Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పచ్చని తెలంగాణ కోసం..

స్వరాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం.. తెలంగాణ సాగునీటి రంగం దశ-దిశను మార్చే మహా ఒప్పందానికి నేడే శుభ ముహూర్తం. గోదావరి నది మీద ఐదు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి ఒప్పంద పత్రాల మీద మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులు నేడే సంతకాలు చేయనున్నారు. ఈ అపురూప ఘట్టానికి ముంబైలోని, సహ్యాద్రి అతిథిగృహం వేదికగా మంగళవారం ఉదయం 10:30 గంటల సమయాన్ని శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం మధ్యాహ్నమే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బృందం ముంబై చేరుకుంది. ఇరు రాష్ట్రాల నీటిపారుదలశాఖ అధికారులు ఒప్పందానికి అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు దశాబ్దాల తెలంగాణ కలను సాకారం చేసుకుని మంగళవారం సాయంత్రం తిరిగిరానున్న కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికేందుకు ఇక్కడ హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.

CM-KCR-with-Maharahtra-Governor-Vidyasagar-Rao

-గోదావరి బ్యారేజీలపై నేడు మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం -ముంబై చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ -రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు ఆత్మీయ స్వాగతం -నీటిపారుదలశాఖ మంత్రి , అధికారులతో సీఎం సమీక్ష -నేటి సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న కేసీఆర్.. ఘనస్వాగతానికి ఏర్పాట్లు

ముంబై చేరిన సీఎం బృందం..: గోదావరి బ్యారేజీలకు సంబంధించి తెలంగాణ-మహారాష్ట్ర మధ్య పరస్పర అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవటం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి బయలుదేరారు. ఆయన వెంట నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న,ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అంతర్రాష్ట్ర ప్రత్యేక సలహాదారు ధర్మపురి శ్రీనివాస్, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంఓ అదనపు కార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి ఉన్నారు. ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్‌రావు, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, చీఫ్ ఇంజినీర్లు వెంకటేశ్వర్లు, భగవంతరావు, వ్యాప్కోస్ ఎండీ శంభు ఆజాద్ ఒక బృందంగా, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి వేరుగా అంతకు కొన్ని గంటల ముందే ముంబైకి చేరుకున్నారు. మధ్యాహ్నం 2.20 గంటలకు ముంబై ఛత్రపతి శివాజీ విమానాశ్రమయంలో దిగిన సీఎం కేసీఆర్, మహారాష్ట్ర గవర్నర్ ఆహ్వానం మేరకు నేరుగా రాజ్‌భవన్ చేరుకున్నారు. సీఎం బృందానికి ఆత్మీయ స్వాగతం పలికిన విద్యాసాగర్‌రావు రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం విందు ఏర్పాటు చేసి ఆతిథ్యమిచ్చారు.

గంటన్నరపాటు సీఎం సమీక్ష మధ్యాహ్న భోజనం అనంతరం సీఎం కేసీఆర్ రాజ్‌భవన్‌లోనే మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో జరిపే చర్చలు, చేసుకునే ఒప్పందాలకు సంబంధించి రూపొందించిన డాక్యుమెంట్లను పరిశీలించి చిన్న మార్పును కూడా సూచించారు. ఇచ్చి పుచ్చుకునే ధోరణితో ఉభయ కుశలోపరి పద్ధతిలో పరస్పర అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. మంగళవారంనాటి ఒప్పందాలకు అంతా సిద్ధంగా ఉన్నామని అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఎనిమిది పేజీలుగా ఒప్పంద డాక్యుమెంట్… తెలంగాణ-మహారాష్ట్ర చేసుకున్న ఒప్పందానికి సంబంధించి డాక్యుమెంట్ ఎనిమిది పేజీలుగా ఉందని తెలిసింది. ఇందులో మొదటి రెండు పేజీలపై తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవిస్ సంతకాలు చేస్తారు. మిగిలిన ఆరు పేజీలపై ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులు సంతకాలు చేయనుండగా సాక్షులుగా రెండు రాష్ర్టాల చీఫ్ ఇంజినీర్లు కూడా సంతకాలు చేయనున్నట్లు తెలిసింది. సమీక్షలో భాగంగా సీఎం సూచించిన మేరకు అధికారులు వెంటనే ఆ మార్పును చేశారు. ల్యాండ్ అక్విజేషన్ అనే పదంతో పాటు ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ అనే పదాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతానికి భిన్నంగా సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణలో ల్యాండ్ ప్రొక్యూర్‌మెంట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని ఇంజినీర్లు మహారాష్ట్ర ఇంజినీర్లకు వివరించారు. దీంతో ఆ పదాన్ని చేర్చేందుకు కూడా మహారాష్ట్ర ఇంజినీర్లు అంగీకరించారు.

Harish-Rao-with-Governor-Vidyasagar-Rao

పనుల ప్రారంభమే లక్ష్యంగా.. మంగళవారం చేసుకునే ఒప్పందంలో భాగంగా గోదావరిపై నిర్మించే బ్యారేజీలకు సంబంధించి పనుల ప్రారంభానికి మార్గం సుగమం చేసుకొని రావాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలిసింది. లోయర్ పెనుగంగలో భాగంగా నిర్మించే చనాక-కొరాట బ్యారేజీకి ఎలాంటి సమస్య లేదు. మిగిలిన రెండు బ్యారేజీలను మహారాష్ట్ర నిర్మించాల్సి ఉన్నందున తెలంగాణకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. తుమ్మిడిహట్టిని 148 మీటర్లలో నిర్మించేందుకు అంగీకరిస్తున్నందున మహారాష్ట్రకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదు. అయితే మేడిగడ్డ వద్ద 103 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న బ్యారేజీకి సంబంధించి సూత్రప్రాయ అంగీకారాన్ని మహారాష్ట్ర నుంచి తీసుకోనున్నట్లు తెలిసింది. మేడిగడ్డ వద్ద గరిష్ఠ నీటి ప్రవాహం 103 మీటర్లు అయినందున కచ్చితంగా ఆ స్థాయిలో రక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున పనులు చేపట్టాల్సి ఉంది. అయితే గేట్లు ఏ స్థాయిలో అనేది మాత్రం ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేసే సాంకేతిక కమిటీ పర్యవేక్షించేందుకు అంగీకారానికి రానున్నట్లు సమాచారం. నేడు అంతర్రాష్ట్ర బోర్డు సమావేశం… రెండు రాష్ట్రాల ఒప్పంద ఏర్పాట్లలో భాగంగా సోమవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఒప్పందంలో భాగంగా చీఫ్ ఇంజినీర్ల స్థాయి సాంకేతిక కమిటీ ఒకటి ఏర్పాటు కానుంది. ఆ తర్వాత రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శులతో స్టాండింగ్ కమిటీ ఏర్పాటవుతుంది. ఇక రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, నీటిపారుదల శాఖ మంత్రులు సభ్యులుగా అంతర్రాష్ట్ర బోర్డు ఏర్పాటు అవుతుంది. దీనికి ఒక ఏడాది ఒక తెలంగాణ సీఎం, మరో ఏడాది మహారాష్ట్ర సీఎం ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు గోదావరి బ్యారేజీ ఒప్పందాల కార్యక్రమం పూర్తి కాగానే మధ్యాహ్నం అంతర్రాష్ట్ర బోర్డు తొలి సమావేశం ముంబైలో నిర్వహించేందుకు కూడా ఇరు రాష్ట్రాల ఇంజినీర్లు రంగం సిద్ధంచేసుకోవడం విశేషం.

లెండిపైనా స్పష్టతకు అవకాశం… తాజా ఒప్పందంలో భాగంగా గోదావరిపై ఉమ్మడి రాష్ట్రంలో చేసుకున్న ఒప్పందాలు, ప్రస్తుత ఒప్పందాలతో పాటు భవిష్యత్తులో చేసుకునేవి కూడా ప్రస్తుతం ఏర్పాటు కానున్న అంతర్రాష్ట్ర బోర్డు పరిధిలోకి వచ్చేలా అంగీకారం కుదుర్చుకోనున్నారు. ట్రిబ్యునల్‌కు లోబడి వ్యవహరించే ఈ బోర్డు అన్ని ఒప్పందాలను పర్యవేక్షించనున్నందున మంగళవారం జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ లెండి ప్రాజెక్టు అంశాన్ని కూడా లేవనెత్తనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో పదేండ్ల కిందట ఈ ప్రాజెక్టు మొదలైనా పునరావాసం, పునర్నిర్మాణం పనులు ఇంకా కొలిక్కి రాలేదు. ఎలాగూ గత ఒప్పందాలు కూడా తాజా బోర్డు పరిధిలోకి వస్తున్నందున లెండి ప్రాజెక్టులోని పెండింగు అంశాలపై కూడా స్పష్టత తీసుకురావాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు సమాచారం. అందుకు సంబంధించి అధికారుల నుంచి సీఎం వివరాలు కూడా తీసుకొని సిద్ధమైనట్లు తెలిసింది.

నేటి మధ్యాహ్నం తిరుగు ప్రయాణం… రాత్రి రాజ్‌భవన్‌లోనే బసచేసిన సీఎం కేసీఆర్ మంగళవారం ఉదయం 10 గంటలకు రాజ్‌భవన్ నుంచి నేరుగా సహ్యాద్రి అతిథి గృహానికి వెళతారు. అక్కడ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సమావేశమై గోదావరిపై నిర్మించే చనాక-కొరాట, రాజాపేట్, పిన్‌పహాడ్, తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలపై ఒప్పందం కుదుర్చుకుంటారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సంయుక్తంగా ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి మధ్యాహ్న భోజనం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు. సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు.

భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు… సాగునీటి రంగ చరిత్రలో చారిత్రక ఒప్పందాలు చేసుకొని వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు, రైతాంగం సిద్ధమవుతున్నది. అపర భగీరథుడికి బ్రహ్మరథం పట్టేందుకుగాను సోమవారం అన్ని జిల్లాల్లోనూ రైతులు వివిధ కార్యక్రమాలు ఏర్పాట్లు చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టుల ద్వారా లబ్ధిపొందే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, మెదక్, నల్లగొండ జిల్లాలకు చెందిన రైతులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలి వస్తున్నట్టు సమాచారం అందింది. మరోవైపు సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ బాధ్యతలు తీసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాలతో పాటు పలు జిల్లాల నుంచి వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలు, ముఖ్యంగా రైతులు మంగళవారం మధ్యాహ్నమే బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్నారు.

దశాబ్దాల తపన.. అహోరాత్రుల శ్రమ.. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే బృహత్తర భగీరథ యత్నం వెనుక ఎంతోశ్రమ ఉంది. మరెంతో తపన ఉంది. సీఎం కేసీఆర్ దాదాపు ఏడాదిన్నర పాటు సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై ఒక ఇంజినీర్‌లా రేయింబవళ్లు శ్రమించారు. సమైక్య పాలనలో దశాబ్దాల పాటు ఏ ఒప్పందమూ సాధ్యపడలేదు. భౌగోళిక పరిస్థితులూ సహకరించలేదు. అయినా రీడిజైనింగ్‌తో మార్గాన్ని చేసుకుంటూ సీఎం ముందుకు వెళ్లారు. ఎక్కడా తప్పులు దొర్లకుండా ఉండేందుకు పదేపదే సర్వేలు జరిపించారు. ఇదే పద్ధతిలో ఒప్పందాల కోసం తీవ్రంగా శ్రమించారు. పుట్టిన రోజు నాడు మహారాష్ట్ర సీఎంతో సమావేశమై ఆయన అభ్యంతరాలను విన్నారు. మనసు తెలుసుకున్నారు. క్లిష్టతరమే అయినా కేంద్రంతో సహా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఇరురాష్ట్రాలకు ప్రయోజనం ప్రాతిపదికన ప్రతిపాదనలు రూపొందించారు.

మహారాష్ట్రకు అవసరమైన పిన్‌గంగపై ముందు ఒప్పందం చేసుకుని సానుకూల వాతావరణం ఏర్పరిచారు. తర్వాత ఒక్కో సమస్యను పరిష్కరిస్తూ రాజకీయ చతురతను జోడించి ఆ రాష్ట్రాలను ఒప్పించారు. దశాబ్దాల తరబడి నీటికోసం తండ్లాడుతున్న తెలంగాణను గోదావరి వెల్లువతో అభిషేకించేందుకు రంగం సిద్ధంచేసి తెలంగాణ జలప్రదాతగా అపర భగీరథుడిగా మన్ననలు అందుకుంటున్నారు. ఒప్పందం ఫలించి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే.. ఉద్యమ సందర్భంనాటి తెలంగాణ గీతం.. జయజయహే గీతంలోని ఆకాంక్ష… గోదావరి కృష్ణమ్మలు మన బీళ్లకు మళ్లి.. పచ్చని మాగాణాల్లో సిరుల పంటలు పండి.. సుఖశాంతులతో సుభిక్షమై.. స్వరాష్ట్రమైన తెలంగాణలో స్వర్ణయుగం సాకారమవుతుంది!

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.