-కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
-రూ.1200 కోట్లతో పథకాల అమలు
-పెండింగ్‌లో ఉన్న ఎనిమిదివేల మరమగ్గాల ఆధునీకరణ నిధుల విడుదలకు వినతి
-కొత్తగా పది చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు విజ్ఞప్తి
-సానుకూలంగా స్పందించిన కేంద్రమంత్రి
రాష్ట్రంలో నేత కార్మికులకు చేయూతనిచ్చేందుకు సహకరించాలని కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతిఇరానీకి రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, జౌళిశాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తిచేశారు. చేనేత కార్మికులకు మరో పది క్లస్టర్లు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో ఎనిమిదివేల మరమగ్గాలను ఆధునీకరిస్తున్నామని, దీనికి కొన్ని నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, వాటిని వెంటనే విడుదలచేయాలని విన్నవించారు. వీటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. మంగళవారం ఢిల్లీలో కేంద్రమంత్రిని కేటీఆర్ కలుసుకున్నారు. రాష్ట్రంలో ప్రజాసంక్షేమం కోసం పలు పథకాలు అమలుచేస్తున్నామని, వాటిలో ముఖ్యంగా చేనేత, మరనేత కార్మికుల కోసం రూ.1200 కోట్లను కేటాయించామని చెప్పారు. హ్యాండ్లూం, పవర్‌లూం రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఈ సందర్భంగా ఆమెకు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో చేనేత, మరనేత కార్మికుల కోసం చేపట్టిన నేతన్నకు చేయూత, చేనేత మిత్ర కార్యక్రమాలను, కేటాయించిన నిధులను కేంద్ర మంత్రికి వివరించినట్టు చెప్పారు. నేతన్నల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న వివిధ కార్యక్రమాలను గతంలోనే వివిధ రాష్ర్టాల మంత్రుల సమావేశాన్ని నిర్వహించినప్పుడు వివరించామన్నారు. అయితే రెండు కీలక సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, కేంద్రం సయోధ్యతో చేయాల్సిన ఈ పనుల కోసమే కేంద్రమంత్రితో భేటీ అయ్యానని వెల్లడించారు. తెలంగాణలోని చేనేత కార్మికుల సంక్షేమార్థం రూ.1200 కోట్లతో నేతన్నకు చేయూత, చేనేతమిత్ర వంటి కార్యక్రమాలు అమలుచేస్తున్నామని, కేంద్రం సహకారంతో కొన్ని కొత్త హ్యాండ్లూం క్లస్టర్లను ఏర్పాటుచేస్తున్నామని వివరించారు.
తాజాగా మరో 10 క్లస్టర్లు మంజూరుచేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిదివేల మరమగ్గాల ఆధునీకరణకు కొన్ని నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోని మధిర, మహబూబ్‌నగర్ జిల్లాలోని అమరచింత ప్రాంతాల్లో కొత్త క్లస్టర్లను ఏర్పాటు చేసేందుకు నివేదించామన్నారు. చేనేత కార్మికులను ఆదుకునేలా కొత్త క్లస్టర్లు ఉంటాయని చెప్పారు. నల్లగొండ, సిరిసిల్ల ప్రాంతాల్లో పవర్‌లూమ్స్ ఆధునీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ వివరించారు. తెలంగాణలోని పవర్‌లూమ్స్ ఆధునీకరణ నిధులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని కోరామని తెలిపారు. దీనిపై కేంద్రమంత్రి స్మృతిఇరానీ సానుకూలంగా స్పందించారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. దీనిపై వెంటనే ముంబైలోని టెక్స్టైల్స్ కమిషనర్‌తో మాట్లాడారని, ఈ సంక్షేమ పథకాల పరిశీలనకు అవసరమైతే వ్యక్తిగతంగా పర్యటించాలని ఆదేశించారని తెలిపారు. రాష్ట్రంలోని నేతన్నల సమస్యలపై స్పందించిన కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రమంత్రిని కలిసినవారిలో లోక్‌సభలో టీఆర్ఎస్ పక్ష నేత జితేందర్‌రెడ్డి, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్, తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ కూడా ఉన్నారు.