Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఓపికకూ హద్దుంటది!

-పిచ్చిగా మాట్లాడితే అదే స్థాయిలో బదులిస్తాం
-మహారాష్ట్రలో కేంద్ర మంత్రినే లోపల వేశారు
-కుక్కకాటుకు చెప్పుదెబ్బలా తిప్పికొట్టిన మల్లారెడ్డి
-బండీ.. ఆస్తుల అమ్మకానికేనా నువ్వు యాత్ర చేసేది?
-రేవంత్‌ బతుకేందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసు
-2 నుంచి రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ
-ఆ రోజునుంచే పార్టీ సంస్థాగత నిర్మాణం ప్రారంభం
-2న ఢిల్లీలో పార్టీ ఆఫీసుకు సీఎం కేసీఆర్‌ భూమి పూజ
-విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్‌ వెల్లడి


మంత్రి మల్లారెడ్డి కుక్కకాటుకు చెప్పుదెబ్బలాగా మాట్లాడారు. విపక్ష నేతలు మాట్లాడినప్పుడు మేం కూడా మాట్లాడతాం కదా! సహనానికీ హద్దు ఉంటది. ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలు బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు ఆవేశంతో మాట్లాడితే దానికో అర్థం ఉన్నది. ఇయ్యాల వీళ్లకేం రోగం? ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపునొస్తదా ఏంది? కొంతమంది జర్నలిస్టులు కూడా అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నరు. ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అనేదానికి ఒక పద్ధతి, హద్దు ఉంటది. ఏది పడితే అది మాట్లాడతం.. జర్నలిజం ముసుగులో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తాం అంటే ఊకుంటరా?

–మీడియాతో మంత్రి కేటీఆర్‌

ప్రతిపక్ష పార్టీల నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడితే అదేస్థాయిలో బదులిస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. తమ సహనానికీ ఓ హద్దుంటుందని స్పష్టంచేశారు. బీజేపీ నేత బండి సంజయ్‌ పాదయాత్ర పేరుతో రాష్ట్రంలోని ఆస్తుల అమ్మకానికి సర్వే చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలకు ఏం మేలుచేశారని యాత్రలు చేస్తున్నారని నిలదీశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి నాయకులు లేక టీడీపీ అధినేత చంద్రబాబు బినామీని దిగుమతి చేసుకొని అధ్యక్ష పదవి ఇచ్చిందని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన రేవంత్‌రెడ్డి కూడా నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. వచ్చేనెల రెండోతేదీన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేస్తారని తెలిపారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, వార్డుల్లో పార్టీ జెండా పండుగతో టీఆర్‌ఎస్‌ సంస్థాగత నిర్మాణం ప్రారంభమవుతుందని వెల్లడించారు. టీఆర్‌ఎస్‌ సుదీర్ఘ ప్రయాణంలో ఢిల్లీలో జెండాపాతే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రసంగం ఆయన మాటల్లోనే..

కుక్క కాటుకు చెప్పుదెబ్బ..
న్యూటన్‌ చెప్పినట్టు చర్యకు ప్రతిచర్య ఉంటది. తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడిని, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడిని, తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడిగా.. ప్రజల ఆశీర్వాదంతో రెండుసార్లు సీఎం అయిన నాయకుడిని నోటికొచ్చినట్టు తిడితే ఊరుకోవాలా? కేసీఆర్‌ కాలి గోటికి కూడా సరిపోని కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నరు. మంత్రి మల్లారెడ్డికి జోష్‌ ఎక్కువ.. ఆవేశం ఎక్కువ.. ఒక మాట అన్నారు.. అందులో తప్పేముంది? కుక్కకాటుకు చెప్పుదెబ్బలాగా మాట్లాడారు. విపక్ష నేతలు మాట్లాడినప్పుడు మేం కూడా మాట్లాడతాం కదా! ఇప్పటికే వందసార్లు చెప్పినం. సహనానికీ హద్దు ఉంటది. గట్లనే మాట్లాడితే ఏం చేయాలి? ఉద్యమ సమయంలో తెలంగాణ బిడ్డలు బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు ఆవేశంతో మాట్లాడితే దానికో అర్థం ఉన్నది. ఇయ్యాల వీళ్లకేం రోగం? ప్రజలు సుభిక్షంగా ఉంటే కడుపునొస్తదా? అధికార యావ తప్ప ఏమైనా ఉన్నదా? కొంతమంది జర్నలిస్టులు కూడా అన్‌పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నరు. ఫ్రీడం ఆఫ్‌ ఎక్స్‌ప్రెషన్‌ అనేదానికి ఒక పద్ధతి, హద్దు ఉంటది. ఏది పడితే అది మాట్లాడతం.. జర్నలిజం ముసుగులో బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేస్తాం అంటే చట్టం తన పనితాను చేసుకుంటూ పోతది.

పటిష్టంగా సంస్థాగత నిర్మాణం
కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా పార్టీ సంస్థాగత నిర్మాణానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. సెప్టెంబర్‌ 2న రాష్ట్రంలోని 12,769 గ్రామపంచాయతీలు, 142 మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో పార్టీ జెండా పండుగ నిర్వహిస్తాం. ఆ రోజునుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం కొనసాగుతుంది. సెప్టెంబర్‌ 20 తర్వాత రాష్ట్ర కొత్త కార్యవర్గం ఎన్నిక ఉంటుంది. రెండోతేదీన సీఎం కేసీఆర్‌ ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్రకార్యవర్గ సభ్యులంతా పాల్గొంటారు. హైదరాబాద్‌లో 1,400 పైచిలుకు నోటిఫైడ్‌ స్లమ్స్‌ ఉన్నాయి. ఈ కాలనీల్లో కొత్తగా ఈసారి బస్తీ కమిటీలు వేస్తున్నాం. వీటితోపాటు 150 డివిజన్‌ కమిటీలు ఉంటాయి. తర్వాత జిల్లా కమిటీ ఉంటుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇంచార్జీలు, కార్పొరేటర్లతో రెండుమూడ్రోజుల్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తాం.

సామాజిక సమతూకం తప్పనిసరి
పార్టీ నియమావళి ప్రకారం ఏ కమిటీలో అయినా క్రియాశీల సభ్యులే ఉండాలి. ఏ కమిటీ చెల్లుబాటు కావాలన్నా 51శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలకు తప్పనిసరిగా ప్రాతినిధ్యం కల్పించాలి. ఈసారి సోషల్‌ మీడియాకు ప్రత్యేకంగా కమిటీ వేయాలని నిర్ణయించాం. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలం. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకువద్దకు తీసుకెళ్లేది కార్యకర్తలే. ఈసారి క్రియాశీల కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. పార్టీ నియమావళి ప్రకారం కమిటీల్లో సామాజిక సమతూకాన్ని పాటిస్తాం. పార్టీ కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా, రైతువిభాగాల కమిటీలను పటిష్టంగా వేసుకొంటాం. కమిటీల నిర్మాణం పూర్తయ్యాక శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తాం. టీఆర్‌ఎస్‌ 20 ఏండ్ల ప్రస్థానంలో ఢిల్లీలో పార్టీ కార్యాలయం ఉండటం అనేది ఉత్కృష్ట సందర్భం. ఒక ఉద్యమ సంస్థగా ఆవిర్భవించి.. పార్టీగా పరిణామం చెంది ఇప్పుడు ఢిల్లీలో కూడా జెండాపాతే స్థాయికి చేరుకోవటం చిన్న విషయం కాదు. ఢిల్లీ తెలంగాణ భవన్‌ బ్రహ్మాండంగా ఉండబోతున్నది. రాష్ట్రంలో ఏ పార్టీకీ లేనంత గొప్పగా, ఇతర పార్టీల కార్యాలయాలను తలదన్నేలా ఉంటది. సీఎం కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని భవనం డిజైన్‌ చేయిస్తున్నారు. టీఆరెస్సే తెలంగాణ రాష్ర్టానికి, ప్రజలకు శ్రీరామరక్ష అనేలా హైదరాబాద్‌లో తెలంగాణ భవనాన్ని 2006లో నిర్మించాం. ఇంతకంటే గొప్పగా ఢిల్లీలో భవనం ఉంటది.. అని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. సమాశంలో ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, గడ్డం రంజిత్‌రెడ్డి, శాసనమండలిలో విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌, దానం నాగేందర్‌, మెతుకు ఆనంద్‌, శా నంపూడి సైదిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, సాట్స్‌ చైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

దిగుమతి నేత రేవంత్‌..
కాంగ్రెస్‌కు ఎవరూ దిక్కులేక చంద్రబాబు తొత్తు, బినామీని తెచ్చుకొని అధ్యక్షుడిని చేసుకున్నరు. రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా డబ్బు సంచులతో దొరికిపోయినోన్ని పట్టుకొని అధ్యక్షుడిని చేసుకున్నరు. ఆయన ఇయ్యాల పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు. చాలా ఓపిక పట్టినం. కేసీఆర్‌ మాములు ముఖ్యమంత్రి కాదు. రాష్ర్టాన్నే తెచ్చిన నేత. తెలంగాణ రాష్ర్టాన్ని పుట్టించింది కేసీఆర్‌. కాదంటారా ఎవరైనా? అట్లాంటిది ఎవరు ఏది పడితే అది మాట్లాడితే ఎన్నిరోజులు ఓపిక పడతాం? మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఒక మాట అన్నందుకు కేంద్రమంత్రినే తీస్కపోయి లోపలేసిండ్రు. మేం కూడా లోపల వేయాలా మరి? ఓపిక నశించి మా వాళ్లు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నరు. ఇగ మావోళ్లు కూడా ఆగమంటే ఆగేటట్టు లేరు. రేవంత్‌రెడ్డి గిట్లనే పిచ్చిప్రేలాపనలు పేలితే కొడంగల్‌లో ప్రజలు తన్నితరిమేశారు. మల్కాజ్‌గిరిలో చావుతప్పి కన్నులొట్టపోయినట్టు ఏదో గెలిచాడు. ఈ మధ్యనే పీసీసీ ప్రెసిడెంట్‌ అయ్యాడు. గామాత్రం దానికే దేశానికి ప్రధానమంత్రి అయిపోయినట్టు పోజులు. రేవంత్‌ను బొమ్మలెక్క ముందుపెట్టి చంద్రబాబు కథ నడిపిస్తున్నడు.

పార్టీ సంస్థాగత నిర్మాణం ఇలా..
-సెప్టెంబర్‌ 2న టీఆర్‌ఎస్‌ జెండా పండుగతో సంస్థాగత నిర్మాణం ప్రారంభం.
-2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీల నిర్మాణం.
-12 నుంచి 20 వరకు మండల, పట్టణ కమిటీల ఏర్పాటు.
-20లోగా జిల్లా అధ్యక్షులు, జిల్లా కార్యవర్గం నియామకం. ఆ తర్వాత కొత్త రాష్ట్ర కమిటీ ఏర్పాటు
-ప్రతి కమిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళాలకు 51 శాతానికి పైగా భాగస్వామ్యం. ఈ కూర్పులేని కమిటీలు చెల్లవు.
-క్రియాశీల సభ్యత్వం ఉన్నవారికే కమిటీల్లో చోటు.


బండీ.. వీటికి సమాధానాలు చెప్పు!
-యాత్రతో ప్రజలకు ఏం చెప్తావు? ‘గతేడాది హైదరాబాద్‌లో వరదలొచ్చాయి. గుజరాత్‌లో వరదలొచ్చినప్పుడు రూ.1,000 కోట్లు ఇచ్చినం.. ఇంకో బీజేపీ పాలిత రాష్ట్రంలో వరదలొస్తే రూ.500 కోట్లు ఇచ్చినం.. హైదరాబాద్‌కు మాత్రం మొండిచెయ్యి చూపినం.. ఒక్కబుడ్డ పైస ఇయ్యలేదు.. అయినా మాకు సిగ్గులేకుండా యాత్ర చేస్తం’ అని చెప్తవా?
-6 లక్షల కోట్ల ప్రభుత్వ ఆస్తులు ఆమ్మేస్తామని కేంద్రం బాజాప్తా చెప్పింది. ఇంకేమైనా ఆస్తులు మిగిలిపోతే అమ్మేసేందుకే బండి యాత్రనా? మౌలాలీలో 21 ఎకరాల రైల్వే భూమిని అమ్మేస్తామని కేంద్రం ప్రకటించింది. పేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కడతాం నాలుగైదు ఎకరాల భూమి ఇవ్వమంటే అక్కడ ఇయ్యలేదు. కానీ ఇవాళ 21 ఎకరాల విలువైన భూమిని అమ్మకానికి పెడుతున్నాం అని చెప్తరా?
-ఏటా రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. రెండు కోట్ల ఉద్యోగాలు కాదు.. ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తున్నామని నీ యాత్రలో చెప్తావా?
-కేంద్రం ఆధ్వర్యంలో 11,30,840 ఉద్యోగాలున్నాయి. వీటిల్లో 1.6 లక్షలు ఎస్సీలకు, లక్ష ఎస్టీలకు, 2 లక్షలు ఓబీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ 5 లక్షల ఉద్యోగాలను ఎగ్గొడుతున్నం అని చెప్పేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారా? -ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలతో వాటిలో రిజర్వేషన్లు లేకుంటచేసి, బడుగు బలహీనవర్గాల పొట్టగొట్టేందుకు, ఉద్యోగాలు ఎత్తగొట్టేందుకా నీ యాత్ర?
-బీజేపీ హయాంలో జీడీపీ బంగ్లాదేశ్‌ కంటే కిందికి పడిపోయిందని చెప్పటానికి చేస్తున్నవా యాత్ర? యాత్ర ముగుసులో రాష్ట్రంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నయో చూసి వాటిని అమ్మాలని మోదీకి చెప్పేందుకా యాత్ర?
-ఏడేండ్లలో తెలంగాణ ప్రజలు పన్నుల కింద కేంద్రానికి కట్టింది రూ.2.72 లక్షల కోట్లు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చింది రూ.1.45 లక్షల కోట్లు. రూపాయి మేమిస్తే ఆఠాణా మీరు వాపస్‌ ఇచ్చారు. ఒక్క పైసా అదనంగా ఇచ్చారా? ఒక స్కీమ్‌ తెచ్చారా? ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చారా? విభజన చట్టంలో ఒక్క హామీని నిలబెట్టుకున్నారా? ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరికి పోతారు? ఏమని చెప్తారు?
-ఇవాళ కేంద్రంలో 8.70 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడరు?

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.