Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పోరుగల్లు జనహోరులో పోరుగర్జన సభ

-రాజకీయ అవినీతి అంతంకావాలి -కాంగ్రెస్‌కు ఓటేస్తే తెలంగాణ కేవీపీ చేతిలోకే -పొన్నాల లక్ష్మయ్య పొంకనాలు కొడుతున్నరు -ఆయన వెనుక సూత్రధారి, పాత్రధారి కేవీపీనే -ఎంత ఖర్చయినా వరంగల్‌కు రింగురోడ్డు -ప్రాజెక్టులు పూర్తిచేస్తే తెలంగాణ సస్యశ్యామలం -జూరాల టు పాకాల కృష్ణా నీళ్లు -భూపాలపల్లిని జయశంకర్ జిల్లాగా ఏర్పాటు -తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయింది -ఓరుగల్లు పోరుగర్జన సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

KCR in warangal Public Meeting01  18-04-14

వరంగల్, టీ మీడియా ప్రతినిధి: ఇంటికొక బిడ్డను ఇవ్వమని అడిగిన. పద్నాలుగేండ్లు పోరాడి తెలంగాణను తీసుకొచ్చి మీపాదాల ముందుంచిన. సాధించుకున్న తెలంగాణను కాకులకు, గద్దలకు వేద్దామా. ఈనగాచి నక్కలపాలు చేద్దామా? సాధించుకున్న తెలంగాణను మనమే తీర్చిదిద్దుకోవాలె. పొరపాటున రేపు కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ కేవీపీ చేతిలోకి పోతుంది. ఇప్పటికే పొన్నాల లక్ష్మయ్య కేవీపీ దయాదాక్షిణాలతో టీ పీసీసీ చీఫయ్యిండు. రేపు కచ్చితంగా గదే కేవీపీ చేతిలోకి తెలంగాణ పోతుంది. గందుకేనా మనం కొట్లాడింది? ఇందుకేనా మనం తెలంగాణను సాధించుకున్నది? ఆలోచించండి. మన తెలంగాణను మనమే నిర్మించుకుందాం.

రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంటే మనదే రాజ్యం అవుతుంది. మన కల సాకారం చేసుకుందాం. కేంద్రంలోనూ మనం శాసించే స్థాయిలో ఉండాలె. అట్లా ఉండాలంటే మనం కచ్చితంగా 17 ఎంపీ స్థానాలను సొంతం చేసుకోవాలె అని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ప్రజలకు పిలుపుచిచ్చారు. గురువారం రాత్రి వరంగల్‌లో జరిగిన ఓరుగల్లు పోరుగర్జన సభలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం ముందు తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తి నిలబడాలె. దేశంలోనే అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలె అని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పని అయిపోయింది తెలంగాణలో కాంగ్రెస్ పని అయిపోయిందని కేసీఆర్ అన్నారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ సభతోనే వాళ్లు చేతులెత్తేశారు. గంత అద్వాన్నంగా సభ పెడతరా? మా కొండా సురేఖ సభ పెట్టినా అంతకంటే బాగా పెట్టేది అని ఆయన వ్యాఖ్యానించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం టీఆర్‌ఎస్ నిలబెట్టుకుటుందని తెలిపారు. రాజకీయ అవినీతిని అంతం చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఎంతటివాళ్లయినా సరే అవినీతికి పాల్పడితే చివరికి తన కొడుకు బిడ్డా, బంధువులైనా, ఆత్మబంధువులైనా, మిత్రులు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదని, అవినీతికి పాల్పడిన వాళ్లను జైల్లో పెట్టుడేనని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.

వరంగల్ అభివృద్ధికి పక్కా ప్లాన్ వరంగల్ జిల్లాలో వ్యయసాయం, పారిశ్రామికాభివృద్ధికి కచ్చితమైన ప్రణాళికలు ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. 60 టీఎంసీల చొప్పున నీటి నిల్వతో కంతనపల్లి, దేవాదుల పూర్తిచేయడం ద్వారా నూటికి నూరు పాళ్లు నియోజకవర్గానికి లక్ష ఎకరాలు సాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు ఎత్తిపోతలు తప్ప ఏమి మిగిలాయని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. జూరాల నుంచి పాకాల వరకు 400 కిలోమీటర్ల దూరం సస్యశ్యామలమయ్యే అద్భుతమైన నీటి విధానం తమ దగ్గర ఉందని, ఈ విధానం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాలోని కుంటలు, చెరువులు నిండి తెలంగాణ పచ్చబడుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికోట్లు ఖర్చయినా వరంగల్‌కు రింగురోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. భూపాలపల్లిని జిల్లా చేసి దానికి ప్రొఫెసర్ జయశంకర్ పేరు పెట్టుకొందామని అన్నారు. తెలంగాణకే తలమానికమైన ఆజాంజాహీ మిల్లును మింగిన పాలకుల నిర్లక్ష్యానికి గురైన టెక్స్‌టైల్ పరిశ్రమను పునరుద్దరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పోయిన ప్రభను తిరిగి తెచ్చుకునేందుకు ఒక టెక్స్‌టైల్ హబ్‌గా వరంగల్‌ను మారుస్తామని, ఆ బాధ్యత తాను తీసుకుంటానని స్పష్టం చేశారు. జిల్లాలో పత్తి ఎక్కువగా పండుతున్న నేపథ్యంలో చుట్టు ఉన్న ఐదారు జిల్లాల మార్కెట్‌లను సమీక్షించి రామెటీరియల్‌ను సద్వినియోగం చేసుకునేలా తమిళనాడు తిరుపూరు తరహాలో మార్చి చూపిస్తామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ ప్రపంచంలోనే వాటర్ షెడ్‌కు తొలి నమూనా అని ఆయన పేర్కొన్నారు. 11వ శతాబ్దంలోనే గొలుసుకట్టు చెరువుల నిర్మాణంతో అద్భుత ప్రగతిని చూపిన ఘనత వరంగల్‌కే దక్కుతుందని అన్నారు. చారిత్రక నగరంగా ఉన్న వరంగల్‌లో ఇప్పుడు అండర్‌డ్రైనేజీ వ్యవస్థ లేకపోవటం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

టీఆర్‌ఎస్ సర్కారొస్తే కల సాకారమైనట్లే ఉద్యమ స్పూర్తితో తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన అనివార్యతలు గుర్తించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ తెచ్చిన కీర్తి నాకు చాలు. నన్ను తిట్టినా, దూషించినా తెలంగాణను వీడలేదు. ఆ బలం నాకు ఇచ్చింది మీరు. మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడుకునేది నేనే. తెలంగాణలో 100 ఎమ్మెల్యే సీట్లు, 17ఎంపీ సీట్లు గెలిపించుకుని రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడితేనే మన కల సాకారమవుతుంది. అదే సమయంలో మన ఎంపీలు 17మంది ఉంటే కేంద్రం మెడలు వంచి మన కొత్త ఇళ్లును, కొత్త సంసారాన్ని బాగుచేసుకుంటాం. రాష్ట్రం రాగానే అన్ని సమస్యలు తీరిపోలేదు. ఆంధ్రా డేంజర్ ఇంకా అయిపోలేదు. తెలంగాణ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని కేసీఆర్ గుర్తుచేశారు.

తమిళనాడు తరహాలో పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ విభాగాన్ని తమిళనాడు తరహాలో ఒకే గొడుకు కిందికి తెస్తామని కేసీఆర్ తెలిపారు. అక్కడ టీఎస్‌పీ (తమిళనాడు స్పెషల్ పోలీస్)ఉన్నట్లే మన దగ్గర కూడా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో అన్ని విభాగాలను ఒకే గొడుకు కిందికి తీసుకొచ్చి బాధ్యతతో చెప్పినట్టు జిమ్మేదారుగా అమలుచేస్తాం. మాజీ డీజీపీ పేర్వారం రాములు లాంటి పెద్ద మనుషులతో, అనుభవజులైన నిపుణులతో చర్చించి ఆమోదయోగ్యమైన పోలీస్ వ్యవస్థను రూపొందిస్తామని ఆయన వివరించారు. జిల్లా మంత్రులుగా పొన్నాల లక్ష్మయ్య, బస్వరాజు సారయ్య ఇద్దరు జిల్లాకు ఒరగబెట్టిందేమిలేదని ఆయన అన్నారు. ఉత్తరదక్షిణ వారధిగా ఉన్న కాజీపేటను రైల్వేడివిజన్‌స్థాయికి పెంచడం, మంజూరైన వ్యాగన్ పరిశ్రమ నిర్మాణాన్ని వేగవంతం చేయడం, కోచ్‌ఫ్యాక్టరీని రప్పించడం తమ ముందున్న లక్ష్యమని ఆయన పేర్కొంటూనే మామునూరు ఎయిర్‌పోర్టును పునరుద్ధరిస్తామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 85శాతం ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతికి పాటుపడతామని, అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకుతీసుకెళతామని, ఆ చిత్తశుద్ధి తమకు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు.

కేవీపీ నాటకంలో పొన్నాల భాగస్వామి పీసీసీ అధ్యక్షుడిగా మీదికి కనబడుతున్నా చిప్పలో రెండు రాళ్లు వేస్తే ఊరుకున్నట్లుగా కేవీపీ ఆడించే నాటకంలో పొన్నాల భాగస్వామి అవుతాడని కేసీఆర్ ఆరోపించారు. మీదికే పొన్నాల మొఖం, వెనక మాత్రం పాత్రదారి, సూత్రదారి అంతా కేవీపీనే అన్న విషయాన్ని గ్రహించాలని కేసీఆర్ సూచించారు. ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగే నాయకులు మన రాష్ట్రంలో అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. పొన్నాల జలయజ్ఞంలో కమీషన్లు తినుడు తప్ప ఏం సాధించారని కేసీఆర్ ప్రశ్నించారు. పొన్నాల లక్ష్మయ్య నీటిపారుదల శాఖ మంత్రిగా ఆరేళ్లు పనిచేశారు. ఇప్పుడు పొంకనాలు కొడుతున్న పొన్నాల మంత్రిగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లాకు ఏం ఒరగబెట్టారు. ఆరేళ్లు జలయజ్ఞం పేరుమీద కమీషన్లు మింగుడు తప్ప ఏం చేశారు అని ఆయన ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లాకు దేవాదుల ద్వారా నీళ్లు వచ్చాయా? రేపు కాంగ్రెస్ చేతిలో తెలంగాణను పెడితే తెలంగాణకు నీళ్లు ఇవ్వనోడు రాష్ర్టాన్ని ఏం బాగుచేస్తడు. ఒక్కనాడైనా పొన్నాల లక్ష్మయ్య ఉద్యమంలో పాల్గొన్నడా? పాల్గొనని వానికి తెలంగాణ గురించి ఏం తెలుసు ? అని కేసీఆర్ నిప్పులు చెరిగారు. తాము ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తుంటే పొన్నాల జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. నా తొలి సంతకం రైతురుణ మాఫీపైనే

-బీజేపీ-టీడీపీ పొత్తు వెనుక పెద్ద కుట్ర -టీఆర్‌ఎస్‌ను అడ్డుకొనేందుకు చంద్రబాబు, వెంకయ్య నాటకం -వినోద్‌కుమార్ గెలిస్తే కేంద్ర మంత్రి అవుతాడు -హుస్నాబాద్ ఎన్నికల బహిరంగ సభలో కేసీఆర్

కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకం రైతుల రుణాల మాఫీపైనే ఉంటుందని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు తరతరాలుగా అన్యాయం జరుగుతూనే ఉందని, ఎన్నికలు రాగానే మాయ మాటలు చెప్పటం తర్వాత మరిచిపోవటం గత ప్రభుత్వాలకు అలవాటుగా మారిందని విమర్శించారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో గురువారం ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతన్నలను అన్ని విధాలుగా ఆదుకొంటామని హామీ ఇచ్చారు. నేను ఒక్క మాట చెపుతున్న.. తెలంగాణ రాష్ట్రంలో నా తొలి సంతకం రైతుల రుణమాఫీపైనే పెడుతా. లక్ష రుపాయాల లోపు రుణాలను మాఫీ చేస్తా అని పేర్కొన్నారు. 14ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, అయితే మనం కోరుకున్న తెలంగాణ మాత్రం రాలేదని అన్నారు. తెలంగాణ బిల్లు రూపకల్పనలో టీఆర్‌ఎస్ పాత్ర లేదని, నిజంగా టీఆర్‌ఎస్ పాత్ర ఉండి ఉంటే ఆంక్షలతో కూడిన తెలంగాణ వచ్చి ఉండేది కాదని తెలిపారు.

టీడీపీ- బీజేపీ పొత్తు వెనుక భారీ కుట్ర తెలంగాణలో టీడీపీ- బీజేపీ ఎన్నికల పొత్తు పెట్టుకోవటం వెనుక పెద్ద కుట్ర ఉందని కేసీఆర్ ఆరోపించారు. ఈ రెండు పార్టీల మధ్య బలవంతపు పొత్తు కుదిర్చిన చంద్రబాబు, వెంకయ్యనాయుడు కలిసి నరేంద్రమోడీకి ఉన్న కొద్ది గొప్పో మంచి పేరును సైతం చెడగొట్టేలా ఉన్నారని విమర్శించారు. మోడీ పేరు చెప్పి పది ఇరవై స్థానాలు సాధించి టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకుండా చూసేందుకు కుట్ర పన్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వారి పాపాలను కక్కిస్తామనే భయంతోనే చంద్రబాబు, వెంకయ్యనాయుడు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

రెండు ఓట్లు టీఆర్‌ఎస్‌కే వేయండి ఈ నెల 30 జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ రెండు ఓట్లూ టీఆర్‌ఎస్ అభ్యర్థులకే వేసి గెలిపించాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థులు గెలువటం ఎంత ముఖ్యమో ఎంపీ అభ్యర్థులు గెలువటం కూడా అంతే ముఖ్యం. 17 మంది ఎంపీలను గెలిపించుకొంటే కేంద్రం మెడలు వంచి రాష్ర్టానికి నిధులు తెచ్చుకోవచ్చు. అలా కాకపోతే కష్టాలు పడాల్సి ఉంటుంది. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం మరొకరిని చేయమనటం భావ్యం కాదు. ఈ విషయాన్ని యావత్ తెలంగాణ ప్రజానీకం గుర్తించాల్సిన సమయం వచ్చింది. మోసపోతే గోస పడుతాం. ఒక్కసారి అలోచన చేయండి. తెలంగాణ సాధన కోసం ఏ పార్టీ అయినా మనతో కలిసి వచ్చిందా? పోరాటం చేసిందా? ధర్నాలు, రాస్తారోకోలు చేశారా? టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలే లాఠీ దెబ్బలు తిన్నారు. నేను చావు నోట్లో తలకాయ పెట్టి వచ్చాను. ఇన్నాళ్లు మనం పోరాటం చేస్తే ఇప్పుడు మరొకరు వచ్చి ఓటు అడిగితే వేస్తారా అని కేసీఆర్ ప్రశ్నించారు. 2001లో టీఆర్‌ఎస్ అవిర్భావ సమయంలో నేను ఒక మాటచెప్పాను. తెలంగాణ సాధించేవరకు అవిశ్రాంత పోరాటంచేస్తాని చెప్పాను. అవసరమైతే తల నరుక్కుంటాను గానీ.. తలదించను. తెలంగాణ సాధించకుండా ఉద్యమాన్ని విరమించనని చెప్పాను. అన్నమాట నిలుపుకున్నా. మా పోరాటం, అమరుల త్యాగం వల్లే తెలంగాణ వచ్చింది. పద్నాలుగేళ్ల పాటు నడిచిన ఉద్యమ పగ్గాలు నా చేతుల్లో ఉండేవి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితిని అధికారంలోకి తెచ్చే పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయి. అందుకే విజ్ఞప్తిచేస్తున్నా ఈనెల 30న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులకే వేయాలి అని కేసీఆర్ కోరారు.

వినోద్‌కుమార్ కేంద్ర మంత్రి అవుతారు కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న వినోద్‌కుమార్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. వినోద్‌కుమార్ టీఆర్‌ఎస్ వ్యవస్థాపక పదిమందిలో ఒకరు. తెలంగాణకు అనుకూలంగా రాజకీయ పార్టీలను ఏకీకృతం చేయటంలో ఆయనది కీలక పాత్ర. ఒక్క మాట చెపుతున్నా నీతి నిజాయితీకి పెట్టింది పేరు. మన రాష్ర్టానికి కేంద్రం నుంచి ఎటువంటి సహాయం తీసుకోవాలన్నా మనకు వినోద్‌కుమార్ చాలా ఉపయోగపడతారు. అంతేకాదు వినోద్‌కుమార్‌ను మీరు గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారు. హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న ఓడితల సతీశ్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు.

హుస్నాబాద్‌లో లక్షన్నర ఎకరాలు సాగులోకి తెస్తాం హుస్నాబాద్ నియోజకవర్గంపై కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. అన్ని వనరులున్నా హుస్నాబాద్ నియోజకవర్గం మెట్ట ప్రాంతంగానే ఉండిపోయిందన్నారు. తాము అధికారంలోకి రాగానే హుస్నాబాద్ నియోజకవర్గంలో లక్ష నుంచి లక్షాయాభైవేల ఎకరాలను సాగులోకి తెచ్చి తీరుతాం. సిద్దిపేట తరహాలో గ్రామ గ్రామానికి మంచినీరు అందించే పథకాన్ని అమలుచేస్తాం. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకంజవేసేది లేదు. మధ్య మానేరు, శ్రీరాంసాగర్ కాలువల ద్వారా హుజూరాబాద్ సశ్యశ్యామలం చేసే బాధ్యతను స్వయగా నేనే తీసుకుంటా. ఒక్క మాట గట్టిగా చెపుతున్నా.. అధికారం ఇవ్వండి.. మీకు ఇచ్చిన ప్రతిహామీని ప్రాణాలు అడ్డుపట్టైనా సరే అచరణ సాధ్యం చేసి చూపిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

ప్రతి తండాలో గులాబీ జెండా ఎగరాలి బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ అధిక ప్రాధాన్యం ఇస్తుందని కేసీఆర్ తెలిపారు. పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పేదలకు సౌకర్యవంతంగా ఉండే ఇళ్లు కట్టించి తీరుతాం. ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు నూటికి నూరు శాతం అమలుచేస్తాం. ఇక ముందు ప్రతి గిరిజన తండాలో గులాబీ జెండానే ఎగురాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

మనపోరాటంతోనే తెలంగాణ: వినోద్‌కుమార్ గులాబీ జెండా కింద తెలంగాణ ప్రజలు చేసిన అలుపెరుగని పోరాటం, అమరుల త్యాగాల వల్లే తెలంగాణ రాష్ట్రం కల సాకారమైందని కరీంనగర్ లోకసభ టీఆర్‌ఎస్ అభ్యర్థి వినోద్‌కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ ఉద్యమం వల్లనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది తప్ప స్వయంగా ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తెలంగాణ ఎవరి చేతుల్లోనో పెడితే..వారికి మన కష్టాలు కన్నీళ్లు తెలుస్తాయా? ఇన్నేళ్లు మనను పట్టించుకోనివారు ఇప్పుడు పట్టించుకుంటారా? మన సంక్షేమాన్ని చూస్తారా? రైతుల కన్నీళ్లు తుడుస్తారా? కొత్త ప్రాజెక్టులు చేపడుతారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. సమావేశానికి హుస్నాబాద్ నియోజకవర్గ అభ్యర్థి ఓడితల సతీష్‌కుమార్ అధ్యక్షత వహించగా టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మన్‌రావు, సుధాకర్‌రావు, మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, శ్రీహరి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.