-నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల స్థానం నిలబెట్టుకున్న టీఆర్‌ఎస్ -తొలి ప్రాధాన్యత ఓట్లలోనే స్పష్టమైన ఆధిక్యం

నల్లగొండ-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల శాసనమండలి స్థానాన్ని టీఆర్‌ఎస్ నిలబెట్టుకుంది. ఎమ్మెల్సీగా ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం సాధించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో బీజేపీ అభ్యర్ధ్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుకంటే 12,723 ఓట్ల ఆధిక్యంలో నిలిచిన పల్లా.. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో అలవోకగా గెలుపొందారు. మొత్తం 1,53,541 ఓట్లు పోలవగా.. అందులో 14,039 ఓట్లు చెల్లలేదు. మరో 5,956 ఓట్లు నోటా కింద వెళ్లాయి. మిగిలిన వాటిలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే 59,764 (44.74%) ఓట్లను పల్లా రాజేశ్వర్‌రెడ్డి దక్కించుకోవడం విశేషం. నల్లగొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ పట్టభద్ర ఓటర్లు గతంలోనూ గులాబీ పార్టీనే ఆదరించారు. 2009లో జరిగిన ఎన్నికల్లో అప్పుడు టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నిలిచిన కపిలవాయి దిలీప్‌కుమార్‌ను పెద్దల సభకు పంపారు. తాజా ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్ ఆ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 13,033 ఓట్లు, వామపక్షాలు బలపర్చిన స్వతంత్ర అభ్యర్థి సూరం ప్రభాకర్‌రెడ్డి 11,580 ఓట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచారు. మిగిలిన 18మంది స్వతంత్ర అభ్యర్థులు 2135 మొదటి ప్రాధాన్యత ఓట్లను దక్కించుకున్నారు. మూడు జిల్లాల్లో కలిపి 1,53,547 ఓట్లు పోలవగా.. వాటి లెక్కింపు ప్రక్రియ బుధవారం ఉదయం 8 గంటలనుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును 16 రౌండ్లలో పూర్తి చేశారు.
మొదటినుంచి ప్రతి రౌండ్‌లోనూ ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చిన రాజేశ్వర్‌రెడ్డి.. చివరికి 12,723 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. మొత్తం చెల్లిన ఓట్లలో సగం అయిన 66,777 మేజిక్ ఫిగర్‌ను చేరుకోవడానికి రాజేశ్వర్‌రెడ్డి ఇంకా 7013 ఓట్ల దూరంలో నిలిచారు. బీజేపీ అభ్యర్థికి 19,736 ఓట్లు అవసరమైంది. ఈ దశలో అధికార యంత్రాంగం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు లెక్కించింది. ముందుగా 22 మంది అభ్యర్థుల్లో అతి తక్కువ తొలి ప్రాధాన్యత ఓట్లను పొందిన వారి నుంచి మొదలుపెట్టి చివరకు ఒక్కరు మిగిలేవరకు ఎలిమినేషన్ పద్ధతిలో ప్రక్రియ నిర్వహించారు. మొత్తం స్వతంత్రులైన 18మంది అభ్యర్థుల బ్యాలెట్లలో ఆయా అభ్యర్థులకువచ్చిన ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను లెక్కించిన తర్వాతకూడా టీఆర్‌ఎస్‌కు స్పష్టమైన మెజార్టీరాలేదు. తర్వాత అధికారులు సూరం ప్రభాకర్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న ఓట్లను లెక్కించారు. మల్లన్న ఓట్ల లెక్కింపు క్రమంలోనే రాజేశ్వర్‌రెడ్డికి 66,777 మ్యాజిక్ ఫిగర్‌కు చేరడంతో ఆయన విజయం ఖరారైంది. మెజార్టీపై మాత్రం అర్ధర్రాతి వరకూ స్పష్టత రాలేదు. గెలుపు ఖరారైన తర్వాత టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లగొండ పట్టణంలో బాణాసంచా కాలుస్తూ సంబురాలు చేసుకున్నారు. ఎన్జీ కాలేజీ నుంచి పెద్ద గడియారం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీగా గెలిచిన రాజేశ్వర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్, టీఆర్‌ఎస్ నేతలు దుబ్బాక నర్సింహారెడ్డి, కాసోజు శంకరమ్మ పాల్గొన్నారు.
ఫలించిన సమిష్టి కృషి పల్లా విజయానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు చేసిన సమిష్టి కృషి ఫలితాన్నిచ్చింది. పార్టీ అభ్యర్థి ఎంపికనుంచి ప్రచారం వరకు పక్కా ప్రణాళికతో టీఆర్‌ఎస్ ముందుకు వెళ్లింది. మూడు జిల్లాలకు సుపరిచితుడు, మూడు ప్రాంతాలతో ఏదో ఒక అంశంతో సంబంధం ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఎంపిక చేసింది. ఎంపికైన అనంతరం ఆయన నేరుగా పట్టభద్రుల్లోకి వెళ్లారు. దీనికి తోడు పార్టీ అధినేత, సీఎం కే చంద్రశేఖర్‌రావు దిశా నిర్దేశంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరితో పాటు జిల్లా మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, ఖమ్మం జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వరంగల్ జిల్లా మంత్రి చందూలాల్‌తో పాటు పార్లమెంటరీ కార్యదర్శులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు, కిందిస్థాయి కార్యకర్త వరకు ప్రచారాన్ని నిర్వహించారు. అన్ని నియోజకవర్గాలను చుట్టి రావడంతో పాటు పట్టభద్రులను స్వయంగా కలిసి, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు సీఎం కేసీఆర్ విజన్‌ను వారి ముందుంచారు. పట్టభద్రుల మనసు గెల్చుకున్నారు. అది ఫలితాల్లో ప్రతిఫలించింది.