Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

పల్లాను గెలిపిస్తే మరింత అభివృద్ధి

అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి పల్లాను గెలిపిస్తే మరింత అభివృద్ధికి బాటలు వేసుకోవచ్చని, అరవై ఏళ్లలో జరుగని అభివృద్ధిని కేవలం ఎనిమిది నెలల్లో చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి పంపాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పట్టభద్రులకు పిలుపునిచ్చారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సూర్యాపేట పట్టణంలోని త్రివేణి ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమావేశానికి హోంమంత్రి నాయిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Palla Rajeshwar Reddy

ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం వస్తున్న మొదటి ఎన్నికలని, చదువుకున్న వారు, పట్టభద్రులు, ఉద్యోగులు, మేధావులు తమ అభిప్రాయం తెలియజేసే సమయమిదేనని పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఉద్యోగులు చేపట్టిన 42రోజుల సకల జనుల సమ్మె చరిత్రాత్మకమని, కేంద్ర ప్రభుత్వం కళ్లు తెరిపించి రాష్ర్టాన్ని సాధించుకున్నామని గుర్తు చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వమూ ఇవ్వని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్… ఉద్యోగులకు 42శాతం ఫిట్‌మెంట్ ఇచ్చి గౌరవించారని, అలాగే తెలంగాణ ఇంక్రిమెంట్ కూడా ఇచ్చారని తెలిపారు.

దేశంలోనే చర్చ జరిగేలా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధిపై ముందుకుసాగుతున్నారని, ఎన్నికల హామీలు అమలు చేయడంతోపాటు, మరెన్నో నూతన పథకాలు ప్రవేశపెడుతూ అన్ని వర్గాల ఆదరణ పొందుతున్నారని పేర్కొన్నారు. మిషన్ కాకతీయతో చెరువులకు పునర్వైభవం తీసుకురావడంతోపాటు, వాటర్ గ్రిడ్ పథకంతో ప్రతి ఇంటికీ నీరందించే యజ్ఞం చేపట్టిన టీఆర్‌ఎస్‌కు పట్టభద్రులు మద్దతుగా నిలవాలని కోరారు. శాసనమండలి ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును చివరి నిమిషం వరకు అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేసిన టీడీపీ, దానికి సహకరించిన బీజేపీతో పాటు ఉద్యమాలే తెలియని కాంగ్రెస్ అభ్యర్థులు నేడు ఎమ్మెల్సీ బరిలో దిగుతున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. టీడీపీ ముమ్మాటికీ ఆంధ్రా పార్టీయేనని, ఇప్పటికే ఆ పార్టీ ఆంధ్రాకు తరలిపోయిందని విమర్శించారు. మిగిలిన ఒకరిద్దరు చంద్రబాబు మెప్పుకోసం ఆయన అడుగుజాడల్లో పనిచేస్తున్నారని, వారి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. పది జిల్లాల్లో కేవలం నల్లగొండ జిల్లాలోనే ఒకరిద్దరు నాయకులుగా చెప్పుకుంటున్న వారు ఉన్నా…. విజ్ఞులైన అన్ని రంగాల్లో ఉన్న పట్టభద్రులు రేపు జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాను భారీ మెజార్టీతో గెలిపించి వారికి తగిన శాస్తి చేయాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ పనితనానికి, టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనకు త్వరలో జరుగబోయే పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలను రెఫరండంగా తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్‌శాఖా మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల శాసనమండల టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమైందని అయితే భారీ మెజార్టీ కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఏ పరిణామాలనైనా ఎదుర్కొని మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధించామన్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ ఘోర పరాజయానికి కారణం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనకపోవడమే కాకుండా టీఆర్‌ఎస్‌నే టార్గెట్‌చేసి మరీ బండబూతులు తిట్టడం అన్నారు. అన్నింటినీ భరించిన టీఆర్‌ఎస్ ఉద్యమ నాయకులు రాష్ర్టాన్ని సాధించడంతో ప్రజలు తిరిగి ఇదే పార్టీకి పట్టం కట్టారని వారి నమ్మకాలను వమ్ము చేయకుండా అరవై ఏళ్లలో జరుగని అభివృద్ధిని ఎనమిది నెలల్లో చేసి చూపించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కిందన్నారు. ఇక రాజేశ్వర్‌రెడ్డికి పోటీగా బరిలో ఉంటున్న బీజేపీ, టీడీపీ అభ్యర్థి ఎవరు… ఆ పార్టీల చరిత్ర ఏమిటో కూడా తెలియకుండా పోతోందని, కాంగ్రెస్ అభ్యర్థి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అన్నారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి రాజేశ్వర్‌రెడ్డి కళాశాలలోనే తెలంగాణ అమరుడు వేణుగోపాల్‌రెడ్డి విద్యనభ్యసించాడని, వేణుగోపాల్‌రెడ్డి ఆత్మబలిదానం చేసుకున్న రోజు ఆయన మృతదేహాన్ని ఇక్కడకు తీసుకురావడానికి రాజేశ్వర్‌రెడ్డి చేసిన కృషి అంతా ఇంతా కాదన్నారు. ప్రభుత్వ అణచివేత, పోలీసుల కాఠిన్యాన్ని ఎదిరించి మృతదేహాన్ని తీసుకువచ్చినందుకు రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేయడం నెల రోజులు జైలుకు పంపడం జరిగిందన్నారు. రాజేశ్వర్‌రెడ్డికి ఏదో ఉత్తిగే ఓటు వేయాలని కోరడం లేదని ఉద్యమంలో కళాశాలలన్నింటిని ఏకం చేసి విద్యార్థులను రోడ్లపైకి తీసుకురావడం… కేసులు… జైళ్ల పాలు కావడం లాంటి చరిత్ర ఉందన్నారు.

ప్రతిపక్షాలు ఉండొద్దని టీఆర్‌ఎస్ ఎప్పుడూ కోరుకోదని అయితే నిజమైన ప్రజాస్వామిక విలువల్ని నిలబెట్టేలా ప్రతిపక్షాలు తమ పాత్ర పోషించాలి తప్ప దౌర్జన్యాలకు దిగితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ సంవత్సరం లోపే చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఏ పార్టీ చర్చకు వచ్చినా సిద్ధమేనని అన్నారు. ఒకే క్యాబినెట్ సమావేశంలో 43 పథకాలకు ఆమోదం తెలిపి ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. అలాంటి టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరింత బలాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లాకు మొదటి ప్రాధాన్యత ఓటును వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

-పల్లాను కేసీఆర్‌కు కానుకగా ఇద్దాం -ఎమ్మెల్సీ పూల రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి పధంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్‌కు మద్దతిచ్చేందుకు గాను ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా పంపిద్దామని ఎమ్మెల్సీ పూల రవీందర్ పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ వెంటే ఉన్నారని, అలాగే తెలంగాణ వచ్చిన అనంతరం కూడా ఆయనకే మద్దతు పలుకుతూ టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తెచ్చి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేశారని గుర్తుచేశారు. జిల్లాలోని ప్రతి ఉద్యోగి, పట్టభద్రులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రధమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేసి గెలిపించాలన్నారు.

-అందరి దీవెనలతో దేన్నైనా సాధిస్తా.. -పల్లా రాజేశ్వర్‌రెడ్డి తనను అందరూ దీవించి ఓటు వేసి గెలిపించి శాసనమండలికి పంపిస్తే సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు దేనికైనా సిద్ధంగా ఉంటానని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్న తాను అనంతరం విద్యా సంస్థలను ఏర్పాటు చేశానని అయితే మంత్రి జగదీష్‌రెడ్డి ప్రొద్బలంతోనే తాను టీఆర్‌ఎస్‌లో క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లో మార్పు వచ్చిందని ప్రధానంగా మహిళల భద్రతకు సీఎం కేసీఆర్ తీసుకున్న షీ టీంల లాంటి నిర్ణయంతో ఇతర రాష్ట్రాల వారు హైదరాబాద్ వైపు చూస్తున్నారన్నారు.

పట్టభద్రుల్లో ఉద్యోగ, నిరుద్యోగ, గ్రాడ్యూయేట్స్ ఉంటారని ఇందులో ఉద్యోగులకు ఇప్పటికే ఎనలేని గౌరవాన్ని ఇస్తూ ఫిట్‌మెంట్ ఇచ్చారన్నారు. నిరుద్యోగుల కోసం టీపీపీఎస్సీ ఏర్పాటు చేశారని, రెండు నెలల్లో ఉద్యోగాల జాతర ప్రారంభమవుతుందన్నారు. కాగా చాలా మంది ఉద్యోగం కోసం వయస్సు దాటిందనే బాధ కనిపిస్తుందని వారి కోసం ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తామని హామీనిచ్చారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా టీఆర్‌ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పట్టించుకోరని అభివృద్ధిలో కేసీఆర్‌ను మించిన మొండి మనిషి మరొకరు లేరన్నారు. తెలంగాణ కోసం ఒక్క రోజు కూడా జైలుకు వెళ్లని, లాఠీ దెబ్బలు తినని పార్టీలకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. సీఎంగా ఉన్న పార్టీకే మద్దతు ఇస్తే అభివృద్ధి మరింత జరుగుతుందని అందుకే తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

సమావేశానికి తెలంగాణ వికాస సమితి చైర్మన్ బద్దం అశోక్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఉపాద్యాయ, ఉద్యోగ, కార్మిక, పట్టభద్రుల సంఘాల నాయకులు చింతలపాటి చినశ్రీరాములు, బాలాజీ, మోతీలాల్, అంతటి వెంకన్న, కాకి రాంరెడ్డి, అంజయ్య, భూతం యాకమల్లు, లచ్చయ్య, చలమందరావు, పాపయ్య, ఉపేపందర్, లింగస్వామి, శ్రవణ్‌కుమార్, కుసుమ సిద్దారెడ్డి, బొల్లెద్దు శ్రీనివాస్, మురళి, రత్నయ్య, లీల, శ్రీరాములు, పులి అచ్చుతరామశర్మ, భిక్షం, కొండేటి రవీందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, పులిచింతల జనార్దన్ తదితరులు పల్లాకు మద్దతు పలుకుతూ ప్రసంగించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.