– వినాయక నిమజ్జనంలా నిర్వహిస్తాం – నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు – పత్రిక, మీడియా ప్రముఖులతో సమావేశం – విజయవంతానికి సహకరించాలని విజ్ఞప్తి – ప్రజా భాగస్వామ్యం పెంచే కథనాలివ్వాలని సూచన – పథకం విజయవంతానికి సలహాల స్వీకరణ

గణేశ్ నిమజ్జనోత్సవంలో ప్రతి ఊళ్లో చిన్నా, పెద్దా ఎలా ఉత్సాహంగా పాల్గొంటారో మిషన్ కాకతీయను కూడా అలాగే నిర్వహిస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు చెప్పారు. దీనిని ఒక ప్రజా ఉద్యమంగా మలుస్తున్నామని అన్నారు. కార్యక్రమం విజయవంతానికి మీడియా తనదైన పాత్ర పోషించాలని విజ్ఞప్తిచేశారు. మంగళవారం నగరంలోని ఒక హోటల్లో వివిధ పత్రికలు, టీవీ చానళ్ల సంపాదకులు, సీఈవోలు, బ్యూరో చీఫ్‌లు, ప్రముఖ పాత్రికేయులతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణను సస్యశ్యామలం చేసేది ఈ మిషన్ కాకతీయ… దీనివల్ల 265 టీఎంసీల నీటిని నిల్వచేయడమేకాకుండా, 46,531 చెరువులను పునరుద్ధరించడంద్వారా అనేక లాభాలుంటాయి. గ్రామ ప్రజలందరి భాగస్వామ్యం ఉంటుంది. పూడిక తీసే కార్యక్రమం ఊరి పండుగలా ఉంటుంది. బతుకమ్మలు, డప్పులతో ప్రజలంతా కలిసివచ్చి ఇందులో పాల్గొనేలా చూస్తున్నాం. ఒకవిధంగా గణేశ్ నిమజ్జనంలా గ్రామంలోని చిన్నాపెద్దా అందరూ పాల్గొనేలా చేస్తున్నాం అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగేలా, లోటుపాట్లకు, అవినీతికి ఆస్కారం లేకుండా చూడటంలో మీడియా పాత్ర ఎంతైనా ఉందన్నారు. దీనిపై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. చెరువుల్లోని సారవంతమైన మట్టిని చేలల్లో వేసుకుంటే రైతుకు అనేక లాభాలున్నాయని అన్నారు. ఇక్రిశాట్ శాస్త్రవేత్తలు కూడా దీనిని నిరూపించారని చెప్పారు. ఈ మట్టికోసం రూపాయి పెట్టుబడి పెడితే రూ.1.44 లాభం వస్తుంది.
రసాయన ఎరువుల భారం గణనీయంగా తగ్గుతుంది. పంట దిగుబడి 35% వరకు పెరిగే అవకాశం ఉంది. చెరువుల్లో నీరు నిలిస్తే చుట్టుపక్కల బావులు, బోర్లలో నీటిమట్టం పెరుగుతుంది అని హరీశ్ అన్నారు. కబ్జాలను అడ్డుకునేందుకు సోషల్ ఫెన్సింగ్‌ను విడతల వారీగా చేపడతామని తెలిపారు. వరంగల్ జిల్లాలో పైలాన్‌ను కేంద్రమంత్రి చేతులమీదుగా ఈ నెలాఖరులోగానీ, వచ్చేనెల మొదటి వారంలోగానీ ఆవిష్కరింపజేస్తామన్నారు. మిషిగాన్ యూనివర్సిటీ సుమారు లక్ష డాలర్లను కేటాయించి, నలుగురు రిసెర్చ్ స్కాలర్లను ఈ కార్యక్రమంపై అధ్యయనం చేయడానికి పంపించిందని వెల్లడించారు. నాబార్డు, కేంద్రం, ప్రపంచబ్యాంకు, జపాన్ తదితర సంస్థలు, దేశాలనుంచి వచ్చే నిధులతో, ఐదేండ్లలో సుమారు రూ.22వేలకోట్లతో 46 వేలకుపైగా చెరువులను పునరుద్ధరించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
పలువురు పత్రికా సంపాదకులు, సీఈవోలు, ముఖ్యులు మాట్లాడుతూ.. నిధుల ఖర్చు, టెండర్ల ఖరారు, రాజకీయ జోక్యం, పనుల పర్యవేక్షణ, నిఘా తదితర అంశాలపై సందేహాలను వ్యక్తంచేశారు. దీనిపై హరీశ్‌రావు స్పందిస్తూ.. అలాంటి లోటుపాట్లకు, అనుమానాలకు, అక్రమాలకు తావులేకుండా చూస్తున్నామని చెప్పారు. మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించి, ప్రజల భాగస్వామ్యం మరింత పెంచేలా చూడాలని కోరారు. చెరువుల నుంచి వచ్చే సారవంతమైన మట్టిని పెద్ద ఎత్తున రైతులు తీసుకెళ్ళేలా వారికి స్ఫూర్తి కలిగించే కథనాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మీడియా కథనాలకు బహుమతులు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ముఖ్యులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. మిషన్ కాకతీయ విజయవంతంలో తమ భాగస్వామ్యం ఉంటుందని హామీఇచ్చారు.
సమావేశంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్, టీవీ 5 ఎడిటర్ అరుణ్‌సాగర్, టీవీ9 సీఈవో రవిప్రకాశ్, పాత్రికేయులు శ్రీనివాసరెడ్డి, హష్మి, తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకులు మల్లేపల్లి లక్ష్మయ్య, కవి జూలూరి గౌరీశంకర్ తదితరులతోపాటు నీటిపారుదల శాఖ సలహాదారు విద్యాసాగర్‌రావు, ఈఎన్సీలు విజయ్‌ప్రకాశ్, మురళీధర్‌రావు, మైనర్ ఇరిగేషన్ సీఈలు రామక్రిష్ణారావు (క్రిష్ణా బేసిన్), రమేష్ (గోదావరి బేసిన్), పలువురు మీడియా ప్రతినిధులు, బ్యూరో చీఫ్‌లు పాల్గొన్నారు.