-పౌరుల భాగస్వామ్యం కీలకం -పది రోజులపాటు కార్యక్రమాలు -భాగస్వాములుకానున్న ప్రజాప్రతినిధులు, అధికారులు -పట్టణప్రగతి పనులకు రూ.148 కోట్లు విడుదల -పచ్చదనం, పరిశుభ్రత, విద్యుత్ సమస్యపై ప్రత్యేక దృష్టి -మహబూబ్‌నగర్‌లో పాల్గొననున్న మంత్రి కేటీఆర్

పట్టణ రూపురేఖలను మార్చి ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా చేపట్టిన పట్టణప్రగతి కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు వచ్చే నెల 4వ తేదీవరకు ఈ కార్యక్రమం కొనసాగనున్నది. పట్టణప్రగతిలో వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లకు రూ.148 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. పట్టణప్రగతి విజయవంతానికి వార్డు యూనిట్‌గా కార్యక్రమం చేపట్టాలని, ప్రతివార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని పురపాలకశాఖ మార్గదర్శకాలను విడుదలచేసింది.
పదిరోజులకు అవసరమైన కార్యాచరణను ముందే రూపొందించుకొని, ప్రణాళికాబద్ధంగా పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీల ఏర్పాటు, విద్యుత్ సమస్యల పరిష్కారం, పబ్లిక్ టాయిలెట్ల కోసం అవసరమైన స్థలాల గుర్తింపు, పట్టణ జనాభాకు అనుగుణంగా పరిశుభ్రమైన వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్లు ఏర్పాటుచేయడం, పట్టణ యువతకు అవసరమైన క్రీడాప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌ల ఏర్పాటు వంటి పనులను గుర్తించింది. మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో పట్టణప్రగతి కార్యక్రమం రూపుదిద్దుకున్నదని పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పాల్గొనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. పట్టణాల్లోని ప్రజల జీవితాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టాలని కేటీఆర్ కోరారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌరసేవలు మెరుగుపర్చడం వంటి ప్రధానమైన ప్రాథమిక లక్ష్యాలను నిర్ణయించినట్టు తెలిపారు.
పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా చెత్తను తరలించడంతోపాటు మురికికాల్వలను, బహిరంగ ప్రదేశాలను శుభ్రపర్చడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. పట్టణాల్లో ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలకు అవసరమైన ఇయర్ క్యాలెండర్‌ను ప్రకటించాలని మంత్రి కోరారు. పట్టణప్రగతి ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైన కార్యక్రమాలను చేపట్టాలని, ఇందులో భాగంగా ఘనవ్యర్థాలు, నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను చెరువుల్లో కలుపకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని, అన్ని గృహ సముదాయాల్లో ఇంకుడుగుంతలు ఏర్పాటుచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పౌరుల భాగస్వామ్యం అనేది అత్యంత కీలకమైన అంశమని, ఇందుకోసం ప్రతివార్డులో కమిటీలను ఏర్పాటుచేసి కనీసం మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించడం, వివిధ అంశాలను చర్చించి వాటిపైన చర్యలు తీసుకోవడం వంటి అనేక లక్ష్యాలను ఇందులో భాగంగా చేపట్టనున్నట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలు తమకు అందించిన ఆశీర్వాదాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ నిర్దేశించిన పట్టణప్రగతి లక్ష్యాలను అందుకొనేందుకు అందరూ కృషిచేయాలని కోరారు.
-పాలమూరులో ఏర్పాట్లు పూర్తి -పర్యవేక్షించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్‌నగర్ పట్టణంలో పట్టణప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం రానున్నారు. ఈ మేరకు బల్దియాలో ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ వెంకట్రావు ఆదివారం పనులను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ పనులను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సోమవారం మెట్టుగడ్డ వద్ద వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లకు శంకుస్థాపన, హైమాస్ట్ విద్యుద్దీపాలతో నూతనంగా నిర్మించిన రోడ్డు విస్తరణ పనుల ప్రారంభం, కేసీఆర్ క్రీడాప్రాంగణం, 100 స్వచ్ఛ వాహనాలను మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులతో సమావేశంలో పాల్గొంటారు.
పట్టణప్రగతికి రూ.148 కోట్లు విడుదల పట్టణప్రగతి కార్యక్రమం కింద కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేసింది. సోమవారం నుంచి పదిరోజులపాటు కొనసాగనున్న పట్టణప్రగతిలో వివిధ కార్యక్రమాలను చేపట్టడానికి వీలుగా ప్రభుత్వం నిధులను కేటాయించింది. జీహెచ్ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 140 మున్సిపాలిటీలకు రూ.148 కోట్లు విడుదలచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఆదిలాబాద్ జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.1.29 కోట్లు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రూ.2.05 కోట్లు, జగిత్యాలకు రూ.2.29 కోట్లు, జనగామకు రూ.45.67 లక్షలు, జయశంకర్ భూపాలపల్లికి రూ.56.79 లక్షలు, జోగుళాంబ గద్వాలకు రూ.1.24 కోట్లు, కామారెడ్డికి రూ.1.34 కోట్లు, కరీంనగర్‌కు రూ.3.57 కోట్లు, ఖమ్మంకు రూ.3.62 కోట్లు, కుమ్రంభీం ఆసిఫాబాద్‌కు రూ.48.48 లక్షలు, మహబూబ్‌నగర్‌కు రూ.2.56 కోట్లు, మహబూబాబాద్‌కు రూ.1.12 కోట్లు, మంచిర్యాలకు రూ.3.18 కోట్లు, మెదక్‌కు రూ.1.06 కోట్లు,
మేడ్చల్ మల్కాజిగిరికి రూ.3.94 కోట్లు, నాగర్‌కర్నూల్‌కు రూ.1.11 కోట్లు, నల్లగొండకు రూ.3.41 కోట్లు, నారాయణపేటకు రూ.84.05 లక్షలు, నిర్మల్‌కు రూ.1.46 కోట్లు, నిజామాబాద్‌కు రూ.4.43 కోట్లు, పెద్దపల్లికి రూ.2.85 కోట్లు, రాజన్న సిరిసిల్లకు రూ.1.22 కోట్లు, రంగారెడ్డికి రూ.5.56 కోట్లు, సంగారెడ్డికి రూ.3.22 కోట్లు, సిద్దిపేటకు రూ.2.07 కోట్లు, సూర్యాపేటకు రూ.2.46 కోట్లు, వికారాబాద్‌కు రూ.1.57 కోట్లు, వనపర్తికి రూ.1.24 కోట్లు, వరంగల్ రూరల్‌కు రూ.72.03 లక్షలు, వరంగల్ అర్బన్‌కు రూ.7.34 కోట్లు, యాదాద్రి భువనగిరికి రూ.1.64 కోట్లు, హైదరాబాద్‌కు రూ.78 కోట్ల చొప్పున విడుదలయ్యాయి.