ఇటీవల రైతు వేదిక ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తూ ఒక ఆసక్తికరమైన ప్రకటన చేశారు. త్వరలోనే ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి ఆధ్వర్యంలో కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ విభాగం ఏ దేశంలో ఏ పంటలను ఎక్కువగా రైతులు పండిస్తున్నారు, ఏ దేశం ఏ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటున్నది, తెలంగాణలో రైతులు ఏ పంటలను పండిస్తే ఇతర రాష్ర్టాల్లో, ఇతర దేశాల్లో సరైన ధరలకు విక్రయించే అవకాశమున్నదీ, విలువ ఆధారిత ఉత్పత్తులను ఏ దేశాలకు ఎగుమతి చేయవచ్చు.. ఇలాంటి విషయాలన్నీ ఈ శాఖ పరిశీలిస్తుంది.
తెలంగాణలోని గ్రామాలను అనేక క్లస్ట ర్లుగా విభజించి ప్రతి క్లస్టర్లోనూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రైతుల ఆత్మహత్యల శోకం నుంచి లేచిందే తెలంగాణ రాష్ట్ర నినాదం. కేసీఆర్‌ను కదిలించింది కూడా రైతుల సమస్యలే. రైతులపై బషీర్‌బాగ్ పోలీసు కాల్పులు జరిగిన పది రోజుల్లోపే శాసనసభ ఉప సభాపతిగా ఉన్న కేసీఆర్, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు ‘కరెంట్ చార్జీలు పెంచితే రైతుల ఉన్న గోచీ ఊడిపోద్ద’ని హెచ్చరిస్తూ లేఖ రాశారు. నిర్వాసిత రైతు కుటుంబం నుంచి వచ్చి నేటికీ వ్యవసాయాన్ని ఎంతో శ్రద్ధగా చేస్తున్న కేసీఆర్‌కు నిర్వాసితుల సమస్యలు మొదలుకొని గిట్టుబాటు ధర వరకు వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యా తెలుసు. ఉద్యమ కాలంలో వాటి పరిష్కార మార్గాలను తన మనసులో పదిలపర్చుకున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రైతులను ఉద్యమంలోకి సమీకరించడానికే కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యాన్నిచ్చారు. జిల్లాల్లో రాష్ట్ర రాజధానిలో జరిగిన సభలన్నింటికీ ఎక్కువగా హాజరైనదీ గ్రామీణ ప్రాంత రైతులే. కేసీఆర్ పద్నాలుగేండ్ల రాష్ట్ర సాధన ఉద్యమంలో చేసిన ప్రతి ప్రసంగంలోనూ ఎక్కువగా ప్రస్తావించింది కూడా రైతుల సమస్యలనే. ‘ఎద్దేడిస్తే ఎవుసం సాగదు-రైతేడిస్తే రాజ్యాం నిలువద’ని పలుమార్లు తన ప్రసంగాల్లో చెప్పారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ గత ఆరేండ్లలో రైతులలో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. రుణమాఫీ నుంచి మొదలై, నిరంతర ఉచిత విద్యుత్తు, ప్రతి ఎకరానికీ కృష్ణా, గోదావరి జలాల సాగునీరు అందిస్తున్నారు. పెట్టుబడి సాయం ఇవ్వడానికి రైతుబంధు పథకం, రైతుబీమా, ఎరువులను నాణ్యమైన విత్తనాలను సకాలంలో సమకూరుస్తున్నారు. కల్తీ విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు చేపడుతున్నారు. రైతుల ప్రయోజనం కోసం విస్తృతంగా మార్కెట్ యార్డుల నిర్మాణం, ప్రతి గ్రామం లో మహిళా స్వయం సహాయక బృందాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. రైతుబంధు సమితిల ఏర్పాటు ద్వారా, రైతు వేదికల ద్వారా అసంఘటితంగా వున్న రైతులను సంఘటితం చేస్తూ వారిలో ఆత్మైస్థెర్యాన్ని నింపుతున్నారు. వ్యవసాయ భూములకు సంబంధించి భూసార పరీక్షలపై దృష్టి పెట్టి పంటసాగును ప్రయోజనాత్మకగా ఉండేట్లు చూస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారుల ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తూ ప్రతి ఐదువేల ఎకరాలకొక అధికారిని నియమించి రైతులకు తగు సూచనలు, సలహాలు అందిస్తున్నారు. సాదా బైనామాలను క్రమబద్ధీకరించడం, కొత్త రెవెన్యూ చట్టం తేవడం ద్వారా అవినీతిమయమైన రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేశారు. స్వల్ప సమయంలోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసి రైతులకు పాస్‌బుక్ అందించే క్రమానికి శ్రీకారం చుట్టారు. భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించుతూ ‘ధరణి’ పోర్టల్‌ను ప్రారంభించారు. విదేశాల్లో వున్న తెలంగాణీయులకు ఇక్కడి స్థిరాస్తులపై తిరుగులేని భరోసా కల్పించారు. పాలీహౌజ్‌లకు వ్యవసాయ పనిము ట్లు, ట్రాక్టర్లకు సబ్సిడీ అందిస్తున్నారు. ఉద్యానవన అభివృద్ధికి హార్టీకల్చర్ యూనివర్సిటీ ఏర్పా టుచేశారు. భూ సమగ్ర సర్వేకు యంత్రాంగాన్ని సిద్ధం చేయడం తదితర చర్యలు రాష్ట్రంలో వ్యవసాయ రంగ స్వరూప స్వభావాలను పూర్తిగా మార్చివేశాయి.
రైతును సంపన్నునిగా మార్చే నిర్ణయాలను కేసీఆర్ అమలుచేస్తుంటే రైతులను కార్పొరేట్ల కబంధ హస్తాల్లో ఇరికించాలని మోదీ ప్రభుత్వం చూస్తున్నది. రైతులను మరింత దయనీయ స్థితిలోకి దిగజార్చే విధంగా వ్యవసాయ విధానాలకు రూపకల్పన చేసి ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకిగా నిరూపించుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల అంతరార్థం ఇదే.
కేసీఆర్ అనుసరించిన ఈ విధానాల్లో ఏ ఒక్కదాన్నయినా భారతదేశంలో స్వాతంత్య్రానంతరం ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా చేపట్టిందా? రైతుల గురించి ఇంతగా మథనపడుతూ ఒక తపస్విలాగా ఎన్ని అవరోధాలెదురవుతున్నా పట్టుదలతో తాను తలపెట్టింది విజయవంతంగా అమలుచేసి చూపించిన మరే పాలకుడినైనా శతాబ్దాల దేశ చరిత్ర చూసిందా? ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఇతర రంగాల ద్వారా లభించే ఆదాయం నుంచి పెద్ద మొత్తంలో వ్యవసాయ సబ్సిడీలనిస్తూ రైతులను ఆదుకుంటున్నాయే గానీ, స్వయం సమృద్ధి సాధించేలా విధానాలు రూపొందించడం లేదు. రైతులు పండించిన ధాన్యానికి ధర నిర్ణయించే స్థాయికి రైతులు ఎదగాలనేది కేసీఆర్ సంకల్పం. అందుకే క్రాప్ కాలనీల ఏర్పాటు, పంటల మార్పిడిపై దృష్టిపెట్టారు.
రైతును సంపన్నునిగా మార్చే నిర్ణయాలను కేసీఆర్ అమలుచేస్తుంటే రైతులను కార్పొరేట్ల కబంధ హస్తాల్లో ఇరికించాలని మోదీ ప్రభుత్వం చూస్తున్నది. రైతులను మరింత దయనీయ స్థితిలోకి దిగజార్చే విధంగా వ్యవసాయ విధానాలకు రూపకల్పన చేసి ప్రధాని నరేంద్ర మోదీ రైతు వ్యతిరేకిగా నిరూపించుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాల అంతరార్థం ఇదే. ఈ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గళమెత్తిన కేసీఆర్ ఇప్పుడు దేశంలోని రైతులను సంఘటితం చేయ సంకల్పించినట్లు తన ప్రసంగంలో చెప్పకనే చెప్పారు. ఏ ఉద్దేశంతో ‘పిడికిలెత్తండి’ అని రైతులకు పిలుపు ఇచ్చినా కేసీఆర్ సృష్టించిన ప్రకంపనలు ఢిల్లీ గద్దెను కంపింప చేయకతప్పదు. దేశంలోని రైతాంగం కేసీఆర్ నాయకత్వాన్ని కోరే రోజు ఇంకెంతో దూరంలో లేదు.
(వ్యాసకర్త: తెలంగాణ జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్)