-విభజన హామీలపై పార్లమెంట్లో నిలదీస్తాం -రాష్ర్టాలకు ఇచ్చిన హామీలను నిలబెట్టకోని కేంద్రం -దేశ ప్రజల ప్రయోజనం కోసమే ఫెడరల్ ఫ్రంట్ -అభివృద్ధితో కాంగ్రెసోళ్ల కండ్లు తిరుగుతున్నయ్ -నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో నిజామాబాద్ ఎంపీ కే కవిత
పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పడేకాకుండా నిరంతరం రాష్ట్ర ప్రయోజనాల కోసం టీఆర్ఎస్ ఎంపీలందరం ఢిల్లీలో పోరాటం చేస్తున్నామని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో నడుస్తూ, రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా చేయగలిగామన్నారు. ఇదే తరహాలో ఇప్పడు కూడా విభజన హామీలు సాధించుకోవాలనే లక్ష్యంతో విలువైన పార్లమెంట్ సమావేశాల కాలాన్ని సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. బుధవారం నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎంపీల వ్యూహం గురించి నమస్తే తెలంగాణ ఇంటర్వ్యూలో ఆమె వివరించారు.
నాలుగేండ్ల పోరాటం కొనసాగిస్తాం విభజన హామీలు.. ముఖ్యంగా కాళేశ్వరానికి జాతీయహోదా, బయ్యారం ఉక్కు, ఐటీఐఆర్, ఐఐఎం వంటి ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. వీటిపై నాలుగేండ్ల నుంచి అలుపెరుగని పోరాటం చేస్తున్నాం. పార్లమెంట్ సమావేశాలు లేకపోయినా ఢిల్లీ వేదికగా గొంతు వినిపిస్తున్నాం. మిషన్ భగీరథకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్ సూచించినా ఇప్పటికీ రూపాయి ఇవ్వలేదు. రిజర్వేషన్ల పెంపుపై పోరాటం కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తున్న రైతుబంధు పథకంతో మరింత ఫలితం పొందేందుకు ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం. దేనిపైనా కేంద్రం స్పందించడం లేదు.
మాట నిలుపుకోని కేంద్రం ప్రజలకు మేలుజరిగే అంశాల్లో కేంద్రానికి మద్దతు తెలిపాం. జీఎస్టీ, పెద్దనోట్ల రద్దువంటి సంస్కరణలకు తోడుగా ఉన్నాం. అయితే పార్లమెంట్ సాక్షిగా రాష్ట్రాలకు ఇచ్చిన హామీలను కేంద్రం నిలుపుకోవడం లేదు. తెలంగాణ లేదా ఏపీ.. ఏ రాష్ట్రానికైనా వీటిపై పోరాటం చేసే హక్కుంటుంది. ఇతర రాష్ట్రాల అభివృద్ధికి నిధులిస్తానని కేంద్రం అంటే.. వద్దనే కుసంస్కారం మాకు లేదు. ఇన్నాళ్లు బీజేపీతో కలిసి ఉన్న టీడీపీ ఇప్పుడు బయటికి వచ్చి అవిశ్వాసం అంటున్నది. దీన్ని ఎంతవరకు నమ్మవచ్చో ఏపీ ప్రజలే ఆలోచించుకోవాలి. అవిశ్వాసం చర్చకు వస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటాం.
దేశప్రజల కోసమే ఫెడరల్ ఫ్రంట్ దేశప్రజలకు మేలు జరుగాలన్నదే ఫెడరల్ ఫ్రంట్ ఉద్దేశం. ప్రాంతీయ సమస్యల గురించి పార్లమెంట్లో విస్తృతస్థాయిలో చర్చ జరుగాలి. రైతుబంధు, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశ ప్రజలందరికీ అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. ఫెడరల్ ఫ్రంట్ ఆ దిశగా తప్పకుండా కృషిచేస్తుంది.
కాంగ్రెసోళ్ల కండ్లు తిరుగుతున్నయ్ తెలంగాణలో ప్రభుత్వ పథకాలవల్ల అందరూ లబ్ధి పొందుతున్నారు. వాటిని చూస్తే కాంగ్రెసోళ్లకు కండ్లు తిరుగుతున్నయ్. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారు. ఇష్టారీతిగా విమర్శిస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెప్తారు.
మాది తెలంగాణ కులం పార్టీ ఉద్యమంనాటి నుంచి ఇప్పటివరకు కులాలు, మతాలకు అతీతంగా పనిచేస్తున్నాం. అన్ని కులాలను అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక పథకాలు అమలుచేస్తున్నాం. సీఎం కేసీఆర్ అన్నివర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. మాది తెలంగాణ సామాజిక వర్గం పార్టీ.