Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఓటు మన తలరాత మార్చుతది

-ఆగమైతే.. అభివృద్ధి జరుగదు
-చంద్రబాబు.. ఓ మెంటల్ కేసు!
-ఒకప్పుడు అడవులు పెరుగాలంటే.. మేకలను బ్యాన్ చేయాలన్నడు
-హైదరాబాద్‌ను ఆయనే కట్టిండట! మరి అమరావతిలో ఒక్క ఇటుక ఎందుకు కట్టలే?
-ఎన్నికల్లో వంచకులు వస్తున్నారు జాగ్రత్త
-పరిగి ప్రజా ఆశీర్వాదసభలో సీఎం కేసీఆర్

ఇవి ఆషామాషీ, తమాషా ఎన్నికలు కావు. ఈ ఎన్నికల్లో వేసే ఓటు మన తలరాతను మార్చుతుంది. మన భవిషత్తును రక్షిస్తుంది అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎన్నికలంటే.. అడ్డగోలుగా డబ్బు, మద్యాన్ని పారించడంవంటి దరిద్రాలు ఉన్నయి. వాటినుంచి బయటకు రావాలి అని ప్రజలను కోరారు. ఆగంఆగం అయి, ఇతర ఒత్తిడులకు లోనై ఓట్లువేస్తే.. అనుకున్నంత అభివృద్ధి జరుగదని చెప్పారు. ఈ ఎన్నికల్లో మీ ముందు ఇద్దరే ఉన్నరు. తెలంగాణ రాకముందు 58 ఏండ్లు పరిపాలన చేసిన కాంగ్రెస్, టీడీపీ.. 14 ఏండ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చి, మీరు అధికారం ఇస్తే కొత్తరాష్ట్రంలో నాలుగేండ్లు పరిపాలనచేసి సంక్షేమ ఫలాలు మీ ముందుంచిన టీఆర్‌ఎస్ ఉన్నయి. ఎవరు ఏం చేసిండ్రో కూడా మీ ముందల్నే ఉన్నది. నేను చెప్పే విషయాలు ఎక్కడివోకాదు.. మన గ్రామాల్లో రోజూ జరుగుతున్న సంగతులే. టీఆర్‌ఎస్ గవర్నమెంట్ రాకముందు, కాంగ్రెస్, టీడీపీ పాలనలో మీ గ్రామాల్లో కరంటు ఎట్ల ఉండె? ఇప్పుడు ఎట్ల ఉంది! ఆలోచన చేయాలి అని సీఎం కోరారు. ఆదివారం పరిగి నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాదసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..

చంద్రబాబు కరంట్ చార్జీలు పెంచినప్పుడే జై తెలంగాణ అన్నం
చంద్రబాబు కరంట్ చార్జీలు ఎప్పుడు ఇబ్బడిముబ్బడిగా పెంచిండో.. అప్పుడు ఎవరినీ అడుగలే.. చచ్చింది ఒకనాడు.. బతికింది ఒకనాడు అనుకుని యుద్ధానికి వెళ్లినం. జై తెలంగాణ అన్నం. తర్వాత జరిగిన కథ మీకు తెలుసు. 15 ఏండ్లు వదలకుండా, పట్టువీడకుండా పోరాటంచేసినం. తెలంగాణ సాధించుకున్నం. నాలుగేండ్లలో ఏం జరిగిందో.. ఎవరేంచేసిండ్రో మీకు తెలుసు.

చంద్రబాబు… ఓ మెంటల్ కేసు!
ఇప్పుడు కాంగ్రెస్, టీడీపీ నాయకులు పెద్దపెద్ద డైలాగులు మాట్లాడుతున్నరు. ఈ పని వాళ్లకు చేయరాలేదా? పెద్ద పెద్ద మేధావులు, ఘనాపాటీలు కరంటు ఎందుకియ్యకపోతిరి? చంద్రబాబు నాయుడైతే చెప్పతరం కాదు. హైదరాబాద్ కట్టిందే ఆయనంట! మెంటల్ కేసు! హైదరాబాద్‌ను చంద్రబాబు కడితే.. కులీకుతుబ్‌షా ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాల్నా? చార్మినార్‌ను కూడా చంద్రబాబే కట్టిండా? 400 ఏండ్ల కిందట కులీకుతుబ్‌షా నమాజ్ చేసి.. అల్లా.. సరస్సులో చేపలు ఎట్లుంటయో.. అట్ల ఈ నగరంల ప్రజలు పెరుగాలె అని దండంపెట్టి, చార్మినార్‌కు పునాదిరాయి వేసిండు. కులీకుతుబ్‌షా ఎప్పుడు పుట్టిండు? చంద్రబాబు ఎప్పుడు పుట్టిండు? చంద్రబాబు మెంటల్ అని ఎందుకంటున్ననంటే.. యెనకటికి ఆయన ఓ మాట చెప్పిండు.. అడవులు పెంచాలంటే మేకలను బ్యాన్ చేయాలట! మేక ఎప్పుడు పుట్టింది? వీడెప్పుడు పుట్టిండ్రా బై అని నేనన్న. సృష్టిలో భాగంగా వచ్చిన మేకను బ్యాన్‌చేసే అధికారం మీకెక్కడిదో నాకర్థం కాదు. ప్రతీది ఇట్లనే! హైదరాబాద్‌నట ప్రపంచ పటంల పెట్టిండట! ఏం చేయాలి? హైదరాబాద్‌ను ప్రపంచపటంల పెట్టిన సిపాయి.. మరి అమరావతిల ఒక్క ఇటుక కూడా ఎందుకు కట్టలే? ఐదేండ్లల్ల డంబాచారాలు.. గ్రాఫిక్స్ తప్ప ఒక్క బిల్డింగ్‌కు గతిలేదు. ఇట్లాంటి మోసగాళ్లు, వంచకులు మళ్ల ఈ ఎన్నికలల్ల వస్తున్నరు తస్మాత్ జాగ్రత్త!

బాధ.. దుఃఖం ఉన్నా.. ఓర్చుకున్నం
హరీశ్వర్‌రెడ్డి, నేను టీడీపీలో కలిసి పనిచేసినం. ఓడినం, గెలిచినం. నేను, ఆయన కలిసి 25, 30సార్లు టీడీపీ ఎమ్మెల్యేలతో కలిపి మీటింగ్‌లు పెట్టినం. 1989 ఎన్నికల సమయంలో మా నాయన చనిపోయిండు.. ఆ సీన్ యాదికి వస్తే.. ఇప్పటికీ నా కండ్లల్లో నీళ్లు తిరుగతయి. కర్మకాండ జరిగితే.. అప్పుడు ఊర్లనే ఉన్న. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఉండే. ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మీ టిక్కెట్ ఫైనల్ అయింది.. వచ్చి తీసుకెళ్లండి అన్నరు. నేను పోయిన.. అక్కడ హరీశ్‌రెడ్డి ఉన్నరు. కారు దిగగానే అక్కడ చూస్తే.. ఒక టెంటు లేదు, నాలుగు కుర్చీలు కూడా లేవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, రాష్ట్ర పార్టీ నాయకులు ఉన్నరు. మన బతుకేంది? అన్నాను. దేవుడి గుడికాడ బిచ్చగాళ్ల మాదిరిగా కూర్చున్న తీరు చూస్తే బాధేసింది. కుర్చీలు వేస్తే ఏం పోతుండే? ఇంత అవమానమా! అని బాధపడ్డాను. హరీశ్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి.. వీరు పలుకరించటానికి నా ఇంటికి వస్తే.. ఆ రోజూ బాధపడ్డాను.. ఏందిరా తెలంగాణ అని! గుండెల్లో బాధ, దుఃఖం ఉన్నా ఓర్చుకున్నం.

పరిగి యువ టైగర్ మహేశ్వర్‌రెడ్డి
మా హరీశ్వర్‌రెడ్డి కొడుకు.. యువకుడు.. పరిగి టైగర్.. మహేశ్వర్‌రెడ్డి. హరీశ్వర్‌రెడ్డి ఆశీర్వాదంతో 68.70% ఓట్లు మహేశ్వర్‌రెడ్డికి వస్తున్నట్లు నాకు సర్వేలో తేలింది. నాకు ఇప్పుడు గుండెల నిండా సంతోషం ఉన్నది. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకొని ఇయ్యాల 68% ఓట్లు సంపాదించే స్థితికి చేరుకున్నడు. మీరంతా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపించండి. ఆయన వెంట ఉండి పరిగిని అభివృద్ధిచేసే బాధ్యత నాది. కొత్తవాడు కాబట్టి.. ఎన్నికల తర్వాత నేను ఆయన ఇంటికి వచ్చి, భోజనంచేసి, రోజంతా ఉండి మీ కార్యక్రమాలన్నీ చేయిస్త. పరిగిలో డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ కావాలని మీకు చాలారోజుల నుంచి కోరిక ఉంది. కచ్చితంగా ఎన్నికల తర్వాత వెంటనే వాటిని చేయిస్త. పాలమూరు ఎత్తిపోతల పథకంద్వారా పరిగి నియోజకవర్గంలో 1.20-1.30 లక్షల ఎకరాలకు రాబోయే ఏడాదిన్నర తర్వాత కచ్చితంగా నీళ్లు తెచ్చి ఇచ్చే బాధ్యత నాది. కానీ మద్దతు చేయాల్సిన బాధ్యత మీది. పరిగిలో ఇంతకుముందు ఇంత పెద్దసభ చూడలేదు. ఇంత పెద్దసంఖ్యలో మీరొచ్చినరంటే మహేశ్వర్‌రెడ్డి భారీ మెజార్టీతో గెలిచినట్లు అర్థమైంది. నేను చెప్పిన వాగ్దానాలన్నీ ఎన్నికల తర్వాత నేనే వచ్చి మీ మధ్య ఉండి చేస్తనని హామీ ఇస్తున్న.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.