Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాలమూరును పచ్చగా మారుస్తాం

-కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తె కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గద్దలపాలవుతుంది
-ఇవి ఉత్త ఎన్నికలు కావు.. మన చావు బతుకుల సమస్య
-చంద్రబాబూ నీతో పొత్తా.. ఛీ ఛీ నీది ఐరన్ లెగ్..
-నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అవుతుంది
-మహాకూటమి నేతలారా..మీ దమ్మేందో.. మా దమ్మేందో ఎన్నికల్లోతేల్చుకుందాం

అరవై ఏండ్ల పాలనలో తెలంగాణను నాశనం చేసిన కాంగ్రెస్, టీడీపీలు కావాలో, నాలుగేండ్లలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో అభివృద్ధి చేసిన టీఆర్‌ఎస్ కావాలో ప్రజలు తేల్చుకోవాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కోరారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం శివారులోని నాగవరం వద్ద నిర్వహించిన భారీ బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పాలమూరు కరువుకు, వలసలకు కారణమయ్యాయంటూ కాంగ్రెస్, టీడీపీలపై నిప్పులు చెరిగారు. ఆ పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా ఓడించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ రాష్ర్టానికి పట్టిన చీడపురుగని, టీడీపీ నాయకుడు చంద్రబాబుది ఐరన్‌లెగ్ అని అభివర్ణించారు. ఈ పార్టీలకు ఓటేస్తే.. ఇన్నేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. గద్దల పాలవుతుందని హెచ్చరించారు. దాచి దాచి దయ్యాలపాలు చేయొద్దని కోరారు. భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామని, అలా చేయకుంటే ఆపై ఎన్నికల్లో ఓట్లడిగేది లేదని శపథంచేశారు. మీ దమ్ము ఏందో మా దమ్ము ఏందో తేల్చుకుందామని మహాకూటమికి సవాలు విసిరారు. ఇవి మామూలు ఎన్నికలు కావన్న కేసీఆర్.. తెలంగాణకు లైఫ్ అండ్ డెత్ పోరాటమని చెప్పారు. ఏమరుపాటుగా ఉంటే ఘోరమైన దెబ్బతింటామని అన్నారు. ఢిల్లీకి, అమరావతికి గులాంలుగా ఉందామా? లేక తెలంగాణ నిర్ణయాలు తెలంగాణలోనే తీసుకుందామా? అనేది ప్రజలు ఆలోచించాలని కోరారు.

రాష్ర్టానికి పట్టిన చీడపురుగు కాంగ్రెస్ అని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. పాలమూరును కరువుజిల్లాగా, వలసలజిల్లాగా మార్చింది ఇక్కడి కాంగ్రెస్ నేతలేనని ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్కకొట్టుకుని ఆంధ్రకు నీళ్లు తీసుకుపోతుంటే నోరు మూసుకున్నారని, రఘువీరారెడ్డి శ్రీశైలానికి మరో పొక్కపెడితే.. ఇక్కడి కాంగ్రెస్ నేత డీకే అరుణ హారతులిచ్చారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గొర్రెలు, చేపపిల్లలు పంపిణీచేస్తుంటే ఇదే జిల్లాకు చెందిన చిన్నారెడ్డి అవహేళనచేశారని గుర్తుచేశారు. ఇలాంటివారు కావాలా? లేక.. నిరంతరం పాలమూరుకు నీళ్లివ్వటం ఎలాగని ఆలోచిస్తున్నవారు కావాలా? ఆలోచించాలని విజ్ఞప్తిచేశారు. కాంగ్రెస్, టీడీపీ కూటమికి ఓటేస్తే.. ఇన్నేండ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ.. గద్దల పాలవుతుందని హెచ్చరించారు. భవిష్యత్తులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తామని, అలా చేయకుంటే ఆపై వచ్చే ఎన్నికల్లో ఓట్లడిగేది లేదని శపథంచేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రం శివారులోని నాగవరంవద్ద ఏర్పాటుచేసిన భారీబహిరంగసభనుద్దేశించి కేసీఆర్ మాట్లాడారు. అనేక సమస్యలు, సంక్షోభాల మధ్య వచ్చిన తెలంగాణలో అతి తక్కువ కాలంలోనే దేశంలో ఎక్కడా అమలుజరుగని కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు.


60 ఏండ్ల పాలన.. నాలుగేండ్ల పాలన గమనించాలి

టీడీపీ, కాంగ్రెస్ 58 ఏండ్లు పాలించాయి. నాలుగేండ్ల మూడునెలలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నది. పాలమూరు జిల్లా ఎవరి పాలనలో ఎట్ల ఉన్నదో పోల్చుకోండి. ఎన్నికలప్పుడు చాలామంది వస్తారు.. చాలా చెప్తారు. ప్రజలు ఆలోచనచేయాలి. కేసీఆర్ చెప్పే మాట విని ఉట్టిగనే పోవద్దు. మీ గ్రామానికి పోయిన తరువాత ఇది వాస్తవమా? కాదా? అనేది చర్చించాలి. ప్రత్యేకించి పాలమూరుపై చర్చించాలి.


మహాకూటమి సంగతి చెప్తం

మహాకూటమా.. గూటమా! నీ మహాకూటమి సంగతి చెప్తాం. నీకు జవాబు చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నరు. ఎన్నికల రంగంలో దూకాం. మీ దమ్ము ఏందో మా దమ్ము ఏందో తేల్చుకుందాం. పిట్ట బెదిరింపులకు ఎవడూ భయపడడు. ప్రారంభమైన ప్రగతిరథం, అభివృద్ధి, పాలమూరు జలయజ్ఞం, ప్రాజెక్టులు ఆగొద్దు.. కరంట్ పోవద్దు. అద్భుతమైన పాలమూరు, బంగారు తెలంగాణ రూపుదిద్దుకోవాలి. ఎన్నికలు మాత్రమే కాదు. ఇది లైఫ్ అండ్ డెత్ పోరాటం. బతకాల్నా.. చావాల్నా.. బానిసలు కావాల్నా! తేల్చుకునే సమయం. ఏమరపాటుగా ఉంటే ఘోరమైన దెబ్బతింటం. నేను చెప్పేవి అన్నీ వాస్తవాలు.. నేను చెప్పిన దాంట్ల ఒక్కమాట తప్పు ఉంటే మాకు డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. ఒకవేళ నిజమైతే 14 సీట్లలో గులాబీ జెండా ఎగురేయండి. అర్థమైన తర్వాత అర్థం కానట్టుంటే మన బతుకులు వ్యర్థమైతాయి. నష్టపోతాము. బక్కపాణం అయినా.. 19 ఏండ్ల పాటు ఉన్న శక్తినంతా కూడదీసుకొని ఇంకా కొట్లాడుతున్న. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. చైతన్యవంతులైన ప్రతి ఒక్కరు కేసీఆర్ కావాలి. అందర్నీ చైతన్యపరుచాలి.


ప్రాజెక్టులపై చర్చిద్దామంటే పారిపోయారు

కోటి ఎకరాలకు రావాలి! ఉన్న ప్రాజెక్టులు ఎట్ల ఉన్నయి? కొత్తయి ఎట్ల రావాలి? మనకు కేటాయించిన నీళ్లు ఎట్ల వాడుకోవాలి? ఒక వ్యవహారం తెలంగాణ నేపథ్యంలో చేసుకోవాలి. 40మంది రిటైర్డ్ ఇంజినీర్లను నాలుగు హెలికాప్టర్లలో కృష్ణ, తుంగభద్ర, గోదావరి, దాని ఉపనదుల మీద 13, 14 రోజులు తిప్పినాను. వారంత తిరిగి నివేదిక ఇచ్చినారు. వ్యాప్కోస్‌కు ఇచ్చి డిజైన్లు తయారుచేసినం. సీఎంగా నా బాధ్యత. శాసనసభకు, ప్రతిపక్షాలకు చెప్పాలి. అందరినీ ఆహ్వానించిన. సభలో పిక్చర్‌వేసి కంప్యూటర్ మీద చెప్పుతాం.. ఎట్ల డిజైన్ వేసినమో, నీళ్లు ఎట్ల వస్తయో చూపెడుత అన్న. తెలంగాణ ఎట్ల బాగుపడుతదో చెప్తా అంటే.. కాంగ్రెస్ నాయకులు వెన్నుచూపించి పారిపోయినారు. ఎందుకు? ముఖంలేకనా? తెలివిలేకనా? అవగాహనలేక మీ బండారం బయటపడుద్దనా? పెద్దపెద్ద మాటలు మాట్లాడేముందు తెలంగాణ రైతాంగానికి సమాధానం చెప్పాలి. ప్రజలు కూడా వారిని ఎక్కడికక్కడ నిలదీయాలి. జిమ్మేదారీ ప్రతిపక్షం అయితే సభలో ఉండాలి. సీఎం చెప్పేది వినాలి. తప్పుంటే అట్లకాదు.. ఇట్ల చేయాలని చెప్పాలి. కానీ.. తోక ముడుచుకుని పోయినారు. ఎందుకంటే.. ఆంధ్ర పాలకులకు సంచులు మోసి బతికినారు కాబట్టి.. సొంత తెలివి, అవగాహన లేక పారిపోయినారు. ప్రతిసారి మేం అసెంబ్లీ పెట్టాలి. వాళ్లు సస్పెండ్ చేయించుకొని పారిపోవాలి! ఏదో.. ఒకసారి దొరికినారు.. మాట్లాడండి అంటే.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లే.. లే.. మేము ప్రిపేర్ అయి రాలే అన్నారు. మరీ ఏం పీకనీకి వచ్చిర్రు అసెంబ్లీకి? గోలీలు ఆడుదామనా? వారికి అడ్డగోలు మాటలు తప్ప విషయం తెలియదు. ఏ నది, ఏ ప్రాజెక్టు ఎక్కడ ఉన్నాయో.. నీళ్లు ఎన్ని ఉన్నాయో, ఎంత వాటా ఉందో తెలియదు.


నోరుమూసుకుని పడి ఉన్న పాలమూరు కాంగ్రెస్ నేతలు

ఆనాటి నుంచి ఈనాటి వరకు దేశానికి పట్టిన భయంకరమైన చీడపురుగు, దరిద్రం కాంగ్రెస్. ఉన్న తెలంగాణను ఊడగొట్టినోడు నెహ్రూ. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా ఆంధ్రలో కలిపారు. 1969లో మా రాష్ట్రం మాకు ఇవ్వాలని అడిగితే 400 మందిని కాల్చిచంపింది ఇందిరాగాంధీ. తరువాత సోనియాగాంధీ.. తెలంగాణ ఇస్తామని 2004లో చెప్పారు. ఆ రోజే అయిపోయేది. బతిలాడినా.. దండంపెట్టినా, రాజశేఖర్‌రెడ్డి మాయల పడి ఇయ్యలే. మనం గట్టిగ నిలబడితే గత్యంతరం లేక తలొగ్గి ఇచ్చారు. పద్నాలుగేండ్లు ఆలస్యంచేశారు. వందల యువకులు సచ్చిపోయినారు. పద్నాలుగేండ్లు ఉద్యమాన్ని నిలబెట్టకపోతే తెలంగాణ ఇచ్చేవాళ్లు కాదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ అడుగులకు మడుగులొత్తి.. ఆంధ్ర సీఎంలకు బానిసలై తెలంగాణ ప్రయోజనాలు తాకట్టి పెట్టినారు. నిజం కాదా! కొట్లాడినారా? ఎగువ కృష్ణా, బీమాకు ఎగనామం పెట్టిన మాట వాస్తవంకాదా? ఆనాడు పాలమూరు కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకొని పడి ఉన్నరు. ఆ పాపమే మనకు శాపమై ఐదు దశాబ్దాలు కరువుబారిన పడినం. నేను, జయశంకర్ సార్ పాలమూరు జిల్లా వస్తే కొన్ని సందర్భాల్లో ఏడ్చేవాళ్లం. ఒకసారి నారాయణ్‌పేట నుంచి మహబూబ్‌నగర్ మీదుగా వస్తున్నా. రాత్రి లైటు వెలుగులో చిన్నపాటి అడవి కనిపించింది. పాలమూరులో అడవి కూడా బక్కగా అయింది అన్నాను. అంత ఘోరం, దరిద్రం. దీనికి కారకులు ఎవరు? 60 ఏండ్ల కాంగ్రెస్, టీడీపీ పాలన పాలమూరు జిల్లాకు ఇచ్చిన బహుమానం ఏంది? మహబూబ్‌నగర్ అనగానే కరువు జిల్లా, వలసల జిల్లా, లేబర్ జిల్లా, పెండింగ్ ప్రాజెక్టుల జిల్లా! ఇదీ కాంగ్రెస్ నాయకుల బతుకు. ఏనాడూ నోరు తెరువలే!


గులాబీ జెండా ఎగిరినంకే జూరాల నింపారు

1974లో బచావత్ ట్రిబ్యునల్ వచ్చింది. బచావత్ అనే సుప్రీంకోర్టు జడ్జి.. ఆంధ్రప్రదేశ్‌లో కలువకపోతే తెలంగాణ చాలా డెవలప్ అయ్యేది. కలిసి నాశనం అయింది అన్నరు. 18 టీఎంసీలు జూరాలకు అలాట్ చేస్తున్నం.. సాంకేతిక కారణాలతో షిఫ్ట్ చేయొద్దు.. ఎక్కడ కట్టినా పాలమూరుకే నీళ్లు ఇవ్వాలని 1974లో చెప్పారు. 1980 దాకా ఫౌండేషన్ వేయలేదు. తెలంగాణ బిడ్డ అంజయ్య సీఎం అయ్యాక ఫౌండేషన్ వేస్తే దాన్ని కట్టలేదు. చివరకు కడితే 2000 సంవత్సరం దాకా నీళ్లు నింపలేదు. 2001లో గులాబీ జెండా ఎగిరాక చంద్రబాబూ ఇది వివక్ష కాదా? అని అడిగితే.. మోకాళ్ల మీద ఉరికించి కట్టారు.


పాలమూరు పథకం పూర్తికావాలి

ఆరునూరైనా పాలమూరు ఎత్తిపోతల పూర్తికావాలి. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను ఎలా కంప్లీట్ చేశామో మీరే గమనించాలి. ఉద్యమం వచ్చేదాకా ఇక్కడ కాల్వలు తవ్వలేదు. ప్రాజెక్టులు నింపలేదు. జూరాల 18, ఆర్డీఎస్ 17, కోయిల్‌సాగర్ 3, బీమా 20 టీఎంసీలు.. ఇవి నికర జలాలు. వీటి గురించి పట్టించుకోలేదు. ఆర్డీఎస్ నీళ్ల కోసం అలంపూర్ నుంచి గద్వాలకు పాదయాత్ర చేశా. అప్పటి కర్నూలు ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి.. కేసీఆర్ ఒత్తిడికి తలొగ్గి ఆర్డీఎస్ తూములు మూస్తే బాంబులు పెట్టి బద్దలు కొడతా అన్నడు. అప్పుడు రాజోలు గ్రామంలో ఉన్న నేను.. అరే బైరెడ్డి.. నువ్వు బాంబులు పెట్టుడుకాదు.. ఆర్డీఎస్‌కాడ అడుగుపెట్టు.. నీ సుంకేసుల బరాజ్‌ను వెయ్యి బాంబులు పెట్టి దుమ్ములేపి పడేస్తా అని చెప్పిన. స్థాయి దిగి మాట్లాడానా అని తర్వాత బాధనిపించింది. కానీ నా మాటల్లో తప్పేం లేదని, మాకు కూడా బాంబేసెటోడు పుట్టిండురా అని పాలమూరు ప్రజలు సంతోషపడుతున్నరని కొందరు విలేకరులు చెప్పారు.


చాతగాక నీళ్లు పారియ్యలేదా..
v పనిచేద్దామంటే కాంగ్రెస్ నాయకులకు అవకాశం లేకుండేనా? నీళ్ల నిరంజన్‌రెడ్డి అని నేను పేరు పెట్టలేదు. లక్ష్మారెడ్డిసహా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు చేసిన పని కాంగ్రెస్ నాయకులు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఏడు లక్షల ఎకరాలకు నీరు పారుతున్నయి. మీరు ఎందుకు పారియ్యలేదు?

భగీరథ పూర్తి చేసేందుకు దమ్ము కావాలి
మిషన్ భగీరథ పూర్తిచేశాకే ఓట్లు అడిగేందుకు వస్తానని చెప్పాను. అలా చెప్పేందుకు, దాన్ని పూర్తిచేసేందుకు గట్స్ కావాలి. 99% పనులు పూర్తయినవి. పాలమూరులో 5.50 లక్షల కనెక్షన్లు ఇచ్చారు. మిగతావి దీపావళిలోపు పూర్తవుతాయి. నేను వచ్చే జూన్‌లో ఎన్నికలుంటాయని ఆ వాగ్దానం చేశా.. కానీ నవంబర్ ముగిసే నాటికి కంప్లీట్‌గా భగీరథ ద్వారా నీళ్లు వచ్చేలా చేస్తున్న.

చంద్రబాబుది ఐరన్ లెగ్గు..అడుగుపెడితే భస్మమే..
సోపతి ఉందామని నాతో అన్నడు చంద్రబాబు. తెలుగోళ్లమట! తెలుగు పేరు మీదనే కదా మా కొంపముంచింది. తెలుగు తల్లి.. తెలుగు భాష అని 60 ఏండ్లు దోచుకున్నరు. తియ్యగ.. పుల్లగ మాట్లాడి.. మోసం చేశారు. చంద్రబాబు.. నీతో పొత్తా! ఛీ.. ఛీ! బతికుండగ కూడా కలువము. నీ అడుగు పడితే పచ్చని చెట్టు కూడా భస్మం అవుతుంది. అంత దరిద్రం నువ్వు. ఐరన్ లెగ్గు నీది. అంత దరిద్రపు దోస్తానం మాకెందుకు? నరేంద్రమోదీ, కేసీఆర్ ఒకటి అయ్యారని బాబు అంటున్నరు. నాకేం అవసరం? చంద్రబాబును నేను వేధిస్తున్ననట! ఎవరు వేధిస్తున్నరు? నువ్వు సక్కటి మనిషివని వేధిస్తున్ననా? ఓటుకు నోటుకు దొంగతనం చేసింది నువ్వుకాదా? ఓ బుడ్డర్‌ఖాన్‌ను పంపితివి.. వాడు దొరికే! అది నిజం కాదా? ఆ దొంగతనంలో నీ పాత్రలేదా? నీ వాయిస్ రికార్డ్ లేదా? మరి నేనేం వేధిస్తున్న బిడ్డా?

ఢిల్లీకి, అమరావతికి గులాంలు అవుదామా..
సిగ్గుపడాలి.. బాధపడాలి. చంద్రబాబు తొమ్మిదేండ్లు ఈ జిల్లాను దత్తత తీసుకున్నడు. ఏం చేసిండు? గుండెల మీద గుద్దిండు. పునాదిరాళ్లు పాతిపోయిండు. సమైక్య పాలకులు పాతిన పునాదిరాళ్లు కృష్ణానదిలో పడేస్తే.. పెద్ద డ్యాం తయారైతదని పాలమూరుకు వచ్చినపుడల్లా నేను అనేవాడిని. అలాంటి దుర్మార్గుడైన చంద్రబాబుతో ఇవ్వాళ తెలంగాణ కాంగ్రెవాళ్లు పొత్తు పెట్టుకున్నరు. నీచాతినీచానికి దిగజారి చంద్రబాబును తెలంగాణకు తెస్తున్నరు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మళ్ల అంధ్రోళ్లకు అప్పగిస్తమా? దరఖాస్తులకు విజయవాడ పోదామా? అమరావతికి బానిసలవుదామా? మీరే చెప్పాలి. తెలంగాణ నిర్ణయాలు తెలంగాణల జరగాలా? లేక ఢిల్లీలో జరగాల్నా? అధికారం మన చేతిలో ఉండాల్నా? అమరావ తి, ఢిల్లీలో ఉండాల్నా? ఢిల్లీ, అమరావతి గులాంలు కావద్దు! పట్టువీడితే ఉన్న గోసి ఊడిపోతది. ఆగమైపో తం. ఇన్నాళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఈనగాచి నక్కల పాలైతది. ఏమరపాటుగా ఉంటే.. ఈ గద్దలు తన్నుకుపోతే.. మళ్లా భయంకర పరిస్థితులు ఉంటాయి.

పోతిరెడ్డిపాడు పొక్కపొడిచిన దుర్మార్గుడు వైఎస్
గతంలో రాజశేఖర్‌రెడ్డి అనే దుర్మార్గుడు పోతిరెడ్డిపాడు పొక్కపొడిచి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పెండింగ్ పెట్టి, పాలమూరును ఎండపెట్టి, వలసజిల్లా చేసి 64వేల క్యూసెక్కుల కాల్వ తవ్వుకపోతడు! సిగ్గుపడాలి. దుఖం వస్తది.. బాధ అయితది! ఎట్ల పుట్టిర్రు తెలంగాణలో అనిపిస్తది. ఇదే చిన్నారెడ్డి.. పోతిరెడ్డిపాడు తవ్వుడు కరెక్టే అని సిగ్గులేకుండా పేపర్లలో వ్యాసం రాసిండు. మహబూబ్‌నగర్ ప్రయోజనాల కోసం.. తెలంగాణ రైతులకోసం రాసిండా? కుక్కకు బొక్కవేసినట్టు చిన్నారెడ్డికి మంత్రిపదవి ఇస్తే.. తోక ఊపుకొంటూ సమైక్య పాలకులను సమర్థించాడు. అనంతపురానికి చెందిన అప్పటి మంత్రి రఘువీరారెడ్డి శ్రీశైలానికి మరో పొక్కపెట్టి.. హంద్రీనీవాకు 300 కిలోమీటర్లు కాల్వ తవ్వి నీళ్లు తీసుకుపోయారు. మన ప్రాజెక్టులు 20 ఏండ్ల సంది పెండింగ్‌ల పెట్టి.. వాళ్లు 40 లిఫ్ట్‌లు ప్రారంభించుకున్నారు. నిన్న కత్తులు తిప్పిన డీకే అరుణ ఆయనకు మంగళహారతి పట్టింది. రఘువీరారెడ్డి.. మీరు మా గుండుకొట్టి, అనంతపురం నీళ్లు తీసుకపోతున్నరు.. చాలా గొప్ప పని మీది.. గిదే లోఫర్ బతుకులు మావి అం టూ సిగ్గులేకుండా ఆయనకు మంగళహారతులు పట్టినారు. అబద్ధమా? వీడియో రికార్డులు ఉన్నాయి. పాలమూరులో ప్రతి ఇంటికీ ఆ వీడియోలు చూపెడుతాం. అరుణ.. ఒళ్లు దగ్గర పెట్టుకో! కాస్కో.. మీ బండారం, చరిత్ర బయటపెడుతం.

పోతిరెడ్డిపాడుపైనే ఆనాడు రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పుకొన్నం
ఇదే పోతిరెడ్డిపాడుకు పొక్క పెడితే నేను ఢిల్లీలో సోనియాగాంధీ దగ్గర పంచాయితీ పెట్టిన. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మా మంత్రులు ఇదే అంశంపై రాజీనామా చేశారు. పదవులను చెప్పుల్లాగా విసిరేసి.. బొక్కలు ఇరిగేదాకా.. పేగులు పిగిలే దాకా.. అన్నం తిన్నా.. ఉపాసం ఉన్నా.. పోరాటంచేస్తే.. ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ దరిద్రులు నోరు మూసినారు. మంగళహారతులు పట్టినారు. వాళ్లా మనకు ప్రజాప్రతినిధులు? లేకపోతే కాల్వలు తిరిగి.. బొట్టు బొట్టుకు తండ్లాడి ఇయ్యాల వనపర్తి, కొల్లాపూర్ ప్రాంతంలో చెరువులు నింపుతున్న నీళ్ల నిరంజన్‌రెడ్డా? ఎవరు నాయకులు? ఎవరుకావాలి? ఉమ్మడి పాలమూరు ప్రజలు నిర్ణయం చేయాలి. తెలంగాణ వచ్చింది.. ఎవడురా తెలంగాణ ప్రాజెక్టు ఆపేది? అవసరమైతే కుర్చీవేసుకుని కట్టిస్త.. అని ఒకనాడు గద్వాల సభలో చెప్పిన. కూర్చున్నం. మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, మర్రి జనార్దన్‌రెడ్డి మూడు దిక్కుల నైట్ హాల్ట్‌లుచేశారు. గుడిపల్లి గట్టుకాడ.. జోన్నలబోగడ కాడ, అవంచ గ్రామంలో పడుకున్నది వాస్తవం కాదా? కుర్చీ వేసుకొని కట్టివ్వలేదా? లేకపోతే ఇంకా ఇరవై ఏండ్లకైనా కల్వకుర్తి నీళ్లు వచ్చేవా? ఇప్పుడు 800-1000 చెరువులు నింపుకొంటున్నం.

పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరు
-శపథం చేస్తున్న.. ఇవ్వకుంటే ఓట్లడుగ వనపర్తి సభలో శపథం చేస్తున్న. 14 స్థానాల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేయండి.. చెప్పినట్టు 20 లక్షల ఎకరాలకు నీరు ఇస్తేనే మల్ల పాలమూర్ల ఓట్లు అడుగుతాం. వివిధ జిల్లాలనుంచి మన వద్దకు కూలీలు వచ్చేలా చేసి పచ్చ పాలమూరును బహుమతిగా ఇస్తా. రూ.9000 కోట్లు ఖర్చుపెట్టి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేశాం. వేలంపాడు రెండు టీఎంసీలు ఉంటే నాలుగు టీఎంసీలు చేశా. సుందిళ్ల ప్రాజెక్టు మంజూరు చేసుకున్నం. గట్టు ఎత్తిపోతల త్వరలో పూర్తిచేసుకుంటాం. ఆర్డీఎస్‌లో 87,500 ఎకరాల పాత ఆయకట్టుకు నీరు తీసుకుంటాం. నికర జలాలు కావచ్చు, కల్వకుర్తి నెట్టెంపాడులాంటి మిగులు జలాలు కావచ్చు.. మొత్తం 103 టీఎంసీల ప్రాజెక్టు తెలంగాణ వచ్చాక మనం కంప్లీట్ చేశాం. కల్వకుర్తిలో కాల్వ అయింది.. కానీ రిజర్వాయర్లు లేవు. ఎన్నికలు పూర్తికాగానే 40 రిజర్వాయర్లు కడుతం. పది లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలి. కొడంగల్, నారాయణపేట, దేవరకద్ర, జడ్చర్ల, షాద్‌నగర్ ప్రాంతాలకు పాలమూరు ఎత్తిపోతల ద్వారా మరో 12 లక్షల ఎకరాలకు నీరు తీసుకువస్తం.

కాంగ్రెస్ గొర్రెలకు అర్థంకాలే

ఈ ప్రాంతానికి చెందిన చిన్నారెడ్డి.. చేపపిల్లలు, గొర్రెలు పిల్లలు ఇంకేవీ లేవా అంటూ అసెంబ్లీలో అవహేళన చేశారు. చేపలు పెంచే తెనుగువాళ్లు కాంగ్రెస్‌వాళ్లకు కనిపించలే. గొర్రెలు అంటే కాంగ్రెస్ గొర్రెలకు తెలియలే. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకు 12వేల గొర్రెలు అవసరమైతాయి. పారిశ్రామికప్రాంతాల్లో పెద్దఎత్తున గొర్రెల వినియోగం జరుగతది. రాష్ట్రంలో 30 లక్షలమంది గొల్లకురుమలు ఉన్నారు. 2014లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిననాడు 650 లారీలు గొర్రెలు ప్రతి రోజు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయితుండే. గొల్లవాళ్లు లేకనా! కాదు అంతకుముందున్న పాలకులకు తెలివి లేక! కులవృత్తిని కూలగొట్టి గొర్రెలను దిగుమతి చేసుకొనే పరిస్థితి తెచ్చారు. ఇది గమనించి దానిని దూరంచేయాలనే నాలుగువేల కోట్లతో 65 లక్షల గొర్రెలను యాదవ సోదరులకు పంపిణీచేశాం. వాటికి 35 లక్షల గొర్రెలు పుట్టినయి. తెలంగాణ యాదవులు ఇప్పుడు రూ.1500 కోట్ల సంపద సంపాదించినారు. రాబోయే కొద్దిరోజుల్లో ధనవంతులైన గొల్లకురుమలు తెలంగాణలోనే ఉన్నరనే పేరు రాబోతున్నది. చేపలు పట్టి బతికేవారు 40 లక్షలమంది ఉన్నరు. శ్రీశైలం ప్రాజెక్టులో చేపలు పట్టబోతే ఆంధ్రవాళ్లు మమ్ముల్ని తరిమికొట్టారని తెలంగాణ ఉద్యమ సమయంలో నాకు చెప్పారు. ఆ దుస్థితి పోవాలని, వేయి కోట్లతో ఉచితంగా చేపపిల్లలు అందిస్తున్నాం. అద్భుతంగా ఆ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నది. చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయినాయి. గీతకార్మికులకు చెట్లపన్ను రద్దుచేసినం. నాయీబ్రాహ్మణ సోదరులకు మంగలిషాపులకు తక్కువ ధరకే కరంటు ఇచ్చి ఆదుకుంటున్నం. రజక సోదరుల వృత్తిని నిలబెట్టడానికి నవీనమైన పద్ధతులు అవలంబిస్తున్నం. ఇండియాలో, ప్రపంచంలోని చాలా దేశాల్లో లేనివిధంగా మొట్టమొదటిసారి రైతు సోదరుల బాధను గుర్తించి ఎకరానికి ఎనిమిది వేలు పెట్టుబడి ఇచ్చే రైతుబంధు పథకాన్ని పెట్టిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతు సచ్చిపోతే కుటుంబం బజారున పడుతది. ఇప్పుడు రైతుబీమా పథకాన్ని పెట్టుకున్నం. ఐదు గుంటల భూమి ఉన్నా.. అరెకరం భూమి ఉన్నా.. ఐదు లక్షలు పది రోజుల్లోపే వస్తాయి. ఆ కుటుంబం బజారున పడకుండా కాపాడుతున్నం.

మన సభల్లో పల్లీలు అమ్ముకునేంతమందికూడా వారి సభలకు రాలే
నిన్న కాంగ్రెస్ నాయకులు అలంపూర్ నుంచి గద్వాల దాకా పోయినారు. నేను నిన్న నల్ల గొండలో ఉన్నాను. ఈ రోజు పాలమూరుకు వచ్చిన. నల్లగొండ, పాలమూరు టీఆర్‌ఎస్ సభల దగ్గర పల్లీలు, బఠానీలు అమ్ముకునేంతమంది కూడా వాళ్ల మీటింగ్‌కు రాలే. కానీ వాళ్లు ఏం మాట్లాడారు? కేసీఆర్ బట్టెబాజ్.. కేసీఆర్ ధోకేబాజ్! ఒక పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గురించి మాట్లాడే సంస్కారం ఇదేనా? బుడ్డరఖాన్‌లు తిప్పినట్టు కత్తులు తిప్పినారు. కత్తులు తిప్పాల్సిన కాడ తిప్పలేదు. తిప్పకూడని కాడ తిప్పినారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.