-టీఆర్ఎస్లో జోరందుకున్న ప్రక్రియ -పార్టీ నేతలను సమన్వయం చేస్తున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యత్వ నమోదు జోరు పెంచింది. లక్ష్యం దిశగా నమోదు ప్రక్రియను పూర్తిచేయడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా కృషిచేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పర్యటిస్తూ చురుకుగా సభ్యత్వాన్ని చేయిస్తున్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్లోనూ సభ్యత్వ నమోదు చేపట్టాలన్న పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఏర్పాట్లుచేశారు.
http://enrol.trspartyonline.org వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని స్వీకరించేవిధంగా ఏర్పాట్లుచేసినట్టు కే తారకరామారావు ఆదివారం ట్విట్టర్లో తెలిపారు. ఆన్లైన్ ద్వారా సాధారణ, క్రియాశీల సభ్యత్వాలు రెండింటినీ పొందవచ్చు. సభ్యత్వం పొందాలనుకొనేవారు వారి పూర్తి వివరాలను నమోదు చేయడంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు, నెట్ బ్యాకింగ్, వ్యాలెట్ పేమెంట్స్, యూపీఐ, మొబైల్ పేమెంట్స్ ద్వారా సభ్యత్వ రుసుము చెల్లించడానికి వెసులుబాటు కల్పించారు. సాధారణ సభ్యత్వానికి రూ.30, క్రియాశీల సభ్యత్వానికి రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ముద్రించిన పుస్తకాల ద్వారా ఒక్కో నియోజకవర్గానికి 50 వేల సభ్యత్వాలను లక్ష్యంగా పెట్టుకొన్నారు.
ఈ నెల 10వ తేదీలోగా సభ్యత్వాలు పూర్తిచేయాల్సి ఉంది. ఇందుకోసం ఎమ్మెల్యేలు, సభ్యత్వ నమోదు ఇంచార్జీలు నియోజకవర్గాల్లో చురుకుగా పర్యటిస్తున్నారు. సభ్యత్వం పూర్తికాగానే కమిటీల ఎన్నిక ప్రక్రియను చేపట్టనున్నారు. గ్రామ పార్టీ శాఖ, అనుబంధ కమిటీలు, మండల కమిటీలను కూడా ఎన్నుకోనున్నారు. సభ్యత్వ నమోదు ఒకవైపు జరుగుతుండగా.. మరోవైపు సభ్యత్వాల డిజిటలీకరణ నడుస్తున్నది. కొత్త జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదును డిజిటలైజేషన్ చేస్తున్నారు. సభ్యత్వ నమోదును వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇంచార్జీలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. వారినుంచి సభ్యత్వానికి సంబంధించిన వివరాలు తెలుసుకొంటున్నారు. వీలైనంత త్వరగా సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని సూచిస్తున్నారు. సభ్యత్వ నమోదును పండుగలా జరుపాలని చెప్తున్నారు. ప్రజల నుంచి సభ్యత్వానికి స్పందన ఎలా వస్తుందనే విషయాన్ని అడిగి తెలుసుకొంటున్నారు. అన్ని వర్గాలవారికి పార్టీ సభ్యత్వం కల్పించేలా చూడాలని సూచిస్తున్నారు.