Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఒంటరిగానే పోతున్నం

– తెలంగాణకు ఇంటిపార్టీ కావాలి – పొత్తు వద్దని జానారెడ్డే లేఖ రాసిండు – 16 ఎంపీలు గెలిస్తే కేంద్రం మెడలు వంచుతం – హైదరాబాద్ చుట్టూ శాటిలైట్ టైన్‌షిప్స్ – మూడేళ్లలో 50లక్షల ఎకరాలకు సాగునీరు – తెలంగాణ విత్తన కార్పొరేషన్ ఏర్పాటు – అమరవీరుల కుటుంబాలకు రూ.10లక్షలు, ఉద్యోగం – టీన్యూస్‌లో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ విజన్

KCR in Tnews

స్వీయ రాజకీయ శక్తిగా ఎదగడం తెలంగాణకు అవసరం. ఆంధ్రాకు ఇచ్చినట్టు మాకూ స్పెషల్ కేటగిరీ ఇవ్వమని ప్రధానితో సహా ఎందరినో అడిగినా పట్టించుకోలేదు. రేపు 16 ఎంపీ సీట్లు మనకుంటే ప్రత్యేక కేటగిరీతో ఎక్సైజ్ డ్యూటీ, ఇన్‌కం టాక్స్ మినహాయింపులు, ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించుకోవచ్చు. ఎన్నికలని ఎవరెవరో వస్తరు. యూపీఏ చూడలేదా? ఎన్డీఏ చూడలేదా? ఎవరో వచ్చి బంగారం కిరీటం పెట్టరు.

మనను మనమే బాగుచేసుకోవాలె. మోసపోతుంటే మోసపోతూనే ఉంటం. 35 సీట్లువస్తె మళ్లీ కలుపుతం అంటున్నరు. అన్నీ చూడాలె.తెలంగాణకు ఇంటిపార్టీ కావాలి. ప్రవాసభారతీయలు తెలంగాణలో ఎలాంటి పాత్ర పోషించాలనేది నిర్ణయిస్తం. బాండ్స్ ఇష్యూ చేస్తాం. అమెరికా వెళ్తా. వివిధ దేశాల్లోని ఎన్‌ఆర్‌ఐలను పిలిచి ఏఏ ప్రాంతాల్లో ప్రాజెక్టులుపెట్టగలరో అడిగి నిర్ణయిస్తా. జానారెడ్డి టీఆర్‌ఎస్‌తో పొత్తు వద్దని సోనియాగాంధీకి ఉత్తరం రాసిండు. వారితో మనకు సంబంధం లేదు.మనం ఒంటరిగానే పోతున్నం. అని టీఆర్‌ఎస్ అధినేత కే.చంద్రశేఖర్‌రావు చెప్పారు. శనివారం టీన్యూస్ లైవ్‌షోలో ఆయన తెలంగాణ ఎలా ఉండాలి, ఏఏ కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై తన విజన్‌ను ఆవిష్కరించారు. అనేక గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కార్యక్రమంలో రాజకీయాలతో పాటు వివిధ రంగాలపై తన వైఖరిని సుస్పష్టంగా ప్రకటించారు. ఆయన ఆలోచనలు ఆయన మాటల్లోనే…

రాజకీయ అవినీతి జీరో చేస్తా.. మనకు రైల్వేలైన్లు చాలా తక్కువ వచ్చినయి. కేంద్రం మెడలు వచ్చి లైన్లు తెచ్చుకోవాలి. ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటే తెలంగాణకు రాజకీయ అస్థిత్వం సాధ్యమైతది. ముగ్గురు నలుగురు కేంద్ర మంత్రులుంటే కేంద్రం నుండి భారీగా నిధులు తెచ్చుకోవచ్చు. 16 ఎంపీలు మన చేతిలో ఉండాలి. అందుకు తెలంగాణకు ఇంటిపార్టీ కావాలి. అలాంటి పార్టీయే తెలంగాణను ఆద్భుతంగా అభివృద్ధి చేస్తుంది. దరిద్రపు కరెప్షన్ తెలంగాణలో ఉండదు. రాజకీయ అవినీతిని జీరో చేస్తా. ఉద్యోగులకు మంచి జీతాలు ఇచ్చి అవినీతి లేకుండా చూస్తా.

మోడీ బంగారు కిరీటం పెట్టడు.. చిరంజీవి తమ్ముడు కొత్త పార్టీ పెడుతడట. ఎవరెవరో వస్తారు ఎన్నికలప్పుడు. దేశం సంగతి తరువాత. యూపీఎను చూడలేదా? ఎన్డీయేను చూడలేదా? సినిమా యాక్టర్లను చూసి మోసపోవద్దు. మోడీ వచ్చి బంగారుకిరీటం పెడుతడని భ్రమ పడకండి. తెలంగాణ తనకేం కావాలో తెలుసుకుని ఓటేయాలి. ముద్దుకృష్ణమనాయుడైతే 35ఎంపీలు చేస్తే మళ్లీ ఆంధ్రప్రదేశ్ చేస్తం అంటున్నడు. నవ్వేవారి మందు జారిపడొద్దు. త్వరలో అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తాం. ఉద్యమంలో పాల్గొన్న వారికే టికెట్లు ఇస్తాం.

హైదరాబాద్ పక్క మరో హైదరాబాద్.. హైదరాబాద్‌కు శాటిలైట్ టౌన్‌షిప్స్, ఎక్స్‌ప్రెస్‌హైవేలు, స్పీడ్ ట్రైన్స్‌ను అందుబాటులోకి తెస్తాం. ఎడ్యుకేషన్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, ఫార్మాసిటీ డెవలప్ చేస్తం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి. రాబోయే 15-20 సంవత్సరాల్లో 50 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. వారి కుటుంబ సభ్యులతో కలిపి రెండుకోట్ల మంది అదనంగా వస్తారు. వారికి నీరు, విద్యుత్‌పై మాకు ప్రణాళికలు ఉన్నాయి. మాకు ఒక విజన్ ఉంది. ఆ విజన్‌ను అమలు చేస్తాం. రియో నగరం చెత్తకుప్పలా ఉండేది. ఆ నగర మేయర్ వచ్చిన తరువాత నేడు రియో నగరం ప్రపంచంలోనే నెంబర్‌వన్ సిటీగా మారింది.

మూడేళ్లలో 50లక్షల ఎకరాలకు సాగునీరు తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో 28 ఆర్బన్ నియోజకవర్గాలున్నాయి. వీటికి తాగునీరు చాలు. కడెం, నిజాం సాగర్, జూరాల, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ద్వారా కవరైనవి 25. మిగిలినవి 72 ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు రావాలి. ప్రణాళికలు ఉన్నాయి. గోదావరిలోనీళ్లున్నాయి. ప్రాజెక్టులు కడుతం. కాకతీయ రెడ్డిరాజులు గొలుసుకట్టు చెరువులు నిర్మించారు. లక్షపైగా చెరువులు ఉండేవి. పాత మైనర్ ఇరిగేషన్ సిస్టమ్ తిరిగి రావాలి. చెరువులు కడుతం. కడెం మీద 30 టీఎంసీల నీళ్లు వృథా అవుతున్నాయి. 5 టీఎంసీల ప్రాజెక్టులు కడితే అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయి. లోయర్‌ పెనుగంగ పూర్తయితే వరద ముప్పు తగ్గుతుంది

మరో 11, 12 మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల కడితే సమస్య పోతుంది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అయ్యేదికాదు… పోయ్యేది కాదు. గోదావరిలో కేటాయించిన నీళ్లు రావాలంటే ఎంతో కరెంటు కావాలి. పాలకులు ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్ పెట్టారు. ఈ పెండింగ్‌లను పూర్తిచేస్తం. గోదావరిలోని నీళ్లను కృష్ణా నీళ్లను హైదరాబాద్‌కు తెస్తం.సింగూరు ఫ్రీ అవుతుంది. కాంతనపల్లి, దేవాదుల 50 టీఎంసీల ప్రాజెక్టులు రావాలి. నిజమాబాద్‌లో రెండు కాల్వలు పెండింగ్‌లో ఉన్నాయి. సింగూరు ఆయకట్టు పెంచాల్సి ఉంది. నిజాం సాగర్‌ వద్ద మత్తడి పూర్తిచేస్తే మరింత సాగుభూమికి నీరు వస్తుంది. ఖమ్మంలో దుమ్ముగూడెంతో సస్యశ్యామలం అవుతుంది.

కృష్ణాలో మన వాటా తీసుకుంటే నల్గొండ ఫ్లోరైడ్ బాధ, పాలమూరు కరువు పోతది. జూరాల నుండి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కడితే సంపూర్ణంగా నీళ్లు వస్తాయి. నల్గొండ పశ్చిమానికి, హైదరాబాద్‌కు, రంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు నీరు వస్తుంది. గోదావరి అనుబంధంగా ఉన్న ప్రాణహిత, ఇంద్రావతి, శబరి నదులకు చెక్‌డ్యాంలు కడితే ఎంతో నీరు ఆగుతుంది. మరో కోటి ఎకరాలకు నీరురావాలి. త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను ముందుగా కడుతం. చిన్నచిన్నవి కడితే సాగునీరు అందడం ప్రారంభం అవుతుంది. జూరాల టూ పాకాల కాలువ తవ్వాలని అనుకుంటున్నం.

విత్తన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తం తెలంగాణ ఎంతో అదృష్టవంతమైన ప్రాంతం. విత్తన ఉత్పత్తి అనుకూల ప్రాంతాలు దేశంలో రెండుమూడు ఉంటయి. తెలంగానలో నల్ల, ఎర్ర, తేలికపాటి, ఇసుక నేలలున్నాయి. రైతులను లక్షాధికారులను చేసే అవకాశం ఉంది. ఎక్స్‌టెన్సన్ అధికారులు కనిపించడం లేదు. ఆ శాఖ అధికారులు పెరగాలి. అధునాతన పద్ధతులు పెరగాలి. కమతాల ఏకీకరణ జరగాలి. రైతులకు రిజిస్ట్రేషన్ ఫ్రీ ఉండాలి. మంచి పంటలు పండించినా అమ్ముకోవడం తెలియని రైతులున్నారు. నా వ్యవసాయ క్షేత్రంలో క్యాప్సికమ్ వేసిన. 20 మంది రైతులను కౌన్సిలింగ్ చేస్తే ఒక్కరే ముందుకు వచ్చిండు. గ్రీన్ హౌస్ కల్టివేషన్ ఉండాలి. 80శాతం సబ్సిడీ ఇవ్వాలనే ఆలోచన ఉంది. క్రాప్‌ కాలనీలు డెవలప్ చేస్తాం. ఏ జిల్లాల ఏ విత్తనం, ఏ పంట వేయాలో నిర్ణయిస్తం.తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ పెట్టి దేశానికే విత్తనాలు సరఫరా చేయొచ్చు. వ్యవసాయంలో మాడ్రనైజేషన్ రావాలి.

ముంపు గ్రామాల తరలింపు ఇల్లీగల్.. ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతే మాకు అభ్యంతరం లేదు. శబరి నది నీళ్లు సముద్రానికి పోయేకంటే ఆంధ్రకు పోతే మంచిదే. అయితే గిరిజనులను ముంచి పాపికొండల ప్రకృతిని చంపి నీళ్లను తీసుకుపోవడం సరైంది కాదు. పోలవరం ఆపుతున్న అపప్రదను కూడా నాపై పెట్టారు. తెలంగాణ బిల్లు గజిట్ వచ్చిన తరువాత ఏడు మండలాలను ఆంధ్రలో కలపడం ఇల్లీగల్. న్యాయ పోరాటం చేస్తాం. రాష్ట్రపతికి ఉత్తరం కూడా రాసిన. ఆర్డినెన్స్‌ను ఆమోదించొద్దని కోరిన.

మూడేళ్లలో తెలంగాణలో మిగులు విద్యుత్ తెలంగాణకు విద్యుత్ సమస్య ఉంటుంది. ఇప్పుడున్నట్లే రెండేళ్లు తప్పదు. 2200మెగావాట్లు మాత్రమే ఉంది. మణుగూరులో పెట్టాల్సిన దాన్ని విజయవాడలో పెట్టారు. 1300 మెగావాట్లు ఈ యేడాది చివర్లో, భూపాలపల్లి నుండి 700 రాబోతోంది. తెలంగాణకు ఐటీఐఆర్ వచ్చినంక వారికి రెండున్నరనుండి మూడున్నర వేల మెగావాట్ల విద్యుత్ నిరంతరం కావాలి. గ్యారెంటీ ఉంటేనే ఐటీఐఆర్‌ వస్తుంది. పవర్‌ ఫైనాన్స్ కార్పోరేషన్ ఉంటుంది. దీని నుండి లోన్ తీసుకుని జనరేటింగ్ స్టేషన్లు పెడుతం. మూడు సంవత్సరాల్లో మిగులు రాష్ట్రంగా కావాలనేది లక్ష్యం. 10 జనరేటింగ్ స్టేషన్లు రావాలి. ఒక్కొక్క స్టేషన్‌లో 1200మెగావాట్లు వస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ నుండి నాలుగువేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి బిల్లులో చేర్చింది. దీన్ని తెలంగాణకే ఇవ్వాలని కోరుతం. దీంతో 20వేల మెగావాట్లకు చేరుతం. ప్రైవేటు పవర్ ప్రాజెక్టులు ఉండవు.

విద్య అభివృద్ధి నాకున్న పెద్ద కల కేజీ టూ పీజీ నిర్భంధ ఉచిత విద్య అనేది నాకున్నపెద్ద కల. పిల్లలను ప్రపంచ పౌరులుగా తయారు చేస్తం. 2000 పాఠశాలలు వస్తాయి. దీనిలో 40 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారు. అమెరికాలో అధ్యక్షుడి బిడ్డ కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటుంది. మన దగ్గర కూడా అలాంటి ఎడ్యుకేషన్ రావాలి. దీన్ని విజయవంతం చేస్తే తెలంగాణకున్న సర్వదరిద్రాలు పోతాయి. విశ్వవిద్యాలయాలు మానవ వికాస కేంద్రాలు. తెలుగుదేశం సెల్ఫ్‌ఫైనాన్స్ విధానం తెచ్చింది. గ్రాంట్స్‌ను ఆపేయడం వల్ల యూనివర్సిటీలు దెబ్బతిన్నయి. ప్రభుత్వ గ్రాంట్ పెంచాలి. ఉస్మానియాలో చదివిన డాక్టర్లు విదేశాల్లో ఉన్నారు. ఉస్మానియా ఖ్యాతి మళ్లీ పెరగాలి.

ఉద్యోగులకు కేంద్రం స్థాయి వేతనాలు ఉద్యోగులు 1969 పోరాటంతో పాటు నేటి తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ ఇస్తం. కేంద్ర ప్రభుత్వ స్థాయి వేతనాలు ఇస్తం. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూరితంగా ఉంటుంది. సిద్దిపేటలో ఒక్కరోజు ఒక్క ఉద్యోగిని మాట అనలేదు. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగాలు ఉండవు. అవసరం అనుకుంటే రిక్రూట్ చేసుకో. లేకుంటే వద్దు. అంగన్‌వాడీ, ఆశా వర్కర్ వంటివారి అవసరం ఉంది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం.

ఏజ్‌బార్ అయిన వారిని కూడా ఉద్యోగులుగా చూస్తాం. ప్రభుత్వ ఉద్యోగి అతన్ని పోస్టు చేసిన తరువాత మూడు సంవత్సరాలు అక్కడే పనిచేయాలి. ఎమ్మెల్యే, ఎంపీలకు కోపం వస్తే బదిలీ ఉండొద్దు. సీఎస్ చూసుకోవాలి. ఉద్యోగులను నమ్మాలి. ప్రకృతి విపత్తులు వస్తే అర్థరాత్రులు కూడా ఉద్యోగులు పనిచేస్తారు. అధికార వికేంద్రీకరణ జరగాలి. పాలకులకు పొగరు ఎక్కువ ఉంటుంది రూలింగ్ పార్టీ అనే విధానమే తప్పు. పత్రికలు కూడా భాష మార్చుకుని సర్వింగ్ పార్టీగా చూడాలి. మా ఏకే గోయల్ తయారు చేసిన విధానం ప్రకారం ఐదు నియోజకవర్గాలకు ఒక జిల్లా చొప్పున 24 జిల్లాలు వస్తాయి. ప్రజలకు వైద్యం ప్రభుత్వ బాధ్యత. ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను డెవలప్ చేయాలి. నియోజకవర్గ కేంద్రంలో ఏరియా ఆస్పత్రి ,జిల్లా కేంద్రంలో ఒక అపోలో, నిమ్స్‌లాంటి ఆస్పత్రి రావాలి. 24 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు 24 జిల్లాల్లో వస్తాయి. 104 పునరుద్ధరిస్తాం.

మైనార్టీలు, దళితులు, బీసీలకు.. మైనార్టీలను చాలా పార్టీలు ఓటుబ్యాంకుగా వాడుకున్నాయి. మొత్తం బడ్జెట్‌లో ఒక్కశాతం కూడా ఇవ్వడం లేదు. దేశంలో 20శాతం మంది ముస్లింలు ఉన్నారు. ప్రధాన మంత్రికి కూడా ప్రతిపాదనలు చేశా. ఒక కమిటీ వేయాలని కోరిన. తరువాతే సచార్ కమిటీ వేశారు. చాలా మంచి రిపోర్టు ఇచ్చింది. జనాభాకనుగుణంగా బడ్జెట్‌ను ఇస్తాం. టీఆర్‌ఎస్ సెక్యూలర్ పార్టీ. ఉర్దూ బాషను పెంపొదిస్తాం. ముస్లిం శాఖ సీఎం వద్ద పెట్టి డెవలప్ చేస్తాం. దళితులకు ఎన్నో చేశాం అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి. కానీ ఏం జరగలేదు. ఏ ఊళ్లో అయినా దళితులే నిరుపేదలే. 100శాతం దళితులకు 10వేల కోట్లు కేటాయిస్తా. వాల్మీకి బోయలను ఎస్టీల్లో చేర్చాల్సి ఉంది.

మా తండాలో మా రాజ్యం నినాదం ప్రకారం తండాలను గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేస్తం. ప్రభుత్వం వచ్చిన వారం రోజుల్లో జీవోలు జారీ అయ్యేలా చూస్తం. గల్ఫ్‌బాధితుల కష్టాలు తీరాలి. దీనికి ఒక మంత్రిత్వ శాఖ పెట్టాలి. బీసీల జనాభా ఎక్కువ. దళితుల కంటే కూడా వెనకబడిన వారున్నారు. చేనేత కార్మికులది పెద్ద సమస్య. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తమిళనాడులో తిరుపూరు అనేది ఉంది. అక్కడున్న వ్యవస్థ తెలంగాణలో రావాలి. బట్టల మిల్లులు ఉండాల్సిందే. ప్రత్యామ్నాయాలు తీసుకురావాలి.

అమరుల కుటుంబాలకు రూ.10లక్షలు శ్రీకాంతచారి చనిపోయినప్పుడు ఏడ్చిన. పోయిన వారి కుటుంబాలను గౌరవించుకోవాలి. అమరుల కుటుంబాలకు 10లక్షల రూపాయలు అందజేస్తం. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కల్పిస్తం. తెలంగాణ ఫార్మేషన్ డే రోజున చిరస్థాయిగా గౌరవించేలా ప్రతి జిల్లాలో అమరవీరుల స్తూపం కట్టించాలి. జిల్లామంత్రి ఎంపీ, ఎమ్మెల్యేలు అమరవీరులకు శ్యాల్యూట్ చేయాలి. ఆ తరువాతే అధికారిక కార్యక్రమాలు మొదలు కావాలి. వృద్ధులకు, వితంతువులకు వెయ్యి, వికలాంగులకు 1500ఇస్తం. నిజాం షుగర్స్‌ను 100శాతం వెనక్కి తీసుకుంటాం.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.