Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఊరూరా చెరువుల దీక్ష

– చెరువుల పునరుద్ధరణతో పల్లెల్లో వెలుగు – పూడికమట్టితో అదనంగా పంట దిగుబడులు -భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు – కుంటపల్లిలో టీయూడబ్ల్యూజే, జేఏసీ శ్రమదానం -మిషన్‌కు వీఆర్వోల సంఘం రూ.60 లక్షల అందజేత

Harish Rao takes part in Mission kakatiya in warangal district

చెరువుల పునరుద్ధరణకు ఊరూరా చెరువుల దీక్ష చేపట్టాలని భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రజలకు పిలుపునిచ్చారు. దీక్షతో చెరువులను పునరుద్ధరించుకోవటం ద్వారా పల్లెల్లో వెలుగు నింపాలని కోరారు. మిషన్ కాకతీయలో భాగంగా ఆదివారం మంత్రి హరీశ్‌రావు వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలోని ఊరకుంట పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, పార్లమెంటరీ సెక్రటరీ దాస్యం వినయ్‌భాస్కర్, ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక జేఏసీ జిల్లా చైర్మన్ పరిటాల సుబ్బారావు పూడికతీతలో పాల్గొన్నారు. జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో టీఎన్జీవోలు, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు కుంటపల్లిలోని ఊరకుంటలో మంత్రితో కలిసి శ్రమదానం చేశారు. రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.

పునరుద్ధరణతో చెరువులకు పూర్వవైభవాన్ని తీసుకురావటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. పూడిక మట్టిని పంట భూముల్లోకి తరలించటం వల్ల రైతులు ఎరువులు, పురుగు మందులు వాడాల్సిన అవసరం ఉండదని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను పొందవచ్చన్నారు. పూడిక మట్టితో దాదాపు ముప్పై శాతం వరకు పంట దిగుబడులు పెరుగుతాయన్నారు. చెరువుల పునరుద్ధరణ వల్ల రైతులతోపాటు చాకలి, మత్స్యకారులు, గీత కార్మికులు, జీవాల పెంపకందారులు ప్రయోజనం పొందుతారన్నారు.

సకల జనులు హనుమాన్, అయ్యప్ప భక్తుల మాదిరిగా యాభై రోజుల చెరువుల దీక్ష చేపట్టి మిషన్ కాకతీయను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. గతంలో కాంట్రాక్టర్లు తమ జేబులు నింపుకున్నారని, తమ ప్రభుత్వం సకల జనుల కడుపు నింపటమే లక్ష్యంగా పనులు నిర్వహిస్తున్నదని స్పష్టంచేశారు. చెరువు పనులకు చేయూతనిస్తున్న టీయూడబ్ల్యూజే, జేఏసీలకు అభినందనలు తెలిపారు. టీయూడబ్ల్యూజే వరంగల్ జిల్లా కమిటీకి హరీశ్‌రావు రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి ప్రకటించారు. మిషన్ కాకతీయకు తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రతినిధులు తమ సంఘం సభ్యుల రెండు రోజుల వేతనం రూ.60 లక్షల చెక్కును హరీశ్‌రావుకు అందజేశారు.

MLA Gadari kishore takes part in Mission Kakatiya programme in Nalgonda district

రైతుల రుణాలను వడ్డీతో చెల్లిస్తాం: డిప్యూటీ సీఎం కడియం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను వడ్డీతో సహా తామే చెల్లిస్తామని కడియం శ్రీహరి వెల్లడించారు. బ్యాంకర్స్ ఎవరైనా రుణం చెల్లించాలని అడిగితే తమ దృష్టికి తేవాలని కోరారు. రైతుల ఆత్మహత్యలు ఆపటానికి ప్రభుత్వం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న లక్ష లోపు రుణాలను మాఫీ చేయనున్నట్లు ప్రకటించిందని గుర్తుచేశారు.

రుణమాఫీలో భాగంగా ఇప్పటికే గతేడాది రూ.4,250 కోట్లు విడుదల చేశామని, త్వరలోనే మరో రూ.4,250 కోట్లు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా, అర్బన్ అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, ఎన్ నరేందర్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎం భిక్షపతి, టీయూడబ్యూజే నేతలు క్రాంతికుమార్, లెనిన్, పీవీ కొండల్‌రావు, వెంకట్, అనిల్, జేఏసీ నేతలు రాజేశ్‌కుమార్, జనన్మోహన్‌రావు, రత్నవీరాచారి పాల్గొన్నారు. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం చెరువు పనులను ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిషోర్ ప్రారంభించారు.

కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. కట్టంగూర్ మండలం అయిటిపాములలో ఎమ్మెల్యే వేముల వీరేశం, జేఏసీ చైర్మన్ జీ వెంకటేశ్వర్లు, పందిరి వెంకటేశ్వరమూర్తితో పాటు పలువురు జేఏసీ నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలో ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, సైదాపూర్, ఎల్కతుర్తి మండలాల్లో పార్లమెంటరీ కార్యదర్శి వీ సతీశ్‌కుమార్, కథలాపూర్ మండలంలో జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ పనులను ప్రారంభించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.