Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పాలేరు విజయం చరిత్రలో రికార్డు

పాలేరు ఫలితాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వ రెండేండ్ల పాలనపై ప్రజలిచ్చిన తీర్పుగా భావిస్తున్నామని టీఆర్‌ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గురువారం పాలేరు ఉపఎన్నిక ఫలితం వెలువడిన తరువాత ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పాలేరు విజయం తమ బాధ్యతను మరింత పెంచిందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఈ గెలుపుతో విర్రవీగవద్దని, ప్రజలతో కలిసి, వారి కోసం పని చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని అందుకే నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయన్నారు. -ప్రభుత్వ పాలనపై ప్రజల తీర్పు ఇది -దీనితో మాపై బాధ్యత పెరిగింది: కేసీఆర్ -ఈ ఫలితం ప్రతిపక్షాలకు కనువిప్పు కావాలి -కాంగ్రెస్ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసింది -అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఇకపై కేసులే! -దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు విమర్శలు మాని జాతీయప్రాజెక్టు తెస్తే మంచిది -హైదరాబాద్‌కు రూ.60 వేల కోట్ల ఆదాయమంటూ బాబు అబద్ధాలు -తెలంగాణ భవన్‌లో మీడియాతో సీఎం కేసీఆర్

CM-KCR-press-meet

అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ ఉందని ప్రధాని స్వయంగా చెప్పారని, అవినీతిరహిత రాష్ట్రంగా దేశవ్యాప్తంగా పేరు వచ్చిందని అన్నారు. ప్రభుత్వాలను దూషించడమే రాజకీయమనుకునే 1947నాటి రాజకీయాలకు స్వస్తి చెప్పాలని కాంగ్రెస్‌కు హితవు పలికారు. బీజేపీ అనవసర విమర్శలు మాని, తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్టును తీసుకువస్తే ప్రజలు హర్షిస్తారని చెప్పారు. పాలేరు ఎన్నికల స్ఫూర్తితో మరింత వేగంగా పని చేస్తామని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే…. రికార్డు విజయమిది..: పాలేరు ఉపఎన్నిక పాలేరు చరిత్రలో రికార్డు సృష్టించింది. అపూర్వ మెజారిటీ ఇచ్చి టీఆర్‌ఎస్ పార్టీని, తుమ్మల నాగేశ్వర్‌రావును ఎన్నుకున్న ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. తుమ్మలకు అభినందనలు, విజయం కోసం పని చేసిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు, అభినందనలు. పాలేరు ఎన్నికల చరిత్రలో ఇంత మెజారిటీ ఇప్పటివరకు ఏ పార్టీకి రాలేదు. 1972లో కాంగ్రెస్ అభ్యర్థి కాంతయ్యకు వచ్చిన 24,552 ఓట్ల మెజార్టీయే అత్యధికం. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయి మెజారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో ప్రజలు తుమ్మలకు 45 వేల ఓట్ల మెజారిటీ ఇచ్చి రికార్డు సృష్టించారు. దీన్ని తెలంగాణలో సాగుతున్న పరిపాలనను ప్రజలు సమీక్షించి ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం.

వందకు వంద శాతం ప్రజలు ఇచ్చిన క్లియర్ ఎండార్స్‌మెంట్. ఇదే పద్ధతిలో ముందుకు సాగండి.. అని ప్రజలు బల్లగుద్ది ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మెదక్, వరంగల్, జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, నారాయణఖేడ్, పాలేరు వరకు ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు నిరంతర మద్దతు ప్రకటిస్తున్నారు. పాలేరు ఎన్నికతో పార్టీపై, ప్రభుత్వంపై బరువు పెరిగింది… మరింత బాధ్యత పెరిగింది. ఈ తీర్పుతో పొగరు రావద్దు. మరింత అంకిత భావంతో పనిచేయాలి. ప్రజలిచ్చిన గౌరవం ఇది. ఈ తీర్పుతో నేతలు, కార్యకర్తలు గర్వపడకుండా, అధిక ప్రసంగాలు, చర్యలకు పాల్పడకుండా సంస్కారంగా ఉండాలి.

తెలంగాణ కోసం ఏకమవుదాం.. పాలేరు ఎన్నికల ఫలితం స్పూర్తిగా బంగారు తెలంగాణ కోసం ఏకమవుదాం. మరోసారి పునరంకితమవుదాం. పేదరిక నిర్మూలన దిశగా ముందుకు పోదాం. పాలేరు, నారాయణ ఖేడ్ ఎన్నికల ఫలితాలు ఆషామాషి కాదు. అసాధారణమైనవి. ఇక్కడ ఎమ్మెల్యేలు మరణిస్తే వచ్చిన ఎన్నికలు.. సానుభూతి పవనాలను దాటి టీఆర్‌ఎస్ గెలిచింది. టీఆర్‌ఎస్‌కు 2014 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 4,140 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ రోజు 95 వేల ఓట్లు వచ్చాయి. అంటే 24 రెట్ల ఓట్లు పెరిగాయి. కాంగ్రెస్, సీపీఎంల ఓట్లు బాగా తగ్గాయి. ఇది మామూలు విజయం కాదు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రోగ్రెస్ కార్డు.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమీక్షించి ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయం ప్రభావం పాలేరు ఫలితంపై కనిపించింది. ఎమ్మెల్యే అజయ్ తీసుకున్న నిర్ణయం అనుకూలించింది. ధన్యవాదాలు. ఇది ప్రజలు ఇచ్చిన ప్రోగ్రెస్ కార్డుగా భావిస్తున్నా. ప్రజలు కోరుకునే విధంగా ఈ రాష్ట్రం పురోగమిస్తుంది.

ఇదేం వైఖరి?.. టీఆర్‌ఎస్ పార్టీ గెలిచి నేను సీఎం అయినప్పటి నుంచి విపక్షాలకు ఒకటే మంట. నేను సీఎం అయిన 5వ రోజు నుంచి ఇప్పటివరకు ఏ పనిచేసినా అర్థసత్యాలతో.. పిచ్చి ఆరోపణలు చేస్తున్నారు. ఒకవైపు దేశ ప్రధానితో సహా అనేక సంస్థలు అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ అని చెప్తున్నాయి. అవినీతి రహిత పాలన అందిస్తున్న రాష్ట్రంగా దేశవ్యాప్తంగా మన్ననలందుతున్నాయి. టీఆర్‌ఎస్, తెలంగాణ ప్రభుత్వం అవినీతిలేని పాలన అందిస్తున్నదని దేశం గొప్పగా చెప్పుకుంటుంటే.. ఇక్కడ వీళ్లు అవినీతి అంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారు. మిషన్ కాకతీయను కమీషన్ కాకతీయ అంటరు. మరొకటి అంటరు. ఈ రకమైన దాడిని ప్రజలు నిరసిస్తున్నారని పాలేరు ఫలితం తెలిపింది.

వ్యక్తిగత దాడి, విమర్శలు, అసత్య ఆరోపణలు ఇకనైనా మాని కనువిప్పు తెచ్చుకోండి. ప్రజల కోసం నిర్మాణాత్మక సూచనలు ఇవ్వండి. కాంగ్రెస్ పార్టీ చివరకు ప్రజలను కూడా అవమానపరిచే విధంగా వ్యవహరించింది. ఫిర్యాదుల ఖమ్మం జిల్లా కలెక్టర్, ఎస్‌పీ, పాలేరు ఎన్నికల రిటర్నింగ్ అధికారిని మార్పించి.. ఈవీఎంలకు ప్రింటర్లు పెట్టించారు. వీరి ఫిర్యాదుతో బదిలీ అయిన కలెక్టర్ లోకేశ్‌కుమార్ 2014లో కేంద్ర ఎన్నికల కమిషన్ చేత బెస్ట్ ఎలక్షన్ కండక్టింగ్ ఆఫీసర్‌గా కితాబు అందుకున్న అధికారి. ఆయన మీద గోల చేసి మార్పించారు. ఈవీఎంలపై పసలేని ఆరోపణలుచేశారు. అతిగా మాట్లాడి మీరు భంగపడ్డారు తప్ప సాధించిందేమీ లేదు.

ప్రభుత్వం మీద పోరా?… పాలేరు ఉపఎన్నిక తరువాత కాంగ్రెస్ ఒక సమావేశం పెట్టి ప్రభుత్వంపై పోరు చేస్తామని ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలపై పోరాటం చేయరు.. ఎవరైనా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తారు. మీ స్టాటజీలోనే తప్పు ఉంది. ప్రభుత్వాలపై కాదు.. ప్రజల సమస్యలకోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తేనే ఆదరిస్తారు. తెలంగాణ ప్రభుత్వం 23 నెలల పాలన పూర్తి చేసుకొని 24వ నెలలోకి వెళ్లింది. మొదటి ఏడాది పాటు పనిచేయడానికి అధికారులు కూడాలేని పరిస్థితి. అయినా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని పని చేస్తున్నాం. ఈ రెండేండ్లలో మోస్ట్ హ్యాపెనింగ్ స్టేట్ ఇన్ ఇండియా అని తెలంగాణకు పేరు వచ్చింది. టీఆర్‌ఎస్‌పై అవాకులు చెవాకులు పేలితే ప్రజలు హర్షించరు..ప్రజల ముందు పరిహాసం కావద్దు.. మీ గౌరవం పోతే రాష్ట్ర గౌరవం పోతుంది.

ఇంకా 1947 నాటి రాజకీయాలు చేస్తామంటే కుదరదు. ప్రాజెక్టుల రీడిజైనింగ్‌పై శాసనసభ రికార్డుల్లో ఉండాలని పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే… రాద్ధాంతం చేసి ఎందుకు బహిష్కరించారో అర్థం కాలేదు. ప్రాజెక్టులకు అడ్డం పడటమే మీ లక్ష్యమా? ప్రాజెక్టులపై మేమూ ప్రజెంటేషన్‌చేస్తామని ఎందుకు చేయలేదు? సభలో చర్చ వస్తే పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మేం ప్రిపేర్ కాలేదని అన్నారు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?

విమర్శలెందుకు?..జాతీయ ప్రాజెక్టు తెండి.. ఇక బీజేపీ అధ్యక్షుడు కొత్తగా ఒకాయన వచ్చాడు. కొత్తబిచ్చగాడు పొద్దు గుర్తు ఎరుగడన్నట్లు ఆయన వైఖరి ఉంది. కేంద్రం నిధులు ఇస్తే రాష్ట్రం ఖర్చు చేయడం లేదంటడు. తాగునీటికి కేంద్రం రూ.54 కోట్లు ఇస్తే.. రాష్ట్రం రూ.350 కోట్లు ఖర్చు చేసింది. కరువు సాయం కింద రూ. 3వేల కోట్లు అడిగితే కేంద్రం రూ.750కోట్లు మాత్రమే ఇచ్చింది. మేం రైతుల ఇన్‌పుట్ సబ్సిడీకే రూ.1300 కోట్లు ఇవ్వాలి. కరువు తాత్కాలిక చర్యల కింద అడిగిన డబ్బులు కేంద్రం ఇవ్వనేలేదు.. అయినా కేంద్రంపై ఆధారపడకుండా పనిచేస్తున్నం. రాష్ట్రం సంక్షేమ కార్యక్రమాలను స్వంతంగా అమలు చేయడంలో చాలా ముందున్నది.

రూపాయికి కిలో బియ్యం సీలింగ్ లేకుండా ఇస్తున్నాం. వృద్ధులకు రూ.1000 పెన్షన్, వికలాంగులకు రూ.1500 పెన్షన్, కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నాం. హాస్టళ్లకు ఫస్ట్ క్లాస్‌గా సన్నబియ్యం అన్నం పెడుతున్నాం. కరువు వల్ల పాఠశాలలకు సెలవులు ఇచ్చినా హాస్టళ్లను తెరిచే ఉంచి విద్యార్థులకు భోజనం పెడుతున్నాం. కరువు శాశ్వత నివారణకు మూడు రకాల చర్యలు చేపట్టాం. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ప్రాజెక్టుల్లో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని కేంద్రాన్ని అడుగుతున్నాం. దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు ఒక జాతీయ ప్రాజెక్టు సాధించుకొని రండి.. ప్రజలు మిమ్ములి హర్షిస్తారు.

కట్టగట్టుకు వచ్చినా.. 2019 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం మేమే అని ఎవరికి వారు అంటున్నారు. ఈ లెక్క మాకు చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయన్నమాట. అచ్చంపేటలో మహాకూటమి పేరుతో సకల పార్టీలు కలిసి మాపై పోటీ చేస్తే ప్రజలు 20 వార్డులకు 20 వార్డులు టీఆర్‌ఎస్‌ను గెలిపించారు. ఖమ్మంలో కూడా మా మీద జట్టు కట్టారు. కాంగ్రెస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు వచ్చిన ఓట్లు కూటమికి రాలేదు. ఆశామాషీగా ఓట్లేసే కాలం పోయింది. ప్రజలు విచక్షణతో ప్రభుత్వ పాలనను సమీక్షించి ఓట్లేశారు. ఇక్కడున్నది మోస్ట్ పాపులర్ గవర్నమెంట్ అన్నది గుర్తుంచుకోవాలి.

పనిచేసే వారికే పట్టం.. ప్రజలు పనిచేసే వారినే గెలిపిస్తారు. గుజరాత్‌లో నరేంద్రమోదీని మూడుసార్లు గెలిపించారు. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను మూడు, ఒడిశాలో నవీన్ పట్నాయక్‌ను నాలుగుసార్లు గెలిపించారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో మమతాబెనర్జీని, తమిళనాడులో అన్నాడిఎంకేను తిరిగి గెలిపించారు. అదే పంథాలో ప్రజల కోసం పనిచేసే టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఏకపక్షంగా గెలిపించారు. మంచిగ పనిచేసే ప్రభుత్వాలను ప్రజలు ఎన్నుకుంటారనడానికి ఈ ఫలితాలు నిదర్శనం.

ఏపీ నాయకుల అసత్య ప్రచారాలు.. ఏపీలో చంద్రబాబు, జగన్ అసత్యప్రచారాలు చేస్తున్నారు. ఎట్ల మాట్లడుతరో తెలియదు. 9 ఏండ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు రూ.60 వేల కోట్ల ఆదాయం వచ్చే హైదరాబాద్‌ను వదులుకున్నామని చెప్తున్నాడు. రాష్ట్రమంతా కలిపి కమర్షియల్ ట్యాక్స్‌ను ఈ ఏడాది బడ్జెట్‌లోనే రూ.43 వేల కోట్లు పెట్టుకున్నాం… మరి ఒక్క హైదరాబాద్‌నుంచి రూ.60 వేల కోట్లు వస్తుందనేది వాస్తవమా?. అసత్యాలు ప్రచారంచేస్తే ప్రజలు చీత్కరిస్తారు.

ఇకపై కేసులే..! గతంలో లాగా ఇపుడు సెక్రటేరియట్‌లో పైరవీలు లేవు.. పైరవీకారులు కనిపించడం లేదు. కాంట్రాక్టర్ల రాజ్యం లేదు.. అవినీతి మీద మీ ఆరోపణల్లో నిజం సెక్రటేరియట్ చూస్తే అర్థం అవుతుంది. అర్థం పర్థం లేకుండా ప్రతి దాంట్లో అక్రమాలున్నాయంటే… కమీషన్లు తీసుకుంటున్నారంటే ఇకపై సహించేది లేదు… ఇక నుంచి మీ ఆరోపణలపై ఆధారాలతోసహా రుజువులు లేకపోతే కేసులు పెడతాం. మీ ఇష్టం వచ్చినట్లు వెకిలి, మకిలి ఆరోపణలు చేసే వారిపై పరువు నష్టం దావా వేస్తాం. కఠిన చర్యలు తీసుకుంటాం. తెలంగాణ కొత్త రాష్ట్రం… గెలిచి నిలవాలి. నిర్మాణాత్మక సలహాలు ఇచ్చి రాష్ట్రం పటిష్టతకు తోడ్పండి.ఉత్తమ సలహాలు ఇవ్వండి స్వీకరిస్తాం.

నిర్మాణాత్మక పద్ధతిలో ప్రతిపక్షాలు వస్తాయని ఆశిద్దాం. అని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన సలహాదారు డీ శ్రీనివాస్, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ, ఎంపీలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బాల్కసుమన్, ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్, పాయం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి శేరిసుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పాలేరు విజయాన్ని పురస్కరించుకొని పిడమర్తి రవి సీఎం కేసీఆర్‌కు స్వీట్ తినిపించారు.

ఏం జరుగుతున్నదో కనిపిస్తున్నదా?.. రాష్ట్రంలో ఏమి జరుగుతలేదని ఆరోపణలు చేస్తున్నారు. వారికి నేను చెపుతున్నా.. సంక్షేమంలో రాష్ట్రం నెంబర్ వన్… పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో నంబర్ వన్, టీఎస్‌ఐపాస్ ద్వారా ఒక్క రూపాయి లంచం తీసుకోకుండా.. ఇచ్చిన 15 రోజుల టైంలో 1700 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చాం. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఐటీ కంపెనీలు ఇక్కడకు వచ్చాయి. వస్తున్నాయి. అమెజాన్ కంపెనీ అమెరికా తరువాత బయట హైదరాబాద్‌లోనే అతి పెద్ద క్యాంపస్ నిర్మిస్తున్నది. నేను చూసి వచ్చిన… గూగుల్ కంపెనీ అమెరికా తరువాత హైదరాబాద్‌లోనే తన సెకండ్ క్యాంపస్ ఏర్పాటు చేసుకుంది. ఫేస్‌బుక్ కూడా ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంది. ఆపిల్ మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ప్రారంభించి ఇక్కడకు వచ్చాను. హైదరాబాద్‌లో 5 వేల మంది పనిచేసే విధంగా ఈ క్యాంపస్ నిర్మాణం చేస్తున్నారు. ఇదీ టీఆర్‌ఎస్ సాధించింది. ఈ ఏడాది రూ.68 వేల కోట్ల సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను ఎగుమతి చేసి దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణ నిలిచింది. గతంలో బెంగళూరు ఉండేది.. ఇప్పుడు హైదరాబాద్‌కు నంబర్‌వన్ స్థానం వచ్చింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏమీ చేయడం లేదనే పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్నారు.

ప్రభుత్వంపై ప్రజల్లో కోటి ఆశలు -నెరవేర్చే దిశగా అడుగులేస్తాం!.. మీడియాతో మంత్రి కేటీఆర్ -రాష్ర్టాభివృద్ధి, సంక్షేమమే ప్రాధాన్యమని వ్యాఖ్య

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రజా సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వ అడుగులు ఉంటాయని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. పాలేరు ఉప ఎన్నిక ఫలితం వెలువడిన తర్వాత గురువారం మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికలు మొదలు ఇప్పటివరకు జరిగిన ప్రతీ ఎన్నికలోనూ టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అండగా నిలిచారని, అందుకు వారికి రుణపడి ఉంటామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టి రెండేండ్లు పూర్తయిందని, రానున్న కాలంపై ప్రజల్లో కోటి ఆశలు నెలకొని ఉన్నాయని అన్నారు. రెండేండ్లలో తమ ప్రభుత్వ పలు సంక్షేమ పథకాలు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాయన్నారు. దేశంలోనే తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నదన్నారు. అనుకున్నంత వేగంగా కొన్ని పనులు జరుగలేదేమో.. కానీ వాటి సాధనకు ప్రజలతో కలిసి ముందుకు సాగుతున్నామన్నారు. భవిష్యత్‌లో తెలంగాణ బిడ్డలందరి సహకారంతో నిర్దేశిత లక్ష్యాలన్నీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మిషన్ భగీరథను 2017లోనే పూర్తిచేసి.. ఇంటింటికీ నల్లా నీటిని అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని తప్పకుండా సాధిస్తామన్నారు. గతేడాది తన విదేశీ పర్యటన విజయవంతమైందని, తాజాగా చేపట్టనున్న పర్యటన కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకేనని స్పష్టం చేశారు. తెలంగాణ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంగా తన అమెరికా పర్యటన ఉంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. వినూత్న పారిశ్రామిక విధానాలతో పెద్ద ఎత్తున ప్రముఖ కంపెనీలను ఆహ్వానించి అద్భుత అవకాశాలను సొంతం చేసుకొంటామన్నారు. రెండేండ్ల్లలో పనిచేసినట్లే భవిష్యత్‌లోనూ రాష్ర్టాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేస్తామని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.