Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఊరూరా పండుగే

-మువ్వన్నెల రెపరెపల నడుమ తెలంగాణపై వెలుగురేఖలు -స్వాతంత్య్ర దినోత్సవాన.. రాష్ట్ర ప్రజలకు సర్కారు కానుకలు -కంటివెలుగుతో ప్రజలందరికీ ఉచిత పరీక్షలు -మెదక్ జిల్లా మల్కాపూరులో ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ -అన్నదాతకు అండగా రైతుబంధు జీవితబీమా -బీసీ యువతకు సబ్సిడీ రుణాలు -ప్రతి పల్లెకు భగీరథ బల్క్‌వాటర్ -గ్రామాల్లో పరిశుభ్రతకు శ్రమదానం -రాష్ట్రవ్యాప్తంగా నేడే ప్రారంభం

పంద్రాగస్టు! ఆంగ్లేయుల వలసపాలనకు భారతదేశం చెల్లుచీటీ ఇచ్చిన రోజు! భారతావని స్వేచ్ఛావాయువులు పీల్చిన చారిత్రాత్మక రోజు! ఈ పంద్రాగస్టు.. తెలంగాణ చరిత్రలో నవశకాన్ని లిఖిస్తున్న రోజు! అరవై ఏండ్ల ఆంధ్ర వలసపాలన సంకెళ్లు తెంచుకుని తనను తాను పునర్నిర్మించుకుంటున్న తెలంగాణ.. తన భావితరానికి బంగారు రాష్ట్రాన్ని  అందించేందుకు పునాదులేస్తున్న శుభతరుణం! డెబై రెండో స్వాతంత్య్ర దిన వేడుకల్లో మువ్వన్నెల జెండా రెపరెపల నడుమ తెలంగాణపై వెలుగురేఖలు ప్రసరించనున్న అపురూప సందర్భం! దేశంలో.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో ఒక రాష్ట్ర ప్రభుత్వం.. తన ప్రజలందరికీ కంటిచూపు ప్రసాదిస్తున్న సమయం! ప్రకృతి ఆడే జూదంలో రైతులను నాటి ప్రభుత్వాలు బలిచేస్తే.. ప్రతికూల పరిస్థితులను సైతం అనువుగా మల్చుకుని.. అన్నదాతల వ్యవసాయానికి దన్నుగా నిలువటమేకాకుండా.. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ రైతు కుటుంబానికి అండగా ఉండే రైతుబంధు బీమా పథకం.. ఆవిష్కృతమయ్యే సందర్భం! పాలకులు మారినా తలరాతలు మారక వెనుకబడి ఉన్న వర్గాలకు భవిష్యత్తుపై బలమైన విశ్వాసాన్ని పాదుకొల్పే సబ్సిడీ రుణాల పంపిణీ పథకం మొదలయ్యేది ఈ రోజే! దశాబ్దాల ఫ్లోరైడ్ రక్కసిని భగీరథ సంకల్పబలంతో పీచమణచి, పరిశుభ్ర జలాలను ప్రతి ఊరికీ అందించే శుభముహూర్తం.. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సాకారం చేస్తూ.. స్వచ్ఛమైన పల్లెలను ప్రకాశింపజేసేందుకు కంకణం కట్టుకుంటున్న తరుణం.. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే.. యావత్ తెలంగాణ ఈసారి స్వాతంత్య్ర సంబురాలకు సంతోషంగా ముస్తాబవుతున్నది! తెలంగాణ దశ, దిశ మార్చే క్రమంలో మరిన్ని ప్రజోపయోగ పథకాలు ప్రారంభించనున్న ప్రభుత్వం.. బంగారు తెలంగాణ ఫలితాలను ప్రజలకు అందించే ఈ వేడుకలను అత్యద్భుతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లుచేస్తున్నది!

తెలంగాణకు ప్రత్యేకం ఈ పంద్రాగస్టు ఈ ఆగస్టు 15.. తెలంగాణకు కేవలం జెండా పండుగ మాత్రమేకాదు. 72ఏండ్ల స్వతంత్రదేశంలో తమఆశలు, ఆకాంక్షలు స్వరాష్ట్రంలోనే తీరుతున్న సందర్భం. ఈ వాస్తవాన్ని గుర్తించిన ప్రజలు.. తమ బతుకు మారే రోజును పండుగలా జరుపుకొనేందుకు ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. పరాయి పాలన నుంచి నాలుగేండ్లక్రితం విముక్తి పొందిన తెలంగాణ.. స్వీయపాలన మొదలుపెట్టుకున్నది మొదలు.. ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా అహరహరం శ్రమిస్తున్నది. అనుమానాలు, అవహేళనలు, అడ్డంకులు అధిగమిస్తూ.. స్వరాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదన్న లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్.. మిషన్ కాకతీయ పథకం కింద చెరువుల పూడిక తీయించారు. మరోవైపు ప్రాజెక్టులను రీడిజైన్‌చేసి.. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా భారీ

ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు. ఇప్పటిదాకా నీరులేక ఒట్టిపోయిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. కృష్ణానదీ జలాల రాకతో బీళ్లు తడిచి.. పంటలతో పులకిస్తున్నది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ఎత్తిపోతల జెట్ స్పీడ్‌తో దూసుకెళుతున్నది. రైతులు భూమిని సాగుచేయడానికి పెట్టుబడి లేక దిగాలు పడకూడదని ఈ ఏడాది మొదటి పంటకు ఎకరానికి నాలుగువేల చొప్పున అందించింది. 24 గంటల నిరంతర విద్యుత్‌తో వెలుగులు నింపింది. మొత్తంగా.. తెలంగాణ వస్తే ఏమొస్తదని ఎగతాళి చేసినవారికి ఏమి వచ్చిందో ఆచరణలో చూపించింది. బంగారు తెలంగాణ సాధన దిశగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రవేశపెట్టిన అనేకానేక పథకాలు ప్రజలకు అందుతున్నాయి. తాజాగా మరిన్ని పథకాలు, కార్యక్రమాలు స్వాతంత్య్ర దినోత్సవ శుభవేళ తెలంగాణ ప్రజల ముంగిట్లోకి వస్తున్నాయి.

నేటినుంచి ప్రజలందరికీ కంటి పరీక్షలు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటిచూపు సమస్యలతో బాధపడకూడదని భావించిన సీఎం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలోనే దృష్టిలోపాలున్నవారికి ఉచితంగా కండ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు.. అవసరమైనవారికి ప్రభుత్వ ఖర్చులతోనే మందులు అందించి, ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించనున్నా రు. మెదక్ జిల్లా మల్కాపూర్‌లో కంటి వెలుగు కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.

రైతు బీమాకు నేడే శ్రీకారం కార్ఖానాల్లో కాయకష్టంచేసే కార్మికులకు, కొలువులు చేసుకునే ఉద్యోగులకు ఆపత్కాలంలో అనేక పథకాలున్నా.. ఎలాంటి భరోసా లేని జీవితం దేశానికి అన్నం పెట్టే రైతుదే. ఆ రైతుకు అనుకోని పరిస్థితుల్లో జరుగరానిదేదైనా జరిగితే.. ఓ కుటుంబం నిలువునా కూలిపోతున్న పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితుల్లో రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు, రైతుకు ధీమా కల్పించేందుకు ఉద్దేశించిన రైతుబంధు జీవితబీమా పథకం కూడా ఆగస్టు 15 నుంచే ప్రారంభంకానుంది. 18 ఏండ్ల నుంచి 59 ఏండ్ల వయస్సు రైతులు ఏ కారణంతో మరణించినా, ఆ రైతు కుటుంబసభ్యులకు పదిరోజుల్లో 5లక్షల సొమ్మును అందజేస్తారు.

బీసీలకు సబ్సిడీ రుణాలు తెలంగాణ ప్రభుత్వం ఈ ఆగస్టు 15 నుంచి ప్రారంభించనున్న మరో ప్రగతిశీల పథకం.. బీసీ కులాల యువతకు సబ్సిడీ రుణా లు. రాష్ట్రంలో మెజార్టీగా ఉన్న బీసీ కులాల అభ్యున్నతికి వివిధ రూపాల్లో పాటుపడుతున్న ప్రభుత్వం.. ఇప్పటికే ఆయా వృత్తులకు పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్నది. వీటితోపాటు బీసీ యువతకు ఉపాధి కల్పించేందుకు సబ్సిడీపై రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మహాత్ముడి కల సాకారం చేస్తూ.. మా తండాల్లో మా రాజ్యం అన్న గిరిజన బిడ్డల ఆత్మగౌరవ నినాదానికి అత్యంత గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తండాలన్నింటినీ ఇటీవలే గ్రామపంచాయతీలుగా మార్చారు. వాటితోపాటు పాలనా సౌలభ్యం కోసం భారీ సంఖ్యలో కొత్త పంచాయతీలను ఏర్పాటుచేశారు. దశాబ్దాల తరబడి నిర్లక్ష్యానికి గురైన పల్లెలు.. ఇప్పుడు ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన కేటాయించిన సొమ్ముతో అభివృద్ధిని పరుగులు పెట్టించనున్నాయి. కొత్తగా ఏర్పడిన పంచాయతీల్లో స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రామస్వరాజ్యం సాధించాలన్న మహాత్ముడి ఆశయాలను నెరవేర్చుతున్న కేసీఆర్ ప్రభుత్వం.. ప్రతి గ్రామాన్ని పరిశుభ్రంగా మార్చేందుకు, పచ్చదనంతో కళకళలాడించేందుకు ఈ పంద్రాగస్టు నుంచే సంకల్పం తీసుకుంటున్నది. ఇందుకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు నెలరోజులపాటు శ్రమదానం చేసి.. తమ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు తెలంగాణ కదులుతున్నది.

ఫ్లోరైడ్ ప్రాంతాలకు జీవధారలు నేడే రాష్ట్రంలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు శాశ్వత విముక్తి కలిగించి, సురక్షితమైన తాగునీటిని ఇంటింటికీ అందించడం కోసం చేపట్టిన మిషన్ భగీరథ ఫలాలు ప్రజలకు అందనున్నాయి. సమైక్యపాలనలో నీళ్ల రూపంలోని గరళం తాగుతూ తమ జీవితాలను, శరీరాలను ఛిద్రంచేసుకున్న ప్రజలకు ఆ కష్టాలు తొలిగిపోయేది ఈ రోజునుంచే. ఈ 72వ స్వాతంత్య్ర దినోత్సవం నాడే ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల్లోనేకాదు.. మొత్తం రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీరు బల్క్‌గా అందబోతున్నది. ఇంటి ఆడబిడ్డలు నీళ్లకోసం మైళ్లు నడవాల్సిన దుస్థితికి ప్రభుత్వం చరమగీతం పాడబోతున్నది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.