Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఒక్కటైన తెలంగాణ

-రాజకీయ పునరేకీకరణకు నాంది -టీఆర్‌ఎస్‌లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది ఎమ్మెల్సీలు -ఇవి రాజకీయ చేరికలు కావు.. బంగారు తెలంగాణ నిర్మాణానికే -రాజకీయ ఐక్యతను కొనసాగిద్దాం -రాజకీయ శక్తులు ఏకం కావాలని ప్రజలు కోరుకుంటున్నరు -విభజన మానని గాయమని బాబు గవర్నర్ చేత చెప్పించిండు -చీమునెత్తురుంటే వెంటనే బయటకు రావాలి -టీడీపీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు

KCR

రాష్ట్రం బాగుపడాలనే భావన, ప్రజలు సుఖశాంతులతో ఉండాలనే ఆలోచనతోనే వివిధ పార్టీలకు చెందిన పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లోకి వచ్చారని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇది చరిత్రలో అద్భుత సన్నివేశమని చెప్పారు. ఇవి రాజకీయ చేరికలు కావని స్పష్టం చేశారు. చిల్లర రాజకీయం అంతకన్నా కాదని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం తొలిసంధ్యలో జరుగుతున్న రాజకీయ పునరేకీకరణ మాత్రమేనని చెప్పారు. అందరం కలిసి తెలంగాణ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందామని పిలుపునిచ్చారు. రాబోయే విపత్కర పరిస్థితులను ఎదుర్కొందామని, రాష్ర్టాన్ని నిలబెట్టుకుందామని చెప్పారు. ప్రగతి ఫలాలు ప్రజలకు అందాలనే తపనతోనే మీరంతా ఇక్కడికి వచ్చారంటూ పార్టీలో చేరినవారిని అభినందించారు. బుధవారం తెలంగాణభవన్‌లో ఇద్దరు బీఎస్పీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్, టీడీపీ, టీచర్ ఎమ్మెల్సీలు మొత్తంగా 11మంది కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

ఈ సందర్భగా కేసీఆర్ పార్టీలో చేరిన వారి మెడలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాజకీయ పునరేకీకరణ జరగాలనే ఆలోచనకు ఇది నాంది పలికింది. వచ్చినవాళ్లు పదవుల కోసం రాలేదు. ఒకరికి ఐదేళ్లు, మిగిలిన ఎమ్మెల్సీలకు మూడేళ్లవరకు కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ బంగారు తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌లోకి వచ్చారు. తెలంగాణ గొప్పగా ముందుకు పోవాలని, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను చూసి నిర్ణయం తీసుకుని వచ్చారు. ఇదే ఐక్యతను కొనసాగించాలి అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం ఒక చరిత్రన్న కేసీఆర్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతర్ధానం అవడం కూడా ఒక చరిత్రేనని చెప్పారు. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాత్రం తన నిజస్వారూపాన్ని బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. మనం ఒకవైపు రాష్ట్రం వచ్చిందనే సంతోషంలో ఉన్నాం. ఈ గడ్డపై నిలబడి రాష్ట్ర విభజన అనేది మానని గాయం అని గవర్నర్‌తో చెప్పించాడు. మన ప్రజలు రాష్ట్రం వచ్చిందని ఆనందంగా ఉన్పపుడు అసెంబ్లీలో ఇంకా ఏం చెప్పించాడో మనకే తెలుసు. అవతలి ప్రభుత్వం దాడి చేస్తోంది. కసి, విద్వేషాన్ని బయటపెట్టుకుంటోంది.

జూన్ రెండుకు ముందు పోలవరం ఆర్డినెన్స్‌ను తెప్పించిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. మనం పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని చెప్పాం. డిజైన్ మార్చమన్నాం. కానీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియంతృత్వ ధోరణిలో తీర్మానం చేసింది. దీనికి కారకులు ఎవరో మనకు తెలుసు. ఇంతకు ముందు నాగార్జునసాగర్‌ను పోరంబోకు ప్రాజెక్టుగా వాడుకునేవాళ్లు. విద్యుత్ ఇవ్వం అంటున్నారు. చట్టంవేరు, ఒప్పందాలు వేరంటున్నారు. చట్టానికి వ్యతిరేకంగా పోతం అంటున్నారు. అని ఆయన చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. ఇంకా ఎన్నాళ్లూ ద్రోహపార్టీలో కొనసాగుతారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఎందుకుంటున్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు చీమునెత్తురు, తెలంగాణ పౌరుషం ఉంటే వెంటనే కలిసిరావాలి. వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆదర్శంగా తీసుకుని బయటకు రావాలి కేసీఆర్ పిలుపునిచ్చారు.

రాజకీయశక్తులు ఏకం కావాలి ఆంధ్రప్రదేశ్ మంత్రులు గవర్నర్ దగ్గరికి పోయి తమ పిల్లలకు కూడా తెలంగాణ ప్రభుత్వం స్కాలర్‌షిప్‌లు ఇప్పించాలని అడిగారని, దీంతో వాళ్లకు వాళ్లే తాము నాన్‌లోకల్ అని ఒప్పుకున్నైట్లెందని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఏమన్న అంటే ఇంట్లంటడా! అట్లంటడా! అని చిలువలు పలువలుగా చేసి మాట్లాడుతారు. అందుకే నేను నోరు విప్పడం లేదు. మౌనంగా పనిచేసుకుంటూ పోతున్నా. ప్రతిక్షణం తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే పనిచేస్తున్నా అని చెప్పారు. ఈ సమయంలో రాజకీయ శక్తులు ఏకంకావాలని తెలంగాణ సమాజం కోరుకుంటోందని కేసీఆర్ అన్నారు. తెలంగాణను ఎవరో తెచ్చి ఇవ్వలేదు. సుదీర్ఘంగా చేసిన పోరాటాల వల్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఆమోస్ పాత్ర గొప్పది. పోరాటంలో మీసా, నాసావంటి చట్టాలు ప్రయోగించారు. చివరికి ఉద్యోగం నుంచి తొలగించారు. అయినా తెలంగాణ కోసం కొట్లాడిన మొగోడు ఆమోస్ అని ప్రశంసించారు.

తెలంగాణ పచ్చబడాలంటే రాజకీయ శక్తులు ఏకంకావాలని, తెలంగాణ అభివృద్ధికి ఈ చేరికే నిదర్శనమని అన్నారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవని, అయినా తెలంగాణ బాగుపడాలని భావించి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిననాడు ఒంటరిగా బయలుదేరానని, కొందరైతే ఆరునెలల్లో పోతుందని, మరికొందరైతే పుబ్బలో పుట్టింది.. మఘలో పోతదని అన్నారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. కానీ టీఆర్‌ఎస్, కేసీఆర్ పోలేదని, అట్లా అన్నోళ్లే పోయారని అన్నారు. అనేక పోరాటాలు, దీక్షలు, ఉద్యమాల తరువాత ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో మన అస్తిత్వాన్ని, ఉనికిని నిలబెట్టుకున్నామని, ఇప్పుడే ప్రయాణం ప్రారంభమైందని తెలిపారు. కొత్తపాత నాయకులు అందరూ కలిసి ప్రజలతో ప్రయాణిస్తూ వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

పార్టీలో చేరింది వీరే: అదిలాబాద్ జిల్లా నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఆమోస్, భానుప్రసాద్, జగదీశ్వర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి, రాజలింగం, టీడీపీ ఎమ్మెల్సీలు బీ వెంకటేశ్వర్లు(మండలిలో టీడీపీ పక్ష నేత), సలీం, టీచర్ ఎమ్మెల్సీలు పూల రవీందర్, జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత సంజీవరెడ్డితో పాటు వివిధ పార్టీలకు చెందిన పలువురు జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆమోస్‌కు కేసీఆర్ మొదటి కండువాను కప్పారు.

విషం కక్కేవారిని ఎదుర్కోవాలి : కేకే బంగారు తెలంగాణ నిర్మాణం కోసం కేసీఆర్‌తో కలిసి పనిచేసేందుకు వచ్చిన వారికి స్వాగతం పలుకుతున్నామని టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు అన్నారు. తెలంగాణకు నిధుల అవసరం ఉందని, కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకుందామని అన్నారు. కొందరు తెలంగాణపై ఇంకా విషంగక్కుతున్నారని మండిపడ్డారు. నాలుగుకోట్ల మంది ప్రజలు కలిసి సవాళ్లను, విషంగక్కేవారిని ఎదుర్కొవాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఇప్పటికైతే కేసీఆరే ఏకవీరుడని అన్నారు. కేసీఆర్‌తోనే తెలంగాణ కలలు సాకారం అవుతాయని చెప్పారు.

కుట్రలు తిప్పికొట్టాలి : ఆమోస్ తెలంగాణపై ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని ఎమ్మెల్సీ ఆమోస్ పిలుపునిచ్చారు. బంగారు తెలంగాణ నిర్మించుకునే దశలో శత్రుశేషం లేకుండా చేయాలని చెప్పారు. బాబు తెలంగాణకు అన్యాయం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. కృష్ణా డెల్టాకు తాగునీటికి 10టీఎంసీల నీటిని తరలించుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకున్నదని, గురుకుల్ ట్రస్టు భూములను స్వాధీనం చేసుకోవడంవంటివి చూస్తుంటే సంతోషంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ నిర్మాణం సాధ్యమని, కేసీఆర్‌తో కలిసి పనిచేస్తామని తెలిపారు.

ఉద్యమాన్ని సజీవంగా ఉంచారు : ఇంద్రకరణ్‌రెడ్డి తెలంగాణ కోసం 65 ఏండ్లు ఉద్యమం జరిగిందని, కానీ కేసీఆర్ కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. తాము కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ తెలంగాణకోసం పోరాటంచేశామని, కానీ తమ హైకమాండ్ పట్టించుకోలేదని చెప్పారు. ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ఉద్యమాన్ని సజీవంగా ఉంచింది మాత్రం కేసీఆరేనని అన్నారు. తెలంగాణలోని అదిలాబాద్ జిల్లాలో తీవ్ర వెనుకబాటుతనం ఉందని, గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని, అనేక ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎంను కోరారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిందని, దీన్ని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు.

నోడల్ ఆఫీసర్లను నియమించాలి: కోనేరు కోనప్ప అదిలాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలూ వెనుకబడి ఉన్నాయని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. పంటలు నష్టపోయిన రైతులకు ఇంకా పరిహారం అందలేదని, పరిహారం ఇప్పించాలని కోరారు. అదిలాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లను నియమించాలని కోరారు. తెలంగాణలో 85% బడుగుబలహీన వర్గాలకు చెందినవారే ఉన్నారు కనుక వారికి మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెస్‌లో పోరాడింది ఎమ్మెల్సీలే : భానుప్రసాద్ కాంగ్రెస్‌లో ఉండి తెలంగాణ కోసం కొట్లాడింది కేవలం ఎమ్మెల్సీలేనని ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. తెలంగాణ కోసం తన జీవితాన్ని అర్పించింది ఎమ్మెల్సీ ఆమోస్ అని, 1969 నుండి ఉద్యమంలో కొనసాగింది జగదీశ్వర్‌రెడ్డి అని తెలిపారు. తాము పార్టీ మారింది కాంగ్రెస్‌కు, హైకమాండ్‌కు వ్యతిరేకంగా కాదన్నారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కృషి ఎంత ఉందో సోనియా కృషి కూడా అంతే ఉందన్నారు. అయినప్పటికీ బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తాము కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధమయ్యామని చెప్పారు. చంద్రబాబు రోజురోజుకు కయ్యానికి కాలుదువ్వుతున్నాడని, ఆయన్ను ఎదుక్కొనేందుకు కేసీఆర్‌ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతోనే తాము టీఆర్‌ఎస్‌లో చేరామని తెలిపారు.

కుట్రలు చూసి మనసు చలించింది : బీ వెంకటేశ్వర్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక ఇక అభివృద్ధి కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలని మండలిలో టీడీపీ పక్ష నేత బీ వెంకటేశ్వర్లు అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కలిగిస్తున్న ఇబ్బందులును చూసిన తరువాత తన మనసు చలించిపోయిందని చెప్పారు. ఇంకా తెలంగాణపై కక్షసాధింపులా? అని ఆలోచించుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని తెలిపారు. పోలవరం ఆర్డినెన్స్, పీపీఎల రద్దు వంటివి తెలంగాణపై ప్రయోగిస్తుంటే బాధకలిగిందని చెప్పారు. అందుకే బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగం పంచుకోవాలని భావించానని తెలిపారు.

మన రాష్ర్టాన్ని మనం అభివృద్ధి చేసుకుందాం : జనార్దన్‌రెడ్డి మనరాష్ర్టాన్ని మనమే అభివృద్ధి చేసుకుందామని, కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్‌నిర్మాణం సాధ్యమని ఎమ్మెల్సీ జనార్దన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ విద్యారంగంలో అభివృద్ధి అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కేజీ టూ పీజీ ఉచిత విద్య చాలా పెద్ద ఆలోచనన్నారు. కేసీఆర్ బంగారు తెలంగాణకు కలలు కన్నారని, విజన్‌తో ముందుకు వెళ్తున్నారని, ఆయన వెంట అన్ని వెళలా అందుబాటులో ఉండేందుకు పార్టీలో చేరామని చెప్పారు.

మైనార్టీలను గుర్తించిన పార్టీ : సలీం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ముస్లిం, మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వలేదని, కానీ కేసీఆర్ ముస్లింలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారని ఎమ్మెల్సీ సలీం అన్నారు. దేశంలో మైనార్టీలను గుర్తించిన పార్టీ కేవలం టీఆర్‌ఎస్ మాత్రమేనని, కేవలం డిప్యూటీ సీఎం పదవే కాకుండా కీలకమైన రెవెన్యూ కూడా ఇచ్చారని తెలిపారు. టీఆర్‌ఎస్ పూర్తిగా సెక్యూలర్ పార్టీ అని, తెలంగాణ పునర్‌నిర్మాణంలో కేసీఆర్ వెంట నడుస్తామని చెప్పారు.

క్రెడిట్ కేసీఆర్‌దే : పూల రవీందర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ పూర్తిగా కేసీఆర్‌దేనని ఎమ్మెల్సీ పూల రవీందర్ అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కేసీఆర్ వెంట నడిచే అదృష్టం తనకు దక్కిందని తెలిపారు. అసెంబ్లీలో, మండలిలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ మాట్లాడుతుంటే ఆ విషయాలు ఐఏఎస్‌లకు కూడా అవగాహనలేని పరిస్థితి ఉందని, అటువంటి వ్యక్తి చేతిలోతెలంగాణ ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.

భారీగా హాజరైన ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ నేతలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు సభకు అధ్యక్షత వహించారు. మంత్రులు జోగురామన్న, పద్మారావు, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, వినోద్, ఎమ్మెల్యేలు నల్లాల ఓదెలు, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కోవా లక్ష్మి, మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు స్వామిగౌడ్, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య, కరీంనగర్, మంచిర్యాల, అదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల అధ్యక్షులు హాజరయ్యారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.