
– తుదిదశ అటవీ అనుమతులు జారీ – 204.48 హెక్టార్ల అటవీభూములు రాష్ట్ర నీటిపారుదలశాఖకు బదిలీ – ప్రభుత్వానికి అందిన ఉత్తర్వులు – చండీయాగం పూర్ణాహుతి రోజే శుభవార్త – అనుమతులపై సీఎం కేసీఆర్ హర్షం – వేగం పుంజుకోనున్న ప్రాజెక్ట్ పనులు
దక్షిణ తెలంగాణకు అత్యంత కీలకమైన ప్రతిష్ఠాత్మక పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తుది అటవీ అనుమతులు లభించాయి. ఈ మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఉత్తర్వుల ప్రతులను కేంద్ర అటవీశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రావణ్కుమార్వర్మ రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ఈ ఉత్తర్వుల ప్రకారం అచ్చంపేట అటవీప్రాంతంలోని 205.4811 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని రాష్ట్ర నీటిపారుదలశాఖకు బదిలీచేస్తారు. రెండవ, తుది అనుమతుల జారీ నేపథ్యంలో ప్రాజెక్టు పనులు మరింత వేగం పుంజుకోనున్నాయి. రాష్ట్ర సమగ్ర వికాసానికి నిర్వహిస్తున్న చండీయాగం పూర్ణాహుతి రోజే ఈ శుభవార్త అందడంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హర్షం వ్యక్తంచేశారు. కేంద్ర పర్యావరణశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు ధన్యవాదాలు తెలిపారు. అనుమతుల సాధనకు కృషిచేసిన నీటిపారుదల, అటవీశాఖ అధికారులను అభినందించారు.
బృహత్తర ఎత్తిపోతల పథకం ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో 12.3 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేయడంతోపాటు వేయికిపైగా గ్రామాలకు తాగునీరందించాలన్న ఉన్నత లక్ష్యంతో ప్రభుత్వం ఈ బృహత్తర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది. ప్రాజెక్టులో భాగంగా కొన్ని పనులను చేపట్టడానికి నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేటలోని 205.4811 హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని నీటిపారుదలశాఖకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అటవీశాఖను కోరింది. ఇందుకు అవసరమైన ప్రక్రియలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేయడంతో గతేడాది ఏప్రిల్ నెలలో కేంద్ర అటవీ సలహా కమిటీ మొదటిదశ అటవీ అనుమతులను ఇచ్చింది. తాజాగా నార్లపూర్ వద్ద అంజనగిరి జలాశయం నిర్మాణం, నార్లపూర్ అంజనగిరి- ఏదుల వీరాంజనేయ జలాశయం మధ్య టన్నెల్ తవ్వకానికి అటవీభూములు బదిలీచేసింది. ఈ మేరకు కొల్లాపూర్, పసుపుల రేంజ్ పరిధిలోని 204.48 హెక్టార్ల అటవీభూములను సాగునీటిశాఖకు బదలాయిస్తారు. ఇందులో ప్యాకేజీ-1 కింద కొల్లాపూర్ రేంజ్లో 170 హెక్టార్లు, ప్యాకేజీ-2 కింద కొల్లాపూర్ రేంజ్లో 35.6478 హెక్టార్లు, ప్యాకేజీ-4 కింద పసుపుల అడవులలోని లింగాల రేంజి పరిధిలో 0.4891 హెక్టార్లు ఉన్నాయి.
అటవీ భూములకు బదులుగా ప్రత్యామ్నాయ అడవుల సృష్టికి రూ.63 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కాంపెన్సేటరీ అండ్ ఎఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కంపా) నిధికి జమచేసింది. దీంతోపాటు నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేట పరిధిలో ప్రత్యామ్నాయ అడవుల పెంపకానికి 238 హెక్టార్ల రెవెన్యూ భూమిని కేటాయించింది. మరో 221 హెక్టార్లలో క్షీణించిన అడవులను పునరుద్ధరించనున్నారు. నదీ పరివాహక ప్రాంతాల అభివృద్ధికి, వన్యప్రాణుల సంరక్షణకు, అటవీప్రాంతం సరిహద్దుల చుట్టూ పిల్లర్ల నిర్మాణానికి వీలుగా ప్రత్యేకంగా రూ.1.62 కోట్లు కేటాయించింది. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అత్యంత ప్రాధాన్యం గల ప్రాజెక్ట్‌గా పరిగణించి పనులు పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 7న సాగునీటిరంగంపై జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈ విషయాన్ని స్పష్టంచేశారు. సీఎం ఆదేశాలతో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అడిషనల్ పీసీసీఎఫ్ (ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్) శోభ తదితరులు విధివిధానాలను పూర్తిచేసి తుది అటవీ అనుమతులు సాధించడంలో ప్రత్యేకంగా కృషిచేశారు.
యాగ ఫలం వచ్చింది.. శుక్రవారం.. ఒకపక్క సహస్ర చండీ యాగంలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి.. యాగంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వచ్చి సర్.. ఒక మాట.. మన రాష్ట్రానికి గుడ్ న్యూస్ సర్.. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వచ్చాయి అని చెప్పారు. ఈ శుభవార్త వినగానే ఒక్కసారిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ఆనందం! యాగఫలం అప్పుడే వచ్చిందని సంతోషం వ్యక్తంచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే అధికారులను అభినందించారు. తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు రైతాంగానికి శుభదినమని అన్నారు. ఇక పనుల్లో వేగం పెంచాలని అక్కడికక్కడే ముఖ్యమంత్రి ఆదేశించారు. తక్షణం కార్యక్షేత్రంలోకి దిగాలని నీటిపారుదల శాఖ అధికారులను కూడా ఆదేశించారు. పూర్ణాహుతి కార్యక్రమం అయ్యేలోపే ఉత్తర్వులు రావడం, వెనువెంటనే పనులపై కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచనలు ఇవ్వడం యాగశాల వద్ద కనిపించింది.