Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఒక్క రోజులో.. కనీవినీ ఎరుగని రీతిలో ఇంటింటి సర్వే

సర్వే ఇలా… – ఒక్కో ఉద్యోగి సర్వే చేయాల్సింది 25 నుంచి 30 కుటుంబాలు – సర్వేకు వెళ్లే ఉద్యోగులు, అధికారుల ఎంపిక 7లోగా పూర్తి.. 15లోగా శిక్షణ పూర్తి – సివిల్ దుస్త్తుల్లో పోలీస్ సిబ్బంది – సర్వే సమాచారం 30 రోజుల్లో కంప్యూటరీకరణ – అత్యధిక జనాభా, ఇండ్లు ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలపై తర్జనభర్జన వీలైతే అక్కడా అదే రోజు.. లేదా వాయిదా!

KCR

-అసలైన లబ్ధిదారుల ఎంపిక కోసం.. – సర్వే సన్నాహక సమావేశంలో సీఎం కేసీఆర్ -ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు -సర్వే తేదీన అందరూ ఇండ్లలో ఉండేలా విస్తృత ప్రచారం -84 లక్షల కుటుంబాల వద్దకు 4 లక్షల మంది ఉద్యోగులు -సర్వే నిర్వహణకు జిల్లాకు రూ.2 కోట్లు మంజూరు తెలంగాణలో 84 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్‌కార్డుల సంఖ్య 91 లక్షలుగా ఉంది. వీటికితోడు 15 లక్షల గులాబీ కార్డులున్నాయి. అంటే 22 లక్షల కార్డులు అదనంగా ఉన్నాయి. పరిపాలనా వ్యవస్థకు ఇంతకన్నా అవమానం ఏముంటుంది? ప్రతి అవినీతిలోనూ తెల్ల రేషన్‌కార్డులు విశ్వరూపాన్ని ప్రదర్శిస్తున్నాయి.. రాష్ట్రంలో ఇప్పటికే 52 నుంచి 55 లక్షల గృహాలు నిర్మించినట్లు లెక్కలున్నాయి. గ్రామాల్లోకి వెళితే జనం ఇంకా ఇండ్లు కట్టాల్సిన అవసరముందని చెప్తున్నారు. ఏందీ అడ్డగోలుతనం? ఏందీ వేల కోట్ల రూపాయల అవినీతి?

తెలంగాణలో 84 లక్షల కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలున్నాయి. కానీ రాష్ట్రం ఏర్పడిన జూన్ 2 తర్వాత ఆ సంఖ్య 86.20 లక్షలకు పెరిగింది. ఇది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అందుకే అసలు ఎన్ని కుటుంబాలున్నాయి? వాటి స్థితిగతులేమిటి?.. ఇలా అన్ని వివరాలను పక్కాగా సేకరించేందుకే సర్వే చేపడుతున్నాం.. కచ్చితమైన లెక్కలుంటే అద్భుత నిర్ణయాలు అమలుచేయవచ్చు. – సీఎం కేసీఆర్

రాష్ట్రంలో 84 లక్షల కుటుంబాలుంటే.. రేషన్‌కార్డులు కోటీ ఆరు లక్షలు! కానీ.. ఇంకా లక్షల మందికి రేషన్ కార్డులు లేని పరిస్థితి! గృహ నిర్మాణంలోనూ అదే తరహా అవినీతి! రాష్ట్రంలో ఇప్పటికే 52-55 లక్షల గృహాలు నిర్మించినట్లు లెక్కలున్నాయి. గ్రామాల్లోకి వెళితే జనం ఇంకా ఇండ్లు కావాలని మొత్తుకుంటున్నారు! ఇతర అనేక పథకాల్లోనూ ఇదే తరహా అవినీతి.. అక్రమాలు! ఫలితంగా నిజమైన లబ్ధిదారులు ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలకు ఆమడదూరంలోనే ఉండిపోతున్నారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రెండు బెడ్‌రూమ్‌లతో పేదలకు కట్టిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఆరునూరైనా ఆ హామీని నెరవేర్చేందుకు కంకణం కట్టుకుంటున్నది.

దళితులకు మూడెకరాల భూమి ఇచ్చే హామీని పక్కాగా నెరవేర్చనున్నది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలోనూ తెలంగాణ విద్యార్థులెవరూ నష్టపోరాదన్నది విధాన నిర్ణయంగా తీసుకున్నది. అయితే గత ప్రభుత్వాల హయాంలో ఇటువంటి పథకాలు ఉన్నా.. వాటి అంచనాలు.. వాటి ఆధారంగా చేసిన కేటాయింపులు, చేపట్టిన సంక్షేమ పథకాలన్నీ అక్రమాలపుట్టలుగా తయారయ్యాయి. దొంగ లబ్ధిదారులు అందులో పాగా వేశారు. ఈ నేపథ్యంలో తాజా పథకాల్లో అసలైన లబ్ధిదారులు నష్టపోకూడదని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ప్రయోజనాల పరిరక్షణకు నడుంకట్టింది. అసలు రాష్ట్రంలో ఎన్ని కుటుంబాలున్నాయి? వాటి ఆర్థిక స్థితిగతులేమిటి? అన్న సంపూర్ణ సమాచారం సేకరించేందుకు విప్లవాత్మకమైన చర్య చేపట్టింది.

దేశంలో ఏ రాష్ట్రంలోనూ నిర్వహించని పద్ధతుల్లో ఒకే రోజు నాలుగు లక్షలపైచిలుకు ఉద్యోగులు.. రాష్ట్రంలోని 84లక్షలకుపైగా కుటుంబాలను ఒకే రోజు కలిసి.. వివరాలు నమోదు చేయనున్నారు. బృహత్తరమైన ఈ సర్వేను ఈ నెల 19న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంటింటి సమగ్ర సర్వే సర్వ రోగ నివారిణి కావాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అభిలషించారు. సర్వే సన్నాహక సమావేశం శుక్రవారం నగరంలోని హైటెక్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. అనంతరం ముఖ్యమైన అధికారులతో మరో భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వే తేదీని ఖరారు చేశారు. అసలైన లబ్ధిదారులకు మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలంటే అధికారులు నిర్వహించే సర్వే కచ్చితంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గవద్దని స్పష్టం చేశారు.

సర్వే జరిగే రోజున అందరూ ఇండ్లలో ఉండేలా ప్రసార మాధ్యమాలు, ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. సర్వే జరిగే రోజు అందుబాటులో లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందలేకపోతారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే అన్ని నిర్ణయాలకు సర్వే లెక్కలే ప్రామాణికంగా ఉంటాయని సీఎం ప్రకటించారు. వీటి ఆధారంగానే సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని చెప్పారు. అందుకే ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు, కార్యాలయాలకు ఆ రోజు సెలవు ప్రకటించి, అందరూ ఇండ్లలో ఉండేలా చూస్తే సర్వే సమగ్రంగా వస్తుందని అన్నారు.

సర్వేలో పాల్గొనే అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రోజును ఆన్‌డ్యూటీగా పరిగణిస్తామని తెలిపారు. సర్వేకు సన్నాహకాలు చేసే క్రమంలో జరిగిన సమావేశం దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు సుదీర్ఘంగా సాగింది. ముఖ్యమంత్రి, మంత్రులు అధికారులతో విస్తృంగా చర్చలు జరిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనేందుకు అధికారులు కూడా అంగీకరించారు. ఎలాంటి అదనపు రెమ్యూనరేషన్ లేకుండానే పనిచేస్తామని చెప్పారు.

84 లక్షల కుటుంబాల సర్వే రాష్ట్రంలో ఉన్న 84 లక్షల కుటుంబాలను సర్వే అధికారులు ఒకే రోజున కలుస్తారు. ఈ బృహత్ ప్రక్రియలో ఒకే రోజున 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొంటారు. పోలీసు సిబ్బంది సైతం సివిల్ దుస్తుల్లో సర్వే నిర్వహణలో భాగస్వాములవుతారు. సర్వే నిర్వహణకు ఒక్కో జిల్లాకు రూ.2 కోట్లను విడుదల చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. హౌస్‌హోల్డ్ సర్వే నిర్వహించే ఒక్కో ఉద్యోగికి 25 నుంచి 30 కుటుంబాలు మాత్రమే కేటాయిస్తారు.

సర్వే కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఫార్మాట్‌ను రూపొందించింది. సర్వే నిర్వహించే సిబ్బంది ఆ ఫారంలో వివరాలు భర్తీ చేయాల్సి ఉంటుంది. ఫారం భర్తీ ఎలాగన్నదానిపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తదుపరి దశలో జిల్లా స్థాయిలో తహసీల్దార్లకు, ఆర్డీవో, ఇతర డివిజన్ స్థాయి అధికారులకు కలెక్టర్ స్థాయి అధికారులు శిక్షణ ఇస్తారు. డివిజన్, మండల స్థాయిలోలో సర్వే నిర్వహించే సిబ్బందికి ఆర్డీవో, తహసీల్దార్ స్థాయి అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ఉద్యోగులు, అధికారులను ఈ నెల ఏడో తేదీలోపు ఎంపిక చేసి, 15లోపు శిక్షణ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. ఒకే రోజు సర్వే నిర్వహణ వల్ల ఒకే వ్యక్తి మరోచోట వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుండదు.

సర్వే పూర్తి చేసిన ప్రతి ఇంటికి జనాభా లెక్కల తరహాలో ఒక లేబుల్‌ను అంటిస్తారు. ఇండ్లకు వెళ్లి నమోదు చేసిన ఫారాలను అదే రోజు సాయంత్రానికి మండల కేంద్రంలోని తహసీల్దార్లకు ఉద్యోగులు అందిస్తారు. వాటిని సీజ్ చేసి, డివిజన్ కేంద్రానికి అక్కడి నుంచి జిల్లా కేంద్రాలకు తరలిస్తారు. సర్వే పూర్తయిన తర్వాత సేకరించిన మొత్తం సమాచారాన్ని 30 రోజుల్లో కంప్యూటరీకరిస్తారు. డాటా కంప్యూటరీకణ కూడా జిల్లా కేంద్రంలో కలెక్టర్ పర్యవేక్షణలో జరుగుతుంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక సంఖ్యలో జనాభా, ఇళ్ళు ఉన్నందున ఈ రెండు జిల్లాల్లో సర్వే ఎప్పుడు నిర్వహించాలన్న అంశంలో కసరత్తు జరిగింది. వీలైతే అదే రోజు, లేదంటే మరో రోజు ఈ రెండు జిల్లాల్లో సర్వే నిర్వహించే అవకాశం ఉంది. సర్వే ఫారాలను కంప్యూటరీకరణకు అవసరమైతే ప్రైవేటు డాటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా ఏర్పాటు చేసుకోండని జిల్లా కలెక్టర్లకు సీఎం సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.