
-ప్రజా ఆశీర్వాద సభతో పదునెక్కిన ప్రచారం -14 స్థానాల్లోను టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ -మహాకూటమిలో కొలిక్కిరాని అభ్యర్థుల ఎంపిక
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. సాధారణ వ్యక్తులకు గొప్పవాళ్లుగా ఎదుగడానికి అవకాశం కల్పించింది. ప్రముఖ వ్యక్తులను మట్టి కరిపించిన గడ్డగా పాలమూరు ప్రత్యేకతను సంతరించుకుంది. వీటిలో ప్రధానంగా టీడీపీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 1989లో కల్వకుర్తి అసెంబ్లీకి పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఓడించారు. అదే కల్వకుర్తికి చెందిన జైపాల్‌రెడ్డి గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు ప్రోత్సాహం అందించిన ప్రాంతంగా కల్వకుర్తి పేరు తెచ్చుకుంది. హైదరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావులాంటి వ్యక్తులతోపాటు సాహితీ దిగ్గజం, గోల్కొండ పత్రిక సంపాదకుడు సురవరం ప్రతాప్‌రెడ్డి లాంటి మహోన్నతులను అందించిన జిల్లాగానూ పేరుంది. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేటీ సీఎం కేసీఆర్‌కు, పాలమూరు ఎంపీగా 2009 ఎన్నికల్లో ఆపన్నహస్తం అందించి ప్రత్యేక తెలంగాణ చరిత్రకు నాందిగా నిలిచింది.
1. కొడంగల్

కొడంగల్‌కు గురునాథ్ రెడ్డి నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే నందారం వెంకటయ్య మరో మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా కొనసాగారు. వీరితోపాటు రెండు పర్యాయాలు రేవంత్ రెడ్డి ఎన్నికైతే, అనంతా రెడ్డి, రుక్మారెడ్డి, అచ్యుతా రెడ్డి, నందారం వెంకటయ్యలు ఒక్కొక్క పర్యాయం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ నరేందర్ రెడ్డి బరిలో నిలిచారు. ఇంతకాలం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి తన రాజకీయం కోసం హల్చల్ చేయడం మినహా కొడంగల్ అభివృద్ధిని పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్సీగా ఉన్న నరేందర్ రెడ్డి మంజూరు చేయించారు. అభ్యర్థిగా ప్రకటన వెలువడినప్పటి నుంచి నియోజకవర్గంలోని గ్రామాల్లో ఉధృతంగా నరేందర్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి సమన్వయంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
2. నారాయణపేట

నియోజకవర్గాల పునర్విభజనలో 2009లో నారాయణపేట నియోజకవర్గంగా ఏర్పాటయింది. అంతకుముందు మక్తల్ పరిధిలో ఈ ప్రాంతం కొనసాగింది. ఎల్లారెడ్డి 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో రాజేందర్ రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అయితే, 2016లో రాజేందర్ రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. అనంతరం నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. 28 కోట్లతో పట్టణంలో రోడ్ల విస్తరణ, మరో 28 కోట్లతో డీ-16 కాలువ ఆధునీకరణ, కోయిల్‌సాగర్ కుడి కాలువ ఆధునీకరణ కోసం మరో రూ.38 కోట్లను రాజేందర్ రెడ్డి మంజూరు చేయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఈ నియోజకవర్గానికి సాగు నీరందించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజేందర్‌రెడ్డి ప్రచారం తీవ్రతరం చేశారు.
3. మక్తల్

మక్తల్‌కు చిట్టెం నర్సిరెడ్డి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశారు. మూడు దఫాలుగా నరసింహులు నాయుడు, రెండు దఫాలుగా ఎల్లారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. బాలప్ప, దయాకర్‌రెడ్డి ఒక్క పర్యాయం ఎమ్మెల్యేలుగా పని చేశారు. చిట్టెం నర్సిరెడ్డి జనతాపార్టీ, కాంగ్రెస్‌ల నుంచి పలు దఫాలు ఎమ్మెల్యే అయ్యారు. ఎల్లారెడ్డి కూడా టీడీపీ హయాంలో మంత్రిగా పని చేశారు. కాగా, ఉమ్మడి జిల్లాలో భీమా, కేఎల్ఐ, నెట్టెంపాడు ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ను గతంలో చిట్టెం నర్సిరెడ్డి తెర మీదకు తెచ్చారు. అందరినీ కలుపుకపోతూ ప్రచారంలో ముందున్నారు.
4. గద్వాల

41 ఏండ్లుగా గద్వాల నియోజకవర్గంలో ఒకే కుటుంబం నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ ప్రత్యేక స్థానంలో నిలిచారు. వీరిలో డీకే సత్యారెడ్డి రెండు దఫాలు, డీకే సమరసింహారెడ్డి, డీకే అరుణలు మూడు దఫాలు, డీకే భరతసింహా రెడ్డి ఒక దఫా ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరితోపాటు పాగ పుల్లారెడ్డి, ఉప్పల గోపాల్‌రెడ్డి రెండు దఫాలు, రాంభూపాల్‌రెడ్డి, గట్టు భీము డు ఒక్కొక్క పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఇటీవలి వరకు తాజా మాజీ ఎమ్మెల్యేగా డీకే అరుణ ప్రాతినిధ్యం వహించారు. అయితే టీఆర్ఎస్ నుంచి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బరిలో నిలిచారు. ఈసారి కృష్ణ మోహన్‌రెడ్డిని గెలిపించాలని టీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుదలతో పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం కేసీఆర్ గద్వాలలో నిర్వహించిన బహిరంగ సభకు భారీ స్పందనలభించింది. దీంతో ఈసారి కృష్ణమోహన్ రెడ్డి ఖాయమైనట్టేనని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు.
5. అలంపూర్

అలంపూర్‌కు మూడు దఫాలుగా రావుల రవీంద్రనాథ్‌రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. చంద్రశేఖర్‌రెడ్డి రెండు దఫాలుగా చేస్తే, నాగన్న, లక్ష్మీదేవమ్మ, మురళీధర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రజనీబాబు, కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, చల్లా వెంకట్రాంరెడ్డి, అబ్రహం, సంపత్‌కుమార్‌లు ఒక్కొక్క పర్యాయం ఎమ్మెల్యేలుగా పని చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో అబ్రహం టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నియోజకవర్గంలో సౌమ్యుడిగా పేరున్న అబ్రహం ఈసారి అలంపూర్‌పై గులాబీ జెండాను ఎగురవేయడం ప్రముఖంగా కనిపిస్తున్నది. సీఎం కేసీఆర్ ఈ ప్రాంతంపై ప్రత్యేక నజర్ పెట్టారు.సుమారు 765 కోట్ల రూపాయలతో తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి ఆర్డీఎస్ పరిధిలో ఉన్న 87 వేల ఎకరాల పూర్తి ఆయకట్టుకు సాగు నీరందించాలని తలపెట్టడం ఈ ప్రాంతంలో గొప్ప మార్పునకు దోహదం చేయనున్నది. తాజా మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌పై ప్రజావ్యతిరేకత బహిరంగంగానే వ్యక్తమవుతున్నది.
6. కొల్లాపూర్

జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్‌లో 1999 నుంచి 2014 వరకు వరుసగా ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికై రికార్డు సాధించారు. అంతకుముందు వెంకటేశ్వరావు మూడుసార్లు, రంగదాస్ రెండుసార్లు, నర్సింగ్‌రావు, మధుసూదన్‌రావు ఒక్కోసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. జూపల్లి కృష్ణారావు ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే త్యాగం చేసి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. రాజీనామాతో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలో అభివృద్ధిని పరుగులు పెట్టించి ప్రజల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. లక్ష ఎకరాలకు పైగా సాగునీరందించి తన నియోజకవర్గంలో కరువును శాశ్వతంగా తరిమేశారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
7. అచ్చంపేట

అచ్చంపేటకు ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారిలో పీ మహేంద్రనాథ్‌కు ప్రత్యేక స్థానముంది. ఈయన నాలుగు దఫాలుగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పోతుగంటి రాములు మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇంకా నాగన్న, వంశీకృష్ణ, గువ్వల బాలరాజు ఒక్కొక్క పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 నుంచి ఎమ్మెల్యేగా కొనసాగిన గువ్వల బాలరాజ్ స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించారు. నియోజకవర్గానికి కేఎల్ఐ ద్వారా సాగునీటిని అందించడంలో గువ్వల విజయవంతమయ్యారు. లింగాల, ఉప్పునుంతల మండలాలకు 50 శాతం మేర సాగునీరందించారు. బల్మూరు, అచ్చంపేటలోని కొన్ని గ్రామాలకు సాగునీటిని అందించి నియోజకవర్గంలో దాదాపు 30 వేల ఎకరాల్లో పంటలకు ప్రాణం పోశారు. ప్రస్తుత ఎన్నికల్లోను పార్టీలోని నాయకుల సమన్వయంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు.
8. మహబూబ్‌నగర్

మహబూబ్‌నగర్‌కు తొలి ఎమ్మెల్యేగా స్వాతంత్య్ర సమరయోధుడు పల్లెర్ల హనుమంతరావును ఇక్కడి ప్రజలు ఎన్నుకున్నారు. అనంతరం కందూరు రాంరెడ్డి, ఇబ్రహీం అన్సారీ, లైటు ఆంజనేయులు, పీ. చంద్రశేఖర్, పులి వీరన్న, రాజేశ్వర్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. అయితే,వీరిలో అత్యధికంగా నాలుగుసార్లు పీ చంద్రశేఖర్, రెండుసార్లు పులి వీరన్నను ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. ఇక 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్‌గౌడ్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగనేతగా కీలకపాత్ర పోషించిన శ్రీనివాస్‌గౌడ్‌కు తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తెలంగాణ ఉద్యమ రథసారథి కేసీఆర్ అవకాశం కల్పించారు. శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత శ్రీనివాస్‌గౌడ్ జిల్లా కేంద్రంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎకోపార్కు ఏర్పాటు, పెద్ద చెరువు పిక్నిక్, బైపాస్ రోడ్డులాంటి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించారు. ప్రస్తుత ఎన్నికల్లోను తన స్థానాన్ని పదిలం చేసుకోబోతున్నారు.
9. షాద్‌నగర్

హైదరాబాద్ రాష్ర్టానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించిన బూర్గుల రామకృష్ణారావు ఈ నియోజకవర్గ నివాసి. ఈ నియోజకవర్గం నుంచి రాయికల్ దామోదర్‌రెడ్డి, శంకర్రావ్, బీస్వ కిష్టయ్య, ఇందిర, బక్కని నరసింహులు, ప్రతాప్‌రెడ్డి,అంజయ్య యాదవ్‌లను ఎమ్మెల్యేలుగా ప్రజలు ఎన్నుకున్నారు. శంకర్రావును నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2014 ఎన్నికల్లో అంజయ్య టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన అంజయ్య యాదవ్‌ను ఇక్కడి ప్రజలు ఆదరించారు. పభుత్వం ద్వారా నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులను మంజూరు చేయించుకున్నారు. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండే ఈ నియోజకవర్గం పరిశ్రమల ఏర్పాటులో కీలకంగా నిలుసున్నది. ప్రస్తుత ఎన్నికల్లోను అంజయ్య యాదవ్ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు.
10. కల్వకుర్తి

కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేకత ఉంది.1989 ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ను ఇక్కడి ప్రజలు ఓడించారు. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి వరకు ఎదిగిన జైపాల్‌రెడ్డి ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. జైపాల్‌రెడ్డి ఇక్కడి నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అలాగే చిత్తరంజన్‌దాస్‌కు రెండు దఫాలుగా ప్రజలు అవకాశం కల్పించారు. ఎడ్మ కిష్టారెడ్డి, జైపాల్ యాదవ్ రెండు దఫాలు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వీరితోపాటు శాంతాబాయి, వెంకట్‌రెడ్డి, జీరెడ్డిలు కూడా ఇక్కడి నుండి ఎమ్మెల్యేలు అయ్యారు. 2014 ఎన్నికల్లో వంశీచంద్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఇక్కడ కీలకంగా వ్యవహరించిన జైపాల్‌రెడ్డి నియోజకవర్గంపై దృష్టి నిలుపకపోవడంతో ఆయన వర్గమంతా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ద్వారా టీఆర్ఎస్లోకి చేరింది. ఇక్కడ ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ దఫా ఇక్కడ గులాబీ జెండా ఎగురవేయాలన్న పట్టుదలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
11. నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్ అసెంబ్లీకి తొలిసారి బ్రహ్మానందరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం వీఎన్‌గౌడ్, శ్రీనివాస్‌రావు, వంగా మోహన్‌గౌడ్, నాగం జనార్దన్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డిలు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో ఒక్క నాగం జనార్దన్‌రెడ్డి 6 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వీఎన్ గౌడ్ మరో మూడు దఫాలు పని చేయగా, నాగన్న, మహేందర్నాథ్ ఒక్కొక్క పర్యాయం ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ ప్రభుత్వంలో అనేక మంత్రి పదవులను నాగం చేపట్టారు. 2014 ఎన్నికల్లో మర్రి జనార్దన్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దాదాపు 80 వేల ఎకరాలకు సాగు నీరును పారించుకోవడం పెద్ద మార్పునకు దోహదంగా నిలిచింది. వీటితో పాటు ఇతర సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేయించారు. ఎప్పటికప్పుడు సాగునీటి పనులపై పాదయాత్రలు చేపట్టి నిత్యం ప్రజల్లో ఉంటున్నారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలోనూ మర్రి ముందంజలో ఉన్నారు.
12. దేవరకద్ర

దేవరకద్ర అసెంబ్లీ నియోజకవర్గంగా 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటయింది. అంతకుముందు అమరచింత నియోజకవర్గంగా కొనసాగిన నేపథ్యంలో కొత్త అసెంబ్లీగా అమరచింత స్థానంలో దేవరకద్ర చేరింది. ఇక్కడి నుంచి ముందుగా సీతాదయాకర్‌రెడ్డి టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో ఆల వెంకటేశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వెంకటేశ్వర్‌రెడ్డి నియోజకవర్గంలో సాగునీటి పరంగా అభివృద్ధిని సాధించారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవడం ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. పిలిస్తే పలికే ఎమ్మెల్యేగా ఆలకు తక్కువ సమయంలో గుర్తింపు వచ్చింది. ఇప్పటి వరకు మహాకూటమి అభ్యర్థులనే ప్రకటించలేదు. మహాకూటమి ఇంకా ప్రచారం మొదలుపెట్టకముందే తాజామాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
13. జడ్చర్ల..

జడ్చర్ల నియోజకవర్గంలో గత చరిత్రను చూస్తే.. స్వతంత్ర అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా ప్రజలు అవకాశం కల్పించారు. కొత్త కేశవులు, ఎల్ఎన్ రెడ్డి, ఎం కృష్ణారెడ్డిలను స్వతంత్ర అభ్యర్థులుగానే ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఇక మిగిలిన వారు ఆయా పార్టీల పేరుతో ఎన్నికవుతూ వచ్చారు. వీరిలో ఎర్ర శేఖర్‌ను మూడుసార్లు, లకా్ష్మరెడ్డిని రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ప్రభుత్వంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. 2004లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయిన లకా్ష్మరెడ్డి, అనంతరం ఉద్యమంలో రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉమ్మడి పాలమూరులో హీరోగా నిలిచారు. 2014 ఎన్నికల్లో గెలుపొందిన అనంతరం మంత్రిగా జిల్లాతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. మహబూబ్‌నగర్‌లో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయడంలో ముఖ్య భూమికను పోషించారు. రాష్ట్రంలో మంజూరైన ఏకైక డిగ్రీ కళాశాలను జడ్చర్లలో లకా్ష్మరెడ్డి ఏర్పాటు చేయించారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
14. వనపర్తి

వనపర్తి నియోజకవర్గం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ స్థానం నుండి తొలి ఎమ్మెల్యేగా సాహితీవేత్త సురవరం ప్రతాపరెడ్డిని ఎన్నుకున్నారు. అనంతరం వనపర్తి సంస్థానాధీశుల కుటుంబం నుంచి కుముదినీ దేవి, కందూరు రాంరెడ్డి, అయ్యప్ప, జయరాములు, డాక్టర్ బాలకిష్టయ్య, డాక్టర్ చిన్నారెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో చిన్నారెడ్డి మాత్రమే వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి జిల్లాలో 14 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ జెండాను చేతబట్టిన సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. అయినా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా ఈ నాలుగేండ్లు నిరాడంబరంగా సేవలందించారు. సీఎం కేసీఆర్ అందించిన ప్రోత్సాహంతో నియోజకవర్గంలో సాగునీటి రంగంలో అద్భుతమే సాధించారు. తొలి ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేయడం, ఇతర అన్ని రంగాల అభివృద్ధిలో వనపర్తిని ఓ స్థాయికి తీసుకెళ్లే విధంగా ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడి హోదాలో నిర్విరామంగా పని చేసుకొచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లోనూ నిరంజన్‌రెడ్డి ముందున్నారు. ఇటీవల వనపర్తిలో ఉమ్మడి జిల్లా ప్రజాశీర్వాద సభను ఆయన నిర్వహించడం టీఆర్ఎస్ పార్టీలో కొత్త జోష్ నింపింది.
ప్రచారంలో మోనార్క్ కేసీఆర్ 2014 ఎన్నికల్లో 15 రోజుల్లో 100కు పైగా ప్రచార సభలు నిర్వహించి చరిత్ర సృష్టించిన ఘనత కేసీఆర్‌దే. ఒంటి చేత ప్రచారం చేసి మెజారిటీ సాధించిన కేసీఆర్ ధాటికి తెలంగాణలో పోటీదారుడే లేడని అప్పట్లోనే తేలిపోయింది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామ ప్రచారంలో మునిగిపోయేవారు. కారులోనో, లేదా హెలీకాప్టర్లోనో విశ్రాంతి తీసుకునేవారు. అప్పట్లో సోనియాగాంధీ సభలకు కాంగ్రెస్ నేతలు 20 వేల మందిని తరలించడానికే హైరానా పడ్డారు. కేసీఆర్ సభలకు ప్రజలు స్వచ్ఛందంగా హాజరయ్యారు. ఉద్యమస్ఫూర్తితో జన సమూహం కదిలేది. కొత్త రాష్ర్టానికి ఉద్యమనేత మాత్రమే పాలకుడు కావాలనే బలమైన ప్రజావాంఛతోనే కేసీఆర్ సభలు విజయవంతమయ్యాయి. కాంగ్రెస్ ఎన్ని వరాలు ప్రకటించినా ప్రజలు నమ్మలేకపోయారు. ఉదాహరణకు రైతులకు రెండు లక్షల రుణ మాఫీ ప్రకటించినా కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మేలాలేరు. లక్ష రుణమాఫీని ప్రకటించిన కేసీఆర్‌నే ప్రజలు నమ్ముతున్నట్లు స్పష్టమవుతున్నది. ప్రజల విశ్వసనీయత కేసీఆర్ ప్రచారానికి బ్రహ్మరథం పట్టింది. కేసీఆర్ ప్రచార శైలి, ప్రచారంలో ఆయన ఓపిక, సహనం, మాట్లాడే సామర్థ్యం తిరుగులేని విధంగా సాగింది. ఈ ఎన్నికల్లోనూ ద్విగుణీకృత దీక్షతో కేసీఆర్ ప్రచారాన్ని ఇప్పటికే మొదలు పెట్టారు. మరోసారి వంద ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. ప్రచారంలో కేసీఆరే మోనార్క్ అని మరోసారి రుజువుకాబోతుందనేదే విశ్లేషకుల అభిప్రాయం.