
-విస్తృత విజన్‌తో ముందుకెళ్తున్న సీఎం కేసీఆర్ -తెలంగాణ తరహా సుస్థిరాభివృద్ధికి ఫెడరల్ ప్రతిపాదనలు
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు.. ఐదేండ్ల కిందటి వరకు దేశంలో ఓ ప్రాంతానికి చెందిన నేత. ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమించిన నాయకుడు. ఇప్పుడు.. యావత్‌దేశానికి ఆదర్శవంతమైన నాయకుడు. సుపరిపాలనలో దేశంలోనే అగ్రశ్రేణి ముఖ్యమంత్రి. ఆయన మస్తిష్కం నుంచి వెలువడిన ప్రతి ఆలోచన.. యావత్ దేశానికి మార్గదర్శకం. ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమం.. అన్ని రాష్ర్టాలకు అనుసరణీయం. స్వాతంత్య్రం వచ్చింది. ప్రభుత్వాలు వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ దేశగతిని సరైన దిశలో నడిపించినవారు లేరు. ప్రజల కోణంలో.. ప్రజలను కేంద్రంగా చేసుకొని పరిపాలించిన నాయకుడు లేడు. ఏడు దశాబ్దాల తరువాత వాస్తవిక దృక్పథం కలిగిన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపంలో దేశానికి లభించాడు. ఆయన దార్శనికత ఏమిటో.. ఆచరణలో దాని వల్ల కలిగిన మార్పు ఏమిటో ఇప్పుడు దేశం ముందు కనిపిస్తున్నది. దేశానికి ఆయన ప్రతిపాదిస్తున్న గుణాత్మకమైన రాజకీయం ఇవాళ అవసరం. ఆయన సూచిస్తున్న ఎజెండా అత్యవసరం.
రైతుకు పట్టాభిషేకం కేసీఆర్ వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. రైతురుణాల మాఫీ నుంచి, రైతు పెట్టుబడి సాయం, రైతుబీమా వంటివి దీనికి నిదర్శనం. కేసీఆర్ తెలంగాణలో ప్రారంభించిన రైతుబంధు పథకం భారత వ్యవసాయ రంగంలోనే ఒక విప్లవాత్మకమైన మార్పు. కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని అనుసరిస్తున్నది. ప్రస్తుతం మన రైతులు ధైర్యంగా వ్యవసాయం చేసే పరిస్థితులకు నెలవు మన రాష్ట్రం. రైతుబీమా ద్వారా అందిస్తున్న 5 లక్షలు రైతు కుటుంబాలకు గొప్ప భరోసా. ఫలితంగా రైతు ఆత్మహత్యలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఉచితంగా విత్తనాలు, ఎరువుల పంపిణీ వంటివి వారిని సాగువైపు ప్రేమగా అడుగులు వేయిస్తున్నాయి.
విలక్షణ నాయకత్వం దేశానికి ఒక సుస్థిరమైన దశ-దిశ చూపించగల నాయకుడు కే చంద్రశేఖర్‌రావు. ఆయనలో మొదట్నించీ విలక్షణమైన నాయకత్వం ఉన్నది. తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని నెత్తుటిబొట్టు చిందకుండా నడిపించిన నాయకత్వం మరోసారి మహాత్మాగాంధీ పోరాట పటిమను గుర్తుచేసింది. ఒకటిన్నర దశాబ్దంపాటు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని నడిపించి తెలంగాణను సాధించిన నాయకుడు కేసీఆర్. సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతులు, పేదల కన్నీరు తుడిచేందుకు ఆయన ప్రవేశపెడుతున్న పథకాలు తిరుగులేని విధంగా అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆయన నాయకత్వంలో తెలంగాణ సుస్థిర, సమ్మిళిత అభివృద్ధిని నమోదు చేస్తున్నది. ఎన్నడూ లేని రీతిలో కులమత సామరస్యం ప్రజల మధ్య వెల్లివిరుస్తున్నది. కేసీఆర్ నాయకత్వ సరళి, అభివృద్ధి నమూనా ఇతర రాష్ట్రాలకు తలమానికమవుతున్న వైనమే దీనికి నిదర్శనం. దేశ ప్రజలలో కొత్త ఆశలను చిగురింప చేస్తున్న గుణాత్మక నాయకుడాయన.
సమున్నతమైన విజన్ భారతదేశ సంపూర్ణ అభివృద్ధి కోసం కేసీఆర్ సమున్నతమైన విజన్‌ను ప్రదర్శిస్తున్నారు. సహజ వనరులు, నదీజలాల సక్రమ వినియోగం, ప్రజలందరికీ సురక్షితమైన తాగునీరు, సాగునీరుకు సుస్థిర పథకాలు వంటివన్నీ తిరుగులేని ప్రజాదరణను పొందాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న మిషన్ కాకతీయ, భగీరథ పథకాలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించాయి. మౌలిక సదుపాయాలు, రహదారులు, రవాణా వ్యవస్థలను మెరుగుపరిచారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. కులవృత్తులకు తిరిగి ప్రాణం పోశారు. ఇవన్నీ ఇతర రాష్ట్రాలు సైతం అనుసరిస్తున్నాయి. నదీజలాల వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన విధానాన్ని ఆయన తాజాగా ప్రతిపాదిస్తున్నారు. రవాణా వ్యవస్థపై దేశంలో ఉండాల్సిన, ఆయన సూచిస్తున్న విధానం నిస్సందేహంగా నిర్మాణాత్మకమైనది.
ప్రజాసంక్షేమంలో అగ్రస్థానం మన రాష్ట్రంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకా లు దేశవ్యాప్తం కావాల్సి ఉన్నది. వృద్ధులకు రూ. 2,000 పింఛన్, బీడీ కార్మికులకు, వితంతు మహిళలకు ప్రత్యేక పింఛన్లు, పెళ్లి చేసుకునే పేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మీ , షాదీ ముబారక్ , కేసీఆర్ కిట్స్ వంటి పథకాలు అత్యంత ప్రజాదరణను పొందాయి. ఇవే పథకాలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే పేదరిక సమస్యకు ఒక చక్కని పరిష్కారం లభిస్తుంది. పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంపైనా సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.
అద్భుత ఆర్థిక క్రమశిక్షణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డాక రుణభారంతో ఆర్థిక నిర్వహణలో తెలంగాణ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని ఆర్థిక పరమైన సమస్యలకు సమర్థవంతమైన పరిష్కారం చూపారాయన. అయిదేండ్ల తర్వాత చూస్తే దేశంలో అత్యధిక రెవెన్యూ వృద్ధి రేటును సాధించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు నెలకొల్పింది. ఆరోగ్యకరమైన ఆర్థిక నిర్వహణను సుసాధ్యం చేశారు. మూలధన వ్యయానికి, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అన్నింటికీ సమప్రాముఖ్యమివ్వడం ఆయనకే సాధ్యమైంది. లక్ష కోట్ల రూపాయలతో నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం సహా, కొత్త పవర్ ప్లాంట్లు, ఇతర మౌలిక సదుపాయాలలో ఆయన ముద్ర యావత్ ప్రపంచానికే మార్గదర్శం. ఇలా దేశ ఆర్థికరంగంలో అద్భుత ప్రగతిని సాధించే సత్తాగల నాయకుడు ఇప్పుడు ఆయనే.
విశాల ఉద్యోగ భారతం కొత్త ఉద్యోగాల కల్పన, ఉద్యోగులతో సౌహార్ద్రత అన్నవి ఏ ప్రభుత్వానికైనా సవాలే. ఇందులో కేసీఆర్‌ది అనూహ్య విజయం. తెలంగాణలోని దాదాపు అన్ని శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాలను కేంద్ర ప్రభుత్వ పే స్కేల్స్‌కు అనుగుణంగా సవరించడం అసాధారణ ఘనత. అన్ని రాష్ర్టాల ఉద్యోగులకంటే తెలంగాణ ఉద్యోగులు తీసుకునే వేతనాలు అధికం. ఇదే పంథాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ కల్పనలోనూ ఆయన చిత్తశుద్ధి అపారం. విదేశీ పెట్టుబడులను పెద్ద మొత్తంలో ఆకర్షించడం ద్వారా ఉత్పత్తి, ఫార్మా, ఐటీ రంగాల్లో ప్రభుత్వం లక్షల ఉద్యోగాలను సృష్టించింది.
హరిత భారతం సుసాధ్యం కేసీఆర్‌ను మించిన ప్రకృతి ప్రేమికుడు మరొకరు ఉండరు. ప్రాకృతిక విధానాలకే ఆయన పెద్దపీట వేస్తారు. తెలంగాణను హరితమయంగా మార్చాలనే లక్ష్యాన్ని ఒక బృహత్ కార్యంగా విజయవంతం చేశారు. యుద్ధప్రాతిపదికన మన రాష్ట్రంలో వంద కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికా రచన, దాని విజయాల వెనుక ఆయన దృఢదీక్ష కనిపిస్తాయి. ఇదీ జాతీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకునే అంశాల్లోనిదే.
రాష్ర్టాల అభివృద్ధితోనే దేశ ప్రగతి భారతదేశంలో బలమైన సమాఖ్య వ్యవస్థను కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారు. ఆర్థిక విషయాల్లో రాష్ట్రాలకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలన్నది ఆయన డిమాండ్. ఉమ్మడి జాబితాలో ఉన్న ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి వంటి వాటిని రాష్ట్రాలకు బదిలీ చేయాలన్న సూచనకు అన్ని వర్గాలనుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్నది. విద్య, ఉద్యోగాల్లో అర్హతగల పేదలకు రిజర్వేషన్ల కోటాను నిర్దేశించుకోవడంలో రాష్ట్రాలకు పూర్తి స్వేచ్ఛ ఉండాలని కేసీఆర్ అభిలషిస్తున్నారు. ఇలా రాష్ట్రాలను బలోపేతం చేయగలిగితే తత్ ఫలితంగా మొత్తం దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నది ఆయన నిశ్చిత సిద్ధాంతం.
భారతీయత వైపు అడుగులు గ్రామీణ ప్రజల సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించడం ద్వారా తెలంగాణ ఆర్థికవృద్ధి అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉన్నది. ఉచితంగా చేపల పంపిణీ, గొర్రెల పంపిణీ, ఇలా అన్ని కులాల వృత్తులను ప్రోత్సహించే ప్రత్యేక కార్యక్రమాలు ఎన్నో. చేనేత కళాకారుల ఆత్మహత్యలకు చరమగీతం పాడేలా వారిని అన్ని విధాలా కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఇవన్నీ మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్ఠం చేయడమేకాక దేశవ్యాప్తంగా ప్రజలు ఒకనాటి వైభవోపేతమైన భారతీయత వైపు అడుగులు వేసేలా చేసేవే.
యువతకు బంగారు భవిత కేసీఆర్ నూతన విద్యావిధానం వల్ల తెలంగాణలో అనూహ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థల ఆధిపత్యానికి తెరపడింది. పేదవర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఏర్పాటు ఆయన సాధించిన ఘనవిజయాలలో మరొకటి. మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి పేదవిద్యార్థి కేజీ నుంచి పీజీదాకా నాణ్యమైన విద్యను పొందుతున్న తీరు అపురూపం. యువత బంగారు భవిష్యత్తు కోసం విదేశీ విద్యను ఉచితంగా అందించేందుకు ప్రత్యేక పథకాలు ప్రారంభించారు. విదేశాల్లో చదివేందుకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న ఈ విద్యావిధానం దేశానికే మార్గదర్శకం.