-తెలంగాణ రాష్ట్రం దేశంలోనే భేష్ అనిపించుకోవాలి – రాష్ట్రాభివృద్ధి కోసం ముందుకు రండి – రాజకీయ నేతలు, తెలంగాణ బిడ్డలకు కేసీఆర్ పిలుపు – టీఆర్‌ఎస్‌లో చేరిన తేరా చిన్నపరెడ్డి, లింగయ్య యాదవ్

తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలవాలె.. దేశంలోనే భేష్ అనిపించుకోవాలె. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నం. దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుని శభాష్ అనిపించుకోవాలె. రాజకీయాలు..గెలుపులు ఓటములు చూసేందుకు ఇది సమయం కాదు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాజకీయ నాయకులు, ఈ తరం తెలంగాణ బిడ్డలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నల్గొండ జిల్లా టీడీపీ కీలక నేత తేరా చిన్నపరెడ్డి, జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు బడుగుల లింగయ్యయాదవ్ పలువురు ఇతర నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాజకీయాలు, ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. తెలంగాణ చరిత్రలో తొలిసారి నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద రెండో పంటకు నీటిని విడుదల చేసుకున్న ఘనత దక్కించుకున్నామని ఆనందం వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లాకు బంగారు భవిష్యత్తు..: నల్గొండ జిల్లా మున్ముందు గణనీయంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రామగుండంలో2500 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు ఉంటే ఇపుడు నల్గొండ జిల్లాలోని దామరచర్లలో ఏకంగా 7500 మెగావాట్ల విద్యుత్‌ప్లాంటును ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇది జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేల కృషి ఫలితమేనని మెచ్చుకున్నారు. సముద్రానికి వెళ్లాలంటే బందర్, కృష్ణపట్నానికి పోవాలని, కానీ ఇపుడు జిల్లాలోని సూర్యాపేట-కోదాడ సమీపంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చే డ్రైపోర్టును ఏర్పాటు చేయబోతున్నామని ఆయన చెప్పారు. దీనితో భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. మునుగోడు, దేవరకొండ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు, సాగు, తాగునీరందించేందుకు నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. ఈరోజు ఉదయం ఇంజినీర్లతో మాట్లాడానని, వీలైంత మేరకు మూడు, మూడున్నర సంవత్సరాల లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించిందని చెప్పారు. అదే విధంగా ఎస్‌ఎల్‌బీసీని పూర్తి చేయడంతో పాటు సాగర్ ఎడమ కాల్వలో మన సంపూర్ణ వాటా సాధిస్తామన్నారు. తేరా చిన్నపరెడ్డి క్షమశిక్షణ, నిబద్ధత ఉన్న వ్యక్తి అని పేర్కొన్నారు. ఆయన ఎన్నికలకు ముందే టీఆర్‌ఎస్‌లోకి వచ్చి ఉంటే ఈ పాటికి ఎంపీ లేదా ఎమ్మెల్యే అయి ఉండేవారన్నారు. ఆయనపై కొందరు కక్ష గట్టి దాడులు చేయించినా నిజాయితీ గల వ్యక్తి కావడంతో తట్టుకుని ముందుకు సాగుతున్నారని అన్నారు. చిన్నపరెడ్డికి పార్టీలో మంచి గుర్తింపు, ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.