Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఒకే గూటికి ఆశ్రమవిద్య

ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక కేజీ టు పీజీ విద్యావిధానం త్వరలో పట్టాలెక్కనుంది. ఎన్నికల సందర్భంగా మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను, ఇవ్వని హామీలను వేగంగా, సమాంతరంగా అమల్లోకి తెస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. విద్యావ్యవస్థలో సంస్కరణలపై దృష్టిసారించారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న ఆశ్రమ పాఠశాలలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలని అధికారులను ఆదేశించారు.

KCR review meet on Residential schools

-నియోజకవర్గానికి పది రెసిడెన్షియల్ స్కూళ్లు – కులమతాలకు అతీతంగా నాణ్యమైన ఉచిత విద్య – ఐదో తరగతి నుంచి ఆంగ్ల మాధ్యమంలో బోధన -స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థులకు తిన్నంత అన్నం పెట్టాలి -ఐటీఐలనూ విద్యాశాఖే నిర్వహించాలి – ఉద్యోగావకాశాలు పెంచేలా డిగ్రీ కోర్సులుండాలి -కేజీ టు పీజీ విద్యపై సమీక్షలో సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగులు తదితర క్యాటగిరీల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్నాయని, ఒక్కో పాఠశాలలో ఒక్కో విధానం, ఒక్కో మెనూ, ఒక్కో మెస్‌చార్జ్ విధానం, ఒక్కో బడ్జెట్ ఉన్నాయని ప్రస్తావించిన సీఎం.. అలాకాకుండా అందరికీ ఒకేరకమైన విద్య, వసతి, సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులకు గ్రాముల చొప్పున కాకుండా.. ఎవరు ఎంత తింటే అంత అన్నం పెట్టాలన్నారు. భోజనం వడ్డించడానికి బఫే పద్ధతి అనుసరించాలని ఆదేశించారు. రాష్ట్రంలో కేజీ టు పీజీ విద్యా విధానంపై ముఖ్యమంత్రి బుధవారం సచివాలయంలో విద్యాశాఖ, వివిధ సంక్షేమశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఒకే గొడుగు కిందకు అన్ని ఆశ్రమ పాఠశాలలను తీసుకువచ్చినప్పటికీ ఏ వర్గం విద్యార్థులకూ నష్టం వాటిల్లకుండా ప్రవేశాలు చేపట్టాలని సీఎం సూచించినట్లు తెలిసింది. అన్ని గురుకులాలకు విద్యాశాఖ పరిధిలోనే ఒకే డైరెక్టర్‌ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి ఆయన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దీనిపై ప్రతిపాదనలు తయారు చేసి వారంలోగా సమర్పిస్తే తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం.

నియోజకవర్గానికి 10 రెసిడెన్షియల్ స్కూళ్లు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో.. నియోజకవర్గానికి సగటున 10 ఆశ్రమపాఠశాలలు ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1190 రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యనుబోధించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంచేశారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు. 12వ తరగతి తరువాతకూడా ఈ విద్యార్థులు ఏయే కోర్సులు ఎంచుకుంటున్నారు? వారికి ఎలాంటి విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలి? అనేదానిపై ఓ సమగ్ర విధానం రూపొందించాలని సీఎం నిర్దేశించారు.

ఉదయం పూట సెషన్‌లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేద విద్యార్థులందరికీ కులమతాలతో సంబంధం లేకుండా నాణ్యమైన విద్యను అందించాలన్నారు. నాలుగవ తరగతివరకు తల్లిదండ్రుల సంరక్షణలోనే పిల్లలు ఉండాలని, దానికి అనుగుణంగా గ్రామస్థాయిలోనే విద్యాబోధన జరగాలని చెప్పారు. ఆ తరువాత మాత్రం పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలని అన్నారు. ప్రస్తుతం సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు ఉన్నంతలో మెరుగ్గా నడుస్తున్నాయని, స్వల్ప మార్పులు అవసరమైతే చేసుకుని, అదే నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా 1190 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రస్తుతం వివిధ శాఖలకింద 668 రెసిడెన్షియల్ స్కూళ్లు నడుస్తున్నాయని, వాటికి తోడు మరో 522 స్కూళ్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ (12వ తరగతి) తరువాత విద్యార్థులు చదివే అంశాలను బట్టి వారి వసతి సంగతి చూడాలన్నారు.

మైనార్టీలకు హాస్టళ్లు పెంచాలి రాష్ట్రంలో మైనారిటీల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ వారికి కేటాయించిన హాస్టళ్లు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3000పైగా హాస్టళ్లు ఉంటే మైనారిటీలకోసం కేవలం 21 హాస్టళ్లు మాత్రమే ఉన్నాయన్నారు. ఈ పరిస్థితిని గమనించి ప్రతి జిల్లాలో మైనారిటీలకోసం ఒక రెసిడెన్షియల్ పాఠశాల, ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.

చాలామంది మైనారిటీ వర్గాల బాలికలు కొంతవరకే చదివి, ఆపేస్తున్నారని, ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పిస్తే వారుకూడా ఉన్నత చదువులు చదువుతారని సీఎం అన్నారు. ప్రతి నియోజకవర్గంలో దళిత బాలికలకోసం ప్రత్యేక హాస్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉద్యోగావకాశాలు పెంచేలా డిగ్రీ కోర్సులు ప్రస్తుతం ఉన్న డిగ్రీ కోర్సులు ఉద్యోగావకాశాలను పెంచేలా ఉండాలని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం సచివాలయంలో విద్యాశాఖపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేటురంగంలో ఎలాంటి ఉద్యోగావకాశాలున్నాయో గుర్తించి, వాటికి అనుగుణమైన కోర్సులను డిగ్రీలో ప్రవేశపెట్టాలని సీఎం చెప్పారు.

విద్యార్థులకు కూడా దీనిపై అవగాహన కలిగించాలన్నారు. పోటీ పరీక్షలంటే కేవలం పబ్లిక్ సర్వీస్ కమిషన్లద్వారా వచ్చే ఉద్యోగాలేనన్న భావన పట్టభద్రుల్లో నెలకొందని, కానీ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇంకా అనేక ఉద్యోగాలు ఉన్నాయనే విషయాన్ని డిగ్రీ స్థాయిలోనే విద్యార్థులు గుర్తించేలా చేయాలని చెప్పారు. డిగ్రీ పూర్తయిన తరువాత చాలా మంది యువకులు ఖాళీగానే ఉంటున్నారని, అలా ఉండకుండా డిగ్రీ చదువుతుండగానే తరువాత ఏం చేయాలనే విషయంపై వారికి స్పష్టత ఉండాలని అన్నారు. రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పారు. అవసరమైన లెక్చరర్ల నియామకాలను పూర్తిచేస్తామని తెలిపారు. ఇందుకోసం డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు పాఠశాల విద్యా శాఖలో భర్తీ చేయాల్సిన ఖాళీలు గుర్తించి, నివేదికను వారంలో ప్రభుత్వానికి అందించాలని సీఎం ఆదేశించారు. ఈ కాలేజీల్లో కాంట్రాక్టు పద్ధతిలో పని చేస్తున్న అధ్యాపకులతో సంబంధం లేకుండా.. ఖాళీ పోస్టులను గుర్తించాలని, ఈ విషయంలో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేసీఆర్ సూచించినట్లు తెలిసింది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి త్వరలో విడుదల కానున్న వరుస నోటిఫికేషన్లద్వారా వీటిని భర్తీ చేయడానికి నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు సమాచారం. తెలంగాణవ్యాప్తంగా పాఠశాలల్లో తెలుగు, లేదా ఉర్దూ భాషను సెకండ్ లాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకునే వెసులుబాటు ఉండాలని చెప్పారు. ఆంగ్ల మాధ్యమంలో చదివినప్పటికీ తమ మాతృ భాష అయిన తెలుగు, లేదా ఉర్దూ భాషపై పట్టు కోల్పోకుండా ఉండేందుకు ఇది దోహదం చేస్తుందని సీఎం అన్నారు. అనాథ పిల్లలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సీఎం చెప్పారు. రాష్ట్రంలో అనాథ పిల్లలందరికీ తల్లీ, తండ్రి రాష్ట్ర ప్రభుత్వమేనని ప్రకటించుకున్నందున అందుకు తగ్గట్టుగా వారి పోషణ, రక్షణ, చదువు, స్వయం సమృద్ధి విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు.

రాష్ట్రంలోని అనాథలందరినీ స్టేట్ చిల్డ్రన్‌గా గుర్తించాలని చెప్పారు. 10వ తరగతి పూర్తయిన స్టేట్ చిల్డ్రన్‌ను ఇంటర్మీడియట్‌లో రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షాసమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు, సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, వివిధ శాఖల ఉన్నతాధికారులు రేమండ్ పీటర్, రాజీవ్ రంజన్ ఆచార్య, ప్రవీణ్‌కుమార్, చిరంజీవులు, రాజా, ఉమర్ జలీల్, మహేశ్ దత్ ఎక్కా, అరుణ, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

చదువంటే ఇంజినీరింగ్, మెడిసినేకాదు సమాజానికి అవసరమయ్యే సేవలకు అనుగుణంగా.. సాంకేతిక విద్యా విధానంలోకూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందని సీఎం పేర్కొన్నారు. చదువంటే కేవలం మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమే అనే భావన పోవాలని చెప్పారు. ఇంజినీరింగ్ పూర్తిచేసి, సరైన ఉద్యోగ అవకాశాలు లేక చాలామంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు హోంగార్డులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఉపాధి హామీ కూలీలుగా పనిచేస్తుండటం సిగ్గుచేటైన విషయమని చెప్పారు.

ఈ పరిస్థితిని నివారించడానికి సాంకేతిక విద్యా విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. సమాజానికి అవసరమయ్యే సేవలు ఏమిటి? అందుకు అనుగుణంగా సేవలందించేవారిని ఎలా తయారు చేయాలి? అనే విషయంపై విద్యా శాఖకు అవగాహన ఉండాలని చెప్పారు. ఏ వృత్తిలో ఎంతమంది అవసరం? అనే విషయాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా కోర్సులు తీసుకురావాలని పేర్కొన్నారు. ఐటీఐలాంటి సంస్థలనుకూడా విద్యా శాఖే నిర్వహించాలని సీఎం చెప్పారు.

గురుకుల టీచర్లు, ఉద్యోగ సంఘాల సమాఖ్య హర్షం గురుకుల పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తెస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల సమాఖ్య హర్షం వ్యక్తం చేసింది. సమాఖ్య చైర్మన్ కే రవిచందర్, కో చైర్మన్ టీ రమేశ్, ప్రధాన కార్యదర్శి కొల్లు వెంకటరెడ్డి ఒక ప్రకటనలో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి పది రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.