అత్యంత ప్రతిష్ఠాత్మక వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ (ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) నల్లగొండ జిల్లాకు దక్కనుంది. బీబీనగర్ సమీపంలోని రంగాపూర్ వద్ద ఎయిమ్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న నిమ్స్ స్థానంలో రూ.1000 కోట్లతో ఎయిమ్స్‌ను, అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన బీబీనగర్ నిమ్స్‌ను సందర్శించి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.

-నల్లగొండ జిల్లా బీబీనగర్‌కు దక్కనున్న ప్రతిష్ఠాత్మక సంస్థ -గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన సీఎం కేసీఆర్ -పరిశీలనకు త్వరలో కేంద్ర బృందం -వెయ్యి కోట్లతో అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీ -వెయ్యి ఎకరాలతో హెల్త్‌హబ్‌గా బీబీనగర్ -బీబీనగర్ నిమ్స్‌ను సందర్శించిన కేసీఆర్.. అధికారులతో సమీక్ష ఉప ముఖ్యమంత్రి టీ రాజయ్య, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం అవసరం కాగా బీబీనగర్‌లో 160 ఎకరాలు అందుబాటులో ఉంది. దీనికి మరో 40 ఎకరాలు తక్షణం సేకరించాలని సీఎం ఆదేశించారు. రాష్ట్ర విభజన అనంతరం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ, ఏపీ రెండు రాష్ర్టాల్లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తరహాలో ఎయిమ్స్ సంస్థలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించింది. ఇందుకు అవసరమైన 200 ఎకరాల స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు కోరింది.
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన సంస్థ కావడంతో అనేక జిల్లాలనుంచి ప్రతిపాదనలు వచ్చాయి. త్వరలోనే ఎయిమ్స్ స్థలపరిశీలనకు కేంద్ర బృందం రానుందని సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సీఎం బీబీనగర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జాతీయ రహదారి పక్కనే ఉండటం.. రింగు రోడ్డుకు దగ్గరలో ఉండటం.. రాజధానికి 20-25 కిలోమీటర్ల దూరంలోనే.. అన్ని జిల్లాలకు అందుబాటులో ఉండటంతో బీబీనగర్‌కే సీఎం కేసీఆర్ పచ్చజెండా ఊపారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
హెల్త్ హబ్‌గా బీబీనగర్ బీబీనగర్ నిమ్స్‌ను ఎయిమ్స్‌గా మార్చటంతో పాటు దాని సమీపంలోనే అంతర్జాతీయ స్థాయిలో హెల్త్ స్మార్ట్ సిటీని నిర్మించాలని సీఎం ప్రతిపాదించారు. భవిష్యత్తులో బీబీనగర్ హెల్త్‌హబ్‌గా మారాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. బీబీనగర్ మండలం రంగాపురంలో 800 ఎకరాల భూదాన్ భూమిని సేకరించాలని, మొత్తం వెయ్యి ఎకరాల్లో రూ.వెయ్యి కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో అత్యాధునిక స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటు చేయాలనేది సీఎం కేసీఆర్ ఆలోచనగా ఉంది. హైదరాబాద్-వరంగల్ ప్రధాన రహదారిపై నగరానికి కేవలం 20-25కి.మి. దూరంలోనే ఉండడం వల్ల దేశ, విదేశాల నుంచి వచ్చే రోగులకు సైతం సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు.
బీబీనగర్‌లో స్థలంతో పాటు అన్ని వసతులు.. ఎయిమ్స్ ఏర్పాటుకు 200ఎకరాలు సరిపోతోంది. బీబీనగర్ నిమ్స్ ఏర్పాటు కోసం ఇప్పటికే 161 ఎకరాల స్థలం ఉంది. దీంతో మరో 40ఎకరాల భూములు సేకరిస్తే సరిపోతుంది. మరోవైపు పరిసరాల్లో 400ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉంది. ఎయిమ్స్‌కు అవసరమైన భూములను సేకరించి ఇచ్చే బాధ్యత నల్లగొండ జిల్లా కలెక్టర్‌కు అప్పగించింది. భూముల సేకరణ విషయంలో రైతులతో నేరుగా సంప్రదించాలని సీఎం ఆదేశించారు. భూములు ఇచ్చే రైతులకు కుటుంబం నుంచి ఒకరికి ఉద్యోగం కల్పించి వారికి భరోసా ఇచ్చి అండగా నిలబడాలనేది సీఎం ఆలోచనగా ఉంది.
ప్రస్తుత భవనంలో మెడికల్ కాలేజీ: ప్రస్తుతం ఇక్కడ నిర్మాణంలో ఉన్న నిమ్స్ భవనాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాల డిజైన్‌లో కొన్ని లోపాలు కనుగొన్నారు. ఆస్పత్రిలో గ్యాస్ పైప్‌లైన్, ఆపరేషన్ థియేటర్లు, ఎయిర్ కండిషన్ ఏర్పాట్లు, పేషెంట్లను తీసుకెళ్లేందుకు లిప్టులు లేవు. కనీసం కంప్యూటర్లు, టెలిఫోన్ సౌకర్యాలు లేకుండా భవనాల నిర్మాణం చేపట్టారు. వీటిని సరిచేసి మెడికల్ కాలేజీతో పాటు ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని భావిస్తున్నారు.
ఎయిమ్స్ వివరాలు.. ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఎయిమ్స్ ఏర్పాటుకు కనీసం 200 ఎకరాల స్థలం, వివిధ ప్రాంతాలతో కనెక్టివిటీ అవసరం. దానికి తోడు నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా, రహదారుల సౌకర్యం తదితర అంశాలను పరిగణిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తే.. భవనాల నిర్మాణం, నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏటేటా నిధులు విడుదల చేస్తుంది. సుమారు రూ.820కోట్ల కేంద్ర నిధులతో దీన్ని ఏర్పాటు చేస్తారు.
ఎయిమ్స్ కింద మెడికల్ కాలేజీతో పాటు అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తారు. అదనంగా వంద మెడికల్ సీట్లు తెలంగాణ రాష్ర్టానికి దక్కుతాయి. 960 పడకల ఆస్పత్రిలో సుమారు 42రకాల సూపర్ స్పెషాలిటీ, అత్యాధునిక వైద్య రీతులు అందుబాటులోకి వస్తాయి. ఎయిమ్స్‌లో అన్ని రకాల వ్యాధులకు సంబంధించిన పరిశోధన కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దేశంలో ఇప్పటిదాకా పాట్నా, రాయ్‌పూర్, భోపాల్, భువనేశ్వర్, జోధ్‌పూర్, రిషికేష్‌లో ఆరు చోట్ల ఎయిమ్స్ ఏర్పాటు చేశారు. ఎయిమ్స్ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ ఎంపీలు కేంద్ర మంత్రులకు వినతి పత్రాలు అందజేయటంతో తెలంగాణకు చోటు దక్కింది.
రాష్ర్టానికి తలమాణికంగా హెల్త్ సిటీ బీబీనగర్‌లో ఎయిమ్స్, హెల్త్‌సిటీ ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై ఉపముఖ్యమంత్రి డాక్టర్ టీ రాజయ్య, భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి హర్షం ప్రకటించారు. నిమ్స్ స్థానంలో రూ.1000 కోట్లతో ఎయిమ్స్, అంతర్జాతీయ స్మార్ట్ హెల్త్ సిటీని ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారని వారు చెప్పారు. బీబీనగర్ నిమ్స్‌లో సీఎం సమీక్ష అనంతరం సమావేశ వివరాలను వారు మీడియాకు వెల్లడించారు.
ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు 200ఎకరాలు అవసరమవుతున్నందున వెంటనే 40ఎకరాల సేకరణకు సీఎం ఆదేశించారని చెప్పారు. భూ సేకరణ విష-యంలో రైతులతో నేరుగా సంప్రదిస్తామని, నిర్వాసితుల కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం కల్పిస్తుందని వారు చెప్పారు. హెల్త్ స్మార్ట్‌సిటీ కోసం రంగాపూర్ గ్రామంలోని 800ఎకరాల భూదాన్ భూమి సేకరిస్తామని చెప్పారు.
ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు గాదరి కిశోర్‌కుమార్, నేతి విద్యాసాగర్‌రావు, బాలునాయక్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, టీఆర్‌ఎస్ నేతలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జడల అమరేందర్, గాదె నరేందర్‌రెడ్డి, చెంగల్ కిషన్‌రావు, నాగారం అంజయ్య, ఎంపీపీ గోలి ప్రణీత పింగల్‌రెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు సందిగారి బస్వయ్య పాల్గొన్నారు.