Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

నూకలు తినుమన్న బీజేపీ తోకలు కోద్దాం

-అన్నదాతకు మోదీ మూడు కిరికిరిలు
-ఆకుపచ్చ కండువాతో.. ఓట్లు దండుకొన్నరు
-దేశానికి అన్నంపెడుతున్నమని మన రైతులు గల్లా ఎగిరేసి చెప్తున్నరు.
-తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి ఏటా 3.5 కోట్ల టన్నులకు చేరింది.
-వ్యవసాయంలో నంబర్‌ 1.. మత్స్య రంగంలో నంబర్‌ 1.. గొర్ల ఉత్పత్తిలో నంబర్‌ 1
-రైతుల గురించి ఆలోచించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌
-కరెంట్‌ కంపెనీలను ప్రైవేటుపరం చేస్తున్నరు
-బాయికాడి మోటర్లకు మీటర్లు పెడుతున్నరు
-ధాన్యం కొనుగోళ్లను ప్రైవేట్‌కు అప్పగిస్తున్నరు ఇవి అమలైతే ఆగమే..మోదీకి బుద్ధి చెప్పాలి
-రాజగోపాల్‌రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే చాలా?
-నల్లగొండ రైతులు ధనవంతులు కాలేరు కదా?
-రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్‌

తెలంగాణ బిడ్డలను నూకలు తినుమన్న బీజేపీ తోకలు కోయాలని పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. మన బిడ్డలను అవమాన పరిచిన పార్టీకి నూకలు చెల్లేవిధంగా తీర్పులివ్వాలని కోరారు. రైతుల సత్తాను, చైతన్యాన్ని తక్కువ అంచనావేస్తున్న ప్రధాని మోదీ, రైతులను ఖతం చేసేందుకు మూడు కిరికిరిలు పెడుతున్నరని చెప్పారు. ఇవి అమలైతే రైతులు ఆగం కావడం ఖాయమని హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లాలో శనివారం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మంత్రి కేటీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే…

ఆకుపచ్చ కండువాతో.. ఓట్లు దండుకొన్నరు
తెలంగాణలో వ్యవసాయమున్నట్టు, రైతు పథకాలు ఉన్నట్టు భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ లేవు. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు.. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడది… రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు’ అని. ఒక్క తెలంగాణలో తప్ప అన్ని రాష్ట్రాల్లో రైతు కంట కన్నీరే ఉన్నది. ఆ కన్నీరు తుడిచే నాయకత్వం కేంద్రంలో లేదు, రాష్ట్రాల్లోను లేదు. రైతులకు, వ్యవసాయానికి, సాగునీటికి సంబంధించి తెలంగాణలో జరిగిన అభివృద్ధి మరెక్కడా లేదు. రైతులు వేసుకొనే ఆకుపచ్చ కండువా వ్యవసాయానికి, రైతన్నకు చిహ్నం. రైతుకు కులం, మతం ఉండదు. మాదంతా ఒకటే కులం, ఒకటే మతం అని చెప్పడానికే మనమంతా ఆకుపచ్చ కండువా వేసుకుంటాం. ఈ అకుపచ్చ కండువాను తలకు రుమాలుగా చుట్టుకొని ఎన్నికల్లో ఓట్లు దండుకున్న ముఖ్యమంత్రులు, ప్రధానులు ఎందరో ఉన్నారు. కానీ రైతులను ఆదుకున్నవారు లేరు.

‘అద్దగంట కరెంట్‌ ఇయ్యి అన్నా’
నిన్నమొన్న రాజకీయాల్లోకి వచ్చినోళ్లు కూడా సీఎం కేసీఆర్‌ను నోటికొచ్చినట్టు తిడుతున్నరు. భవిష్యత్తు గురించి మాట్లాడే ముందు గతం ఎట్లా ఉండెనో గుర్తు చేసుకుందాం. సరిగ్గా పదేండ్ల కింద తెలంగాణలో ఏమిటీ పరిస్థితి. ఊళ్లలో మనకు సంబంధించిన వాళ్లు ఎవరైనా చనిపోతే.. కరెంటోళ్లకు ఫోన్‌ చేసి బతిలాడుకునేది. ‘అన్నా మా చుట్టపాయినె చనిపోయిండు అంత్యక్రియలకు పోతున్నం.. బాయికాడికి పోతున్నం.. స్నానం చెయ్యాలే.. ఒక అద్దగంట సేపు కరెంట్‌ ఇయ్యి అన్నా’ అని బతిమాలుకున్న రోజులు గుర్తు తెచ్చుకోండి. కాలిపోయిన మోటర్లు, పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్‌ కోతలు, చార్జీల మోతలు.. అన్నిటికీ మించి పోలీస్‌ స్టేషన్లలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో చెప్పులు.. ఇదీ ఆనాటి దుస్థితి.

దమ్ముంటే ఒక్క రాష్ట్రాన్ని చూపించండి
ఈ రోజు తెలంగాణలో కరెంట్‌ కోతలు లేవు. వర్షాలకో లేదా ఎక్కడైనా వైర్‌ తెగిపోయి ఒక పది నిమిషాలు కరెంట్‌ పోతే.. సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు. ‘ఇదేనా మన బంగారు తెలంగాణ. కరెంట్‌ పోయి 15 నిమిషాలు అయింది. ఇంకెప్పుడొస్తది’ అని లొల్లి పెడుతున్నరు. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. పదేండ్ల కింద రోజుకు పది గంటలు కరెంట్‌ పోయినా అడిగేవాడు లేడు.. కానీ ఈ రోజు 10 నిమిషాలు పోతే ఆగమాగమైతున్నరు. ఆనాడేమో కరెంట్‌ ఉంటే వార్త.. ఈనాడు సీఎం కేసీఆర్‌ హయాంలో కరెంట్‌ పోతే వార్త. ఇది వాస్తవమా కాదా? ఆలోచించండి. కొంతమంది మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ చేసిందేముంది. కరెంట్‌ ఇచ్చుడు గొప్పనా’ అంటున్నరు. భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే వీటిలో తెలంగాణ కాకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఇంకొక రాష్ట్రం దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపిస్తరా? అని ప్రతిపక్షాలకు సవాల్‌ చేస్తున్న.

దండగన్న వ్యవసాయం.. పండుగైంది
తెలంగాణలో వ్యవసాయం ఒకప్పుడు దండుగ అనే స్థాయి నుంచి పండుగ అనే స్థాయికి చేరుకుంటున్నది. తెలంగాణ ఏర్పడ్డప్పుడు 2014లో ఏడాదికి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నులు. ఈ రోజు 3.5 కోట్ల టన్నులు. ఎనిమిదేండ్లలో సీఎం కేసీఆర్‌ అభివృద్ధి ఆలోచనతో ధాన్యం ఉత్పత్తి ఐదురెట్లు పెరిగింది. ఇది మనందరికి గర్వకారణం కాదా? 2014-15లో 40 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తే ఇప్పుడు 62 లక్షల ఎకరాల్లో పత్తి పండిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలను అమలు చేసిందో ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రైతుకు పెట్టుబడి రూపంలో రైతుబంధు ఇవ్వాలని ఆలోచన చేసిన మొట్టమొదటి నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్‌ మాత్రమే.

అప్పుడు రైతులు అప్పులపాలైతే అంజుమన్‌ బ్యాంకోళ్లు వచ్చి తలుపులెత్తుకుపోయేవారు. ఇప్పుడు ఆలాంటి పరిస్థితి ఉన్నదా? రైతుబంధు రూపంలో రూ.58 వేల కోట్లను రైతుల ఖాతాల్లో వేసింది కేసీఆర్‌ ప్రభుత్వం కాదా? దేశంలో ఇలాంటి పథకం ఎక్కడైనా ఉన్నదా? ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా ఒక రైతు చనిపోతే ఆ కుటుంబం ఆగం కావొద్దని, రోడ్డున పడొద్దని మీరు అడిగినా అడగకపోయినా రూ.5 లక్షల రైతుబీమా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కాదా? ఇప్పటివరకు రైతుబీమా ద్వారా 89 వేల మంది రైతు కుటుంబాలకు రూ.4,450 కోట్ల బీమా సొమ్ము అందిన మాట వాస్తవం కాదా? ఇక ఉచిత విద్యుత్తు కోసం ప్రతియేటా ప్రభుత్వం రూ.10,500 కోట్లు ఖర్చు చేస్తున్నది.

రాజగోపాల్‌రెడ్డి ధనవంతుడైతే చాలా?
మనమేమో రైతుల కోసం ప్రాజెక్టులు కట్టుకుందాం, కరెంట్‌ ఇచ్చుకుందాం, చెరువులు బాగు చేసుకుందాం, రైతుబంధు ఇద్దాం, రైతువేదికలు కట్టుకుందాం, రైతబీమా ఇచ్చుకుంటు మంచిగా ముందుకు పోదామని అనుకుంటే.. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వ తీరు మరోవిధంగా ఉన్నది. 2013లో మోదీ మాట్లాడుతూ.. ‘నన్ను ప్రధానమంత్రిని చేయండి. రైతుల ఆదాయం డబుల్‌ చేస్తా’ అన్నరు. మరి రైతుల ఆదాయం డబుల్‌ అయిందా? ఈ దేశంలో ఒకే ఒక వ్యక్తి (ఆదానీ) ఆదాయం డబుల్‌ అయింది.

వందల వేల కోట్లు పెరిగింది. దేశమంతా పేదరికంలో కొట్టుమిట్టాడుతుంటే.. ఒక్కడు మాత్రం ధనవంతుడవుతున్నాడు. దేశంలో ఒకరిద్దరు ధనవంతులైతే దేశ సంపద పెరిగినట్టేనని మోదీ ప్రభుత్వం భావిస్తున్నది. నల్లగొండ జిల్లాలో రాజగోపాల్‌రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే నల్లగొండ ప్రజలు బాగా లాభపడినట్టేనని అనుకుంటున్నరు. ‘అయ్యా మోదీ గారూ.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు ఒక్కాయనకే ఇచ్చారంట!. అదే నల్లగొండ జిల్లా మొత్తానికి ఇవ్వండి మేము పోటీ నుంచే తప్పుకుంటాం’ అని చెప్పినం.

ఇదీ తెలంగాణ రైతుల సత్తా
రైతుల ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో ఐదురకాల విప్లవాలను తీసుకొచ్చారు. పల్లె జీవితాన్ని, కులవృత్తులను బలోపేతం చేశారు. ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం ద్వారా దేశంలోనే తెలంగాణ మత్స్యరంగంలో నం.1గా నిలిచింది. వెయ్యి కోట్లతో వారికి వలలు, మోపెడ్లు కొనిచ్చి, ప్రతియేటా రూ.100 కోట్లతో చేపపిల్లలు పంపిణీ చేస్తే సాధ్యమైంది. రాష్ట్రంలో ఈ వానకాలంలో 1.35 కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇది మనందరికీ గర్వకారణం కాదా? ఒకప్పుడు పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతన్న.. ఇప్పుడు పుట్ల కొద్దీ వడ్లు పండిస్తున్నడు. ‘మేం కొనలేం.. మా వల్ల కాదని’ కేంద్రమే చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. ఇది తెలంగాణ రైతుల సత్తా.

వాళ్ల పార్టీకి నూకలు చెల్లే తీర్పులిద్దాం
కేంద్రం ధాన్యం కొనము అంటే.. మేం ఢిల్లీకి పోయి అక్కడ కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ను కలిసి మా ధాన్యం కొనాలని అడిగితే అప్పుడు ఆయన ‘ఏం చమత్కారం చేశారు. ఒక్కసారే ఇంత ధాన్యం ఎట్లా పెరిగింది? ఒకప్పుడు 68 లక్షల టన్నులు పండితే ఇప్పుడు 3.50 కోట్ల టన్నులకు ఎట్లా పెరిగింది. మీరేదో గోల్‌మాల్‌ చేస్తున్నరు’ అంటూ మమ్మల్ని అవమానించేలా మాట్లాడారు. అప్పుడు మేము ఆయనకు చెప్పినం.. ‘మేం రైతులు, వ్యవసాయం కోసం రైతుబంధు, రైతుబీమా ఇస్తున్నం. చెరువులు బాగు చేసుకున్నం, కొత్త ప్రాజెక్టులు కట్టుకొంటున్నాం. వీటన్నిటి వల్ల తెలంగాణ వ్యవసాయం పెరిగింది.

పంటలు పండుతున్నయ్‌’ అని చెప్పినం. యాసంగి వడ్లు కొంటరా? లేదా? అని అడిగితే అప్పుడు పీయూష్‌ గోయల్‌.. ‘మా దగ్గర నాలుగేండ్లకు సరిపడా ఉడకబెట్టిన బియ్యం ఉన్నవి. ఇక మేం మీ దగ్గర యాసంగి వడ్లు కొనం’ అని చెప్పారు. ఆయన్ను ఎంతగానో బతిలాడినం. ‘యాసంగిలో వడ్లు ఉడకపెట్టకపోతే అవి నూకలైతయి’ అని చెప్తే ఆయన మాతో ఏమన్నారో తెలుసా? ‘మీ వాళ్లకు నూకలు తినడం నేర్పించండి. మీ తెలంగాణ బిడ్డలకు నూకలు తినిపించండి. మేం మాత్రం కొనం’ అని తేల్చిచెప్పారు. తెలంగాణ బిడ్డలను నూకలు తినాలని చెప్పిన వాళ్ల తోకలు కట్‌ చేద్దామా? వద్దా? ఒక్కసారి ఆలోచించండి. వాళ్ల పార్టీకి నూకలు చెల్లే విధంగా తీర్పులిద్దామా? లేదా? ఒక్కసారి ఆలోచించండి.

ఆత్మహత్యల చోట.. ధాన్యపు సిరులు
భారతదేశంలో అత్యధిక రైతు ఆత్మహత్యలు ఎక్కడవుతున్నాయని ఎవరైనా అడిగితే.. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలు అగ్రభాగాన ఉండేవి. ఈ రోజు నల్లగొండ రైతన్నలు గర్వంగా చెప్పుకోవచ్చు.. ‘ఆనాడు రైతుల ఆత్మహత్యల్లో అగ్రభాగాన ఉన్న నల్లగొండ. ఇప్పుడు ధాన్యం పండించడంలో తెలంగాణలోనే నంబర్‌ 1 స్థానంలో ఉన్నది’ అని. మా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చాక.. మా రాష్ట్రం మాకు వచ్చాక.. మా రైతుబిడ్డ సీఎం అయ్యాక మా బతుకులు మారాయని గల్లా ఎగరేసి చెప్పే స్థాయికి చేరుకున్నాం.

ఆకలి సూచీలో దిగజారిన దేశం
ప్రపంచ దేశాల్లో ఆహార ఉత్పత్తులు, ఆకలి కేకలపై అధ్యయనం చేసి ఒక సంస్థ ప్రపంచ ఆహార సూచిక (వరల్డ్‌ హంగర్‌ ఇండెక్స్‌) విడుదల చేస్తుంది. ఈ సంస్థ తాజా నివేదిక ప్రకారం 116 దేశాలకు ర్యాంకులు ఇస్తే ఇందులో గతేడాది భారతదేశ ర్యాంకు 101 ఉండేది. ఈ ఏడాది మరో ఆరు స్థానాలు దిగజారి 107 స్థానానికి దిగజారింది. దక్షిణాసియాలో భారత్‌, పాకిస్తాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, అఫ్గానిస్థాన్‌ ఉంటే ఇందులో అఫ్గానిస్తాన్‌ మినహా మిగతా నాలుగు దేశాలు మనకన్నా మెరుగ్గా ఉన్నాయి.

ప్రభుత్వ కాంట, ఐకేపీ సెంటర్‌ ఉండదు
మేం కొట్లాడితే కేంద్రం దిగొచ్చి ధాన్యం కొన్నది. ఇప్పుడు కొత్తగా మళ్లీ కొత్త కుట్రకు కేంద్రం తెరతీసింది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే మాట్లాడుతూ… ‘ప్రతి సంవత్సరం ధాన్యం కొనడం ద్వారా మాకు రూ.4 వేల కోట్ల నష్టం వస్తున్నది. ఇకనుంచి మేం ధాన్యం కొనం. పైవేటు వ్యాపారులకు అవకాశం ఇస్తం’ అని చెప్పారు. అంటే రేపు ఏమైతదో తెలుసా? మీ కల్లం కాడ కాంట ఉండది, ఐకేపీ ఉండదు, ఫ్యాక్స్‌ ఉండదు, ప్రభుత్వం పెట్టే కాంట ఉండదు.

ఇక ప్రైవేటోళ్లే వస్తరు. మిల్లర్లను కాదని, పెద్దపెద్ద సేఠ్‌ను కాదని మీరంతా ఒక తాటిమీదికొచ్చి ధాన్యంకు ధర నిర్ణయించే శక్తి మీకు ఉంటదా? ధాన్యం కొనుగోళ్లలో ప్రైవేటోళ్లు చొరబడితే, ఐకేపీ సెంటర్లు లేకపోతే మద్దతు ధరకు ధాన్యం అమ్ముకునే శక్తి రైతుకు ఉంటదా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రైవేటు వాళ్ల చేతుల్లో ధాన్యం సేకరణ పెట్టడమంటే.. మన మరణ శాసనం మనం రాసుకోవడమే. మద్దతు ఇక మర్చిపోవడమే. ఇలాంటి రైతు వ్యతిరేక ఆలోచనలు చేస్తున్న మోదీకి, ఆయన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సంగతి ఒకసారి ఆలోచన చేయండి.

బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా బుద్ధి చెప్పాల్సిన బాధ్యత తెలంగాణ రైతులపైనే ఉన్నది. సందర్భం వచ్చినప్పుడల్లా ఈ రైతు వ్యతిరేకులను, మనందరి కడుపులు కొట్టే ప్రయత్నం చేస్తున్నవాళ్లకు బుద్ధి చెప్పాలి. యూపీలో ట్రాక్టర్లతో తొక్కించి 13 మంది రైతులను చంపారు. వాళ్లేమో రైతులను తొక్కిచంపే ప్రయత్నంలో ఉంటే.. మేమేమో రైతన్న బాగుండాలని కోరుకుంటూ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నాం.

రైతుల కోసం ఆలోచించింది కేసీఆరే: మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతుల కోసం ఆలోచించి, వారి అభివృద్ధికి బాటలు వేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమేనని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో మాట్లాడుతూ.. దేశంలో వ్యవసాయరంగం అభివృద్ధికి ఎంతో అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలోని పాలకుల చేతగాని తనంతో వనరులను సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని అన్నారు. నల్లగొండ జిల్లాను ఫ్లోరైడ్‌ భూతం నుంచి తరిమేసి.. అక్కడి ప్రజలకు విముక్తి కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు.

రైతు రాజు అయితే: మంత్రి సబితారెడ్డి
రైతు కష్టాలు తెలిసిన వారు ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో చెప్పడానికి తెలంగాణ నిదర్శనమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఉచిత విద్యుత్తు, రైతుబంధు, సాగునీటి వనరులు, పాడిపంటలతో తెలంగాణ అలరారుతున్నదని పేర్కొన్నారు. అనుక్షణం రైతుల గురించి ఆలోచించే కేసీఆర్‌కు రైతుల ఆశీస్సులు, అండదండలు ఉండాలని కోరారు.

మోదీ.. మూడు కొత్త కిరికిరీలు
కేంద్రంలోని మోదీ సర్కారు వ్యవసాయానికి సంబంధించి మూడు నల్లచట్టాలు తీసుకొస్తే.. ఉత్తరాది రైతులు 13 నెలల పాటు రోడ్లపై ఉండి కొట్లాడితే ఆఖరికి ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చి, తలవంచి దేశ రైతులకు క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఇదీ రైతుల సత్తా. రైతుల సత్తాను మోదీ తక్కువ అంచనా వేస్తున్నారు. అందుకే మూడు కొత్త కిరికిరి ఆలోచనలు చేస్తున్నారు. వాటివల్ల కలిగే నష్టాన్ని ప్రతి రైతు తెలుసుకోవాలి. ఇందులో అత్యంత ప్రమాదకరమైన ఆలోచన మీ బాయిలకాడ మోటర్లకు మీటర్లు పెట్టడం. మీటర్లు ఎందుకని ప్రశ్నిస్తే.. ఎవరు ఎంత కరెంట్‌ వాడారో తెలియాలి కదా? అని అంటరు.

ఆ పెట్టే మీటర్లు ఎలాంటివంటే.. ప్రీపెయిడ్‌ మీటర్లు. మోదీ రాష్ర్టాలకు బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నారు. మోటర్లకు మీటర్లు పెడితే అదనంగా సంవత్సరానికి రూ.5 వేల కోట్ల రుణం ఇస్త్తమని ఆశపెడతున్నరు. అప్పుడు సీఎం కేసీఆర్‌ ఒక్కటే మాట చెప్పారు ‘నా గొంతులో ప్రాణం ఉండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ బాయిలకాడ మీటర్లు పెట్టనియ్య. రూ.25 వేల కోట్లు కాదు.. ఇంకా ఎన్ని కోట్లు పోయినా ఫర్వాలేదు’ అని తేల్చిచెప్పారు. మోటర్లకు మీటర్లను సీఎం కేసీఆర్‌ ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసా? ఒకవైపు మనవద్ద ఉండే విద్యుత్తు కంపెనీలను ప్రైవేటుపరం చేయాలి.

మళ్లీ ఇవి ఎవరి చేతుల్లోకి పోతయో తెలుసా? (అదానిని ఉద్దేశించి). మనం తయారుచేసిన కరెంట్‌ కంపెనీ వాళ్ల చేతిలో పడితే తెల్లారి నుంచి ఏమవుతుందో తెలుసా? మీటర్‌ ఎట్లా తిరగాలో ఆయనే డిసైడ్‌ చేస్తడు. కరెంట్‌ బిల్లుపై మన కంట్రోల్‌ ఉండదు. పేరుకే ఈఆర్సీ ఉంటది కానీ.. వాళ్లు ఎంత చెప్తే అంత ఉంటది. రోజురోజుకి కరెంట్‌ ధరలు కూడా మారుతయి. ప్రీపెయిడ్‌ మీటర్‌లో మీరు రూ.100 వేస్తే అది ఒకసారి రెండు రోజులే పని చేయొచ్చు.. మరోసారి మూడు రోజులు పని చేయొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి విద్యుత్తు విధానం ఒకసారి నాశనం అయితే.. మీరే దండం పెట్టి ‘ఈ ఎవుసం మేం చేయలేము’ అని చెతులెత్తేసి పారిపోయే పరిస్థితి వస్తది.

ఈ విషయం ఇతర రాష్ట్రాలకు సీరియస్‌ కాకపోవచ్చు. కానీ తెలంగాణకు మాత్రం చాలా సీరియస్‌ అంశం. మీ పైసలతో పంపుసెట్టును నడిపించుకుంటున్న మీ బోర్లకు మీటర్లు పెడతామంటున్న మోదీకి బుద్ధి చెప్పాల్నా? లేదా? ‘ప్రీపెయిడ్‌ మీటర్లు పెట్టి ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న తెలంగాణ రైతుల్ని సావుదెబ్బ కొడతా.. రైతులను ఖతం చేస్తా’ అంటున్న మోదీని అడ్డుకుందామా? వద్దా? ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు పాల్గొన్నారు.

మోదీ మూడు సెగలు…

  1. కరెంట్‌ కంపెనీలను ప్రైవేటుపరం చేయడం
  2. మోటర్లకు మీటర్లు పెట్టడం.
  3. ధాన్యం కొనుగోళ్లను ప్రైవేటువారికి అప్పగించడం.

భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే వీటిలో తెలంగాణ కాకుండా 24 గంటల పాటు వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఇంకొక రాష్ట్రం దేశంలో ఉన్నదా? దమ్ముంటే చూపిస్తరా? అని ప్రతిపక్ష పార్టీలకు సవాల్‌ చేస్తున్న.
-పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.