Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పకడ్బందీగా ప్రక్షాళన

-భూ రికార్డులను సరిచేసేందుకు 1193 బృందాలు ఏర్పాటుచేయాలి -ఒక్కో బృందానికి తొమ్మిది గ్రామాలు -మూడునెలల్లో కార్యక్రమం పూర్తికావాలి -అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం -త్వరలో తహసీల్దార్లతో సమావేశం

భూమి రికార్డుల ప్రక్షాళన పకడ్బందీగా, అత్యంత పారదర్శకంగా జరుగాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్షాళనలో ఏ ఒక్క రైతుకు ఎలాంటి హాని కలుగకూడదని స్పష్టంచేశారు. రికార్డుల ప్రక్షాళన తరువాత రూపొందిన పక్కా రికార్డుల ఆధారంగానే రైతులకు ఏడాదికి రూ.8 వేల పెట్టుబడి ఇస్తామన్నారు. వచ్చే ఏడాదినుంచి ఈ పథకాన్ని అమలుచేయాల్సి ఉన్న నేపథ్యంలో భూమి రికార్డుల ప్రక్షాళనను మూడు నెలల్లో పూర్తిచేయాలని సీఎం అధికారులకు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్దేశించిన గడువులోగా ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయడానికి వీలుగా 1193 బృందాలు ఏర్పాటుచేయాలని, ఒక్కో బృందానికి తొమ్మిది గ్రామాలు కేటాయించాలని అన్నారు. ఈ బృందాల ఏర్పాటు బాధ్యతను జిల్లా కలెక్టర్లకు సీఎం అప్పగించారు. లెక్కలన్నీ సవరించిన తరువాత భూముల తుది జాబితాపై గ్రామంలోని రైతులందరి సంతకాలు తీసుకొని వెల్లడించాలన్నారు. రికార్డుల ప్రక్షాళనలో భాగంగా తొలుత ఏ విధమైన చిక్కులు, సమస్యలు లేని సుమారు 95 శాతానికి సంబంధించి వివరాలు ఖరారుచేయాలని అన్నారు. భూమి రికార్డుల సరళీకరణ, ప్రక్షాళనపై సీఎం బుధవారం ఉదయం ప్రగతిభవన్‌లో రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన ఆదాయవనరుగా భూమి శిస్తు ఉండేది. అయితే కాలక్రమేణా రైతుల దగ్గర శిస్తు వసూలుకు బదులు ప్రభుత్వమే ఎకరానికి రూ.8 వేల చొప్పున పెట్టుబడి సమకూరుస్తున్నది. దీంతో భూమికి సంబంధించిన దృక్పథమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా రైతులను అన్ని దేశాలు గౌరవిస్తున్నాయి. ఆహారరంగంలో స్వావలంబన ఉండాలని ఏ దేశమైనా ఆలోచించడమే దీనికి ప్రధాన కారణం. మనదేశం కూడా అంతే. మన రాష్ట్రం కూడా వ్యవసాయిక ప్రధాన ప్రాంతమే కాకుండా ఇక్కడ సమశీతోష్ణ వాతావరణం ఉండటంవల్ల పంటలు బాగా పండుతాయి. రాబో యే సంవత్సరం నుంచి కాళేశ్వరం నుంచి గోదావరి నీళ్లు పుష్కలంగా లభ్యం అవుతాయి. చెరువులు నింపుకొంటాం. దీనిద్వారా పూర్వపు ఏడు జిల్లాలకు కాళేశ్వరం నీళ్లు ఉపయోగంలోకి వస్తాయి. పంటలు బాగా పండటంతో అన్ని రకాల ప్రజలు, రైతులు బాగుంటారు అని చెప్పారు.

మనకున్న 31 మంది జిల్లా కలెక్టర్లకు ఏయే గ్రామాలను, ఏయే టీములకు కేటాయించాలో అధికారం ఉంటుంది. ఇది ప్రధానంగా భూమి రికార్డుల ప్రక్షాళన. ఇందులో భాగంగా రికార్డుల్లో ఉండే చిత్రవిచిత్రమైన చిక్కులు, వివాదాలు తలెత్తే అంశాలన్నీ పోవాలి. బై నంబర్ల గోల్‌మాల్ లేకుండా పోవాలి. – సీఎం కేసీఆర్

బై నంబర్ల గోల్‌మాల్ పోవాలి పహాణీ, సేత్వారీలాంటి పాతకాలపు పదాలు మన తెలుగు భాషకు సంబంధించినవి కావు. అందుకే తెలుగులో సరళంగా, సులభంగా, సరళీకృతమైన భాషలో ఈ పదాలను మార్చాలి. అదేవిధంగా అనేక రకమయిన లెక్కలు కూడా అనవసరం. పహాణీలో కూడా ఎక్కువ కాలమ్స్ అవసరం లేదు. సులభంగా, కష్టతరం కాకుండా ఉండాలి. భూమి రికార్డుల ప్రక్షాళన ఈ నేపథ్యంలో జరుగుతున్నది. దీనికోసం 1193 బృందాలను ఏర్పాటుచేసి, ఒక్కొక్క బృందానికి తొమ్మిది గ్రామాలు కేటాయించి, మొత్తం భూమి రికార్డుల ప్రక్షాళన, సవరణ చేయటానికి మూడు నెలల వ్యవధి పడుతుంది. మనకున్న 31 మంది జిల్లా కలెక్టర్లకు ఏయే గ్రామాలను, ఏయే టీములకు కేటాయించాలో అధికారం ఉంటుంది. ఇది ప్రధానంగా భూమి రికార్డుల ప్రక్షాళన. ఇందులో భాగంగా రికార్డుల్లో ఉండే చిత్రవిచిత్రమైన చిక్కులు, వివాదాలు తలెత్తే అంశాలన్నీ పోవాలి. రికార్డుల్లో ఉన్న అస్తవ్యస్త లెక్కలు చిక్కులకు, వివాదాలకు దారితీస్తున్నాయి. బై నంబర్ల గోల్‌మాల్ లేకుండా పోవాలి. రైతుకు న్యాయపరమైన చిక్కులు పూర్తిగా పోయి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవాలి అని సీఎం చెప్పారు.

కొరియర్ ద్వారా పాసుపుస్తకాలు కోట్లాది బ్యాంకు ఖాతాలను పకడ్బందీగా నిర్వహిస్తున్న కోర్ బ్యాంకింగ్ విధానాన్ని భూ రికార్డులకు అనుసరించాలి. రికార్డుల ప్రక్షాళన తరువాత కోర్ బ్యాంకింగ్ తరహాలో ఎప్పటికప్పుడు చోటుచేసుకునే మార్పులకు అనుగుణంగా కంప్యూటర్‌లో నిక్షిప్తంచేయాలి. దీనికోసం వెయ్యిమంది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులను ప్రత్యేకించి రెవెన్యూ శాఖలో నియమించాలి. ఆన్‌లైన్‌లో ఎటువంటి సమాచారమైనా పట్టాదారులకు లభ్యమయ్యేలా రికార్డుల్లో ఉండాలి. భూ ప్రక్షాళన ఒకవైపు జరుగుతుండగా అది పూర్తయ్యేసరికి ఐటీ ఆఫీసర్ల నియామకం, కంప్యూటర్లు, సర్వర్ల కొనుగోలు, కంప్యూటర్ అనుసంధానం పూర్తికావాలి. మ్యుటేషన్ ప్రక్రియ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎప్పటికప్పుడు జరిగిపోవాలి. రైతులు తమ క్రయవిక్రయాల కోసం రిజిస్ట్రేషన్ ఆఫీసుకు ఒకే ఒక్కసారి వెళ్లే వెసులుబాటు ఉండాలి. ఆ తరువాత వారి పాస్‌పుస్తకాలు కొరియర్ ద్వారా ఇంటికే రావాలి. బ్యాంకుల్లో రైతుల పాస్‌పుస్తకాలు కుదువ పెట్టించుకునే విధానం పోవాలి. కంప్యూటర్ ఆధారిత సమాచారం ఆధారంగా రైతులకు రుణాలు మంజూరు చేయాలి అని ముఖ్యమంత్రి చెప్పారు.

ఇక నుంచి కలెక్టర్ కోర్టు ఒక్కటే ఒక్క కలెక్టర్ కోర్టు మినహా ఇతర రెవెన్యూ కోర్టులన్నీ రద్దు చేయాలి. భూమి సంబంధ వ్యవహారాలు రాజ్యాంగపరంగా రాష్ట్ర పరిధిలో ఉంటాయి కాబట్టి, దానికి సంబంధించిన చర్యలు చేపట్టే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. కాబట్టి దీనికి అనుగుణంగా న్యాయపరమైన చిక్కులకు ఆస్కారం లేనివిధంగా రికార్డుల ప్రక్షాళన జరుగాలి. భూమి రికార్డుల ప్రక్షాళన, సవరణలో పకడ్బందీగా, త్వరితగతిన పని పూర్తిచేసే తహసీల్దార్, ఆర్డీవో, జిల్లాస్థాయి అధికారులకు ప్రోత్సాహకాలు, సర్టిఫికెట్లు ఇవ్వాలి. గురువారం కలెక్టర్లు, ఆర్డీవోలు, ఇతర రెవెన్యూ సంబంధిత అధికారుల సమావేశం తరువాత త్వరలోనే రాష్ట్రంలోని తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటుచేయాలి అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారక రామారావు, జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా, విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోలీస్ గృహనిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, సీఎంవో అధికారులు, భూ రికార్డుల ప్రక్షాళన స్పెషల్ ఆఫీసర్ వాకాటి కరుణ, కలెక్టర్లు రఘునందన్‌రావు, వెంకట్రామ్‌రెడ్డి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.