Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నిధుల కొరతలేదు

-ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, వైభవోపేతంగా యాదాద్రి ఆలయ నిర్మాణాలుండాలి
-పునరుద్ధరణ పూర్తయ్యాక సహస్రాష్టక కుండయాగం
-దేశవిదేశీ ప్రముఖులను యాగానికి ఆహ్వానిస్తాం: సీఎం కేసీఆర్
-4.5 ఎకరాల్లో ప్రధాన దేవాలయం
-302 ఎకరాల్లో దేవాలయ ప్రాంగణం
-భక్తుల వసతికి టెంపుల్ సిటీలో 340 క్వార్టర్లు
-అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
-యాదాద్రి పనులపై ఉన్నతస్థాయి సమీక్ష

ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, అద్భుత శిల్పకళానైపుణ్యంతో, ఆలయ ప్రాశస్థ్యం, వైభవం ప్రస్ఫుటమయ్యేలా యాదాద్రి పునరుద్ధరణ పనులు జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులకు సూచించారు. యాదాద్రిలో చేపట్టిన నిర్మాణపనులకు నిధుల కొరత లేకుండా ఈసారి బడ్జెట్‌లోకూడా అవసరమైనన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తరువాత సహస్రాష్టక కుండయాగం (1008 యాగకుండాలతో) 11 రోజులపాటు నిర్వహించనున్నట్టు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్రమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను ఆహ్వానిస్తామన్నారు. యాదాద్రి పునరుద్ధరణ పనులను ఆదివారం సందర్శించి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమవారం ప్రగతిభవన్‌లో విస్తృతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన ఆలయమున్న గుట్టపై భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? గుట్ట కింద భాగంలో ఎలాంటి నిర్మాణాలు రావాలి? టెంపుల్ సిటీపై ఎలాంటి నిర్మాణాలు రావాలి? మొత్తంగా యాదాద్రి ఎలా ఉండాలి? అనే విషయాలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకున్నారు.

4.5 ఎకరాల్లో ప్రధాన దేవాలయం
మాడవీధులు, ప్రాకారాలు కలుపుకొని 4.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన దేవాలయం నిర్మించాలని సీఎం కేసీఆర్ చెప్పారు. మొత్తం 302 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ ప్రాంగణం ఉంటుందన్నారు. లక్ష్మీనర్సింహస్వామి కొలువై ఉండే గుట్టపైభాగంలో ప్రధాన దేవాలయంతోపాటు గోపురాలు, ప్రాకారాలు, మాడ వీధులు, శివాలయం, ఆంజనేయస్వామి విగ్రహం, ఈవో కార్యాలయం, వీవీఐపీ గెస్ట్‌హౌస్ (ప్రెసిడెన్షియల్ సూట్), అర్చక నిలయం, నైవేద్యం వంటశాల, ప్రసాద మంటపం, రథశాల, వ్రత మంటపం, స్వామివారి పుష్కరిణి, క్యూ కాంప్లెక్స్, మెట్లదారి, బస్‌స్టేషన్, పోలీస్ ఔట్‌పోస్ట్, హెల్త్ సెంటర్లు ఉండాలని నిర్ణయించారు. ఏ నిర్మాణం ఎక్కడ రావాలనే దానిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం నిర్మాణాలు ప్రారంభం కావాలని అధికారులను ఆదేశించారు.

వైభవోపేతంగా నిర్మాణాలు
వందల ఏండ్లపాటు నిలిచిపోయే దేవాలయం కాబట్టి, ప్రతి అంగుళం నిర్మాణంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, వైభవోపేతంగా నిర్మాణాలుండాలని అధికారులకు సీఎం కేసీఆర్ చెప్పారు. అత్యాధునికంగా, ఆధ్యాత్మిక శోభ కనిపించేలా నిర్మించిన వెల్లూరు, తంజావూరు, అక్షరధామ్‌లాంటి ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించి నిర్మాణాలను అధ్యయనం చేయాలని కోరారు. దేశంలోని ప్రతిఒక్కరు ఒక్కసారైనా యాదాద్రిని సందర్శించాలనే ఉత్సుకత కలిగేలా దేవాలయ ప్రాంగణాన్ని తీర్చిదిద్దాలని చెప్పారు. పునరుద్ధరణ తరువాత యాదాద్రికి భక్తులసంఖ్య ఎన్నోరెట్లు పెరుగుతుందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

పనులన్నీ సమాంతరంగా
శివరాత్రి ఉత్సవాలు, తెప్పోత్సవం నిర్వహించడానికి, నిరంతరం వ్రతాలు చేసుకోవడానికి, తలనీలాల సమర్పణకు, మండల దీక్ష భక్తులు ప్రత్యేక పూజలు చేసుకోవడానికి ఏర్పాట్లు శాశ్వత ప్రాతిపదికన చేయాలని సీఎం ఆదేశించారు. ఒకదాని తర్వాత ఒకటి కాకుండా నిర్మాణ పనులన్నీ సమాంతరంగా సాగాలని, ఏ పనికి ఆ పనిగా ప్రణాళిక సిద్ధం చేసుకొని అమలుచేయాలని చెప్పారు. గుట్ట కింది భాగంలోని గండిచెరువును తెప్పోత్సవం నిర్వహించడానికి అనువుగా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి నిత్యం ఈ చెరువుకు నీటిని సరఫరా చేస్తామని వెల్లడించారు. గండిచెరువుకు అనుబంధంగా కోనేరు, కల్యాణకట్ట నిర్మించాలని చెప్పారు. గుట్ట కిందభాగంలోనే ఆలయ బస్‌స్టేషన్ నిర్మించాలని, అక్కడినుంచి భక్తులను దేవాలయ వాహనాలద్వారా గుట్టపైకి తీసుకురావాలని సూచించారు. గుట్టపైకి వెళ్లటానికి, తిరిగి రావటానికి వేర్వేరు దారులు ఉపయోగించాలన్నారు. మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం గుట్ట కింద ఆశ్రమం నిర్మించాలని నిశ్చయించారు. యాదాద్రి ఆలయం చుట్టూ రింగురోడ్డు నిర్మించాలని, దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులకు సూచించారు. యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్డు వేయాలని ఆదేశించారు. నిర్మాణ పనులన్నీ అత్యంత పటిష్టంగా జరుగాలని, నాణ్యత విషయంలో రాజీపడవద్దని సీఎం స్పష్టంచేశారు.

పునరుద్ధరణ పనులన్నీ పూర్తయిన తర్వాత పరిపూర్ణ ఉపాసకులతో అతిపెద్ద యాగం నిర్వహిస్తామని, దీనికి దేశ విదేశాల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తామని వెల్లడించారు. లక్షలమంది భక్తులు పాల్గొనే ఈ యాగం కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయడానికి ఓ కమిటీని నియమించనున్నట్టు చెప్పారు. భక్తులు బస చేయడానికి వీలుగా టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణ పనులు వేగంగా జరుగాలని ఆదేశించారు. టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి కనీస వసతులు కల్పించాలని సూచించారు. యాదాద్రిలోని ప్రతి బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు పెడతామని చెప్పారు. యాదాద్రి టెంపుల్ సిటీ అంతా ప్రకృతి రమణీయత గోచరించేలా, ఆహ్లాదం వెల్లివిరిసేలా ఉద్యానవనాలు, ఫౌంటెయిన్లు నిర్మించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఆర్‌అండ్‌బీ ఈఎన్సీలు గణపతిరెడ్డి, రవీందర్‌రావు, ఈఈ వసంత్‌నాయక్, ఎస్‌ఈ లింగారెడ్డి, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావు, ఈవో గీత, ఆలయ నిర్మాణ నిపుణుడు ఆనంద్‌సాయి, స్ట్రక్చర్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఆర్కిటెక్ట్ మధుసూదన్, వాసుకి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమీక్షాసమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు
-గుట్ట కింది భాగంలోని గండిచెరువులో స్వామివారి తెప్పోత్సవం.
-గండిచెరువుకు అనుబంధంగా కోనేరు, కల్యాణకట్ట.
-గుట్ట కిందభాగంలోనే బస్‌స్టేషన్.
-దేవాలయ వాహనాలద్వారా భక్తులను గుట్టపైకి తీసుకురావాలి.
-గుట్టపైకి వెళ్లి, రావడానికి వేర్వేరు దారులు.
-మండల దీక్ష చేపట్టిన భక్తుల కోసం గుట్ట కింద ఆశ్రమం.
-యాదాద్రి చుట్టూ రింగు రోడ్డు.
-దానికి అనుబంధంగా రేడియల్ రోడ్ల నిర్మాణం.
-యాదాద్రి నుంచి తుర్కపల్లికి నాలుగు లేన్ల రోడ్డు.
-భక్తులు బస చేయడానికి టెంపుల్ సిటీలో 340 క్వార్టర్ల నిర్మాణం.
-టెంపుల్ సిటీలో రోడ్లు, మంచినీరు, విద్యుత్, డ్రైనేజీ లాంటి వసతులు.
-యాదాద్రిలోని ప్రతి బ్లాకుకు దేవుళ్లు, దేవతల పేర్లు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.