Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాడి రైతుకు కేసీఆర్ వరాలు

-ఇంటికో సబ్సిడీ బర్రె -50శాతం సబ్సిడీపై పంపిణీ -ఎస్సీ, ఎస్టీలకు 75శాతం సబ్సిడీ -విజయడెయిరీ లాగే.. అన్ని డెయిరీలకూ రూ.4 ఇన్సెంటివ్ -దసరాకు ముందే అమలు -హైదరాబాద్ చుట్టూ పంటకాలనీలు -మన పాలు, మన కూరగాయలు, మన గొర్రెలు -అన్ని వృత్తులవాళ్లు బాగుండాలి -పాల ఉత్పత్తిదారుల సమావేశంలో సీఎం కేసీఆర్

కష్టపడి సాధించుకున్న తెలంగాణ క్షీర విప్లవం దిశగా అడుగులు వేయాలని, పాడిపంటల తెలంగాణగా రాష్ట్రం ఆవిర్భవించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. అన్ని రంగాలు, అన్ని వృత్తులవాళ్లు బాగుపడటంతోపాటు రాష్ర్టానికి సంపద సృష్టికర్తలుగా ప్రతి ఒక్కరినీ తీర్చిదిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం యాభైశాతం సబ్సిడీపై ప్రతి పాడిరైతు ఇంటికీ బర్రెలను పంపిణీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు 75శాతం సబ్సిడీపై బర్రెలను అందిస్తామని ఆయన అన్నారు. విజయ డెయిరీకి ఇస్తున్న మాదిరిగానే రాష్ట్రంలోని అన్ని డెయిరీలకు రూ.4 ఇన్సెంటివ్‌ను వారంలోగా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతిభవన్‌లో పాల ఉత్పత్తిదారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, రాష్ర్టానికి అవసరమైన పాలను ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకోకుండా ఎగుమతి చేసే స్థాయిలో పాల ఉత్పత్తి జరుగాలని ఆకాంక్షించారు. ఇందుకోసం అవసరమైనన్ని బర్రెలను పంపిణీ చేయటమే కాకుండా పాలను సేకరించే సామర్థ్యాన్ని పెంచేందుకు అవసరమైన యంత్రాలు, ఇతర మౌలిక, ఉత్పాదక సౌకర్యాల ఏర్పాటుకు త్వరలోనే శ్రీకారం చుడుతామని తెలిపారు. అరవై ఏండ్ల సమైక్య పాలనలో ఏ ఒక్కటీ కూడా సరిగ్గా జరుగలేదని, అన్ని వర్గాలూ నిరాదరణకు గురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్కొక్క రంగంపై దృష్టి పెట్టి అన్నింటా తెలంగాణను అగ్రభాగంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.

సబ్సిడీపై బర్రెల పంపిణీ తెలంగాణలో ఒక కోటి మూడు లక్షల కుటుంబాలున్నాయి. అన్ని కుటుంబాలకు సరిపడా పాల ఉత్పత్తి రాష్ట్రంలో జరుగడంలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 2లక్షల మంది పాడి రైతులున్నారు. డెయిరీల ద్వారా మొత్తం 7లక్షల లీటర్ల పాలు మాత్రమే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రానికి కోటి లీటర్ల పాలు అవసరం. మీరంతా మొత్తం కలిపి పోస్తున్నది 7లక్షల లీటర్ల పాలు. మనకు రోజూ ఆంధ్రకెల్లి 4 లక్షలు, 2 లక్షలు గుజరాత్ నుంచి వస్తున్నయి. కోటి లీటర్లు ఎక్కడా..7లక్షల లీటర్లు ఎక్కడా.. మనం ఎక్కడ్నో ఉన్నం. గిట్లున్నది మన చరిత్ర. ఇది చేసిన పార్టీవాడే మళ్లీ ఇప్పుడు లొల్లి పెడుతున్నడు బజార్ల్లొ. వాడు సక్కగా 7చందమామలు.. ఆరు సూర్యుళ్లు తెచ్చిపెడితే నేను వచ్చి కరాబు చేస్తున్ననట. కాంగ్రెసోళ్ల మాటలకు అర్థంపర్థం ఉన్నదా? రాష్ట్రంలో ఉన్న పాల కొరతను తీర్చేందుకు త్వరలోనే క్షీర విప్లవం కొనసాగించడానికి ఒక స్కీం తెస్తం. గొర్రెల పంపిణీ లాగానే బర్రెల పంపిణీ చేపడుతాం. రెండు లక్షల మంది పాడి రైతులకు 50శాతం సబ్సిడీపై బర్రెలను పంపిణీ చేస్తం.. ఎస్సీ, ఎస్టీలకు 75 శాతం సబ్సిడీ వర్తిస్తుంది. బర్రెలను నేరుగా రైతులే కొనుక్కోవాలి. నెల రోజుల్లో డబ్బులు సమకూర్చుతం. రెండు నెలల్లో బర్రెలను కొనాలి. మరో ఆరేడు నెలల తర్వాత పాల ఉత్పత్తి పెరుగాలి. దీనికి సంబంధించిన కార్యక్రమం ఎప్పుడు మొదలుపెట్టినా మొదటి ప్రాధాన్యం రెండు లక్షల మంది పాడి రైతులకు ఇస్తాం. ఇతర రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకుంటున్న మనం.. ఒక సంవత్సర కాలంలోనే ఎగుమతి చేసే స్థాయికి ఎదుగాలె. పది లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగాలె. మన రాష్ర్టానికి సరిపడా పాల ఉత్పత్తిని మనమే చేసుకోవాలె.

24నుంచి రూ.4 ఇన్సెంటివ్ అమలు పాల విషయంలో విజయ డెయిరీకి కర్ణాటక ప్రభుత్వం మాదిరిగానే నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నాం. వచ్చే వారం నుంచి తప్పకుండావిజయ డెయిరీ మాదిరిగానే నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి సొసైటీలకు నాలుగు రూపాయల ఇన్సెంటివ్ దసరా లోపు చెల్లిస్తాం. ఈనెల 24 లోపే అమలవుతది. రైతులందరూ పాడి పశువులను చక్కగా పెంచుకోవాలి. పాల సొసైటీలను ఏర్పాటు చేసుకోవాలి. నల్లగొండలో కూడా పాల కేంద్రంపై దృష్టి పెట్టాలని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నా వెంటపడుతున్నడు. కామారెడ్డి, నిజామాబాద్ లాగ కరీంనగర్, నల్లగొండ జిల్లాలపై చూడాలని వెంటపడుతున్నడు. ఒక పని చేపట్టాలంటే దానికి తరిఖా ఉంటది.. సరైన తరిఖాలో అది తప్పకుండా చేస్తాం. చెప్పిన పని వెంటనే కావాలంటే అధికారులు చేయాలి. ప్రభుత్వం చేసే పని అంటే వైకుంఠపాళి మాదిరిగా ఉంటది. వాటన్నింటిని అధిగమించి ముందుకుపోయినం. ఇంకా పోతాం. రైతులు కోరిన విధంగా విజయడెయిరీ మాదిరిగా నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్ పాల సొసైటీలకు కూడా రూ.4 ఇన్సెంటివ్‌ను వారం రోజుల్లో అమలు చేస్తాం.

ఇంటికి ఆరు చెట్లు పెంచండి పాల ఉత్పత్తిదారులవి 2 లక్షల కుటుంబాలున్నాయి. మీతో నాది ఒక్కటే కోరిక. ఇంటికి ఆరు చెట్లు నేను సప్లై చేస్తా. పన్నెండు లక్షల చెట్లు. మీరు ఇంటికి ఆరు చెట్లు ఖచ్చితంగా పెంచాలె. ఇంటి చుట్టు ఆరు చెట్లు ఉంటే మనకే చల్లదనం. మనకు మంచిది. పెంచకపోతే నామీద ఒట్టే. పెంచిన ఆరు చెట్లకు ఇంట్లోని వాళ్ల పేర్లు పెట్టుకొని.. ఎవరి పేరు ఉంటే ఆ చెట్టుకు వాళ్లే నీళ్లు పోయాలి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నది.. పిల్లలు పెరిగే వాతావరణం లేకుంటే ఎన్ని లక్షలు సంపాదించి ఇచ్చినా వృథా.

మత్స్యకారులు సంతోషంగా ఉన్నరు బెస్తోళ్లు. ముదిరాజ్‌లు చేపలు పడుతరు. చేపలకు మంచి గిరాకీ ఉంది. చెప్పుకొంటే పరువు పోతది. మనకు చెరువులు, ప్రాజెక్టులు, నదులు, కుంటలు లేవా.. కానీ హైదరాబాద్ సిటీకి రోజుకు 40 లారీల చేపలు ఇతర ప్రాంతాల నుంచి వస్తాయి. ఆంధ్రకెల్లి వస్తే చేపలు తినాల్నా? 40 లక్షల మంది ముదిరాజ్, బెస్తోళ్లు ఉన్నారు. వాళ్లకు అప్పజెప్తే పనిచెయ్యరా..? మంచి చేపలు దొరుకయా..? ఆంధ్రకెల్ల్లి, బొంబయి కెల్లి మనకు చేపలు వస్తయి. ఎండిపోయిన చేపలు కూడా బొంబయి నుంచి వస్తే అవి మనం కొనుక్కొని తినాల్సిన గతి అవసరమా..? వెయ్యికోట్లతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్టుపట్టి చేపలు పెంచే పని చేయిస్తున్నడు. రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు, నదుల్లో చేపపిల్లలను వేసుకున్నాం. మత్స్యకారులు సంతోషంగా ఉన్నరు.

హైదరాబాద్ చుట్టూ పంట కాలనీలు పాలు, కూరగాయలకు హైదరాబాద్ గింతపెద్ద మార్కట్ కదా. కోటి జనాభా ఉండే నగరం. హైదరాబాద్ చుట్టూ నూరు కిలోమీటర్ల లోపల రైతు ధనవంతులుండాలి. హైదరాబాద్‌కు వచ్చేవాటిలో 10శాతమే మనం పండించేవి. 90 శాతం బెంగుళూరు, రాయ్‌పూర్, ఇతర ప్రదేశాల నుంచి వస్తున్నయి. మన రైతులు విషం తాగి సచ్చుడు, ఆత్మహత్య చేసుకునుడు అప్పులపాలవుడు. ఎందుకుండాలి ఆ పరిస్థితి..? ఈ పరిస్థితి పోవాలి. హైదరాబాద్ చుట్టూ పంట కాలనీలను ఏర్పాటు చేస్తున్నాం. ఉద్యానశాఖ ద్వారా కూరగాయలు పండించే రైతులను ప్రోత్సహిస్తున్నాం. భవిష్యత్తులో మనకు సరిపోయే కూరగాయలను మనం పండించడమే కాకుండా.. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి రైతులను తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నాం.

అప్పటి గోస ఇప్పుడు లేదు ఒక్కొక్కటిగా సదురుకుంటా పోతున్నాం. ముందుగాల ఏం కావాలా.. ముసలోల్లు, భర్త చనిపోయినోళ్లు, ఒంటిరి స్త్రీలు, ఆకలి చావుతో ఎవరూ చావొద్దనుకున్నం. వాళ్లకు ఇచ్చే పెన్షన్‌ను వెయ్యిరూపాయలకు పెంచినం. బువ్వకు ఢోకాలేదు. ఎవ్వడు ఉపాసం పండుకుంటలేడు. ఎరువులు యాళ్లకు తెచ్చుకుంటున్నం. మునుపటోళ్లే ఉన్నదా గోస. అందుతున్నాయి కదా..? ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతున్నయి. క్రమం తప్పకుండా ఎవరికి ఎన్ని బస్తాలు కావాలో అన్ని దొరుకాలి. ఆ లైన్లు కట్టుడు, చిట్టీలు ఇచ్చుడు. మనం పైసలు పెట్టి కోనేది కదా.. ఒకటే బస్తా .. రెండు రావంటడు. దానికి ఇంతింత లైను కట్టాలి. చెప్పులు లైన్లో పెట్టాలి. అన్నం తినపోతే లైన్‌లో చెప్పులు. ఇవన్నీ చూసినం కదా..? ఇవన్నీ చేసినోళ్లు మళ్లీ ఇప్పుడు లొల్లి పెడుతున్నారు.

కరెంటు సమస్యను అధిగమించినం కరెంటు నయమైంది. నేను ఏం చెప్తున్నా అంటే ముందుగాల 24 గంటలు రానీ.. అది బలపడద్దా. ఎప్పుడు గిట్లనే ఉంటామా ఉండం కదా..? మొన్నటి దాకా బేకారుగా ఉన్నం. ఇవాళ కరెంటు నయం చేసుకున్నం. 24 గంటల కరెంటు ఇస్తామంటే 12 గంటలు చాలు అంటున్నరు. దీంతో బోర్లు ఎత్తిపోవుడు లేకుండా పోయింది. రెండేళ్లు అయితే గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడుగుతా. ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే వంద శాతం గోదావరి నీళ్లు రావాలె. మన హక్కు అది. ఎవడో బిచ్చమిచ్చేది కాదు. అవి రావాలని తిప్పలపడుతున్నాం. మంత్రులు , ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా రాత్రిపగలు పనిచేస్తున్నరు. మీ కరీంనగర్ జిల్లా వాళ్లకు తెలుసు కాళేశ్వరం పనులు మీ దగ్గరే నడుస్తున్నయి. ఆ నీళ్లు వచ్చినయి అనుకో మన చెరువులు ఎండయి. 365 రోజులు నిండే ఉంటాయి. ఎనకట చిన్నప్పుడు తిన్న ఎర్రరొయ్యలు మళ్ల పుడుతాయి. చిన్పప్పుడు తిన్న జల్లె, చందమామ చేపలు మళ్లీ పుడుతాయి. ఇప్పుడు మాయం అయిపోయినయి. నీళ్లు జాళ్లు పుట్టే తెలంగాణ అయితది. విత్తనం, ఎరువు యాళ్లకు వచ్చేట్టు చేసుకున్నం. చెరువులు లోతు చేసుకున్నం. మిషన్ కాకతీయ పెట్టుకుని చెరువుల పూడికలు తీసుకుంటున్నం. తెల్లారివరకే అయితదా ఏరుపడ్డ సంసారం. సమయం పట్టదా. ఇంకా చాలా జరగాలే. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, జోగు రామన్న, ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, బోయినపల్లి వినోద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, ఎన్.భాస్కర్ రావు, రవీంద్రనాయక్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భూమారెడ్డి, మదర్ డెయిరీ చైర్మన్ గుత్తా జితేందర్‌రెడ్డితో పాటు నల్లగొండ, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పాడి రైతులు పాల్గొన్నారు.

డెయిరీలను విస్తరించాలి పాల ఉత్పత్తితోపాటు సేకరణ పెరుగాలె. దాన్ని సేకరించే సామర్థ్యం కూడా పెరుగాలె. ఎక్కువ పాలు వస్తే దాన్ని పొడిచేసి ఎట్ల నిలువ చేయాలి? వాటికి అవసరమైన మిషన్లు తేవాలి. క్షీరవిప్లవం దిశగా మనం అడుగులు వేస్తాం. మన రాష్ట్రంలో మన పాలు మనమే తాగేటట్లు, మన పిల్లలకు స్వచ్ఛమైన పాలు వచ్చేట్లు చేద్దాం. సబ్సిడీపై పశువులను ఇవ్వడమే కాకుండా.. రైతులకు ఇంకా చాలా చెయ్యాలి. చాప్ కట్టర్స్ ఉంటయి. గడ్డి కోసే మిషన్లు, ఇవన్నీ కూడా తయారుచేసి.. ఒక పద్ధతిగా.. చాలా పకడ్బందీ చేయాల్సి వస్తది. ఇందుకోసం ఓ పథకం రూపకల్పన చేయాల్సి ఉన్నది. ఇప్పటివరకు రెండు మూడు స్కీంలు సక్సెస్ అయినయి. యాదవుల గొర్రెల పెంపకం, చేపపిల్లల పెంపకం జరిగిపోతున్నది. కరెంటు బాధ పోయింది. ఇప్పుడు పాల ఉత్పత్తి పెంచే పథకంపై దృష్టిపెట్టినం. మూడు నాలుగు నెలలైతే మిషన్ భగీరథ పనులన్నీ అయిపోతయి మీ గ్రామాల్లో. రాష్ట్రమంతటా భగీరథ నీళ్లు వస్తున్నయి. ఆలేరు, భువనగిరికి భగీరథ నీళ్లు వచ్చినయి. గంధమల్ల వస్తది. బస్వాపూర్ వస్తది. తెలంగాణలో ఉన్నం కాబట్టి పక్కా వస్తది.

గొల్ల కుర్మలు బాగుపడుతున్నారు పాల ఉత్పత్తి సంగతి అట్లా ఉంటే.. 30లక్షల మంది గొల్ల కుర్మలు మన రాష్ట్రంలో ఉంటే మనం హైదరాబాద్‌లో తినే మాంసానికి.. ఊర్లకుగానీ 650 లారీల గొర్రెలు రాజస్థాన్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. సిగ్గుచేటు కదా ఇది. పరువు తక్కువ ముచ్చట కదా. మనకు లేరా మంది, అంటే పనిచేసేటోళ్లు.. పెంచేటోళ్లు ఉన్నారు. ఒక్క హైదరాబాద్‌కే 350 లారీలు వస్తాయి ప్రతి రోజు. మరీ మనం ఏం చేస్తున్నట్టు.. ఏపీలో ఏం జరిగినట్టు. వాళ్ల కర్మానికి వాళ్లను వదిలేశారు. పట్టించుకోలేదు. ఇయ్యాళ్ల మనం 7 లక్షల మంది యాదవులకు గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. మొదటి దశలో 84 లక్షలు, తదనంతరం మరో 3 లక్షల గొర్రెలు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటికీ 19 లక్షలు దాటినయి. గొర్రెల పెంపకంతో గొల్ల కుర్మలు బాగుపడుతున్నారు. మన రైతులకు సేంద్రియ ఎరువు దొరుకుతది. భూమి బలంగా అయితది. అన్ని రకాలుగా లాభం. కానీ ఈ పని గతంలో జరుగలేదు. ఇవి తెస్తే కూడా గొర్రెలా అని అంటున్నరు తెలివితక్కువ గొర్రెలు. గొర్రెలు అవసరం లేదా? యాదవ సోదరులకు గొర్రెలు దండిగా ఇచ్చుకుంటున్నాం. వాళ్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు. గొర్రె బలిస్తే గొల్లాయనకు నయం. గొల్లాయన బలిస్తే తెలంగాణకు నయం.

అప్పులు లేకుండా రైతులు బతుకాలె తెలంగాణలో అప్పులు లేకుండా రైతులు బతుకాలె. బంగారు తెలంగాణలో రైతులది కీలక పాత్ర ఉంటుంది. వచ్చే మే నెల నుంచి ఎకరానికి రైతు ఖాతాల్లో రూ. 8వేలు ఇస్తం. రైతులు పైరవీకారులను పట్టుకొని మోసపోకుండా వాళ్ల ఖాతాల్లోకే నేరుగా పైసలు జమ చేస్తం. రైతులు ఏ అధికారులకు లంచం ఇవ్వద్దు. అధికారులు ఎవరు లంచం అడిగిన నాకు చెప్పండి.. అధికారులు సూచించిన పంటలనే రైతులు వేసుకోవాలె. ప్రాజెక్టుల ద్వారా పొలాలకు నీరు అందిస్తం. అలాగే బోర్లకు నిరంతర విద్యుత్ అందిస్తం. పండించిన పంటలకు సరైన మద్దతు ధర కల్పిస్తం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. రైతులు బాగు పడాలంటే రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలె. ప్రతి గ్రామానికి రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలె. ప్రతి మండలానికి రైతు సంఘం ఏర్పాటు చేస్తం. గ్రామ సంఘంలో ప్రతి రైతు మెంబర్‌గా పేరు నమోదు చేసుకోవాలె. రైతు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర రైతు సంఘంలోనే నిర్ణయిస్తం. సరైన ధరకు రైతులు పంటను అమ్ముకునేలా మండల రైతు సంఘం పని చేయాలె.

ప్రతి మండల కేంద్రానికి ఒక పంట కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ప్రభుత్వం చెప్పిన మద్దతు ధరకే కొనుగోలు చేస్తం. రైతులు అందరు మార్కెట్‌కు ధాన్యం ఒకేసారి తీసుకుపోవద్దు. రైతు సంఘం సూచించిన ప్రకారం రైతులు మార్కెట్‌కు ధాన్యం తరలించాలె. మన పంట- మన రైతులు- మన ధర అనే విధంగా రైతులు ఉండాలె. ఇప్పటి దాక దళారులది నడిచింది. ఇప్పుడు రైతులది నడవాలె. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర రైతు సంఘం ఉంటది. ధాన్యం కొనుగోలు చేయడానికి ప్రభుత్వం అధికారం ఇస్తది. పైసలు ఇస్తది. ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర రైతు సంఘానికి బ్యాంకు రూ.5 వేల కోట్ల రూపాయలు గ్యారంటీ ఇస్తది. రైతు సంఘం ధాన్యం కొంటది. వడ్లను బియ్యం పట్టించడానికి వారికి ప్రభుత్వం తరపున పూర్తి పర్మిట్ ఇస్తది. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా గ్రామగ్రామాల్లో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నం. దీన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. వాళ్లు చేయరు ఇంకొకరిని చేయనివ్వరు.

భూముల లెక్కలు తేలాలె గ్రామాల్లో భూములు ఉన్నయి. ఆ భూములయి పెద్ద కథ. భూమి ఒకరి పేరు మీద ఉంటే…దాన్ని రాత్తాడు మరొకడు. జుట్లు ముడేత్తరు పంచాయితీ పెడ్తరు. వీనిది వానికి.. వానిది వీనికి. ఈ బాధలు పోయేందుకు భూముల సర్వే కోసం గ్రామాలకు సర్వే టీంలు వచ్చినయి. ఈ పని 80 ఏళ్ల కిందట చేసిండ్రు. మధ్యలో చేయలే. మళ్ల ఇప్పుడు చేస్తున్నం.ఒకసారి భూముల లెక్కలు మంచిగ తేలితే ఇప్పుడు ఎకరానికి రూ.4వేలు పెట్టుబడి ఇద్దామనుకున్నం. మన రైతులు అప్పుల పాలై ఉన్నరు. కాబట్టి ఒక ఐదారేళ్లు గోదావరి నీళ్లు తెచ్చి కడుపునిండా కరెంటు ఇచ్చి ఎకరానికి రూ.4వేలు ఏడాదికి రూ.8వేలు పెట్టుబడి సర్కార్ ఇత్తే.. ఇప్పుడు రైతు పరిస్థితి ఘోరంగా ఉన్నది.

ఉద్యోగం ఉండి వ్యవసాయం చేసేటోడు, వ్యవసాయం ఉండి వ్యాపారం చేసేటోడు మంచిగనే ఉన్నడు. పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు పరిస్థితి మంచిగ లేదు. పేరుకు పటేలు. తెల్లబట్టలు వేసుకుని తిరుగుతడు.యెనుక చూస్తే ఏం లేదు. ప్రతి ఒక్కరికి రెండు, మూడు లక్షలకు తక్కువ లేదు అప్పు. ఆ అప్పులు కట్టి మళ్లో రెండు లక్షలు రైతు జేబులకు చిల్లర రావాలె. దేవుని దయవల్ల.. ఈయింత కాలమైతే.. చెరువులు, కుంటలన్నీ నిండాలె. పునాస పంటలైతే గడ్డకు పడ్డం. కిందికో మీదికో ఎళ్లినం. కానీ.. ఈయింత కూడా నీళ్లు నిండితే మనం బతికిపోతం. మనందరం కూడా ఇంకా బాగుపడాలి. మంచి పంటలు పండాలె. పాడి, పంట రెండింటితోనూ తెలంగాణ వర్ధ్థిల్లాలె. మన పిల్లలు బాగుండాలె. తెచ్చుకున్న తెలంగాణ సార్థకం కావాలె.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.