Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నిధులు ఇవ్వండి

-పథకాలు.. పరిష్కారాలు.. – కీలక అంశాలపై నేడు ప్రధానితో సీఎం భేటీ -సాయంత్రం మోదీ నివాసంలో సమావేశం -విభజన చట్టం అంశాల అమలుపై విజ్ఞాపన -మిషన్ కాకతీయకు ఆహ్వానించనున్న కేసీఆర్.. -పుష్కరాలకు 750 కోట్లు కోరనున్న సీఎం – నేటి సాయంత్రం ముంబైకి సీఎం

KCR

రాష్ట్ర విభజన చట్టంలో పెండింగ్‌లో ఉన్న అంశాలు, వివిధ పథకాల కింద రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, పలు ప్రాజెక్టులకు అనుమతులపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సోమవారం కలుసుకోనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరయ్యేందుకు కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఆయన వెంట టీఆర్‌ఎస్ ఎంపీలు కే కేశవరావు, బీ వినోద్‌కుమార్, సీఎంవో అదనపు కార్యదర్శి స్మిత సబర్వాల్, రాజశేఖరరెడ్డి తదితరులు కూడా వచ్చారు.

ఓ ప్రైవేటు హోటల్‌లో బస చేసిన కేసీఆర్‌ను రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి కలుసుకుని కొద్దిసేపు ముచ్చటించారు. సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిలో తెలంగాణ రాష్ర్టానికి ఉత్తమ అవార్డు వచ్చిన విషయాన్ని, ప్రధాని చేతుల మీదుగా అవార్డును అందుకున్న విషయాన్ని కేసీఆర్‌కు ఆయన వివరించారు. అనంతరం సాయంత్రం ఏడున్నర గంటలకు కేసీఆర్, ఆయన కుమార్తె, ఎంపీ కవిత తదితరులు,అశోకారోడ్‌లో ఏర్పాటు చేసిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

నేడు ప్రధానితో భేటీ : ప్రధాని మోదీతో కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆయన నివాసంలో భేటీ కానున్నారు. ముఖ్యంగా వచ్చే సంవత్సరం బడ్జెట్ తయారీ పను లు ముమ్మరంగా జరుగుతున్నందున తెలంగాణ రాష్ర్టానికి తగిన తీరులో నిధులు కేటాయించాలని విజ్ఞప్తిచేసే అవకాశం ఉంది. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని కూడా కోరనున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అంశాలను ఏపీ ప్రభుత్వం అమలు చేయడంలేదని, విద్యుత్ సరఫరాలాంటి అంశాల్లో చట్టానికి విరుద్ధంగా పీపీఏలను ఉల్లంఘిస్తున్నదని పది రోజుల క్రితం లేఖ రాసిన నేపథ్యంలో ఆ అంశాలను కూడా ప్రధానికి వివరించనున్నారు.

మిషన్ కాకతీయకు ఆహ్వానం: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని కేసీఆర్ స్వయంగా ఆహ్వానించనున్నారు. గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నందున దీనికి అవసరమైన నిధుల్లో సుమారు రూ.750కోట్లను కేంద్రంనుంచి సాయంగా అందించాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తున్నది. ఈ అంశాలే కాకుండా హైకోర్టు విభజనపై సత్వరం నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రధానిని కోరనున్నారు.

కేంద్ర పథకాల నిధులపై చర్చ: కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పలు సంక్షేమ పథకాలకు కేంద్ర ఆర్థిక సాయం, పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీల అమలు, ఉద్యానవన విశ్వవిద్యాలయానికి కేంద్రం నుంచి మంజూరు కావాల్సిన నిధులు, కాంపా నిధుల విడుదల.. ఇలా అనేక అంశాల్లో ప్రధానితో కేసీఆర్ చర్చించనున్నారు. వీటికి తోడు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలను వివరించడంతో పాటు కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాల అవసరాన్ని నొక్కి చెప్పనున్నారు.

నేడే ముంబైకి పయనం: ప్రధానితో సాయంత్రం ఐదున్నరకు భేటీ అయిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా ముంబై వెళ్ళనున్నారు. ఫిబ్రవరి 17 తన పుట్టినరోజు అయినప్పటికీ ప్రజా సమస్యలకంటే తన జన్మదినం ముఖ్యం కాదని భావించిన కేసీఆర్ రాష్ట్ర అవసరాలు, పరిష్కారం కావాల్సిన అంశాలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం కావడానికే ప్రాధాన్యం ఇచ్చారు. నిజానికి పద్నాలుగేండ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సాధించుకున్న సందర్భంగా తన పుట్టినరోజును స్వంత రాష్ట్రంలో జరుపుకుంటారని ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు భావించినా రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని భావించి ముంబై పర్యటనకు వెళ్తున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులే ఎజెండా: మంగళవారం ఉదయం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు. రాష్ర్టానికి సంబంధించిన ప్రాణహిత-చేవెళ్ళ, ఇచ్ఛంపల్లి, లెండి, లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులతో పాటు కొన్ని చెక్‌డ్యాంలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మహారాష్ట్ర నుంచి విద్యుత్ పొందే అంశంపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే సాగునీటి ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చర్చించిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా కూడా ఆ అంశాలపై తన వంతు ప్రయత్నాలు చేయనున్నారు. ఇతర మార్గాలనుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లయితే దాని సరఫరాకు మహారాష్ట్ర విద్యుత్ కారిడార్ ట్రాన్స్‌మిషన్ లైన్లను వాడుకునే అంశంపై కూడా ఫడ్నవిస్‌తో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. ముంబై పర్యటన అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.