క్లోరో ఫాం చికిత్సలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచిన ఉస్మానియా ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకొస్తామని డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ టి. రాజయ్య అన్నారు. సోమవారం ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన ఆయన అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నిద్ర కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ సీఎం రాత్రి ఆస్పత్రిలోనే బస చేశారు.
-క్లోరో ఫాం చికిత్సలో ప్రపంచ దేశాలకే ఆదర్శం -కిడ్నీ మార్పిడిలో సక్సెస్…ఇక లివర్ మార్పిడిపై దృష్టి -ఆసుపత్రి నిద్ర ప్రతీ జిల్లాలో అమలు పరచాలి -కమ్యూనిటీ సెంటర్లుగా ఆరోగ్య కేంద్రాలు -త్వరలో ప్రభుత్వం ఆధ్వర్యంలోనే మందుల పంపిణీ కేంద్రాలు -ఆస్పత్రి నిద్ర కార్యక్రమంలో డిప్యూటీ సీఎం రాజయ్య

1894లో క్లోరోఫాం మత్తు మందు చికిత్సతో ప్రపంచ దేశాలకే ఆదర్శమైన ఆసుపత్రిగా ఉస్మానియాకు పేరుందని డిప్యూటీ సీఎం, వైద్య-ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య గుర్తు చేశారు. ఉస్మానియా ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకువస్తానన్నారు. ఆస్పత్రి నిద్ర కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో విజయవంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఆస్పత్రి నిద్రలో తెలుసుకున్న సమస్యలను నివేదిక రూపంలో ప్రతిపాదనలను తయారు చేసి పంపాలన్నారు. దేశంలో ఏప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులకు విడుదల చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రూ.550 కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందన్నారు.
అదే విధంగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌కు రూ.100కోట్ల చొప్పున ఈఎన్‌టీకి రూ.10కోట్లు, నిలోఫర్‌కు రూ. 30 కోట్లు, చెస్ట్ట్ ఆసుపత్రికి రూ.10కోట్లు, సరోజినీదేవి ఆసుపత్రికి రూ.10కోట్లు, ఫివర్ ఆసుపత్రికి రూ.5 కోట్లు, మెంటల్ ఆసుపత్రికి రూ.10కోట్లు, ప్రసూతి ఆసుపత్రులకు రూ.25కోట్ల చొప్పున ప్రభుత్వం కేటాయించిందన్నారు. తెలంగాణ రాష్ర్టానికి 550 ఎంబీబీఎస్ మెడికల్ సీట్లు అదనంగా కేటాయించిందన్నారు.
కిడ్నీ మార్పిడి విజయవంతంగా ఉస్మానియాలో జరుగుతుంది… అతి త్వరలో లివర్ మార్పిడికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కమ్యూనిటీ సెంటర్లుగా మారుస్తామన్నారు. ఆసుపత్రుల్లో వైద్యుల కొరత, సిబ్బంది కొరత లేకుండా ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసిందన్నారు. చంచల్‌గూడకు ఉస్మానియా ఆసుపత్రిని తరలించాలనే చర్చలు నడుస్తున్నాయన్నారు. చంచల్‌గూడ జైళ్లను తరలించి నగర శివారులోకి మార్చే ఆవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వమే మందులు పంపిణీ చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
ఇప్పటికి నిమ్స్‌లో ఆసుపత్రి యాజమాన్యమే మందులు పంపిణీ చేస్తుందన్నారు. డీఎంఈ పుట్ట శ్రీనివాస్‌రావు, ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రఘురాం, తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆసోసియేషన్ గౌరవ అధ్యక్షులు రమేష్, అడిషనల్ సూపరింటెండెంట్ డాక్టర్ మైథిలీ, హెచ్‌ఎంవోడి డాక్టర్ నాగేందర్‌తో పాటు వివిధ విభాగాల ప్రొఫెసర్లు, పీజీ వైద్యులు తదితరులు పాల్గొన్నారు. మంత్రి బస చేసిన వార్డులో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
వైద్య పరీక్షలు చేయించుకున్న డిప్యూటీ సీఎం అఫ్జల్‌గంజ్: ప్రభుత్వ ఆస్పత్రులను కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా తీర్చిదిద్దే కార్యక్రమంలో భాగంగా సోమవారం డిప్యూటీ సీఎం, ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య ఉస్మానియా ఆస్పత్రిలో బస చేశారు. డిప్యూటీసీఎం పలు విభాగాల్లోని రోగులను పరామర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీఎస్సీ నర్సింగ్ విద్యార్థులు డిప్యూటీ సీఎం రాజయ్యను కలిసి తమ సమస్యలను విన్నవించారు. వారి సమస్యలు విన్న మంత్రి త్వరితగతిన పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం ఓపి విభాగంలో మంత్రి రాజయ్య వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అదే సందర్భంలో ఆయన కాలి బొటన వేలు గాయానికి సర్జరీ చేయాల్సి వస్తుందని డాక్టర్లు తెలిపారు. అనంతరం షుగర్,బీపీ, రక్త పరీక్షలు చేయించుకున్నారు. మంగళవారం ఉదయం మరికొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటానని మంత్రి రాజయ్య తెలిపారు. నెఫ్రాలజీ హెచ్‌ఓడీ డాక్టర్ మనీషా సాహె, జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ గుండగాని శ్రీనివాస్, సీసీ టీఆర్‌ఆర్ హెచ్‌ఓడి డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌ఎంఓ-1 డాక్టర్ అంజయ్య, డాక్టర్ రఫీ తదితరులు మంత్రితోపాటు ఉన్నారు.