంచి ఉదయ సముద్రానికి మంగళవారం రాత్రి నుంచే నీటి విడుదల జరుగాలని చెప్పారు. కృష్ణానదిలో ఈసారి వరద నీరు రాలేదని, నాగార్జునసాగర్‌లో నీటిమట్టం గణనీయంగా పడిపోయిందని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో నీటిని జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ పరిస్థితిలో కృష్ణానది నీళ్లపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండల్లో మంచినీటి సరఫరాకు ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వెల్లడించారు.

ముందుగానే హెచ్చరించిన సీఎం హైదరాబాద్ మహా నగర తాగునీటి సరఫరాపై సీఎం కేసీఆర్ ముందుగానే ఓ అంచనాకు వచ్చినట్టు స్పష్టమవుతున్నది. అందుకే సింగూరు రిజర్వాయర్‌నుంచి నీటిని విడుదల చేయకుండా అట్లనే ఉంచాలని నీటిపారుదల శాఖ అధికారులకు గతంలోనే ఆయన ఆదేశాలు జారీచేశారు. కొందరు ప్రజాప్రతినిధులు అడిగినప్పటికీ.. కీలకమైన హైదరాబాద్ తాగునీటికోసం సింగూరులో నీటిని అట్లనే ఉంచాల్సి వస్తున్నదని కూడా చెప్పారు. ఆ ముందు జాగ్రత్త చర్యలే ప్రస్తుతం హైదరాబాద్‌కు శ్రీరామరక్షగా మారాయి.

కృష్ణా జలాల సరఫరాలో వెసులుబాటు హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాకోసం నల్లగొండ జిల్లాలోని ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టుద్వారా నీటిని సేకరిస్తారు. నాగార్జునసాగర్‌లో 510 అడుగుల (ఎండీడీఎల్-కనీస నీటి సేకరణ స్థాయి) కంటే ఎక్కువగా ఉంటేనే ప్రాజెక్టు మోటర్లద్వారా నీటి విడుదల సాధ్యమవుతుంది. కానీ ప్రస్తుతం సాగర్‌లో 500 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయి. దీంతో జలమండలి అధికారులు అత్యవసర మోటర్లద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో హైదరాబాద్‌కు తాగునీటిని అందిస్తున్నారు. దీంతో వచ్చిన నీటిని హైదరాబాద్‌కే తరలిస్తుండటంతో నల్లగొండ పట్టణంతోపాటు సుమారు 230కిపైగా గ్రామాలకు తాగునీటిని అందించే ఉదయ సముద్రానికి నీటిని విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సింగూరు జలాలను హైదరాబాద్‌కు తరలించాలని ఆదేశించడంతో కృష్ణాజలాల సరఫరాలో కొంత వెసులుబాటు లభించనుంది. దీంతో ఇటు హైదరాబాద్, అటు నల్లగొండ, ఇతర ఫ్లోరైడ్‌పీడిత గ్రామాల తాగునీటికి ఢోకా ఉండదు. పైగా సింగూరు పూర్తిస్థాయి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22 టీఎంసీల నిల్వ ఉంది. ఎగువన ప్రధానంగా సాయిగాం నుంచి 18వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కూడా ఉంది. దీంతో హైదరాబాద్ తాగునీటితోపాటు మున్ముందు సింగూరు ఆయకట్టుకు కూడా ఉపశమనం కలిగే అవకాశాలున్నాయి.

నేడు పుట్టంగండికి నీటిపారుదల శాఖ అధికారులు సీఎం ఆదేశాలతో నీటిపారుదలశాఖ, జలమండలి అధికారులు రంగంలోకి దిగారు. సుమారు రెండేండ్ల కిందట హైదరాబాద్‌కు మంజీరా జలాల సరఫరా నిలిపివేయగా.. సింగూరు నుంచి మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. బుధవారం నుంచి రోజుకు 90 ఎంజీడీలను నగరానికి తరలించనున్నారు. ఇంతమేరలో కృష్ణా జలాలను తగ్గించేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం సాగర్ నుంచి అత్యవసర మోటర్ల ద్వారా ఏఎమ్మార్ ప్రాజెక్టుకు 675 క్యూసెక్కుల నీటిని తరలించి అక్కంపల్లి రిజర్వాయర్‌లోకి ఎత్తిపోస్తున్నారు. అందులో 525 క్యూసెక్కుల నీటిని జలమండలి సేకరించి.. రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల నీటిని హైదరాబాద్‌కు తరలిస్తూవచ్చింది. దీంతో అక్కంపల్లి రిజర్వాయర్‌లో స్టోరేజీ పెరుగడం లేదు. ప్రస్తుతం అక్కడ 0.13 టీఎంసీల నిల్వ మాత్రమే ఉంది. కనీసంగా 0.30 టీఎంసీలకంటే ఎక్కువ నీళ్లు ఉంటే తప్ప అక్కంపల్లి నుంచి నల్లగొండ ఉదయ సముద్రానికి నీటిని వదిలే అవకాశాల్లేవు. ఈ నేపథ్యంలో సింగూరు నుంచి హైదరాబాద్‌కు బుధవారం నుంచి రోజుకు 90 మిలియన్ గ్యాలన్ల నీటిని తరలిస్తున్నారు. దీంతో నగరానికి వచ్చే 270 ఎంజీడీల్లో 90 ఎంజీడీలను తగ్గించనున్నారు. తద్వారా అక్కంపల్లి రిజర్వాయర్‌లో అదనంగా 175 క్యూసెక్కుల జలాల మిగులు ఉంటుంది. పుట్టంగండి వద్ద ఉన్న అత్యవసర మోటర్ల ద్వారా 900 క్యూసెక్కుల నీటిని లిఫ్టు చేసే అవకాశం ఉండటంతో బుధవారం ఎన్‌ఎస్పీ చీఫ్ ఇంజినీర్ ఎస్ సునీల్‌తోపాటు ఇతర ఇంజినీర్లు అక్కడికి వెళ్లనున్నారు. పూర్తిస్థాయిలో లిఫ్టు చేయడం ద్వారా అక్కంపల్లికి ఇన్‌ఫ్లో పెరుగనుంది. ఇలా సుమారు 550 క్యూసెక్కుల వరకు నీటిని రిజర్వాయర్‌లో నిల్వ చేసేలా అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. తద్వారా నిల్వ సామర్థ్యం పెరిగిన వెంటనే ఉదయ సముద్రానికి నీటిని విడుదలచేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.