Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఒకేదఫాలో రుణమాఫీ

-ఈ ఆర్థిక సంవత్సరంలోనే 8వేల కోట్ల బకాయిల చెల్లింపు -విత్తన భాండాగారంగా తెలంగాణ -కరువు మండలాలను త్వరలోనే ప్రకటిస్తాం -మీడియాతో మంత్రి పోచారం

Pocharam Srinivas Reddy

ఈ ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.8వేల కోట్ల బకాయిలను చెల్లిస్తామని, అసెంబ్లీలోనే ఈ అంశాన్ని స్పష్టంగా చెప్పామని వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. రుణమాఫీ బకాయిల చెల్లింపు ప్రక్రియ కొనసాగుతున్నదని, త్వరలోనే పూర్తిచేస్తామని తెలిపారు. సోమవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడారు. ఈ నెల 27-29 తేదీల్లో జరిగే జాతీయ విత్తన కాంగ్రెస్ ఏర్పాట్లను వివరించారు. ఈ సమావేశానికి 600 మంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, మేధావులు, రైతులు హాజరవుతున్నారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2.90లక్షల ఎకరాల్లో రెండు లక్షల మంది రైతులు విత్తనాలను ఉత్పత్తి చేసే ప్రక్రియలో ఉన్నారని చెప్పారు. ఇంత భారీ స్థాయిలో మరేరాష్ట్రంలోనూ చేయడం లేదని తెలిపారు. దేశంలోని రైతులందరికీ సరఫరా అయ్యే విత్తనాల్లో 60% తెలంగాణ నుంచే వెళ్తున్నాయని, 14 దేశాలకు కూడా విత్తనాలను సరఫరా చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని సీడ్ కంపెనీలు 670 మెట్రిక్ టన్నుల విత్తనాలను ప్రాసెస్ చేస్తున్నాయని, దీనివల్ల వేలమందికి ఉపాధి లభిస్తుండగా, రెండు లక్షలమంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

ఈ సీడ్ కాంగ్రెస్‌లో విత్తనాల ఉత్పత్తిలో చేపట్టాల్సిన మెళకువలపై శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు చిన్నసన్నకారు రైతులకు సలహాలు ఇస్తారని అన్నారు. 2001లో 196.40మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు ఉత్పత్తి అయితే 2014లో 264మిలియన్ టన్నుల ధాన్యాలు ఉత్పత్తి అయ్యాయని తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని విత్తన భాండాగారంగా తీర్చిదిద్దే ఆలోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నామని, ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో జాతీయ విత్తన సదస్సు నిర్వహించేందుకు అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. సీడ్ విలేజ్ ప్రోగ్రాం కింద 14,680 యూనిట్లలో 38వేల హెక్టార్లలో విత్తన ఉత్పత్తి కార్యక్రమం జరుగుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో 400 కంపెనీలున్నాయని, వీటికి ఒక్కొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆదేశించామని తెలిపారు. ఈ కంపెనీలే రైతులకు ప్రారంభ విత్తనం, ఫౌండేషన్ విత్తనాలు అందించి, చివరికి రైతులు పండించిన విత్తనాలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. రాష్ట్రంలో సోయాబీన్ విత్తనాల ఉత్పత్తి లేదని, మధ్యప్రదేశ్ నుంచి దిగుమతి చేసుకుంటున్నామన్నారు. ఈ సంవత్సరం సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ద్వారా ఖాళీ భూములు సాగు చేయించామని, ఈ సంవత్సరం 60-70వేల క్వింటాళ్ల సోయాబీన్ విత్తనాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీంతోపాటు రైతులకు ప్రారంభ విత్తనాలకు 50%, ఫౌండేషన్ సీడ్‌కు 33% సబ్సిడీకూడా ఇస్తున్నామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేవని తెలిపారు. ఈ విత్తన కాంగ్రెస్ సమావేశంలో 75 మంది రైతులు పాల్గొంటారని, వీరికి ఎలాంటి ఫీజు వసూలు లేదని తెలిపారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి సంజీవ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు.

త్వరలో ఎక్స్‌గ్రేషియా జీవో అమలు రాష్ట్రంలో కరువు మండలాలపై త్వరలోనే ప్రకటన చేస్తామని, సీఎస్ నేతృత్వంలో వేసిన కమిటీ సిఫార్సుల నివేదిక ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు. ఎక్స్‌గ్రేషియా జీవోను త్వరలోనే అమల్లోకి తెస్తామన్నారు. ఎన్ని మండలాలు అనేది కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో పంట నష్టంపై మాట్లాడలేదని, కానీ తమ సీఎం అసెంబ్లీలోనే జిల్లాలవారీగా పంట నష్టం వివరాలను వెల్లడించారని తెలిపారు. సమావేశంలో కేంద్ర అధికారులు త్రివేది, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పార్థసారధి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.