-పాత చెత్త వాహనాలకు కొత్త ఏడాదిలో స్వస్తి -ఘనవ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ ఆదర్శం -ఆధునిక కాంప్యాక్టర్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ఆధునిక పద్ధతిలో చెత్త తరలింపు, నిర్వహణతో హైదరాబాద్‌లో దుర్గంధం దూరం కానున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. ప్రస్తుతం చెత్త తరలింపునకు ఉపయోగిస్తున్న పాత వాహనాలకు కొత్త సంవత్సరంలో పూర్తిగా స్వస్తి చెప్పనున్నామని.. వీటి స్థానంలో అత్యాధునిక కాంప్యాక్టర్లు అందుబాటులోకి రానున్నాయని ప్రకటించారు. గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో భవన నిర్మాణ వ్యర్థాలను తరలించే 55 ఆధునిక స్వచ్ఛ వాహనాలు, సంజీవయ్యపార్క్ సమీపంలో ఆధునీకరించిన సెకండరీ కలెక్షన్, ట్రాన్స్పోర్ట్ సెంటర్లో చెత్త తరలింపు కేంద్రాన్ని మంత్రులు మహమూద్‌అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్‌తో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెండు డంపర్లు పెట్టుకుని.. రోడ్లమీద చెత్తవేసుకుంటూ వెనకొచ్చే వాహనదారులకు ఇబ్బందులు కలిగించే పాత చెత్తవాహనాలు రాబోయే నెల రోజుల్లో ఇక కన్పించవని చెప్పారు. హైదరాబాద్‌లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచామని, ఘనవ్యర్థాల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని అన్నారు. కాంప్యాక్టర్ల రాకతో అత్యాధునిక చెత్త తరలింపు వ్యవస్థ హైదరాబాద్ సొంతమవుతుందని తెలిపారు. ఇందుకు చొరువ తీసుకుంటున్న జీహెచ్ఎంసీ అధికారులు, రాంకీ ఎన్విరోటెక్ యాజమాన్యాన్ని అభినందించారు.

అన్ని హంగులుండాలి హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే అన్నిరకాల హంగులుండాలని, ఎక్కడా నేరాలు జరుగకూడదని, ఒకవేళ జరిగినా పసిగట్టే అత్యాధునిక యంత్రాంగముండాలని కేటీఆర్ తెలిపారు. కరోనా వైరస్ తర్వాత ప్రజల్లో ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై అవగాహన పెరిగిందని.. ఈ మేరకు ప్రభుత్వంవైపు నుంచి అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. చెత్త తరలింపులో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని.. కాంప్యాక్టర్ల రాకతో అవన్నీ పరిష్కారమవుతాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్ఎంసీ కమిషనల్ లోకేశ్‌కుమార్, రాంకీ ఎన్విరోటెక్ సీఈవో గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పారిశుద్ధ్యానికి పెద్దపీట రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్యానికి సీఎం కేసీఆర్ పెద్దపీటవేశారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి, పల్లెల్లో పల్లెప్రగతి పేరుతో పచ్చదనం, పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చారని చెప్పారు. ఐదేండ్లలో ఇండ్లనుంచి చెత్తను సమర్ధంగా సేకరించి, పారిశుద్ధ్య వ్యవస్థ ను మెరుగుపరిచామన్నారు. ప్రస్తుతం 2 వేల స్వచ్ఛఆటోల ద్వారా చెత్తసేకరణ జరుగుతున్నదని.. త్వరలో మరో 2,700 ఆధునిక వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు. జీహెచ్ఎంసీలో 44 లక్షల చెత్తబుట్టలను ఇంటింటికీ అందజేయడంతోపాటు, స్వచ్ఛ ఆటోలతో చెత్త సేకరణ సమర్థంగా జరుగుతున్నదన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లోనూ ఉన్నత స్థానాన్ని కైవసం చేసుకున్నామని..ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌లను వెనక్కి నెట్టిందన్నారు. చెత్తసేకరణ, తరలింపు కేంద్రాలను సైతం వికేంద్రీకరిస్తున్నామని వివరించారు.

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే అన్నిరకాల హంగులుండాలి. ఎక్కడా నేరాలు జరుగకూడదు. ఒకవేళ జరిగినా పసిగట్టే అత్యాధునిక యంత్రాంగం ఉండాలి. – మంత్రి కేటీఆర్
