-టీఆర్‌ఎస్ సభ్యత్వాలకు విశేష స్పందన -పాలకుర్తి, గజ్వేల్ నియోజకవర్గాల్లో అత్యధికంగా సభ్యత్వాల నమోదు -30లోగా సభ్యత్వాలు, డిజిటల్ నమోదు పూర్తి.. -ఆగస్టు 1 నుంచి పార్టీ సభ్యులకు బీమా వర్తింపు -అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురాలి.. -బూత్‌కమిటీల ఏర్పాటుతో పురపోరుకు సిద్ధంకండి -టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై సమీక్షలో వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేషస్పందన లభించిందని, నెల వ్యవధిలో దాదాపు 40 లక్షల మంది సభ్యులుగా చేరారని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. ఇందులో దాదాపు 20 లక్షలమంది వివరాలను డిజిటలైజ్ చేసినట్టు చెప్పారు. 50 వేల సభ్యత్వాలు పూర్తయిన నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు అనుమతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురాలని పిలుపునిచ్చారు. బూత్‌స్థాయి కమిటీలు వెంటనే ఏర్పాటుచేసి, నాయకులు, కార్యకర్తలు మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదుపై శుక్రవారం తెలంగాణభవన్‌లో నియోజకవర్గ సభ్యత్వ, డిజిటల్ నమోదు ఇంచార్జీలతో కేటీఆర్ సమీక్షించారు. ప్రతి నియోజకవర్గంవారీగా పూర్తయిన సభ్యత్వం, వాటి డిజిటలైజేషన్‌పై వివరాలు తెలుసుకున్నారు. నెలాఖరులోపు సభ్యత్వ నమోదు పూర్తిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
కార్యకర్తల పూర్తి వివరాలను సేకరించాలని ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తున్నారో లేదో తెలుసుకున్నారు. ఈ వివరాల ఆధారంగానే కార్యకర్తల బీమా సౌకర్యం ముడిపడి ఉన్నదని చెప్పారు. సభ్యత్వ నమో దు సందర్భంగా ప్రజలనుంచి వచ్చిన అభిప్రాయాలను ఇంచార్జీల ద్వారా కేటీఆర్ తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదుకు అన్నివర్గాలనుంచి పెద్దఎత్తున స్పందన వస్తున్నదంటూ సంతృప్తి వ్యక్తంచేశారు. లక్ష్యాన్ని మించి సభ్యత్వాన్ని నమోదుచేసిన పలు నియోజకవర్గాల్లో మరిన్ని సభ్యత్వ నమోదు పుస్తకాలను పార్టీ కార్యాలయం నుంచి తీసుకున్నారని కేటీఆర్ తెలిపారు. సభ్యత్వాల నమోదు, డిజిటలైజేషన్ లక్ష్యాన్ని ఈ నెల 30లోగా పూర్తిచేయాలని సూచించారు. పట్టణప్రాంతాల్లో పెద్దఎత్తున సభ్యత్వ నమోదు చురుకుగా కొనసాగుతున్నదని ఇంచార్జీలు కేటీఆర్‌కు తెలిపారు. రానున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో పట్టణప్రాంతాల్లో వస్తున్న స్పందనపై కేటీఆర్ సంతృప్తి వ్యక్తంచేశారు. లక్ష్యంమేరకు సభ్యత్వాన్ని పూర్తిచేసిన ఇంచార్జీలు, స్థానిక ఎమ్మెల్యేలను అభినందించారు. నెలాఖరులోగా మొత్తం ప్రక్రియ పూర్తవుతుందని తెలిపారు.

సభ్యత్వాల్లో పాలకుర్తి, గజ్వేల్ టాప్ సభ్యత్వ నమోదులో పాలకుర్తి, గజ్వేల్ నియోజకవర్గాలు ముందువరుసలో నిలిచాయి. పాలకుర్తిలో 73 వేలమంది, గజ్వేల్‌లో 70 వేల మంది సభ్యత్వాలు స్వీకరించారు. సిద్దిపేటలో 63వేలు, సత్తుపల్లిలో 62వేలు, పరకాల, మహబూబాబాద్, మహేశ్వరం, మేడ్చ ల్, సూర్యాపేట, ములుగు, ధర్మపురి, సిరిసిల్ల, కామారెడ్డి నియోజకవర్గాల్లో 60 వేలకు పైగా, గద్వాల, నకిరేకల్‌లో 50 వేలకుపైగా సభ్యత్వ నమోదు జరిగినట్టు కేటీఆర్ వెల్లడించారు.
జీహెచ్‌ఎంసీ సభ్యత్వాలపై ప్రత్యేక సమీక్ష అత్యంత కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్టీ సభ్యత్వ నమోదుపై బుధవారం ప్రత్యేకంగా సమీక్షించాలని నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 24 మున్సిపాలిటీలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఆగస్టు 1 నుంచి సభ్యులకు బీమా పార్టీ సభ్యత్వం పొందిన సభ్యుల వివరాలను జూలై 30లోగా డిజిటలైజ్‌చేసి, ఆగస్టు 1 నుంచి బీమా వర్తింపజేయనున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌లు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దానం నాగేందర్, రవీంద్రనాయక్, వనమా వెంకటేశ్వరరావు, పార్టీ నేత తుల ఉమ, కార్పొరేషన్ల చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కేటీఆర్‌కు జన్మదినోత్సవాన్ని (24వ తేదీన) పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలిపారు.
జలమండలి విజేతలకు అభినందన హైదరాబాద్ మెట్రో వాటర్‌బోర్డు (జలమండలి) యూనియన్ గుర్తింపు ఎన్నికల్లో గెలిచిన నాయకులను కేటీఆర్ అభినందించారు. టీఆర్‌ఎస్కేవీ అనుబంధ వాటర్‌వర్క్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు రాంబాబుయాదవ్.. కామ్‌గార్ యూనియన్ నాయకుడు సతీశ్‌కుమార్‌పై 367 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ సందర్భంగా రాంబాబు నేతృత్వంలో యూనియన్ ప్రతినిధులు రాజిరెడ్డి, నారాయణ, జహంగీర్, అఖ్తర్‌అలీ, జయరాజ్, లక్ష్నీనారాయణ, ఆనంద్‌రెడ్డి, షకీల్ తదితరులు కేటీఆర్‌ను కలిశారు. వారిని అభినందించిన కేటీఆర్.. యూనియన్ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్కేవీ యూనియన్‌కు మద్దతు తెలిపిన సంఘాల నేతలకు రాంబాబు ధన్యవాదాలు తెలిపారు.
హలో.. నేను కేటీఆర్‌ను మాట్లాడుతున్న.. సభ్యత్వ నమోదుపై సమీక్షించిన కేటీఆర్.. సభ్యత్వ నమోదు పుస్తకాల్లోంచి కొందరు కార్యకర్తల నంబర్లకు స్వయం గా ఫోన్లు చేశారు. మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కార్యకర్తలకు ఫోన్‌చేసి, సభ్యత్వ రుసుమును సభ్యత్వం పొందినవారే చెల్లించారా? లేక ఎమ్మెల్యేలు చెల్లించారా? అనేది వాకబుచేశారు. ఊహించని విధంగా కేటీఆర్ స్వయం గా ఫోన్ చేయడంతో కార్యకర్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో అపార నమ్మకం -ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి

దేశచరిత్రలో నెలరోజుల్లో 40 లక్షల సభ్యత్వాలను పూర్తిచేసిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కిందని ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సభ్యత్వాల నమోదుపై శుక్రవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశం అనంతరం పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, ఎం శ్రీనివాస్‌రెడ్డి, రాజేశ్, వాసుదేవరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌పట్ల ప్రజలు అపారమైన నమ్మకం, ప్రేమ కలిగి ఉన్నారని చెప్పారు. గత ఎనిమిది నెలల్లో జరిగిన వివిధ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అద్భుతంగా, ఏకపక్షంగా పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పటికే 40 లక్షలకుపైగా సభ్యత్వాలు పూర్తయినట్టు చెప్పారు.
సభ్యత్వ రుసుముకు సంబంధించి రూ.15 కోట్లు పార్టీ రాష్ట్ర కార్యాలయానికి అందినట్టు తెలిపారు. సభ్యులందరికీ ఈ ఏడాది కూడా రూ.2 లక్షల బీమా వర్తిస్తుందని చెప్పారు. 50 వేల సభ్యత్వాలు పూర్తయిన నియోజకవర్గాల్లో కమిటీల ఏర్పాటుకు కేటీఆర్ అనుమతిచ్చినట్టు పల్లా తెలిపారు. టీఆర్‌ఎస్ సభ్యులందరికీ రాజకీయ శిక్షణ ఇచ్చి, దేశంలో క్రమశిక్షణ కలిగిన సైనికులుగా తీర్చిదిద్దాలనేది కేసీఆర్, కేటీఆర్ లక్ష్యమని చెప్పారు. దసరానాటికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తిచేసి, శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని కేటీఆర్ ఆదేశించినట్టు వివరించారు. అసెంబ్లీ, సచివాలయాల నిర్మాణాలపై హైకోర్టులో కేసు ఉన్న నేపథ్యంలో దానిపై ప్రభుత్వమే కోర్టుకు సమాధానమిస్తుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా పల్లా చెప్పారు.
