Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నీళ్లపై ఏపీ దాదాగిరి

-తెలంగాణపై కేంద్ర సర్కారుది వ్యతిరేక వైఖరి
-రాష్ట్రంలో 12 లక్షల కుటుంబాలకు దళితబంధు
-మన దళితజాతి దేశానికే దిక్సూచిగా నిలుస్తది
-నల్లగొండకు 15 లిఫ్టులు.. ఏడాదిన్నరలో పూర్తి
-సాగర్‌ ఆయకట్టుకు శాశ్వతంగా నీటి భద్రత
-నాగార్జునసాగర్‌ అభివృద్ధికి రూ.150 కోట్లు
-నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి రుచి చూపిస్తం
-2005 కటాఫ్‌గా పోడు భూముల పరిష్కారం
-నల్లగొండలో సామాజిక అడవులను పెంచాలె
-ఏడేండ్లలోనే అట్టడుగు నుంచి అగ్రస్థానానికి
-నాగార్జునసాగర్‌ ప్రగతిపై సమీక్ష సమావేశంలో
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యలు
-కృష్ణా నదిపై ఏపీ సర్కార్‌ అక్రమ ప్రాజెక్టులు
-ఇట్లే ఉంటే భవిష్యత్తులో మనకు ఇబ్బందులు

స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా దళితజాతి వెనుకబడే ఉన్నది. అందుకే దళితబంధు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చుచేస్తామని చెప్పాం.తెలంగాణలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నయి. ఇందులో దళితబంధుకు అర్హత ఉన్నవారు 75-85 శాతం మంది ఉంటారని అనుకొంటే దాదాపు 12 లక్షల కుటుంబాలు వస్తయి. ఈ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తది. బ్యాంకుల లంపటం లేకుండా ఆ డబ్బుతో లబ్ధిదారులే ఏం చేసుకోవాలో నిర్ణయించు కొనేలా మంచి పథకాన్ని రూపకల్పన చేశాం

తెలంగాణ వచ్చినరోజు రాష్ట్రం చిట్టచివరన ఉండేది. ఈ రోజు బ్రహ్మాండంగా విజయాలు సాధించాం. దేశంలో ఎక్కడా లేని మంచి కార్య క్రమాలను అమలు చేసుకొంటున్నం.వ్యవసాయంలో చిట్టచివరన ఉండి, రైతులు ఆత్మహత్య చేసుకొన్న తెలంగాణలో ఇప్పుడు మూడు కోట్ల టన్నుల వరిధాన్యాన్ని పండించినం. ప్రపంచంలోనే అతి మేలైన పత్తి మన తెలంగాణ భూముల్లో పండుతున్నది. ఇది మన అదృష్టం. పత్తి పంటలో మనకన్నా ముందు వరుసలో గతంలో మహారాష్ట్ర ఉంటుండె. నిన్న మీరంతా పేపర్లలో చూసినరు. 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తిని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అమ్మి దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచింది.

-హాలియాలో సీఎం కేసీఆర్‌

కృష్ణానదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాదాగిరి చేస్తున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని విమర్శించారు. కృష్ణానదిపై ఏపీ అక్రమ ప్రాజెక్టులు ఇలాగే కొనసాగితే తెలంగాణకు భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ నియోజకవర్గ ‘ప్రగతి సమీక్ష సమావేశం’ సోమవారం నల్లగొండ జిల్లా హాలియాలో జరిగింది. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 75-85% దళిత కుటుంబాలకు దళితబంధు అమలుచేస్తామని ప్రకటించారు. సాగర్‌ నియోజకవర్గ అభివృద్ధి పనులకు రూ.150 కోట్లు మంజూరుచేశారు. ప్రసంగం ముఖ్యాంశాలు అయన మాటల్లోనే..

కృష్ణా నీళ్లపై దాదాగిరి
కేంద్ర ప్రభుత్వం అవలంబించే తెలంగాణ వ్యతిరేక వైఖరి కావొచ్చు, ఆంధ్రావాళ్లు చేస్తున్న దాదాగిరి కావొచ్చు.. కృష్ణా నదిపైన వారు ఏ విధంగా అక్రమ ప్రాజెక్టును కడుతున్నరో మీరంతా చూస్తున్నరు. ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మనకు కృష్ణానది నీళ్లలో ఇబ్బంది జరిగే అవకాశమున్నది. కాబట్టి మనం ముందుగానే కొంత జాగ్రత్తగా ఉండాలని పెద్దదేవులపల్లి చెరువు వరకు పాలేరు రిజర్వాయర్‌ నుంచి గోదావరి నీళ్లను తెచ్చి అనుసంధానంచేయాలని సర్వే చేస్తున్నం. ఇది పూర్తయితే సాగర్‌ ఆయకట్టుకు భవిష్యత్‌లో ఢోకా ఉండదు.

నీళ్లపై ఏపీ దాదాగిరి
-గుర్రంపోడుకు లిఫ్ట్‌
గుర్రంపోడు ప్రాంతంలో లిఫ్ట్‌ ఏర్పాటుచేస్తే ఐదారు గ్రామాల్లో 10 వేల ఎకరాలకు సాగునీరు వస్తుందని ఎమ్మెల్యే భగత్‌ చెప్పిండు. వెంటనే సర్వే చేపట్టాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశిస్తున్న. సర్వే పూర్తికాగానే నెల్లికల్‌ లిఫ్ట్‌తోపాటే ఇది కూడా మంజూరుచేస్తాం. కుంకుడుచెట్టుతండా లిఫ్ట్‌ కూడా ప్రారంభమైతది. ఏం రంది పెట్టుకోవద్దు. దేవరకొండలో ఐదు లిఫ్ట్‌లు.. పొగిల్ల లిఫ్ట్‌, కంబాలపల్లె లిఫ్ట్‌, నంబాపురం, పెద్దగట్టు లిఫ్ట్‌, పెద్దమునిగల్‌ అంబా భవాని లిఫ్ట్‌, అక్కంపల్లి లిఫ్ట్‌ మంజూరుచేసినం. మిర్యాలగూడలోనూ ఐదు లిఫ్ట్‌లు దున్నపోతుల గండి, బొత్తలపాలెం, వీర్లపాలెం, కేశవాపురం, తోపుచర్ల లిఫ్ట్‌లను మంజూరుచేశాం. నకిరేకల్‌లో అయిటిపాముల వద్ద ఒక లిఫ్ట్‌, హుజూర్‌నగర్‌లో ఒక లిఫ్ట్‌ మంజూరుచేశాం. మొత్తంగా జిల్లాకు 15 లిఫ్ట్‌లను మంజూరుచేశాం. ఇవన్నీ ఏడాదిన్నరలో పూర్తిచేసి మీకు అందిస్తాం. ఇవి పూర్తిచేస్తే జిల్లాలో ఎగువ ఆయకట్టుకు నీళ్లు అందుతాయి. మంచి లాభం జరుగుతది. ఫైనల్‌గా మనం పాలేరుతోని పెద్దదేవులపల్లితో అనుంసధానం చేస్తే బ్రహ్మాండంగా సాగర్‌ ఆయకట్టుకు ఢోకాలేకుండా అయితది.

12 లక్షల కుటుంబాలకు దళితబంధు
స్వాతంత్య్రం వచ్చి 70 ఏండ్లయినా దళితజాతి వెనుకబడే ఉన్నది. అందుకే దళితబంధు అనే అద్భుతమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. రూ.లక్ష కోట్లయినా సరే ఖర్చుచేస్తామని చెప్పాం. తెలంగాణలో సుమారు 16-17 లక్షల దళిత కుటుంబాలున్నయి. ఇందులో దళితబంధుకు అర్హత ఉన్నవారు 75-85 శాతం మంది ఉంటారని అనుకొంటే దాదాపు 12 లక్షల కుటుంబాలు వస్తయి. ఈ ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం అందిస్తది. బ్యాంకుల లంపటం లేకుండా, దళిత సోదరుల అభివృద్ధిని కాంక్షించి, ఏదో ఒక గొప్ప పనిచేస్తే తప్ప వాళ్లు పైకి రారు అని ఆలోచించి పెడుతున్నం. ఆ డబ్బుతో లబ్ధిదారులే ఏం చేసుకోవాలో నిర్ణయించుకొనేలా మంచి పథకాన్ని రూపకల్పన చేశాం. వచ్చే సంవత్సరం నుంచి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు మంజూరుచేసి ఆ కార్యక్రమం అమలుచేస్తం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో ఒక వంద కుటుంబాలకు వచ్చేలా బడ్జెట్‌లో పెట్టిన రూ.వెయ్యి కోట్లకు మరో రూ.200 కోట్లు కలిపి అమలుచేస్తం. రాబోయే బడ్జెట్లలో ప్రతి ఏడాది దశలవారీగా చేసుకొంటూ 12 నుంచి 13 లక్షల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటది.

నీళ్లపై ఏపీ దాదాగిరి
భారతదేశం పుట్టినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా దళితులను వాళ్ల ఖర్మానికి వదిలేశారు తప్ప.. ఎవరూ ఈ కార్యక్రమం తీసుకోలేదు. అందుకే అందరికీ గుండెదడ మొదలైంది. కేసీఆర్‌ చేస్తే మొండిగా చేస్తడు. ఇది గనుక చేస్తే రాజకీయం గా పుట్టగతులు ఉండవని గ్రహించినవాళ్లు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. నేను దళిత సోదరులకు ఒక్కటే మనవి చేస్తున్న. దళితబంధు పెట్టాలని నాకు ఎవరూ దరఖాస్తు ఇవ్వలేదు. ఎవరు ధర్నా చేయలేదు. డిమాండ్‌ చేయలేదు. మేం సుమోటోగా తీసుకుని, తెలంగాణ తెచ్చినవాళ్లంగా, మీ తెలంగాణ బిడ్డగా నేనే మేధోమథనం చేసి, ఏ వర్గంవారు ఎట్లా ఉన్నరో ఆలోచన చేసి అమలుచేస్తున్నం. మీకు అందరికీ తెలుసు గీత కార్మికులు, చేనేత కార్మికులను ఏవిధంగా ఆదుకొన్నమో. గీత కార్మికులకు చెట్ల రకం పూర్తిగా మాఫీచేశాం. అనేక వర్గాల సంక్షేమానికి చర్యలు తీసుకొంటూ ఈ రోజు దళితుల కోసం ఈ కార్యక్రమం తెచ్చాం. వందకు వందశాతం ఆరు నూరైనా సరే ఈ పథకాన్ని అమలుచేస్తం. నేనే స్వయంగా పర్యవేక్షణ చేస్త. తెలంగాణ దళితజాతి కూడా భారత దళిత జాతికే ఆదర్శంగా నిలబడుతుంది.

జానారెడ్డి మాట తప్పారు..
ఓసారి శాసనసభలో రెండేండ్లలో కరెంటు సమస్యను పరిష్కరించి అన్ని వర్గాలకు.. ముఖ్యంగా రైతాంగానికి 24 గంటల క్లీన్‌.. స్టేబుల్‌ పవర్‌ ఇస్తామని నేను చెప్పాను. అప్పుడు ప్రతిపక్షనేతగా ఉన్న జానారెడ్డి ఎగతాళి చేస్తూ..‘మీరు రెండేండ్లు కాదుకదా.. పదేండ్లయినా చేయలేరు. ఒకవేళ రెండేండ్లకే చేస్తే నేనే గులాబీ కుండువా కప్పుకొని టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రచారం చేస్త్త’ అని అసెంబ్లీలో అన్నరు. కానీ, ఆయన మాట తప్పి.. కాంగ్రెస్‌ కండువా కప్పుకొని మొన్న ఎన్నికల్లో ఇక్కడ నిలబడ్డారు. దానికి మీరు సరైన జవాబిచ్చారు. పుక్కిటి పురాణాలు చెప్పి.. కథలు చెప్పి, ప్రజలను మోసగించిన పార్టీలు, 70 ఏండ్లుగా ప్రజల గోసపుచ్చుకొన్న పార్టీ లు, సమైక్య పాలకులకు తొత్తులుగా మారి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన పార్టీలన్నీ రాష్ట్రం వచ్చాక కూడా పుక్కిటి పురాణాలు చెప్పా యి. నిజమైన అభివృద్ధి అంటే ఏమిటి?.. ఏయే వర్గాలకు ఏం చేయాలి? అని.. చెప్పింది చెప్పినట్టు తు.చ. తప్పకుండా ఆచరించి, అమలుచేసి మీ ముందర పెడుతున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. రేషన్‌కార్డుల విషయంలో రూ.2 వేల పెన్షన్‌ విషయం లో కావొచ్చు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హా మీ మేరకు 57 ఏండ్లకే పింఛన్‌ కావొచ్చు.. అన్నీ అమలుచేసి మీ కండ్లముందే చూపుతున్నం. ఏ మాటలైతే చెప్పామో వాటిని ఆచరించి చూపిస్తు న్నం. మేం ఏం చెప్పినా గతంలో వాళ్లు (ప్రతిపక్షా లు) చేసిన మొఖాలు కాదు కాబట్టి వాళ్లకు విశ్వా సం లేక అవాకులు చెవాకులు మాట్లాడుతున్నరు. దేవుడు నోరు ఇచ్చాడు కదా అని చాలా భ్రష్ట భాషలో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నరు.

మీ ఆశీర్వాదం ఉంటే చాలు
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న పనులన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నరు. మేము ఎప్పుడు ప్రజల్లోకి వెళ్లినా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తున్నరు. మీ ఆదరణ, మీ దీవెన ఉన్నంతకాలం ఇదే పద్ధతిలో సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూ ముందుకు వెళుతం. దళితబంధు అయితదా.. పోతదా? అని మాట్లాడుతున్నరు. తెలంగాణ ప్రగతి ప్రస్థానం జీర్ణంకానివాళ్లు రకరకాల మాటలు మాట్లాడుతరు. నేను మీ అందరినీ కోరేది ఒక్కటే. అందరికంటే ఎక్కువ విజ్ఞులు మీరు. ఎక్కువ అవగాహన ఉన్నవారు మీరు. పనులు కూడా మీ ముందే ఉంటాయి. కాబట్టే నాగార్జునసాగర్‌లో మీరు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. మీ దీవెనలు ఉన్నంతకాలం పేద వర్గాల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమంకోసం ముందుకు వెళ్తాం. సాగర్‌ నియోజకవర్గంలో పరిస్థితులు ఒక రకంగా ఉంటాయి. సెంట్రల్‌ తెలంగాణ జిల్లాల్లో చాలామంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. కానీ, ఈ రోజు రైతుబీమా, రైతుబంధు పథకాలతో బ్రహ్మాండంగా రైతుల్లో ధీమా వచ్చింది. కరువు ప్రాంతమని, వెనుకబడిన ప్రాంతమని, ఎకసెక్కాలు ఆడి.. ఎగతాళి చేయబడిన నా తెలంగాణ.. ఈ రోజు దేశానికే అన్నం పెడుతున్నది. తెలంగాణ బిడ్డగా నాకు గర్వంగా ఉన్నది.

నీళ్లపై ఏపీ దాదాగిరి
3 కోట్ల టన్నుల ధాన్యం పండించి దేశానికి అన్నం పెడుతున్నది నా తెలంగాణ కాదా? అని నేను అడుగుతున్న. పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన విషయం నిజం కాదా? అని నేను అడుగుతున్న. పార్లమెంటు సాక్షిగా కేంద్ర మంత్రులే ఈ విషయాలు తెలియజేస్తున్నరు. ఈ రోజు విద్యుత్తు తలసరి వినియోగంలో 1,100 యూనిట్లు దేశ సగటు అయితే, మన రాష్ట్రంలో 2,070 యూనిట్ల పర్‌క్యాప్టా విద్యుత్తు వినియోగం తోటి.. దేశంలోనే నంబర్‌వన్‌ పర్‌క్యాప్టా విద్యుత్తు వినియోగంచేసే రాష్ట్రం తెలంగాణ కాదా? అని అడుగుతున్న. అనేక విషయాల్లో మంచి ఫలితాలు సాధిస్తూ, ప్రగతి సాధిస్తూ.. మీ దీవెనతో ప్రభుత్వం ముందుకు వెళుతా ఉన్నది. మీ దీవెన ఉన్నంతవరకు ఎవ్వరు ఎన్ని అవాకులు చెవాకులు మాట్లాడినా.. వాటిని పట్టించుకోకుండా కచ్చితంగా ఈ ప్రగతిమార్గాన్ని కొనసాగిస్తం. మేం వెనుకకు తిరిగి చూడం. ప్రభుత్వం ప్రకటించిన అన్ని కార్యక్రమాలు అమలు చేసి తీరుతం. నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను..మీలో ఎవరికి ఏ సమస్య ఉన్నా వ్యక్తిగతంగా వచ్చి చెప్పండి. ఎక్కడో ఉండి అరిచే అవసరం లేదు. ఇది పాత ప్రభుత్వం కాదు.. పాత నాయకత్వం కాదు.. నోముల భగత్‌ మీ బిడ్డ.. ఎవరైనా సరే రావొచ్చు. ఆయనను కలవొచ్చు.. దరఖాస్తు ఇవ్వొచ్చు.. మంచిగ కడుపునిండా మాట్లాడవచ్చు. కానీ అరిచి రంకెలు వేసి పిచ్చి డ్రామాలు చేయడం మంచిది కాదు.

రెండు పంటలు పండేలా చర్యలు
తెలంగాణ తెస్తానన్ననాడు ఎవరు నమ్మలేదు. వీళ్లంతా (ప్రతిపక్ష నేతలు) ఇంట్లో పండుకొన్నరు. సమైక్య పాలకుల సంచులు మోసిం డ్రు. ఎవరూ కలిసిరాలేదు. ఆనాడు పేగులు తెగేదాకా కొట్లాడి, చావు అంచు దాకా వెళ్లి టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు, నేను అంతా కలిసి తెలంగాణ తెచ్చి చూపించాం. నేను చాలా సగర్వంగా చెప్తున్న. ఆనాటి చంద్రబాబు సర్కార్‌ పంటలకు నీళ్లు ఇవ్వడం ఆపేస్తే.. ఇదే నాగార్జునసాగర్‌ కట్టమీద నేను 50 వేల మంది రైతులతోటి దండోరా మో గించి నీళ్లు సాధించుకొన్నం. ఈ రోజు.. మీ జిల్లా నేత మిత్రుడు బడుగుల లింగయ్యయాదవ్‌, ఇత ర మిత్రులు వెళ్లి నీళ్లు విడుదలచేశారు. మన వా టా మనం తీసుకొని సాగర్‌ కింద రెండు పంటలు పండించుకొంటున్నం. ఇదే పద్ధతిలో కృష్ణాలో కచ్చితంగా మన వాటా మనం వాడుకొనేలా చర్య లు తీసుకొంటాం. గతంలో నేను కోదాడ నుంచి హాలియా వరకు పాదయాత్ర చేసినప్పుడు చాలామందితో పలు విషయాలు పంచుకొన్న. అప్పట్నుంచి వాటికి పరిష్కారాలు వెతుకుతున్నం. ఇప్పటికే కొన్ని పరిష్కరించాం. మిగిలినవి కూడా పరిష్కరిస్తం.

త్వరలో పోడు భూముల సమస్య పరిష్కారం
పోడు భూములకు సంబంధించి కేంద్ర చట్టం ప్రకారం 2005 వరకు కటాఫ్‌ డేట్‌ ఉన్నది. ఈ సమస్యపై నిన్న క్యాబినెట్‌లో చర్చించినం. త్వరలోనే రాష్ట్రంలో అవకాశమున్నవారికి పాతచట్టం ప్రకారం సమస్యను పరిష్కరిస్తం. ఆ చట్టం కేంద్ర ప్రభుత్వానిది. కాబట్టి కటాఫ్‌ డేట్‌ మన చేతుల్లో లేదు. గతంలో లంబాడా సోదరులు ‘మా తండాలో మా రాజ్యం’ అని చెప్తే.. ఆదివాసీ సోదరులు ‘మా గూడెంలో మా రాజ్యం’ అని చెప్తే పట్టించుకోలేదు. ఈ రోజు మనం తండాలు, గూడేలు, గిరిజన ప్రాంతాలన్నీ పంచాయతీలుగా చేసుకొన్నం. గతంలో 50 ఏండ్లు మొత్తుకున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదు. కానీ ఈ రోజు తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆధ్వర్యంలో బంజారా ప్రాంతాలన్నింటినీ పంచాయతీలుగా చేసుకొన్నం. నాగార్జునసాగర్‌లో పెద్ద ఎత్తున బంజారా సోదరులు ఉన్నరు. మీకు ఇక్కడ మంచి బంజారాభవన్‌ నిర్మించి ఇస్తానని ఎన్నికలప్పుడు చెప్పిన. దానికి నిధులు మంజూరు చేస్తున్న. తెలంగాణలో మున్సిపాలిటీలు బాగు చేసుకొంటున్నం. ప్రతి గ్రామానికి టాక్టర్‌ ఉన్నది, ట్యాంకర్‌ ఉన్నది. పారిశుద్ధ్యం జరుగుతున్నది. గతంలో వచ్చిన డెంగీ, మలేరియా వంటి వ్యాధులు తగ్గుతున్నయి. సంతోషం.

నల్లగొండ జిల్లాకు అద్భుతమైన ప్రాజెక్టులు
హాలియా కోసం, నంది కొండ మున్సిపాలిటీ కోసం చెప్పిన రూ.30 కోట్లతోపాటు మరో రూ.120 కోట్లు మంజూరు చేస్తున్న. మొత్తం రూ.150 కోట్లను నాగార్జునసాగర్‌ నియోజకవర్గానికి మంజూరు చేస్తున్నం. చాలా అద్భుతమైన, ఇండియాలోనే నంబర్‌వన్‌ ప్రాజెక్టులు మీ జిల్లాకే వస్తున్నయి. రాష్ట్రంలో ఉన్న విద్యుత్‌ సంస్థలు అన్నీ ఉత్తర తెలంగాణలో గోదావరి ఒడ్డుమీద ఉన్నయి. దక్షిణ తెలంగాణలో పాలమూరు జిల్లాలోగానీ, నల్లగొండ జిల్లాలో గానీ విద్యుదుత్పత్తి సంస్థలు లేవు. అవి బ్యాలెన్స్‌ కావాలె. ఇక్కడ అనేక లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీములు ఉన్నయి. చాలా లోడ్స్‌ వచ్చే అవకాశం ఉంటది. భవిష్యత్తులో అనేక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉన్నది. దానిని బ్యాలెన్స్‌ చేయాలనే నేను ఆ రోజు దక్షిణ తెలంగాణలో ఒక పెద్ద పవర్‌ జనరేషన్‌ ప్లాంట్‌ రావాలని చెప్పిన. మంత్రి జగదీశ్‌రెడ్డి స్వయంగా చొరవ చూపడంతో రూ.35 వేల కోట్లతో దామరచర్ల దగ్గర అద్భుతంగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణం జరుగుతా ఉన్నది. మీరందరూ కండ్లారా చూస్తున్నరు. లక్ష మంది ఉండే గొప్ప పట్టణంగా దామరచర్ల మారబోతున్నది. ఆర్థికంగా కూడా ఈ జిల్లా బలపడే అవకాశముంటది. తెలంగాణ ఏర్పడేనాటికి కనీసం కలలో కూడా మనం ఊహించని అల్ట్రా మెగా పవర్‌ ప్లాంట్‌.. 4 వేల మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తిచేసే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ పవర్‌ప్లాంట్‌ ఇక్కడనే ఏర్పాటవుతున్నది. ఇది నల్లగొండ జిల్లా ప్రజలకు, మనందరికీ గర్వకారణం.

చివరి స్థానం నుంచి అగ్రస్థానానికి..
తెలంగాణ వచ్చినరోజు రాష్ట్రం చిట్టచివరన ఉండేది. ఈ రోజు బ్రహ్మాండంగా విజయాలు సాధించాం. ఇండియాలో ఎక్కడా లేని మంచి కార్యక్రమాలను అమలు చేసుకొంటున్నం. పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులే చెప్తున్నరు. వ్యవసాయంలో చిట్టచివరిన ఉండి, రైతులు ఆత్మహత్య చేసుకొన్న తెలంగాణలో ఇప్పుడు మూడు కోట్ల టన్నుల వరిధాన్యం పండించినం. ఇందులో 92 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సీఐ సేకరించింది. ప్రపంచంలోనే అతి మేలైన పత్తి మన తెలంగాణ భూముల్లో పండుతున్నది. ఇది మన అదృష్టం. పత్తి పంటలో మనకన్నా ముందు వరుసలో గతంలో మహారాష్ట్ర ఉంటుండె. నిన్న మీరంతా పేపర్లలో చూసినరు. 1.78 కోట్ల క్వింటాళ్ల పత్తి ని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకు అమ్మి దేశంలోనే తెలంగాణ నంవర్‌ వన్‌ స్థానంలో నిలిచింది. కేసీఆర్‌ కిట్‌ తెచ్చినంక తల్లులు, పిల్లల మరణాలు తగ్గినయి. హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌ చేస్తున్నం. కరెంటు సమస్య తీర్చుకొన్నం. భగీరథ కింద మంచినీళ్ల సమస్య తీర్చుకొన్నం.

నీళ్లపై ఏపీ దాదాగిరి
సాగర్‌ ప్రజలకు ధన్యవాదాలు
నాగార్జునసాగర్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో అద్భుత విజయాన్ని ఇచ్చి నోముల భగత్‌ను గెలిపించినందుకు సాగర్‌ నియోజకవర్గ ప్రజలందరికీ వ్యక్తిగతం గా నా పక్షాన, టీఆర్‌ఎస్‌ పక్షాన పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్న. గతంలో ఇచ్చిన మాట ప్రకారం నేను ఇక్కడికి చాలా రోజుల క్రితమే రావాలి. కానీ కరో నా మహమ్మారి దేశాన్ని, ప్రపంచాన్ని, మన రాష్ర్టాన్ని కూడా పట్టిపీడిస్తున్నది. నాగార్జునసాగర్‌ ఎన్నికల సభలో పాల్గొని వెళ్లిన తర్వాత నన్ను కూడా కరోనా విడిచిపెట్టలేదు. నేను కూడా దాని బారిన పడ్డా. ఈ కారణాలతో ఎన్నికలు కాగానే ఇక్కడికి రాలేకపోయాను. కానీ ఇక్కడ చాలా వెనుకుబాటుతనం ఉన్నది, చాలా సమస్యలు పెండింగ్‌లో ఉన్నయని ఆలోచించి ఈ రోజు వచ్చిన.

ప్రతి జిల్లా కేంద్రంలో.. మెడికల్‌ కాలేజీ
కరోనా దెబ్బ నుంచి రాష్ర్టాన్ని, రాష్ట్ర ప్రజలను కాపాడుకొనేందుకు దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఈ మధ్యనే అన్ని ప్రభుత్వ దవాఖానల్లోని 18 వేల బెడ్లను ఆక్సిజన్‌ బెడ్లుగా మార్చుకొన్నం. ఈ మధ్యనే ఏడు కొత్త మెడికల్‌ కాలేజీలు కూడా మంజూరు చేసుకొన్నం. రాబోయే రోజుల్లో 33 జిల్లా కేంద్రాల్లో 33 మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకొంటున్నం. కాలేజీతోపాటు 500 పడకల దవాఖాన కూడా ఉంటది. నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట, నల్లగొండలో కూడా మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేసుకొన్నం. హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్కీం కింద సాగర్‌ నియోజకవర్గంలోని ప్రైమరీ హెల్త్‌ సెంటర్లను తప్పకుండా అప్‌గ్రేడ్‌ చేస్త.

నెల్లికల్‌ లిఫ్ట్‌కు 664.80 కోట్లు
నల్లగొండ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకాలకు రాష్ట్ర ప్ర భుత్వం సోమవారం పరిపాలన అనుమతులిచ్చిం ది. తిరుమలగిరి సాగర్‌ మండలంలోని నెల్లికల్‌ వద్ద నిర్మించ తలపెట్టిన నెల్లికల్‌ ఎత్తిపోతల పథకానికి రూ.664.80 కోట్లు, దామరచర్ల మం డలం వీర్లపాలెంలోని తుంగపాడు వాగు దగ్గర వీర్లపాలెం-2 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.32.22 కోట్లు. సాగర్‌ లెప్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌పై 57.240 కిలోమీటర్ల దగ్గర తోపుచెర్ల ఎత్తిపోతల పథకం స్టేజ్‌-2 పనులకు రూ.9.30 కోట్లు, కట్టంగూర్‌ మండలం అయిటిపాముల చెరువు వద్ద ఎత్తిపోతల పథకానికి రూ. 101.62 కోట్లకు పరిపాలన అనుమతులు ఇచ్చారు. వెంటనే పనులు మొదలుపెట్టాలని ప్రాజెక్టుల అధికా రులకు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులిచ్చారు.

కేసీఆర్‌ పాలనలోనే నల్లగొండ సస్యశ్యామలం: మంత్రి జగదీశ్‌రెడ్డి
తెలంగాణ ఏర్పడి.. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం వల్లనే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో నల్లగొండ సస్యశ్యామలం అయిందని రాష్ట్ర విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి అన్నారు. సాగర్‌ 70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్‌, టీడీపీ నేతలు జిల్లాను సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏడేండ్ల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నల్లగొండ జిల్లాకు ఇప్పటికి 27 సార్లు వచ్చారని వెల్లడించారు. జిల్లా అభివృద్ధికోసం ఇప్పటిదాకా రూ.60 వేల కోట్లు ఖర్చుచేశామని మంత్రి తెలిపారు.

అన్ని రంగాల్లో ప్రగతి: ఎమ్మెల్యే నోముల భగత్‌
టీఆర్‌ఎస్‌ పాలనలోనే సాగర్‌ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని ఎమ్మెల్యే నోముల భగత్‌ అన్నారు. గుర్రంపోడు మండలంలో టేలాండ్‌ భూములకు సాగునీరు అందించేందుకు లిఫ్ట్‌ను మంజూరుతోపాటు ఇటీవల కొత్తగా ఏర్పాటైన హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో మౌలిక సదుపాయాల కోసం అధిక నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే భగత్‌ సీఎం కేసీఆర్‌ను కోరారు. దీర్ఘకాలిక సమస్యలైన ఎన్నెస్పీ క్వార్టర్స్‌ క్రమబద్ధీకరణ, పోడు భూముల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరారు. హాలియాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం, ఇండోర్‌ స్టేడియం నిర్మాణం కోసం నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.