Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పది రోజుల్లో.. పంటరుణ మాఫీ

-బంగారు తెలంగాణ సాధనకు అహర్నిశలు కృషిచేస్తా -తెలంగాణ ప్రజలు కన్న కలలు సాకారం చేస్తా -సంక్షేమానికి లక్ష కోట్లు ఖర్చుచేస్తాం -అందులో దళితులకు 50శాతం నిధులిస్తాం -వ్యవసాయం, ఆరోగ్య రంగాలకు పెద్దపీట -రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తా -జవాబుదారీ పాలన కోసం సలహా మండలి -ఉచిత నిర్బంధ విద్యకోసం ఏర్పాట్లు -గజ్వేల్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ -బలహీన వర్గాల గృహ నిర్మాణ పథకం గజ్వేల్ నుంచే ప్రారంభిస్తామని వెల్లడి

KCR 05-06-14

అది ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన మూడోరోజు నిర్వహించిన సభ! హంగు ఆర్భాటాల్లేవు.. సభపై ప్రచారం హోరెత్తిందీ లేదు. కేసీఆర్ వస్తున్నారంటూ భారీ ప్రకటనలూ లేవు. కానీ.. సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. తాము ఎమ్మెల్యేగా గెలిపించిన కేసీఆర్.. తెలంగాణ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి హోదాలో తమ ప్రాంతంలో తొలి సభకు హాజరుకావటాన్ని గజ్వేల్ ప్రజలు ఘనంగా స్వాగతించారు! కేసీఆర్ కూడా వారి ఆహ్వానానికి పులకించిపోయారు. ప్రజల్లో ఒకడిగా కలిసిపోయారు. ఉద్యమ సారథిగా ఇన్నాళ్లు ప్రజలతో కలిసి నడిచిన ఆయన.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కలలు తనకు తెలుసని, వాటిని నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని దృఢ సంకల్పాన్ని ప్రకటించారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజలకు రుణపడి ఉంటానన్న కేసీఆర్.. మీ కాలికి ముల్లు గుచ్చుకుంటే.. నా పంటితో తీస్తా అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.

సార్వత్రిక ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు పదిరోజుల్లోనే లక్షలోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రైతులకు రూ.లక్ష లోపు రుణాల మాఫీ కోసం బ్యాంకర్లతో సమావేశమై ఏర్పాట్లు చేశామని, మొత్తం రుణాలు దాదాపు రూ. 12 వేల కోట్ల వరకు ఉన్నట్టు తేలిందని, వాటిని వెంటనే మాఫీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సీఎం వెల్లడించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టిన తర్వాత కేసీఆర్ తొలిసారిగా బుధవారం ఎమ్మెల్యేగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా గజ్వేల్‌లో పర్యటించి బహిరంగసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రజల చెంతకు వచ్చిన ఆయనకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాజకీయ కూకటివేళ్లతో సహా పెకిలించి బయటపడేస్తానని, బంగారు తెలంగాణ సాధనకు అహర్నిశలు కృషిచేస్తానని పునరుద్ఘాటించారు. గజ్వేల్ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ చెబుతున్నా.. తెలంగాణ ప్రజలు కలలు కన్న బంగారు తెలంగాణ సాధనకు నిరంతరం కృషి చేస్తాను అని ప్రకటించారు.

తెలంగాణ ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే వినూత్నమైనదని, ఎక్కడా హింసకు తావివ్వకుండా సహనం, ఓర్పుతో రాష్ట్రం సాధించుకున్న తీరు ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుందని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ వస్తే మా ఉద్యోగాలు మాకే వస్తాయని, కృష్ణా,గోదావరి నీళ్లు అందుతాయని, అటవీ సంపద మనకే చెందుతుందని ప్రజలు ఎన్నో కలలు కన్నారని.. వాటిని సాధించుకోవడానికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. బంగారు తెలంగాణ కోసం తాను అహరహం కృషిచేస్తానని హామీనిచ్చారు. రాజకీయ అవినీతి అంతం చేయకపోతే అభివృద్ధి సాధ్యంకాదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అవినీతిరహిత రాజకీయాలతో స్వచ్ఛమైన పాలనను అందిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రమాణపూర్వకంగా చెప్తున్నా రాజకీయ అవినీతిని కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రయత్నిస్తాను.. రాజకీయ అవినీతిని ఎంతమాత్రం ఉపేక్షించబోం. ఎంతటివారినైనా శిక్షిస్తామని ప్రకటించారు.

పరిపాలన సవ్యంగా సాగడానికి, జవాబుదారీగా ఉండటానికి రాష్ట్ర సలహా మండలిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కమిటీలో మేధావులు, పత్రికా సంపాదకులు, ఇతర రంగాల నిపుణులు ఉంటారని వివరించారు. తన ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని అన్నారు. దళితులు, బలహీనవర్గాల, ముస్లిం, కైస్తవ మైనార్టీల సంక్షేమం తన తొలిప్రాధాన్యమని తెలిపారు. అందుకే ఈ సంక్షేమ శాఖల వ్యవహారాలన్నింటినీ తానే స్వయంగా చూసుకుంటున్నానని వివరించారు. వారి సంక్షేమానికి అధిక శాతం నిధులను ఖర్చు చేస్తానని, సంక్షేమ రంగానికి రూ. లక్ష కోట్లు ఖర్చుచేస్తామని,అందులో 50 శాతం దళితులకు ప్రత్యేక కోటా ఉంటుందని అన్నారు. ఆటోరిక్షాలకు రవాణ పన్ను మాఫీచేయడంతో పాటు వృద్ధులకు, వితంతువులకు రూ. 1000, వికలాంగులకు రూ. 1500 పింఛన్ అమలు చేస్తామన్న మాటకు కట్టుబడుతామని స్పష్టంచేశారు.

రూ. 3 లక్షల వ్యయంతో బలహీనవర్గాల వారికి అన్ని ప్రాథమిక సౌకర్యాలతో 125గజాల విస్తీర్ణంలో ఇళ్లను నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ఇళ్ల నిర్మాణం పథకానికి వెంటనే శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. వెంటనే దరఖాస్తుల కోసం కౌంటర్లను తెరవాలని మెదక్ కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు సూచించారు. గజ్వేల్ పట్టణంలోనే ఐదు వేల ఇళ్లు కట్టిస్తామని వెల్లడించారు. తన ప్రభుత్వం వ్యవసాయరంగానికి తగిన ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. గతంలో కొందరు పాలకులు వ్యవసాయం లాభసాటి కాదని, దాని వల్ల జీడీపీ పడిపోతుందని అన్నారు.అది తప్పు ఇప్పటికీ 80శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు అని సీఎం కేసీఆర్ వివరించారు.

గజ్వేల్‌తోపాటు రంగారెడ్డి ,మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలలో అవసరమైన చోట ఉద్యానవన కేంద్రాలను ఏర్పాటు చేస్తానని, గ్రీన్‌హౌజ్‌లను నెలకొల్పుతానని ఆయన ప్రకటించారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాకుండా జిల్లాల్లో కూడా పేదలకు ఆధునిక వైద్యసదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిమ్స్‌లాంటి ఆస్పత్రిని నెలకొల్పుతామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిని పెంచుతామని వివరించారు. పేద విద్యార్థులకు కేజీ నుంచి పీజి వరకు ఉచిత విద్య అనేది తన కల అని, దాన్ని సాకారం చేస్తానని సీఎం మరోసారి స్పష్టం చేశారు. దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి ఏడాది లేదా రెండేళ్లు పట్టవచ్చని చెప్పారు. రాజకీయాలను పక్కనపెట్టి కులమతాలకు అతీతంగా అందరు తెలంగాణ అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. అందుకే గజ్వేల్‌లో అన్ని పార్టీలను అభివృద్ధి సమీక్షా సమావేశానికి ఆహ్వానించామని కేసీఆర్ వివరించారు.

గజ్వేల్‌పై వరాల జల్లు గజ్వేల్ నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. తనను గెలిపించిన ఇక్కడి ప్రజల రుణం తీర్చుకుంటానని, ఎవరి కాలికైనా ముల్లు కుచ్చుకుంటే పంటితో తీస్తానని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. గజ్వేల్‌ పజ్ఞాపూర్‌లో నాలుగులేన్ల రింగ్‌రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో కలెక్టర్ స్మితాసబర్వాల్ అంకితభావం, చురుకుదనంతో వ్యవహరిస్తున్నారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నరసింహారెడ్డి, హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు బాబూమోహన్, పద్మాదేవేందర్‌రెడ్డి, సుధీర్‌రెడ్డి, చింతా ప్రభాకర్, ఎంపీ బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు కేసీఆర్‌కు ప్రజ్ఞాపూర్ నుంచి గజ్వేల్ వరకు ప్రజలు నీరాజనాలు పట్టారు. వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలుచోట్ల యక్షగాన ప్రదర్శనలను ఏర్పాటు చేయడం విశేషం..

ఏరియా అథారిటీ ద్వారా గజ్వేల్ అభివృద్ధి ఏరియా అథారిటీ కమిటీ ద్వారా గజ్వేల్‌ను రాజకీయాలకు అతీతంగా అభివృద్ది చేయడానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. మండలానికి కొంతమందిని సలహాదారులను ఎంపిక, చేసి నియోజకవర్గానికి కమిటీ ద్వారా అవసరమైన సమస్యలను తాను ప్రత్యేకంగా నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ద్వారా ప్రభుత్వ దృష్టికి చేరుతాయని పేర్కొన్నారు. ప్రజలకు అవసరంగా భావించిన ఆమోదయోగ్యమైన పనులకు వెంటనే నిధులు మంజూరవుతాయని సూచించారు. స్థానిక ప్రజలకు వ్యక్తిగత ఇబ్బందులు కలిగినా ప్రత్యేక అధికారి దృష్టికి తీసుకువెళితే సహకరిస్తారన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కోసం తాను నియమించిన ప్రత్యేక పీఏ ద్వారా అభివృద్దితో పాటు సమస్యల పరిష్కారానికి సహకారం పొందవచ్చన్నారు.

పార్టీలకతీతంగా గజ్వేల్ అభివృద్ధికి కృషి -రాష్ట్ర, జిల్లా, స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులతో కేసీఆర్ రాజకీయ వైషమ్యాలను దూరం పెట్టి అభివృద్ధిపై దృష్టి సారించి బంగారు తెలంగాణ నిర్మించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. గజ్వేల్‌లోని ప్రజ్ఞాగార్డెన్‌లో బుధవారం జరిగిన వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రజా సమస్యల పరిష్కారంలో పనిచేయాలని సూచించారు.

ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు వేర్వేరు కాదని, ఉద్యోగుల హితం కోరే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వారితో కలసి పనిచేస్తూ.. బంగారు తెలంగాణ నిర్మిస్తుందని పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని దేశంలోనే అభివృద్ధిలో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తనకు సహకరించాలని కోరారు. ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కమిటీ ద్వారా రాజకీయాలకు అతీతంగా గజ్వేల్‌ను అభివృద్ధి చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే తాను గ్రామాలను పరిశీలించడమేగాకుండా రాత్రి సమయాల్లో బస చేస్తానన్నారు. రెండేళ్లలోపు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి మంజీరా నల్లా కనెక్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలో రెండు నుంచి మూడు లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పిస్తామన్నారు.

గజ్వేల్‌లో దారిద్య్రంపై యుద్ధం ప్రకటించాలని, ముఖ్యంగా పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేస్తూ వారం రోజుల పాటు వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి తానుకూడా హాజరవుతానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి గజ్వేల్ నియోజకవర్గంలో 30లక్షల మొక్కలను నాటే చర్యలు చేపట్టాలని, ఇందుకు కలెక్టర్ వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు.

వరి విత్తనాలకు సబ్సిడీ వర్తింపు సమైక్య రాష్ట్రంలో వరి విత్తనాలపై సబ్సిడీ ఎత్తేయడంతో అదనపు భారానికి గురైన రైతాంగాన్ని ఆదుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రంలో వరి విత్తనాలకు సబ్సిడీ వర్తింపజేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు గజ్వేల్‌లో ప్రకటించారు. 2 రోజుల్లో ఈ ఉత్తర్వులు అమలవుతాయని, కలెక్టర్‌కు ఈ మేరకు తగిన సూచనలు రాష్ట్ర వ్యవసాయశాఖ అందించి సబ్సిడీ వర్తింపజేసుకుని ఖరీఫ్ రైతులకు వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.