Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పగటికలల కాంగ్రెస్!

-అందులో రిజైన్‌లేగానీ జాయినింగ్‌లుండవు -అధికారం రాదనే భయంతో కాంగ్రెస్ నేతలు -అందుకే అబద్ధాల ప్రచారంతో పబ్బం గడుపుతున్నరు -భూ రికార్డుల ప్రక్షాళనపై కోర్టులకు పోతమంటున్నరు -రైతులకు మేలు చేస్తుంటే ఇంత కండ్ల మంట ఎందుకు? -కాంగ్రెస్ నాయకులకు రైతులే తగిన బుద్ధి చెప్తరు -తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి హరీశ్‌రావు

అన్ని వర్గాలు టీఆర్‌ఎస్‌కు దగ్గర కావడాన్ని కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు విమర్శించారు. ఇక అధికారంలోకి రావడం కల్లేనని తేలడంతో ఆ పార్టీ నాయకులను మానసిక వ్యథ పట్టి పీడిస్తున్నదని ఎద్దేవాచేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదలచేశారు. నిరాశా, నిస్పృహలు తారస్థాయికి చేరడంతో మరింత దిగజారిన కాంగ్రెస్ నాయకులు టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల నమ్మకాన్ని, కార్యకర్తల బలాన్ని కోల్పోయిన కాంగ్రెస్ నాయకులు పగటికలలు కంటున్నారని ఎద్దేవాచేశారు. ఆ పార్టీ మునిగిపోతున్న నావ అని అభివర్ణించిన మంత్రి.. అందులో ఎక్కడానికి ఎవరూ ముందుకు రారన్నారు. కాంగ్రెస్‌లో రిటైర్మెంట్లే తప్ప రిక్రూట్‌మెంట్లు ఉండవు. రిజైన్లు తప్ప జాయినింగ్‌లు ఉండవు అని వ్యాఖ్యానించారు. జాతీయస్థాయిలో ప్రధాన ప్రతిపక్ష హోదా కోల్పోయిన ఆ పార్టీ 2019లో తెలంగాణలో కూడా ప్రతిపక్ష హోదా కోల్పోక తప్పదని అన్నారు. కాంగ్రెస్ నాయకులు భ్రమలోబతుకుతూ.. ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నరు. కానీ వాళ్ల మాయమాటలను ఏనాడూ ప్రజలు నమ్మలేదు. 2014 ఎన్నికలతోపాటు ఆ తర్వాత వచ్చిన ప్రతి ఉప ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులకే ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి ఆ ఎన్నికలు ప్రజాభిప్రాయానికి కొలబద్దలు కావా? అని హరీశ్ ప్రశ్నించారు.

రైతులకు మేలు చేయడం ఇష్టం లేదా? భూ రికార్డులను సరిచేస్తామంటే కాంగ్రెస్ నాయకులు ఎందుకు విమర్శిస్తున్నారో అర్థం కావడంలేదని హరీశ్‌రావు అన్నారు. నిజాం కాలం తర్వాత మళ్లీ భూ సర్వే జరుగలేదని గుర్తుచేశారు. రికార్డులన్నీ ప్రక్షాళన చేయకపోవడంతో గందరగోళంగా ఉందని, అస్తవ్యస్త రికార్డుల వల్లనే భూ వివాదాలు, అక్రమాలు పెరిగిపోతున్నాయని చెప్పారు. అందుకే గ్రామసభలుపెట్టి, రైతుల భాగస్వామ్యంతో రికార్డులను సరిచేయాలని ప్రభుత్వం అనుకుంటున్నదని తెలిపారు. భూ వివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడాలని, రైతులకు భూ హక్కులపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని చెప్పారు. దీనికి కాంగ్రెస్ నాయకులు ఎందుకు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నారో చెప్పాలని డిమాండ్‌చేశారు. భూ రికార్డులను సంస్కరించడంవల్ల అవినీతికి ఆస్కారం ఉండదని కాంగ్రెస్ నాయకులు ఆందోళన చెందుతున్నారా? వారుచేసిన భూదందాలు బయటకు వస్తాయని జంకుతున్నారా? బినామీ భూములు కోల్పోతామని వణుకుతున్నారా? అని హరీశ్ ప్రశ్నించారు. కోర్టుకు వెళ్లి ఈ ప్రక్రియను అడ్డుకుంటామని ప్రకటించడం ఆ పార్టీ నేతల నైరాశ్యానికి నిదర్శనమన్నారు. ఆదర్శ రైతుల పేరిట కాంగ్రెస్ పార్టీ వారి కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచిపెడితే.. తెలంగాణ సర్కారు మాత్రం స్వచ్ఛందంగా రైతు సంఘాలు, రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేస్తున్నదన్నారు. రైతులకు మేలు జరుగుతుందంటే కాంగ్రెస్‌కు ఇంత కండ్ల మంట ఎందుకని ప్రశ్నించారు.

ఇది రైతుల బాధలు తెలిసిన సర్కారు.. రైతులకు కరెంటు ఇస్తే ఓర్వరు. ఎకరానికి రూ.8వేల పెట్టుబడి ఇస్తమంటే వంకలు పెడుతరు. ప్రాజెక్టులు కడుతమంటే అడ్డుకుంటరు. చెరువులు పునరుద్ధరిస్తే గుండెలు బాదుకుంటరు.. ఇదెక్కడి అన్యాయం? ఇంత విపరీత ధోరణి ఎందుకు? అసలు రైతులకు ఏం చేసినా ఆ పార్టీ నాయకులకు నచ్చదా.. అని మంత్రి నిలదీశారు. రైతులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంవైపు ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పుట్టగతులు ఉండవనే భయంతోనే రైతులకు నష్టంచేసేందుకు ఆ పార్టీ నేతలు వెనుకాడటం లేదన్నారు. రాజకీయ స్వార్థం కోసం రైతులను బలి చేస్తారా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు తమ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే రైతులే బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో వ్యవసాయాభివృద్ధికోసం, రైతుల కోసం పనిచేసిందిలేదని, అందుకే టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా వాళ్ల లాగనే ఉండాలని కోరుకుంటున్నారని ఎద్దేవాచేశారు. కానీ టీఆర్‌ఎస్ సర్కారు మాత్రం అలా ఉండదని, తమది ఉద్యమ స్ఫూర్తి ఉన్న ప్రభుత్వమని మంత్రి చెప్పారు. రైతుల బాధలు తెలిసినందున వారిని అప్పుల ఊబిలో నుంచి బయటపడేయాలని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కంకణం కట్టుకున్న ప్రభుత్వమని చెప్పారు. రైతులకు మేలుచేసే తమ చిత్తశుద్ధిని పిచ్చి చేష్టలతో, కుట్రలతో భగ్నంచేయలేరని మంత్రి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు పోతున్నదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఛాయలు ఏ కోశానా కనిపించడం లేదని స్పష్టంచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.