Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎన్టీఆర్‌కు రెండో వెన్నుపోటు!

-చనిపోయినా చంద్రబాబు ఆయన్ను వదలడం లేదు
-పాము, ముంగీసలు ఒక్కటయ్యాయ్..
-బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతున్నది
-గత పాలకుల నిర్లక్ష్యంతోనే వస్త్రరంగంలో సంక్షోభం
-మరో తిరుపూరులా సిరిసిల్ల కావాలి
-చేనేత కార్మికులు కాదు.. చేనేత కళాకారులు
-కేసీఆర్‌ను కాపాడుకుంటేనే పేదోడికి న్యాయం
-వస్త్రరంగం అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.1200 కోట్లు పెట్టాం
-సిరిసిల్ల నేతన్నల కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్

కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేందుకు తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్‌కు బతికుండగా వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. ఆయన చనిపోయాక కూడా వెన్నుపోటు పొడుస్తున్నారని మంత్రి కే తారకరామారావు అన్నారు. పాము, ముంగీసలు కలుస్తాయంటూ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం కాంగ్రెస్, టీడీపీ పొత్తులతో నిజమవుతున్నదని చెప్పారు. ప్రాజెక్టులను అడ్డుకోడానికి 200 కేసులు వేసిన కాంగ్రెస్ పార్టీ.. అనుమతులివ్వద్దంటూ 30 లేఖలు రాసిన చంద్రబాబు కలిసి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ చీకటిరోజులు వస్తాయని హెచ్చరించారు. వ్యవసాయం తర్వాత అతిపెద్దది చేనేత వస్త్ర పరిశ్రమేనని, ఆ పరిశ్రమ నేటి సంక్షోభానికి గత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. చైనాలో 40 శాతం, బంగ్లాదేశ్ 14, శ్రీలంకలో 8శాతం వస్త్ర ఉత్పత్తులు చేస్తుండగా, కోట్లమంది చేనేత కళాకారులు ఆధారపడిన భారత్‌లో మాత్రం 4 శాతమే ఉత్పత్తి కావడం సిగ్గుచేటన్నారు. నేతన్నలు చేనేత కార్మికులు కాదని, వారంతా చేనేత కళాకారులు అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వందసీట్లు గెలుస్తున్నాం.. దేశ ప్రధానిని నిర్ణయించే సర్కారు మనదే అవుతుంది.. అని పేర్కొన్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలం పోత్గల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన మంత్రి సిరిసిల్లలోని అర్బన్‌బ్యాంక్ మాజీచైర్మన్, పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు గాజుల బాలయ్య నివాసానికి చేరుకున్నారు. బాలయ్యతోపాటు పద్మశాలీ అనుబంధ సంఘాల నాయకులు, ఆర్టీసీ జేఏసీ చైర్మన్ దొంత ఆనందం కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో పద్మశాలీలు, వస్త్ర అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన భారీ కృతజ్ఞత సభలో కేటీఆర్ మాట్లాడారు. సిరిసిల్లలో ఆకలిచావులు, ఆత్మహత్యలు చేసుకున్న వందలమంది మరనేత కళాకారుల కుటుంబాల మరణవేదన చూడలేక టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రూ.50 లక్షలు పోగుచేసి పద్మశాలీ ట్రస్టు అందించి, సూక్ష్మరుణాలు ఇచ్చి రెండువేల కుటుంబాలకు చేయూతనిచ్చినట్టు తెలిపారు. దుబ్బాకలోని పద్మశాలీయుల ఇంట్లోఉన్న కేసీఆర్ వారి జీవన స్థితిగతులు గమనించి తెలంగాణ సాధించుకున్న తరువాత అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని పేర్కొన్నారు. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికి గత ప్రభుత్వాలు బడ్జెట్‌లో రూ.70 కోట్లు మాత్రమే కేటాయిస్తే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1,270 కోట్లు కేటాయించిందని చెప్పారు. వచ్చే మూడేండ్లలో సిరిసిల్లకు రైలు కూత వినిపిస్తానని స్పష్టంచేశారు.

నేతన్నలను యజమానులుగా చూడాలన్నదే లక్ష్యం..
రాష్ట్రంలోని చేనేత, మరనేత కళాకారులను యజమానులుగా మార్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ వర్క్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టారని కేటీఆర్ చెప్పారు. రూ.8 వేల వేతనం వచ్చే కార్మికులకు రూ.15 నుంచి రూ.20 వేలు వచ్చేలా కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో నేతన్నల బతుకులకు భరోసా కలిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బతుకమ్మ చీరెలు కట్టుకుని ఆడబిడ్డలు సంబురపడుతున్నారంటే, ఆ గర్వం సిరిసిల్ల నేతన్నలకే దక్కిందని ప్రశంసించారు. నేతన్నలకు చేసింది గోరంతని, చేయాల్సింది కొండంత ఉందని చెప్పారు. రైతన్నకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించినట్లే నేతన్నలకు కూడా దానిని వర్తింపజేస్తామని హామీఇచ్చారు. సాంచాల ఆధునీకరణతో రాష్ట్రంలోని మరమగ్గాలను జియో ట్యాగింగ్ చేసి ప్రత్యేకచర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

సిరిసిల్ల నేత కళాకారుల్లో మంచినైపుణ్యం ఉన్నదని, ప్రభుత్వ చేయూతతో మరో తిరుపూర్‌గా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. గీతన్నలు, నేతన్నల తలరాతలు మార్చుకునే ఈ ఎన్నికల్లో ఆలోచించి కేసీఆర్‌ను గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఒకరికి ఒకరం తోడై కేసీఆర్‌ను కాపాడుకుంటేనే పేదోడికి న్యాయం జరుగుతుందని చెప్పారు. ఎంపీ వినోద్‌కుమార్ మాట్లాడుతూ 60 ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యలను కేటీఆర్ నాలుగేండ్లలో పరిష్కరించి నేతన్నల జీవితాలలో వెలుగులు నింపారని కొనియాడారు. సమావేశంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు చీటి నర్సింగారావు, చిక్కాల రామారావు, గూడూరి ప్రవీణ్, పద్మశాలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాస్, పద్మశాలీ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం గౌరవ అధ్యక్షుడు జిందం చక్రపాణి, గోవిందు రవి, మండల సత్యం, అన్నల్‌దాస అనిల్, సామల పావని, బొల్లి రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ఇండ్లకు తాళం పెట్టి దత్తపుత్రుడికి కృతజ్ఞతలు
బతుకులకు భరోసానిచ్చిన రామన్నపై నేతన్న అభిమానం వెల్లువెత్తింది. పద్మశాలీయుల వస్త్ర అనుబంధాల సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కృతజ్ఞతాసభకు నేతన్నలు పోటెత్తారు. నేత కుటుంబాలు తమ ఇండ్లకు తాళంపెట్టి ర్యాలీ, డప్పు చప్పుళ్లతో పటాకలు కాలుస్తూ కేసీఆర్, కేటీఆర్‌ను కొనియాడుతూ సభాస్థలికి చేరుకున్నారు. నేతన్నలు గాంధీ టోపీ, తెల్లని కండువాలు కప్పుకొని ట్రాక్టర్లపై మరమగ్గాలు పెట్టుకుని తరలివచ్చారు. సిరిసిల్ల రోడ్లన్నీ నేతకార్మికుల కుటుంబాలతో నిండిపోయాయి. పదివేల మంది వస్తారనుకున్న నాయకుల అంచనాలను తారుమారుచేస్తూ పదిహేను వేల మందికి పైగా కుటుంబాలతో సహా చేరుకున్నారు. కేటీఆర్‌ను భగవంతుడే తమను కాపాడేందు కు పంపారని, జీవితాంతం ఆయనకు అండగా ఉంటామని నినదించారు.

అశేష జనవాహిని చూసి స్పందించిన కేటీఆర్ పద్మశాలీ వంశంలో పుట్టకున్నా, మీలో ఒకడినై తోడుంటానని, అభివృద్ధిలో సిరిసిల్లను రాష్ట్రంలోనే అగ్రభాగాన నిలుపుతాను అని భావోద్వేగంతో అన్నారు. ఆయన అన్న మాటలకు నేతన్నలు సభాస్థలిలో చేసిన కరతాళధ్వనులతో సిరిసిల్ల కార్మికక్షేత్రం మార్మోగింది. మంత్రి ఎన్నికల్లో నామినేషన్ వేసేందుకు పద్మశాలీ, అనుబంధసంఘాల ఆధ్వర్యం లో రూ.100116 విరాళంగా అందజేశారు. సభలో మంత్రి కేటీఆర్ బతుకమ్మ చీరెలు తయారుచేసే మరమగ్గాన్ని ప్రారంభించారు. పద్మశాలీ ఆడపడుచులు బతుకమ్మలు, మంగళహారతులతో ఘనస్వాగతం పలికారు. నేతకళాకారులు నల్ల విజయ్ అగ్గిపెట్టెలో తయారుచేసిన శాలువా, వెల్లి హరిప్రసాద్ మగ్గంపై నేసిన బతుకమ్మ ప్రతిమ, కేటీఆర్ పేరు గల శాలువాలతో మంత్రిని సత్కరించారు. వస్త్రఉత్పత్తిదారుల సంఘం మరమగ్గం జ్ఞాపికను బహూకరించింది. వరంగల్‌కు చెందిన జంగం కుమారస్వామి కేటీఆర్‌పై రాసి న కవితతో కూడిన మెమెంటోను అందజేశారు. పద్మశాలిగా పుట్టకున్నా మీలో ఒకడిగా ఉండి రాష్ట్రంలోని చేనేత, మరమగ్గాల కళాకారులకు అండగా ఉంటా. నేతన్నలు చేనేత కార్మికులు కాదు.. వారంతా చేనేత కళాకారులు. వచ్చే ఎన్నికల్లో వందసీట్లు గెలుస్తున్నాం. దేశ ప్రధానిని నిర్ణయించే సర్కారు మనదే అవుతుంది. కూటమి అధికారంలోకి వస్తే తెలంగాణలో మళ్లీ చీకటిరోజులు వస్తాయి.
– మంత్రి కే తారకరామారావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.