Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాలమూరు, డిండికి గ్రీన్‌సిగ్నల్

పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ ప్రజల బాధలు శాశ్వతంగా తీరేలా రెండు ప్రాజెక్టులు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులను చేపట్టేందుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి సుమారు మూడున్నర గంటలపాటు సాగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాలను వెల్లడించారు. అవి ఆయన మాటల్లోనే.. -పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షకు హరీశ్ అధ్యక్షతన సబ్ కమిటీ..

-సభ్యులుగా తుమ్మల, కడియం -నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కావాలి -అనాథ పిల్లలకు ప్రభుత్వమే తల్లీతండ్రి -పదో తరగతి తర్వాత చదువుల ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది -హాస్టల్ పిల్లలకు కడుపునిండా అన్నం -అమలుకు కడియం అధ్యక్షతన సబ్‌కమిటీ -గీత, మత్స్య కార్మికులకు 5 లక్షల ప్రమాద బీమా -నిజామాబాద్ జిల్లాలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ -జూలైలో 25 వేల పోస్టులకు నోటిఫికేషన్ -బోర్డులు మినహా అన్నీ టీఎస్‌పీఎస్సీ ద్వారానే.. -స్థానికులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను మాత్రమే క్రమబద్ధీకరిస్తాం

KCR క్యాబినెట్‌లో చాలా విషయాలు చర్చించాం. ముఖ్యంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి. రూ.35,200 కోట్లతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల భూములు సాగు చేయడానికి, అలాగే హైదరాబాద్ ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ ప్రాజెక్టు చేపట్టినం. గురువారం ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేయడానికి వెళుతున్నా.. ఇయ్యాల చాలా సంతోషంగా ఉంది. అనేక సంవత్సరాలుగా బాధలు పడ్డ నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు అత్యధికంగా ఉన్నారు. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇది పెద్దసమస్య. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా గుర్తించి, దృష్టి కేంద్రీకరించింది. సమైక్య రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ల ఖర్మ అని వారు వదిలేసిండ్రు.

చివరకు ఫ్లోరైడ్ ఎఫెక్ట్ అయిన బిడ్డలను అక్కడి ఉద్యమకారులు తీసుకువెళ్లి ప్రధానమంత్రి టేబుల్‌పై పెట్టి అడిగితే కూడా పరిష్కారం చెప్పలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత.. రాష్ట్రం వచ్చిన సార్థకత ఉండాలంటే పాలమూరు ప్రాజెక్టు వచ్చి తీరాలి.. ఆలస్యం చేయడానికి వీలు లేదు. రెండోది.. ఫ్లోరైడ్ బాధితులకు చెందిన నల్లగొండ సమస్య పరిష్కారం కావాలి. అందుకోసం రూ.6,190 కోట్లతో ఆ ప్రాజెక్టు చేపట్టాలని క్యాబినెట్‌లో నిర్ణయించినం. ఇది రెండు జిల్లాలకు కూడా సంతోషకరమైన నిర్ణయం. ప్రస్తుతానికి దానికి పేరు లేదు. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిండి అంటే సరిపోతుంది. డిండి ప్రాజెక్టు. ఈ రెండు ప్రాజెక్టులకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీటిని తీసుకుంటాం.

దీనికి ఒక 70 టీఎంసీలు, దానికి ఒక 30 టీఎంసీలు కలిపి మొత్తం 100 టీఎంసీల కెపాసిటీతో తీసుకుంటాం. హైదరాబాద్ గురించేమో అదనంగా 20 టీఎంసీలు ఉంది. ఈ నీటిని కూడా శ్రీశైలం నుంచే తీసుకుంటాం. పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి గతంలో ఈపీసీలు ఇచ్చి చాలా గందరగోళం చేశారు. రేట్లు తారుమారై లేనిపోని సమస్యలు వస్తా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టులు దాదాపు 75 వరకు పూర్తి అయినయి. వాటికోసం కూడా సబ్ కమిటీని ఇరిగేషన్ మినిస్టర్ అధ్యక్షతన వేసినం. దాంట్లో గతంలో ఇరిగేషన్ మంత్రులుగా పనిచేసినటువంటి తుమ్మలనాగేశ్వరరావు, కడియం శ్రీహరిని చేర్చినం. ఈ కమిటీ పెండింగ్ ప్రాజెక్టుల మీద అనుసరించాల్సిన వూహంపై చర్చించి నిర్ణయం తీసుకుంటుంది.

ఇంకొక గుడ్ న్యూస్.. గీతకార్మికులకు, మత్స్యకార్మికులకు 5లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని నిర్ణయించడం. గీత పారిశ్రామిక సంఘాలు కావచ్చు, మత్స్యకార్మిక సంఘాలు కావచ్చు, ఇప్పటికే రిజిస్టర్ అయి సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకున్న కార్యకర్తలకే ఇది వర్తిస్తుంది. మైనారిటీల కోసం 10 రెసిడెన్షియల్ స్కూళ్లు, 10 హాస్టళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినం. ఓవర్సీస్ స్టడీస్ కోసం ఎస్సీ, ఎస్టీలకు ఏ విధంగానైతే ఇస్తున్నామో అదే విధంగా రూ.25 కోట్లు మైనారిటీ బడ్జెట్‌నుంచి కేటాయించి వాళ్లను కూడా సేమ్‌లైన్‌లో తేవాలని నిర్ణయించినం.

మైనారిటీ స్ట్టూడెంట్స్‌కు కూడా ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు అందజేయాలని నిర్ణయించినం. విద్యార్థులకు ఒకటి, ఆర్ఫన్ స్టూడెంట్స్‌కు ఒకటి చాలా అధ్వాన్న పరిస్థితి ఉంది. పదో తరగతి వరకు పాపం అక్కడక్కడ కస్తూరిబా లాంటి స్కూళ్లల్లో చదువుకుంటున్నారు. ఇతరత్రా హాస్టళ్లలో చదువుకుంటున్నారు. అక్కడినుంచి ఎక్కడికి పోవాల్నో వారి బతుకు అర్థంకాని పరిస్థితి ఉంది. సామాజికంగా కూడా ఘోరమైన స్థితి ఉంది. బాలికలుగా ఉండగానే కొందరు గర్భం దాల్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాళ్లను పట్టించుకోకపోవడం ఒక సాంఘిక సమస్యగా మారింది.

తెలంగాణ రాష్ట్రంలో ఉండే అనాథ బాలికలు, బాలుర చదువుల భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే నెత్తికి ఎత్తుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇక అనాథలుండరు. అనాథలందరికి తల్లీ తండ్రీ ఇక నుంచి ప్రభుత్వమే. ఆ బాలబాలికలకు అయ్యే మొత్తం చదువుల భారాన్ని ఖచ్చితంగా ప్రభుత్వమే మోస్తుంది. ఇది దేశంలోనే మంచి స్కీమ్. దీనికి కడియం శ్రీహరి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ నియామకానికి నిర్ణయించినం. వారం పదిరోజుల్లో రిపోర్టు ఇస్తే, దానిని పకడ్బందీగా పిల్లలను ఎక్కడకు తీసుకుపోవాలి, పదో తరగతి తరువాత ఎలా చదివించాలి అనే విషయాన్ని కమిటీ పరిశీలించి నిర్ణయిస్తది.

సత్వరం నిర్ణయం తీసుకొని అమలు చేస్తాం. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో ఉన్న పిల్లలకు, మధ్యాహ్న భోజనంలో కానీ హాస్టళ్లలో కానీ గ్రాముల్లో కొలిచి అన్నం పెడుతున్నరు. దీంట్లనే అన్ని పిల్పరేజ్‌లన్ని ఉండగా, ఖైదీలకు పెట్టినట్లుగా కొలిచి పెడుతున్నరు. ఇది చేయదగిన పనికాదు. కడుపు నిండా అన్నం పెట్టే పద్ధతుల్లో ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఉన్నది. వారికి వారానికి రెండు రోజులు గుడ్డు ఇస్తున్నరు. రోజు విడిచి రోజు గుడ్డు ఇవ్వాలని నిర్ణయించినం. దీని సాధ్యాసాధ్యాలపై ఈ కమిటీ పరిశీలించి రిపోర్టు ఇస్తది. ఈ కమిటీలో ఈటల రాజేందర్, జోగురామన్న,లక్ష్మారెడ్డి, చందూలాల్ ఉన్నారు. ఈ కమిటి రిపోర్టు వస్తేనే పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టాలనే నిర్ణయం వస్తుంది.

నిజామాబాద్ జిల్లా రుద్రూరులో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నెల 12న లాంచ్ అవుతున్న టీఎస్ ఐపాస్ దానికి సంబంధించి టోటల్ గైడ్ లైన్స్ కూడా దాదాపు గంట గంటన్నరపాటు చర్చించి, ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి సరళమైన, సెల్ఫ్ సర్టిఫికెట్‌తో కూడుకున్నటువంటి, రైట్ టు క్లియరెన్సెస్ అనే ఒక పకడ్బందీ చట్టాన్ని శాసనసభ ఆమోదించింది. దానికి సంబంధించిన విధివిధానాలను పరిశ్రమల శాఖ అధికారులు రూపొందించి తెచ్చారు. దానిని ప్రభుత్వం పరిశీలించిన తరువాత గంటన్నర చర్చించిన తరువాత ఇరిగేషన్ స్కీమ్స్ కానీ టీఎస్ ఐపాస్ కాని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నాం.

పాలమూరు – నల్లగొండ జిల్లాల బాధలు శాశ్వతంగా దూరమయ్యే విధంగా ఈ స్కీమ్‌లపై నిర్ణయం తీసుకున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. ఉద్యమ నాయకుడిగా ఉండే సమయంలో కూడా చాలా సందర్భాలలో ఈ స్కీమ్ మీద కేంద్రంలో, స్టేట్‌లెవల్‌లో, ఊరూవాడా అంతా తిరిగి చెప్పడం జరిగింది. సమగ్రమైన ఎజెండా చాలా విషయాలు నేనే స్క్రూట్నీ చేసిన తరువాత ఈ రెండు స్కీమ్‌లు కూడా డిసైడ్ చేయడం జరిగింది. ఈ రెండింటికి కూడా శ్రీశైలం నుంచే సోర్స్ ఉంటుంది. మొత్తం మీద పాలమూరు- రంగారెడ్డి- నల్లగొండ జిల్లాల బాధ శాశ్వతంగా దూరమవుతుంది.

విద్యార్థుల బాధ కూడా దూరం కావడమనేది ఈ రోజు మంచి స్కీమ్‌లుగా సంతృప్తి ఇచ్చే స్కీమ్‌లుగా క్యాబినెట్ క్లియర్ చేసింది. ఉద్యోగాల భర్తీ ఈ రోజు కూడా చర్చకు వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న 25 వేల ఖాళీలు భర్తీ చేయాలని నిర్ణయించినం. రాష్ట్ర అవతరణ దినోత్సవాల రోజు ప్రకటించినం. నిరుద్యోగులకు వయోపరిమితి సడలింపు 5నుంచి 10 సంవత్సరాలు ఇవ్వాలని గతంలో నిర్ణయం తీసుకున్నం. అన్ని డిపార్ట్‌మెంట్ల నుంచి వాటి వివరాలు సేకరిస్తున్నం. జూలై నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల అవుతది. కొన్ని శాఖలు ఇండిపెండెంట్‌గా నోటిఫికేషన్ ఇస్తయి. బోర్డులు ఉన్నయి. కొన్ని డిపార్ట్‌మెంట్సేమో టీఎస్‌పీఎస్సీ ద్వారా చేసే అవకాశం ఉంది.

అదంతా చీఫ్ సెక్రటరీ, డిపార్ట్‌మెంట్ సెక్రటరీలు, మంత్రులు కలిసి నిర్ణయం తీసుకుంటరు. ఏ ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేయాలనేది చూస్తరు. పోలీసులకు ప్రత్యేక రిక్రూట్‌మెంట్ బోర్డు ఉంది, ఎలక్ట్రిసిటీలో వాళ్ల ఓన్ చానళ్లలో వాళ్లు అవసరాలను బట్టి రిక్రూట్ చేస్తున్నరు. వాళ్లు ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు పోవాలి. ఎక్కడ అవసరాలుంటే అక్కడ వాళ్లు నిర్ణయాలు తీసుకుంటున్నరు. మిగిలిన ఉద్యోగాలను ఉదాహరణకు అగ్రికల్చర్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్లు, ఇతర డిపార్ట్‌మెంట్లలో చాలావరకు టీఎస్ పీఎస్సీకి పోయే అవకాశం ఉంది. మొత్తంమీద తెలంగాణలో గతంలో ఉద్యోగాలు రాక వారి వయసు డినే చేయబడింది. చాలా మందికి అన్యాయం జరిగింది కాబట్టి, అది సవరించడం కోసం వయసు సడలింపు ఇవ్వాలని అన్నారు.

5 సంవత్సరాలని కొందరు, పదేండ్లని కొందరు చెపుతా ఉన్నరు. ఏది చేస్తే మంచిగుంటదో చెప్పాలని సీఎస్ ఆధ్వర్యంలో అధికారులతో వేసిన కమిటీకి చెప్పినం. బహుశా వారం రోజుల్లో రిపోర్టు పెడతరు. దానిపై ఫైనల్ నిర్ణయం తీసుకొని జూలైలో వందశాతం రిక్రూట్‌మెంట్ చేపడతం. గవర్నమెంట్‌లో ఖాళీలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు జూలైలో వస్తయి. కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి రెండు విషయాలు ఉన్నయి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని నిర్ణయం తీసుకున్నం. దాంట్లో స్థానికులు, స్థాకేతరులు ఉన్నరు. కాంట్రాక్టు ఉద్యోగులకు ఒక స్క్రీనింగ్‌లా పెట్టించి, వారి స్థానికత, సర్టిఫికెట్లు పరిశీలన చేసి, పర్‌ఫెక్ట్‌గా స్థానికులకు మాత్రమే అవకాశం వచ్చే విధంగా క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్థానికులు కానివారికి ఇందులో అవకాశం రాదు.

ఆ ప్రకారంగా గైడ్‌లైన్స్ తయారవుతున్నయి. గైడ్‌లైన్స్ రాగానే ఆ ప్రాసెస్ జూలై నుంచి మొదలవుతది. మద్యం పాలసీపై కూడా నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో కూడా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. గుడుంబావల్ల చాలామంది చచ్చిపోతాఉన్నరు. ప్రతి గ్రామంలో చాలా మంది 30 నుంచి 40 మంది వరకు వయసు ఉన్న వితంతువులు ఉంటున్నరు. ఇది మంచిది కాదు. గుడుంబా మహమ్మారి నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. దీనికి మంచి ఆప్షన్స్ ఏమున్నాయనేది పరిశీలించాలని ఎక్సైజ్‌శాఖ అధికారులకు చెప్పాం. మద్యం పాలసీని ఈ మధ్యలోనే తయారుచేయాలి. ఐదు, పది రోజులు ఆలస్యమైనా కొంపలు ఆరిపోయేది ఏముంది.

శాశ్వతంగా గుడుంబాను అరికట్టాలి. దీనిని ఏ విధంగా చేయవచ్చు అనే విషయాన్ని కూడా చెప్పినం. ఎట్లా ఓవర్ కమ్ కావాలే.. ఆ మధ్య వరంగల్‌కు పోయినప్పుడు సభలో ఒక మహిళ ప్రభుత్వ సారా అన్న పెట్టండి సార్ అన్నది. కనీసం ఆ దరిద్రపు గుడుంబా తాగి చావకుండానన్న బతుకుతరని చెప్పి ఆమె అడిగింది. నేను చాలా ఆశ్యర్యపోయినా, గతంలో సారా బంద్ చేయాలని ఉద్యమించారు. కానీ ఇప్పుడు గుడుంబాను అరికట్టడం కోసం ఒక సెక్షన్ జనాభా సారా అన్నా తీసుకురమ్మని డిమాండ్ చేసే పరిస్థితి వచ్చింది. దీనిపై కమిటీ రిపోర్టు ఇవ్వగానే ఒక నిర్ణయం తీసుకుంటం. ఇప్పుడు మద్యంపై నిషేధం ఏమీలేదు. గవర్నమెంటు పాలసీ అమలు చేస్తది కానీ దీనిమీద బ్యాన్ ఏమీలేదు. ఎక్కడ బ్యాన్ పెట్టిండ్రో అక్కడ ఫైల్ అయింది. ఆ తరువాత రివైవల్ అయింది.

పర్టిక్యులర్‌గా ఆ బ్యాన్, ఈ బ్యాన్ అని ఏమీలేదు. సిస్టమ్ లేకపోవడం వల్ల చీప్ లిక్కర్ అందుబాటులో ఉంది. ఇది కొంతమందికి అందుబాటు ధరలో ఉండవచ్చు, ఉండకపోవచ్చు, గుడుంబా ఉత్పత్తి చేసే వాళ్లు ఆ గ్యాప్‌లో వచ్చారు. రూ.20లకే అమ్ముతున్నారు. జనం అది తాగి సచ్చిపోతున్నరు. అందుకే డిపార్ట్‌మెంట్ వాళ్లకు గుడుంబా కంట్రోల్ చేయగులుతారా అని చెప్పినా.. ఏమి చేయాలనేది రైట్‌గా సమగ్రంగా చెప్పాలి, ఆ తరువాత సోషల్ డిబేట్ జరుగుతుంది. నిర్ణయం జరుగుతుందని చెప్పిన. బీడీ కార్మికుల గురించి ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి ఆదాయానికి వెయ్యి రూపాయలు అదనపు భృతి ఇస్తామన్నం. 18 ఏండ్ల పిల్లలను బీడీ కార్మికులుగా గుర్తించాలంటరు.

వారిని గుర్తిస్తే చైల్డ్ లేబర్ ప్రాబ్లమ్ వస్తుంది, ఆడిట్ సమస్యలు వస్తాయి. ఏ ప్రాబ్లమైనా అంతే. ప్రభుత్వానికి ఒక క్రైటేరియా ఉంటే ఈజీ అవుతుంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేయలేదు. ఇప్పుడు చేస్తున్నాం. గతంలో గీత కార్మికులకు రెండు లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేది. ఇప్పుడు అలాకాకుండా రూ.5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నం. మత్స్యకార్మికులకు కూడా ప్రీమియం కట్టాలని నిర్ణయం తీసుకున్నం. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులని మీరే అంటున్నరు. ప్రభుత్వం జీతాలు పెంచే సమస్యనే ఉత్పన్నం కాదు కదా! పట్టి సీమ ప్రాజెక్టును తీసుకున్నారు. ధర్మం ప్రకారం ఎగువ రాష్ర్టాలకు మూడింటికి చెప్పాలి.

బచావత్ ట్రిబ్యునల్‌లో కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నరు. పోలవరం నుంచి డైవర్ట్ చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకువస్తే, ఏపీలోని ఎగువ ప్రాంతాలకు 45 టీఎంసీల నీటిని ఇవ్వాలి. ఎగువ ప్రాంతమంటే ఎవరో కాదు.. తెలంగాణ. మహారాష్ట్ర, కర్ణాటకకు కూడా సప్లమెంటరీ చేయాలి, కానీ చంద్రబాబు ప్రభుత్వం ఒంటెత్తు పోకడతోని, ఎవరిని సంప్రదించకుండా ప్రాజెక్టు మొదలుపెడితే, దానిని విమర్శిస్తే ఆయనకు చెప్పే సంసారం చేయాలా అని కూడా మాట్లాడిండు. ఆటోమెటిక్‌గా వాళ్లు డైవర్షన్ చేసుకున్నప్పుడు మాకు 45 టీఎంసీల నీళ్లు రావాలి. బచావత్ ప్రకారంగా వచ్చి తీరాల్సిందే. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగింది, కాబట్టి మొత్తం రివ్యూ జరగాలె. ఏపీ, తెలంగాణల మధ్య మొత్తం నీటి పంపకాల పునఃపరిశీలన జరగాలె, అప్పుడే న్యాయం జరుగుతుందని పిటిషన్ వేసినం. శ్రీశైలంలో మా వాటా లేదా? ఇంకా రెండు ఇష్యూలు ఉంటాయి. 90 టీఎంసీ వాటర్ అనేది.

నాగార్జునసాగర్‌లో స్టోరేజి కెపాసిటీ తగ్గిపోయింది. దాదాపు 80 టీఎంసీల పైచిలుకు శ్రీశైలంలో పూడిక వల్ల ఈ స్టోరేజీ తగ్గిపోయింది. మా వాట మాకు రావద్దా? 197లో మా వాటా మాకు రావద్దా, సచ్చి చెడి మాకు వంద రావాలి, పట్టిసీమలో మాకు 45 టీఎంసీలు రావాలి.140 టీఎంసీ మాకు ఉండనే ఉంది., పూడికలో ఉన్నవి మొత్తం కలిపి 145 టీఎంసీలు మా వాటా మాకు రావాల్నా వద్దా. మాకు రైట్ లేదా, మాది రాష్ట్రం కాదా. ఇంతకుముందు నడిచింది. ఇక నడుస్తదా.. నడువదు. హెచ్‌ఎండీఏలో పటాన్‌చెరువు మండలం తప్ప మిగిలిన 49 మండలాలు కృష్ణా పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి. కృష్ణా నుంచి చెన్నైకి నీళ్లు ఇస్తారు కానీ హైదరాబాద్‌కు ఇవ్వరా. మీరు తలపెట్టిన స్కీమ్‌ల ద్వారా నీళ్లు తీసుకుంటం.మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, జగదీశ్‌రెడ్డి, పద్మారావుగౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.

-గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డిని సిఫారసు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో ఈ మేరకు తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపించనున్నది. ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.