Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పచ్చవడ్డ పాలమూరు

-జిల్లాలో 30 లక్షల ఎకరాలకు నీళ్లు
-పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేశాం
-పారిశ్రామిక హబ్‌గా మహబూబ్‌నగర్‌
-పాలమూరు ఎంపీగా రాష్ట్రం సాధించా
-ఆ గుర్తింపు ఎన్నటికైనా ఈ జిల్లాదే
-జిల్లా అభివృద్ధికి 220 కోట్లు ఇస్తున్నా
-మహబూబ్‌నగర్‌ సభలో సీఎం కేసీఆర్‌

ఒకనాడు కరువు జిల్లాగా ముద్ర పడిన పాలమూరు.. నేడు పంటలతో పచ్చబడ్డదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్‌ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. రెండో దశ తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో తాను పాలమూరు ఎంపీగా ఉన్నానని కేసీఆర్‌ గుర్తు చేశారు. పాలమూరు ఎంపీగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించానని, ఎన్నటికైనా ఆ ఘనత, గౌరవం మహబూబ్‌నగర్‌ జిల్లాకే దక్కుతుందని చెప్పారు.

మహబూబ్‌నగర్‌లో అద్భుతమైన కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించుకొని, తన చేతులమీదుగా ప్రారంభింపజేసుకొన్నందుకు జిల్లా ప్రజాప్రతినిధులను, జిల్లా ప్రజలను అభినందించారు. పరిపాలన సంస్కరణల్లో భాగంగా 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, అన్ని జిల్లాల్లో అద్భుతమైన కలెక్టరేట్లను, కార్యాలయాలను నిర్మించుకొంటున్నామని చెప్పారు. ‘ఒకనాడు ఉద్యమ సందర్భంలో పాలమూరుకు వస్తే వేదనలు, రోదనలు, బాధలు. ఆ బాధ పోవాలని, మన రాష్ట్రం మనకు వస్తే బాగుపడతామని ఎన్నో కలలు కని, పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకొన్నాం. తర్వాత అనేక కార్యక్రమాలు చేపట్టి, జిల్లాను బాగు చేసుకొన్నాం.

దళితబంధుకు శ్రీకారం చుట్టినప్పుడు నేను, గోరటి వెంకన్న, సాయిచంద్‌ ఇతర రచయితలు పాటలు రాస్తుంటే.. పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోన అని ఆనాడు పాడినం.. ఇప్పుడు పల్లేర్లు మాయమైనయి. బొంబాయి బస్సులు బంద్‌ అయితున్నయి. వలస పోయిన బిడ్డలు వాపస్‌ వస్తున్నరు కాబట్టి..
‘వలసలతో వలవల విలపించు పాలమూరు
పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తిచేసి
చెరువులన్నీ నింపి పన్నీటి జలకం ఆడి
పాలమూరు తల్లి పచ్చని పైట కప్పుకొన్నది..
అని రాయాలని చెప్పిన’ అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

త్వరలో 25-30 లక్షల ఎకరాలకు నీరు
సమైక్య పాలకులు కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా వంటి ప్రాజెక్టులను దశాబ్దాలపాటు పెండింగ్‌ పెట్టారని, కోయిల్‌సాగర్‌ వంటి చిన్న లిఫ్ట్‌ను కూడా పూర్తి చేయలేదని కేసీఆర్‌ విమర్శించారు. రాష్ట్రం వచ్చిన వెంటనే స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, అధికారులందరం కలిసి పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసుకొన్నామని తెలిపారు. ‘మిషన్‌ కాకతీయతో చెరువులు బాగు చేసుకొన్నాం. వాగుల మీద చెక్‌డ్యామ్‌లు కట్టుకొన్నాం. 24 గంటల నాణ్యమైన కరెంటు ఇస్తున్నాం. వీటన్నింటివల్ల ఇప్పుడు పాలమూరు అంటే కరువు జిల్లా కాదు.. పచ్చబడ్డ పంటల జిల్లా అని పేరొస్తున్నది. ‘మహబూబ్‌నగర్‌కు పోయి వచ్చినం సార్‌.. అంతా మారిపోయింది’ అని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తున్నది’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పుడు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు మాత్రమే పెండింగ్‌లో ఉన్నదని అన్నారు. కేంద్రం నీటి వాటాను తేల్చడం లేదని, ప్రాజెక్టుకు సహకారం అందించడం లేదని కేసీఆర్‌ విమర్శించారు. ఈ ప్రాజెక్టు నుంచి నారాయణపేట, మక్తల్‌, కొడంగల్‌వైపు పోయే కాలువల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. అవన్నీ పూర్తయితే పాత, కొత్త కలిసి పాలమూరు జిల్లాలో 25-30 లక్షల ఎకరాల్లో పంటలు పండుతాయని చెప్పారు.

చెప్పిన మాట సాక్షాత్కారమైంది..
14 ఏండ్లు ఉద్యమం జరిగేటప్పుడు ‘తెలంగాణ వస్తే బ్రహ్మాండంగా బాగుపడుతం’ అని చెప్పానని, అది ప్రజల కండ్లముందే సాక్షాత్కారం అయ్యిందని సీఎం అన్నారు. వర్గం, కులం, జాతి, లింగ బేధం లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకొంటున్నామని తెలిపారు. ‘మంచినీటి సమస్య, కరంటు కొరత తీరాయి. సాగునీటి సమస్య చాలావరకు తీరింది. దళితబంధు, గొర్రెల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలతో అన్ని వర్గాలనూ ఆదుకొంటున్నాం’ అని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలు రోజూ కండ్ల ముందే కనిపిస్తున్నాయన్నారు. గతంలో పెద్దపెద్ద మాటలు మాట్లాడిన నాయకులు, కేసీఆర్‌కన్నా మూడింతల దొడ్డు, నాలుగింతల పొడుగు ఉన్న నాయకులు ఎవరైనా రైతుబంధు వంటి పథకం తెచ్చారా? అని ప్రశ్నించారు. మంత్రి మల్లారెడ్డిని ఉద్దేశించి ‘టైగర్‌ మల్లారెడ్డి..’ అని కేసీఆర్‌ సంబోధించారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దీంతో ‘సూడవోతే మల్లన్న గాలి బాగున్నది’ అనడంతో సభలో నవ్వులు విరబూశాయి.

పాలమూరు అభివృద్ధికి రూ.220 కోట్లు
పాలమూరు జిల్లాపై సీఎం కేసీఆర్‌ పలు వరాలు కురిపించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు దాదాపు 90% పూర్తయ్యాయని తెలిపారు. ఈ జిల్లాలోనే పుట్టిన కొందరు దరిద్రులు చిన్నచిన్న ఆటంకాలు కల్పిస్తున్నారని, వాటిని పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ‘నేను ఏ జిల్లాకు వెళ్లినా అక్కడి ఎమ్మెల్యేలు కోరికలు కోరుతుంటారు. ఇక్కడ కూడా పాలమూరు జిల్లా అభివృద్ధికి రూ.10 కోట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అడిగారు. పాలమూరు ప్రజలు నన్ను ఎంపీగా గెలిపించారు. ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి పాలమూరుపై ప్రత్యేకమైన అభిమానంతో ఈ నియోజకవర్గం ఆ నియోజకవర్గం అనే తేడా లేకుండా జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటికే ఇచ్చిన ఏసీడీపీ నిధులు రూ.5 కోట్లు కాకుండా, ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి రూ.15 కోట్ల చొప్పున మొత్తం రూ.220 కోట్లు మంజూరు చేస్తున్నా. ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ నిధులను అభివృద్ధి కోసం సద్వినియోగం చేసుకోవాలి. దళితబంధు అమలు చేసుకోవాలి. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలి’ అన్నారు.

పారిశ్రామిక హబ్‌గా మహబూబ్‌నగర్‌
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ నాయకత్వంలో అనేక మంచి పనులు జరిగాయని కేసీఆర్‌ అన్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం పారిశ్రామిక హబ్‌గా తయారవుతున్నదని చెప్పారు. ఇటీవలే ఐటీ సెంటర్‌ ఏర్పాటైందని, 300 ఎకరాల్లో ఫుడ్‌ పార్క్‌, 2 వేల ఎకరాల్లో అర్బన్‌ పార్క్‌, తాజాగా 9,500 కోట్ల పెట్టుబడితో అమరరాజా బ్యాటరీల ఫ్యాక్టరీ మహబూబ్‌నగర్‌కు రావడం సంతోషంగా అనిపించిందని అన్నారు. ఎన్నో రోజులుగా అనుకున్న బైపాస్‌ రోడ్డు నాలుగు లేన్లతో పూర్తయిందన్నారు. ఎంవీఎస్‌ డిగ్రీ కాలేజీలో స్పోర్ట్స్‌ స్టేడియం అడిగారని, వెంటనే జీవో జారీ చేయిస్తామని చెప్పారు. ఆడిటోరియం సైతం మంజూరు చేస్తామన్నారు.

ఇంటి జాగ ఉంటే రూ.3 లక్షలు
సొంత ఇంటి జాగ ఉన్న పేదలకు ఇల్లు నిర్మించుకొనేందుకు రూ.3 లక్షల సాయం అందిస్తామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ‘ఖాళీ స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చినం. ఈ మేరకు 15 రోజుల్లో ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇండ్లు కూడా మంజూరు చేస్తాం. పాలమూరు జిల్లాకు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి అదనంగా వెయ్యి ఇండ్లు మంజూరు చేస్తాం. పాలమూరు వెనకబడిన జిల్లా. మనం ఎవరి వెనుక పడం. దారిద్య్రం వెనుక పడుతాం. వెనుకబాటు వెనుక పడతాం.. దాన్ని తరిమేద్దాం. అందరం కలిసి అద్భుతమైన పాలమూరును నిర్మించుకుందాం’ అని పిలుపునిచ్చారు. త్వరలో అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటిస్తానని సీఎం తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.