Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాలమూరుకు పచ్చాని రంగేసినట్లు…

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టిన పట్టు విడవకుండా చేసిన పనుల ఫలితం ఇప్పుడు పాలమూరులో కనిపిస్తున్నది. సొంత ఊళ్లకు తిరిగొస్తున్న రైతులు, రద్దవుతున్న ముంబాయి బస్సులు, ఆ చివర నుంచి ఈ చివర వరకు పరచుకున్న పొలాలు, కళకళలాడుతున్న గ్రామాలే ఇందుకు నిదర్శనం.

కొన్ని నెలల క్రితం వనపర్తి ప్రాంతంలో జరుగుతున్న సాగునీటి పనులను పరిశీలించేందుకు నేను బుద్ధారం పోయిన. తిరిగి వస్తున్న సమయంలో ఒక రైతు నాకు ఎదురొచ్చిండు. తన పేరు తెనుగు రాములు అనీ, తనది ఆ ఊరేననీ చెప్పిండు. రెండు ఎకరాల పొలం ఉందని, మొన్ననే సొంతంగా వ్యవసాయం మొదలుపెట్టాననీ అన్నడు. ఇన్నాళ్లూ ఎక్కడున్నవని అడిగితే, బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు పోయాననీ, చేలకు నీళ్లు రావడంతో ఊరికి తిరిగొచ్చాననీ సంతోషంగా చెప్పిండు. మళ్లీ హైదరాబాద్‌కు వలస పోతవా అంటే, ‘కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు. మళ్లా నేనెందుకు పట్నం పోత?’ అని అంటూ వెళ్లిపోయిండు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మారుతున్న బతుకు చిత్రానికి నిదర్శనం ఈ దృశ్యం.

పాలమూరు తెలంగాణలోనే అతిపెద్ద జిల్లా. దాదాపు 35లక్షల మంది నివసించే ఈ జిల్లాకు దేశంలోనే ఓ గుర్తింపు ఉంది. అది పాలమూరు లేబర్‌. వారు చిందించిన చెమటతో దేశంలోని ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణమయ్యాయి. వారి రక్తం అక్కడి మట్టిలో కలసిపోయింది. కానీ పాలమూరు బతుకులను పండించే సాగునీటి ప్రాజెక్టులు మాత్రం దశాబ్దాల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఒక తరం నుంచి మరో తరం అభివృద్ధి పథంలో నడవడం సాధారణ పరిణామం. కాని పాలమూరు తరాల తలరాత మాత్రం మారలేదు. దశాబ్దాలు గడిచినా వలస సంకెళ్ల నుంచి వారికి విముక్తి దక్కలేదు. అయితే ఇదంతా పాత మాట. చేదు చరిత్ర. కరువుతో, కడగండ్లతో, కష్టాలతో ఏండ్ల తరబడి సహవాసం చేసిన పాలమూరు మట్టి మనుషులకు కొత్త జీవితం అందించే పనిలో పడింది ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం. బీడువారిన పాలమూరు పొలాలకు పచ్చని రంగేసే బాధ్యతను తలకెత్తుకుంది.

1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడటం వల్ల అధికంగా నష్టపోయిన జిల్లా పాలమూరే. కృష్ణా నది ఈ జిల్లా గుండా 300 కిలోమీటర్లు పారుతుంది. తుంగభద్ర నది కూడా ఈ జిల్లా సరిహద్దుగా సాగుతుంది. అయినా పాలమూరుకు నీరు లేదు. హైదరాబాద్‌ రాష్ట్రం ఫజల్‌ అలీ సిఫారసుల మేరకు ప్రత్యేక రాష్ట్రంగా కొనసాగి ఉండి ఉంటే అప్పర్‌ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ద్వారా దాదాపు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పాటు వల్ల ఈ అవకాశం పూర్తిగా పోగొట్టుకున్న దురదృష్టం పాలమూరుది. జిల్లా మొత్తము విస్తీర్ణము 43.73 లక్షల ఎకరాలు. ఇందులో సాగుకు యోగ్యమైనది 35 లక్షల ఎకరాలు, ఇందులో ఒక లక్ష ఎకరాలకు సాగు నీరు అందించే జూరాల ప్రాజెక్టు, 87 వేల ఎకరాలకు బదులు 30 వేల ఎకరాలే పారే ఆర్‌.డి.ఎస్‌, రెండున్నర లక్షల ఏకరాలకు బదులు 50 వేల ఎకరాలు మాత్రమే పారే మైనర్‌ ఇరిగేషన్‌ చెరువుల వలన నికరంగా రెండు లక్షల ఎకరాలకే సాగు నీరు అందే పరిస్థితి నెలకొంది. భీమా, కల్వకుర్తి, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి ఫైళ్లలోనే మగ్గుతూ వచ్చాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కల్వకుర్తి ప్రాజెక్టు చేపట్టి 30 సంవత్సరాలు గడిచాయి. నీళ్లు మాత్రం పారలేదు. వలసల జిల్లా, నాటి ముఖ్యమంత్రి దత్తత జిల్లాపై ఉమ్మడి పాలకుల వివక్షకు ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమి ఉంటుంది? జలయజ్ఞంలో ప్రారంభించిన ప్రాజెక్టులదీ ఇదే గతి. 10 సంవత్సరాలు గడిచినా నిధుల కొరత, భూసేకరణ సమస్యలు, అటవీ అనుమతులు రాకపోవడం, రైల్వే మరియు రోడ్డు క్రాసింగ్‌ ఇబ్బందులు, అంతర్రాష్ట్ర వివాదాలు, కాంట్రాక్టు సంస్థలతో వివాదాలు, కోర్టు కేసులలాంటి అనేక సమస్యల్లో కూరుకుపోయి ప్రాజెక్టులు నత్తనడక నడిచాయి. సమస్యలను పరిష్కరించలేక కాదు; పాలకులకు చిత్తశుద్ధి లేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు ప్రజల కష్టం ఓ రణ నినాదమైంది. ఆ పోరు నుంచి ఆవిర్భవించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇపుడు పాలమూరు భవితను మారుస్తున్నది. పాలమూరు ప్రగతి రథానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సారథిగా మారి ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడి బీడు భూములపై నీరు పారించడం కోసం, ఉమ్మడి రాష్ట్రంలో ఆటకెక్కిన ప్రాజెక్టుల దుమ్ము దులిపి ఆయన నేల మీదకు దించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ఇంజనీరింగ్‌ నిపుణులతో సమావేశమై పాలమూరు ప్రాజెక్టుల స్థితిగతులను కూలంకషంగా సమీక్షించారు. ఎంతో దార్శనికతతో పాలమూరులో నీరు పారించేందుకు త్రిముఖ వ్యూహం అనుసరించాలని నిర్ణయించారు. 1. అరకొరగా పనులు జరిగి, ఆగిపోయిన ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి వినియోగంలోకి తేవడం. 2. మిషన్‌ కాకతీయ కింద చెరువులను అభివృద్ధి చేసి, ప్రాజెక్టులతో వాటిని సంధానించడం. 3. దీర్ఘకాలిక ప్రాతిపదిక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తిచేయడం. సమస్యలు, వివాదాల కారణంగా పెండింగ్‌లో పడిన ప్రాజెక్టులను ముందుకు నడిపించేందుకు ముఖ్యమంత్రి సత్వర చర్యలు తీసుకున్నారు.

నిరంతరం ఇంజనీర్లతో, కాంట్రాక్టర్లతో సమీక్షించడం, ప్రధాన అడ్డంకిగా ఉన్న భూసేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టడం, ప్రాజెక్టుకు అవసరమైన నిధులని వెనువెంటనే ప్రాధాన్య క్రమంలో విడుదల చెయ్యడం, అవసరమైన అనుమతులని సత్వరమే మంజూరు చెయ్యడం, రైల్వే, రోడ్డు క్రాసింగ్‌ల సమస్యను ఉన్నత స్థాయి సమావేశాల ద్వారా పరిష్కరించడం, ఎత్తిపోతల పథకాలకు కీలకమైన పంపుహౌజ్‌లు, సర్జ్‌పూల్‌లను సిద్ధం చేయడం, పంపులు, మోటార్లను బిగించడం, వాటికి విద్యుత్‌ సరఫరా కోసం సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు వేయడం, ఇట్లా రెండేండ్లు పగలూ రాత్రి శ్రమించిన ప్రభుత్వం, మహబూబ్‌నగర్‌ పెండింగ్‌ ప్రాజెక్టు పనులని 50 శాతం నుంచి 95 శాతానికి పూర్తి చెయ్యగలిగింది. 2016–17 సంవత్సరంలో కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1.6 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు ద్వారా 1.2 లక్షల ఎకరాలకు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలకు, కోయిల్‌ సాగర్‌ ద్వారా 8 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు.. మొత్తమ్మీద నాలుగు ఎత్తిపోతల పథకాల ద్వారా ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు అందించగలిగాం. 2017–18లో ఈ విస్తీర్ణం 6.5 లక్షల ఎకరాలకు పెంచగలిగాం. జూరాల కింద లక్ష ఎకరాలను కూడా కలిపితే సాగునీరు అందిన పంట పొలాల విస్తీర్ణం 7.5 లక్షలకు చేరింది. కల్వకుర్తి నియోజకవర్గంలో సాగునీరు ఇవ్వడానికి అడ్డంకిగా ఉన్న ఆవంచ ఆక్విడక్ట్‌ పనులను పూర్తి చేయడంతో 2017–18లో మొదటిసారిగా జంగారెడ్డిపల్లి వరకు సాగునీరు అందింది.

ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక చెరువులున్న జిల్లా పాలమూరు జిల్లా. అత్యధిక చెరువులున్న జిల్లా కరువు జిల్లాగా, వలసల జిల్లాగా మారడం ఒక విచిత్రం, విషాదం. పాలమూరు గోస తీర్చేందుకు ముఖ్యమంత్రి రచించిన సాగునీటి వ్యూహంలో భాగంగా మిషన్‌ కాకతీయ కింద మహబూబ్‌ నగర్‌ జిల్లా చెరువుల పునరుద్ధరణ అద్భుతంగా జరిగింది. పునరుద్ధరణ జరిగిన చెరువులను ఎత్తిపోతల పథకాలతో అనుసంధానం చేయడంతో వాటికి పూర్వ వైభవం వచ్చింది. జిల్లాలో దాదాపు 700లకు పైగా చెరువులు నీటితో కళకళలాడాయి. కాకతీయులు నిర్మించిన గణపసముద్రం చెరువు 30 ఏళ్ల తర్వాత కల్వకుర్తి నీటితో నిండి అలుగు పారడం అందుకు సాక్ష్యం. ఎండాకాలంలో కూడా మహబూబ్‌ నగర్‌ చెరువులు నిండుగా ఉండడం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా చూసినామా? తెలంగాణా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాన్ని సాధ్యం చేసి చూపించారు. పాలమూరు జిల్లాలో చెరువుల కింద 2.7 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, 2014కు ముందు కనీసం 50 వేల ఎకరాలైనా సాగులోకి రావడం కష్టంగా ఉండేది. మిషన్‌ కాకతీయతో అద్భుతమైన ప్రగతిని కళ్లారా చూసే అవకాశం కలిగింది.

మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మిషన్‌ కాకతీయ–1 ద్వారా చెరువుల కింద 62,899 ఎకరాలకు, కాకతీయ–2 ద్వారా 94,309 ఎకరాలకు, కాకతీయ–3 ద్వారా 65,840 ఎకరాలకు, మిషన్‌ కాకతీయ–4 ద్వారా 45,289 ఎకరాలకు చెరువుల కింద సాగునీరు ఇవ్వడం అద్భుతమైన విజయం. మొత్తంగా ఈ నాలుగేళ్లలో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా కరువు జిల్లా అయిన పాలమూరులో చెరువుల కింద సాగయ్యే 2.7 లక్షల ఎకరాలకు గాను, 2,68,337 ఎకరాలకు నీరు అందింది. దీనివల్ల వలస పోయిన వారు వాపసొచ్చారు. పాలమూరు గ్రామాల్లో పోయిన కళ తిరిగి వచ్చినట్లయింది. చెరువుల్లో, కాలువల్లో నీరు రావడంతో జిల్లాలో సామాజిక, ఆర్థిక మార్పు స్పష్టంగా కనబడుతున్నది. జిల్లాలో పంటల దిగుబడులు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగాయి. ఇదేదో మాటల గారడీ కాదు. మార్కెటింగ్‌ శాఖ సేకరించిన వివరాలు నిజంగా ఆశ్చర్యం కలిగించేలా ఉన్నాయి. 2015–16లో మహబూబ్‌నగర్‌ జిల్లాలో 31,828 క్వింటాళ్ల కందులు, 3,29,909 క్వింటాళ్ల వేరు శనగ, 2,67,780 క్వింటాళ్ల వరిధాన్యం, 8,67,957 క్వింటాళ్ల మక్కలు పండగా, మరుసటి ఏడాదికి ఇవి మరింత పెరిగాయి. 2016–17లో 5,46,474 క్వింటాళ్ల కందులు, 5,76,414 క్వింటాళ్ల వేరు శనగ, 11,72,703 క్వింటాళ్ల వరిధాన్యం, 9,15,206 క్వింటాళ్ల మక్కలు పండాయి. ఈ దిగుబడులు పాలమూరు చరిత్రలోనే ఎన్నడూ లేనటువంటివి.

ఇంత అద్భుతమైన పంటలు పండే నేల ఉన్నా రైతులు ఇన్నాళ్లు, ఇన్నేళ్లు ఎందుకు కష్టాలు అనుభవించారు? ఉన్న ఊరిని, కన్న తల్లిని విడిచిపెట్టి ఎందుకు వలసలు పోయారు? నాటి పాలకులకు మనసు లేకపోవడం వల్లే, మానవత్వం లేకపోవడం వల్లే పాలమూరు పొలాలు బీడుబడ్డాయి తప్ప, పాలమూరు రైతుకు చేవ లేక కాదు. పాలమూరు మట్టిలో జవ లేక కాదు. మనసుంటే మార్గముంటుంది, పట్టుదల ఉంటే పని పూర్తవుతుంది అని నిరూపించిన వారు మన ముఖ్యమంత్రి. పునాది రాయి ఎవరేశారన్నది కాదు; పూర్తెవరు చేశారన్నది ముఖ్యం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పట్టిన పట్టు విడవకుండా చేసిన పనుల ఫలితం ఇప్పుడు పాలమూరులో కనిపిస్తున్నది. సొంత ఊళ్లకు తిరిగొస్తున్న రైతులు, రద్దవుతున్న ముంబాయి బస్సులు, ఆ చివర నుంచి ఈ చివర వరకు పరచుకున్న పొలాలు, కళకళలాడుతున్న గ్రామాలే ఇందుకు నిదర్శనం. ఇక్కడితో అయిపోలేదు. మహబూబ్‌నగర్‌ జిల్లాను అగ్రగామిగా నిలపడానికి తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

అందులో భాగంగా గత ప్రభుత్వం ఆమోదించి అటకెక్కించిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా ప్రారంభించాం. ఆర్డీఎస్‌ రైతాంగానికి అందని ద్రాక్ష పండులాగా మిగిలిపోయిన సాగునీటిని అందించడానికి తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నాం. మహబూబ్‌ నగర్‌ జిల్లాలోనే అత్యంత కరువు ప్రాంతాలైన గట్టు, ధరూర్‌, కె టి దొడ్డి మండలాలలో 30 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గట్టు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం చేపడుతున్నాం. ఒక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుని పూర్తి చేసి కరువుని పారదోలుతాం. రాబోయే మూడు నాలుగు సంవత్సరాల్లో పాలమూరు రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌ సాగర్‌, జూరాల, ఆర్డీఎస్‌, తుమ్మిళ్ళ, గట్టు, చిన్న నీటి చెరువుల కింద సుమారు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. తెలంగాణలో ఏ జిల్లాతో పోల్చి చూసినా ఇది అత్యధికం అనడానికి సందేహించనక్కరలేదు. మొత్తమ్మీద తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో మహబూబ్‌నగర్‌ జిల్లా దశ, వలస జీవుల దిశ మారడం మొదలైంది. పాలమూరు ప్రగతికి, ఉజ్వల భవితకు ఇది శుభారంభం.

తన్నీరు హరీష్‌ రావు సాగునీటి శాఖ మంత్రి, తెలంగాణ ప్రభుత్వం

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.