-యాసంగి మాదిరిగా ఈ సీజన్లోనూ కొనుగోళ్లు -రైతు వద్దకే ఏజెన్సీలు.. గ్రామాలవారీగా కేంద్రాలు -వడ్లకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.1,888 -రైతులంతా ఒకేసారి మార్కెట్లకొస్తే ఇబ్బందులు -మొత్తం కంది పంటనూ ప్రభుత్వమే కొంటుంది -ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్

కరోనా ముప్పు ఇంకా తొలిగిపోలేదు.. రైతులంతా ఒకేసారి పంట తీసుకొని మార్కెట్లకు వస్తే మహమ్మారి బారినపడే ప్రమాదం ఉన్నది. యాసంగి మాదిరిగా వానకాలం వడ్లనూ గ్రామాల్లోనే కొనుగోలుచేస్తాం. కందిపంట మొత్తాన్నీ ప్రభుత్వమే కొంటుంది. పంట పైసలు వెంటనే చేతిలో పడితే రైతు సంతోషానికి హద్దులుండవు. యాసంగిలో 9.68 లక్షల రైతుల నుంచి 65 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. దీని విలువ రూ.12వేల కోట్లు. ఈసారీ ధాన్యం డబ్బును వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేసుకోవాలి. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
వానకాలం వరి కోతకు సిద్ధమవడం.. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగని నేపథ్యంలో వడ్ల కొనుగోలుపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లోనే కాంటాలు ఏర్పాటుచేసి.. యాసంగి మాదిరిగానే వానకాలం వడ్లను కూడా కొనుగోలు చేస్తామని ప్రకటించారు. గ్రామాలవారీగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. పంటలను అమ్ముకొనేందుకు రైతులెవరూ మార్కెట్లకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఏజెన్సీలే రైతు వద్దకు వచ్చి కొనుగోలు చేస్తాయని స్పష్టంచేశారు. వానకాలం ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో మంత్రులు, అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. కరోనా కారణంగా రైతుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పంట కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించామని సీఎం కేసీఆర్ తెలిపారు. గ్రేడ్-ఏ రకం వడ్లకు క్వింటాల్‌కు రూ.1,888, గ్రేడ్-బీ రకానికి రూ.1,868 మద్దతు ధరను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పారు. వడ్లలో తేమశాతం 17కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండబెట్టి, తాలు లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని, లేదంటే మద్దతు ధర పొందలేరని అన్నారు. పంట అమ్మిన వెంటనే సంబంధించిన పైసలను రైతు ఖాతాలో వేసేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
ధాన్యం దిగుబడిపై అంచనాలు సిద్ధం చేయండి ఓవైపు విస్తారమైన వర్షాలు, మరోవైపు నియంత్రిత సాగు విజయవంతంతో 52.77 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయిందని.. ఈ నేపథ్యంలో ఈసారి ధాన్యం దిగుబడిపై పక్కాగా అంచనాలు వేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధాన్యం భారీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందుకెళ్లాలని, మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. ఈ సీజన్లో ముందుగానే వర్షాలు కురవడం, కాళేశ్వరం జలాలు అందుబాటులో ఉండటంతో రైతులు త్వరగా వరినాట్లు వేశారన్న సీఎం.. ఈ నెలాఖరుకల్లా కోతలు జోరందుకోనున్నాయని చెప్పారు. నెలాపదిహేను రోజులపాటు వరికోతల సీజన్ ఉంటుందని, అందుకు అనుగుణంగా గ్రామాల్లో కేంద్రాలు ఏర్పాటు, అక్కడ సౌకర్యాలపై వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పడావు భూములు సాగులోకి.. రాష్ట్రంలో నీటిసౌకర్యం పెద్దఎత్తున అందుబాటులోకి వస్తుండటంతో పడావుగా ఉన్న భూములన్నీ సాగులోకి వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు ప్రస్తుత సాగు విస్తీర్ణమే ఉదాహరణ అన్నారు. గత సీజన్లో 1.22 కోట్ల ఎకరాల్లో పంటలు వేస్తే, ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో సాగయ్యాయని చెప్పారు. సాగునీటి సౌకర్యానికి ప్రభుత్వ పెట్టుబడిసాయం కూడా తోడుకావడంతో పట్నాలకు వలసవెళ్లిన రైతులు గ్రామాలకు తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారని, ఇది తనకెంతో సంతోషాన్ని కలిగిస్తున్నదని కేసీఆర్ అన్నారు. కరోనాకాలంలో పట్టణాల్లో ఉపాధి కరువై ప్రజలందరూ పల్లెబాట పట్టారని, వారంతా ఎవుసంవైపు మళ్లడం హర్షణీయమని చెప్పారు. భవిష్యత్‌లో భారీస్థాయిలో పంటలు సాగయ్యే అవకాశమున్నదని, అందుకు అనుగుణంగా పంటల దిగుబడి కూడా భారీమొత్తంలో పెరుగుతుందని కేసీఆర్ అన్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాలశాఖ కీలకంగా మారనున్నదని తెలిపారు. పంటల కొనుగోలుకు సంబంధించి పౌరసరఫరాలశాఖ మరింత బలోపేతం కావాల్సిన అవసరమున్నదని చెప్పారు. సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్‌రావు, సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మార్క్‌ఫెడ్ చైర్మన్ మారం గంగారెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, సివిల్ సప్లయీస్ కమిషనర్ అనిల్‌కుమార్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు తదితరులు పాల్గొన్నారు.
నియంత్రిత సాగు సక్సెస్ నియంత్రిత సాగులో భాగంగా రైతులు ప్రభుత్వం చెప్పిన విధంగానే పంటలు వేశారని, కందిపంటను విస్తృతంగా సాగుచేయాలని సూచిస్తే రైతులు అదేవిధంగా చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతంలో 7.38 లక్షల ఎకరాల్లో కంది సాగైతే.. ఈసారి 10.78 లక్షల ఎకరాల్లో వేశారని, ఇది అభినందనీయమని అన్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా మొత్తం కందులను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని హామీఇచ్చారు.